Site icon Sanchika

యాత్రా దీపిక చిత్తూరు జిల్లా – 56 – మూగవాడి

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా మూగవాడిలోని ప్రసన్న పార్వతీ సమేత పుండీశ్వరస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

ప్రసన్న పార్వతీ సమేత పుండీశ్వరస్వామి ఆలయం, మూగవాడి

[dropcap]రా[/dropcap]మసముద్రం నుంచి 3 కి.మీ.ల దూరంలో వున్నది మూగవాడి. ఇక్కడ ప్రసన్న పార్వతీ సమేత పుండీశ్వరస్వామి ఆలయం చోళరాజుల కాలం నాటిది. విశాలమైన ఆవరణలో ఆలయం. ఉద్భవ లింగం. వెదురు పొదనుంచి స్వామి ఉద్భవించారుట. స్ధల పురాణం ప్రకారం కథ ఏమిటంటే…

ఒక మూగవాడు తన పొలంలో పంటల్ని ఆవు మేస్తుంటే దాన్ని తరుముకుంటూ వెళ్తే అది వెదురు పొదలో దూరిందట. గొడ్డలితో కొడితే ఆవు మాయమై రక్తం కారటం కనిపించిందట. త్రవ్వి చూస్తే శివ లింగం. గొడ్డలి దెబ్బకు లింగం ముక్క పోయి రక్తం కారుతోందిట. స్వామి ప్రత్యక్షమై నా విషయం ఎవరికీ చెప్పవద్దు, నీకు నోరు ఇస్తానని ఇచ్చాడుట. నోరు వచ్చిన పిదప ఆ మూగవాడు గ్రామస్తులకు ఈ విషయం చెప్పి తల పగిలి చనిపోయాడుట. విషయము తెలిసిన ఆ గ్రామ జమీందారు లింగమును పైకితీసి, పానవట్టమును చెక్కించి ఆ లింగమున్న ప్రాంతంలోనే ప్రతిష్ఠించారుట.

లింగానికి గొడ్డలి తగిలిన చోట గుంటలాగా పడింది. పూలు తీసి చూపించారు. మూగవాడి గొడ్డలి మూలంగా స్వామికి పుండయిందిగనుక స్వామి పుండీశ్వరస్వామి అయ్యాడు. ఆ ప్రదేశం మూగవాడి అయింది.

పూర్వం ఈ గ్రామం రాజధానిగా చాలా రాజవంశాలు పాలించాయిట. ఈ ఆలయాన్ని నిర్మించింది చోళరాజైన మొదటి రాజరాజచోళుడు. క్రీ.శ. 985 – 1016 సంవత్సరాల మధ్య నిర్మాణం జరిగింది. చాలా విశాలమైన ఆవరణలో వున్న ఆలయం చిన్నదే. ఆలయ నిర్మాణంలో వృత్తాకార, చతురస్రాకార స్తంభాలను ఉపయోగించారు. గర్భగుడిలో స్వామి తూర్పునకు అభిముఖంగా వున్నాడు. దాతి కిటికీగుండా ఉదయ సూర్య కిరణాలు స్వామి పాదములపై పడేటట్లు నిర్మించారు. అమ్మవారు ప్రసన్న పార్వతీ దేవి.

ఆలయం ప్రవేశ ద్వారానికి ఎడమవైపు రెండు రాళ్ళమీద ఒక మనిషి గొడ్డలితో కొడుతున్నట్లు చెక్కిన బొమ్మలు వున్నాయి. అవి మూగవాడివన్నారు.

స్వామికెదురుగా ఒకే పీఠం మీద రెండు నందులున్నాయి. వాటికి ఒక కథ చెప్పారు. ఒక ఆసామీ ఏదో ఆపద వచ్చి, ఆ గండం తీరితే స్వామి పేరు మీద ఒక వృషభాన్ని వదులుతానని మొక్కుకున్నాడుట. ఆ ఆపద తీరింది గానీ ఆయన ఆ సంగతి పట్టించుకోలేదుట. ఆ కోడె తనంతట తాను వచ్చి ఇక్కడ స్వామికెదురుగ నంది పక్కన కూర్చుని అలాగే శిల అయిపోయిందట.

పూర్వం ఎందరో రాజులకు రాజధానిగా విలసిల్లిన ఈ పట్టణం ఇప్పుడు ఒక గ్రామంగా వున్నది. పుండీశ్వరస్వామి దయ వలన మేము దర్శించగలిగాము.

మేము వెళ్ళేసరికి మహాశివరాత్రికోసం చేసిన విద్యుద్దీపాల అలంకరణతో ఆలయం దేదీప్యమానంగా వెలుగొందుతోంది.

Exit mobile version