Site icon Sanchika

యాత్రా దీపిక చిత్తూరు జిల్లా – 58 – తెట్టు

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా తెట్టు గ్రామంలో ఉన్న సంతాన వేణుగోపాలస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

సంతాన వేణుగోపాలస్వామి, తెట్టు

[dropcap]చి[/dropcap]త్తూరు జిల్లా కురబలకోట మండలంలోని ఈ ఆలయానికి మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం 2-30 గంటయింది. మమ్మల్ని చూసి ఒకావిడ తాళాలు తీసుకువచ్చారు. ఆ సమయంలో అర్చక స్వామి వుండరు. ఆవిడే అక్కడి సమాచారం కొంత చెప్పారు. ఈ ఆలయానికి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు లండన్ మ్యూజియంలో వున్నాయిట. శ్రీ రామానుజాచార్యులు కొంతకాలం ఇక్కడ వున్నారుట. ఇక్కడే శేషనగరాధిపా అనే శతకం వ్రాశారుట.

తర్వాత నేను సేకరించిన వివరాల ప్రకారం ఈ ఆలయం 1800 సంవత్సరాల క్రితం చోళులు, గంగ రాజుల సమయంలో కట్టించినది. స్ధల పురాణం ప్రకారం కృష్ణ పరమాత్మ గంగరస అనే రాజు కలలో కనబడి తాను వున్న ప్రదేశం గురించి చెప్పాడు. అప్పుడాయన యుధ్ధానికి వెళ్తుండటంతో ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. యుధ్ధంలో విజయం సాధించి తిరిగి వస్తుండగా సరిగా ఆ ప్రదేశానికి వచ్చేసరికి ఆయన రథ చక్రాలు కదలలేదుట. రాజుకి కల సంగతి గుర్తు వచ్చి ఆ విగ్రహాన్ని బయటకి తీసి దానిని కౌండిన్య మహర్షి దగ్గరకు తీసుకెళ్ళాడుట. ఆ ఋషి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. తర్వాత ఈ ఆలయాన్ని హొయసాల రాజయిన వీరభల్లవుడు 1298లో పునరుధ్ధరించి ఆలయ అవసరాల నిమిత్తం భూమి వగైరా కానుకలు ఇచ్చాడుట.

భక్తులు తమ జీవితంలో అత్యంత విలువను భగవంతునికిస్తారు. ఆయనే తమ సర్వస్వం అనుకుంటారు. మరి భగవంతుడు కూడా భక్తుల్ని అంత కరుణిస్తాడు అనటానికి ఈ ఆలయం నిదర్శనం. పూర్వం ఈ స్వామి సన్నిహిత భక్తుడు తుపాకుల కృష్ణంనాయుడు. ఈ ఆలయం ఎదురుగా ఆయనకు చిన్న గుడి వున్నది. ఆయన కోరుకున్న వరం ఆయన బతికున్నా, చనిపోయినా స్వామి సన్నిధిలో వుండాలని. స్వామి వరం ఇచ్చాడుట. నా ఎదురుగానే నువ్వుంటావు అని. స్వామి కళ్యాణోత్సవ సమయంలో ఈ భక్తుడికి పూజ చేసిన తర్వాతే స్వామి పూజ.

నాకు సరిగ్గా అర్థం కాని విశేషమేమిటంటే రథోత్సవం సమయంలో తేనెటీగలు గుంపుగా వస్తాయిట. ఆ తర్వాతే రథం కదులుతుందిట. అందుకే గ్రామానికి తెట్టు అనే పేరు వచ్చింది.

నంబాళ్వారు ఈ స్వామిని దర్శించి ఈ స్వామి మీద కొన్ని సంకీర్తనలు చేశారు. ఆలయం ముందు ఎడమ పక్కగా వున్న ఉపాలయంలో ఆంజనేయస్వామి వున్నారు. ఆయనకి కుడివైపు నంబాళ్వారు, ఎడమవైపు రామానుజాచార్యులు దర్శనమిస్తారు. స్వామి ఉత్సవం కాగానే ఆయనకీ ఉత్సవం చేస్తారుట.

ఇక్కడ గరుత్మంతుడు లేడు. కారణం తెలియదు. ఆయన లేని వైష్ణవాలయం ఇదొక్కటేనేమో.

దగ్గరలో రెండు కొండల్లో ఉత్సవ విగ్రహాలు దొరికితే తెచ్చి ఇక్కడ పెట్టారు. అవి దొంగిలించబడ్డాయి. విగ్రహాలు కడవ పోలీసులకి దొరికితే తీసుకువచ్చారు. దొంగల భయానికి ఉత్సవ విగ్రహాలని ఇదివరకు నేలలో దాచారు. బండలు వెయ్యటానికి తవ్వుతుంటే బయట పడ్డాయి రెండు సెట్ల వేణు గోపాలస్వామి ఉత్సవ విగ్రహాలు, ఒక సెట్టు వెంకట రమణమూర్తి ఉత్సవ విగ్రహాలు వున్నాయి ఆలయానికి ప్రస్తుతం.

ఇంత పురాతన ఆలయాలు, పూర్వం ఎంతో వైభవంగా విలసిల్లినవి ప్రస్తుతం వాటి చరిత్ర కూడా చెప్పేవాళ్ళు లేక గత వైభవాన్ని తెలుసుకుని, నిలపుకోలేక పోతున్నాము. చరిత్ర ప్రసిధ్ధికెక్కిన ఆలయాల చరిత్ర పరిశోధించి, బోర్డు మీద రాసి పెడితే అందరికీ తెలుస్తుంది కదా అనుకుంటూ అక్కడనుండి బయల్దేరాము.

Exit mobile version