Site icon Sanchika

యాత్రా దీపిక చిత్తూరు జిల్లా – 60 – రామాపురం

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా రామాపురంలో ఉన్న జ్ఞానాభి రామస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

జ్ఞానాభి రామస్వామి, రామాపురం

[dropcap]త[/dropcap]రిగొండలో అర్చక స్వామి శ్రీ కందవరం కృష్ణ ప్రసాద్ భట్టర్ చెప్పారు. అక్కడికి 1 కి.మీ. దూరంలో రామాపురంలో జ్ఞానాభి రామస్వామి ఆలయం వున్నది. చాలా పురాతనమైన ఆలయం. అక్కడ రాముడు విశేష భంగిమలో వుంటాడు అని. అలాగైతే మరి చూడాల్సిన ఆలయమే కదా. పైగా అక్కడ కూడా అర్చకత్వం వీరిదే. వచ్చి, మార్గ నిర్దేశనం కూడా చేశారు. అదృష్టమే కదా.

మీరు అనేక రామాలయాలు చూసి వుంటారు. వాటిలో రాముడు కోదండరాముడుగానో, పట్టాభి రాముడుగానో, ముగ్గురు తమ్ముళ్ళు, భార్యతోనో, ఒక తమ్ముడు, భార్యతోనో, ఆంజనేయస్వామితో కూడో, ఆయన లేకుండానో వివిధ రూపాలలో దర్శనమివ్వటం చూసుంటారు. అయితే చిత్తూరు జిల్లాలో ఆలయాలు విశిష్టతని సంతరించుకున్నాయి.

వాల్మీకిపురం (వాయల్పాడు) రామాలయంలో శ్రీ రామచంద్రుడు ముద్ర ప్రధానంగా ముద్రాభిరాముడిగా దర్శనమిస్తే ఈ రామాపురంలో రాముడు ధ్యానంలో నిమగ్నమయి కనిపిస్తాడు. రాముడి ఇలాంటి భంగిమని మీరెక్కడా చూసి వుండరు.

ఈ ఆలయంలో శ్రీ రామచంద్రుడు చక్రమఠంలో కూర్చుని ధ్యానం చేస్తూ వుంటారు. ఎంతటి మహనీయులైనా తమ జ్ఞానాన్ని, శక్తిని, ఏకాగ్రతను పెంపొందిచుకోవటానికి తపస్సు చేస్తూనే వుంటారు. అదే రాముడు ఇక్కడ నిరూపిస్తున్నాడు. ఎడమ పక్కన అమ్మ, సీతమ్మ కూర్చుని వుంటుంది. ఇది జాంబవంత ప్రతిష్ఠ. నిత్య పూజలు, విశేష పూజలు జరుగుతూ వుంటాయి. ఆలయం పరిశుభ్రంగా, పవిత్రతను ప్రసరిస్తూవుంది.

ఇక్కడ ఆంజనేయస్వామి, స్వామి దగ్గర కింద కూర్చుని వుండరు. స్వామి విగ్రహం పాదాల దగ్గర ఆంజనేయస్వామిది చిన్న విగ్రహం వుంటుంది నిల్చుని. స్వామి ధ్యానానికి భంగం వాటిల్లకుండా కాపలా కాస్తున్నారా అనిపిస్తుంది. అలాగే ధ్వజస్తంభం ముందు కూడా ఆంజనేయస్వామిది ఇలాంటి విగ్రహమే కనబడుతుంది.

అతి పురాతనమైన ఈ ఆలయం చుట్టూ ఆవరణతో విశాలంగా వుంటుంది.

ఒక విశేష రామాలయాన్ని దర్శించామనే తృప్తితో అక్కడనుండి బయల్దేరాము.

Exit mobile version