[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా వాల్మీకిపురంలో ఉన్న పట్టాభిరామ ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
వాల్మీకి మహర్షి దర్శనమయ్యే వాల్మీకిపురం
[dropcap]ఇ[/dropcap]ప్పుడు చిత్తూరు జిల్లాలోదే ఇంకో విశిష్ట రామాలయం గురించి చెబుతాను. ఇది వాల్మీకీపురం (వాయల్పాడు) లో వుంది. ఇక్కడ విశిష్టత ఏమిటంటే రాముడు స్వయం వ్యక్తుడు. రాముడు స్వయం వ్యక్తుడైన క్షేత్రాలు తక్కువే వుంటాయి. అంతే కాదు. పట్టాభి రాముడు చేతి ముద్రలతో తన గుణ గణాలను వ్యక్తం చేసిన క్షేత్రం. మరి అలాంటి ఆలయం గురించి మీకు కూడా చెప్పాలి కదా.
ఈ ఆలయ విశేషాలను చెప్పినవారు అక్కడి అర్చక స్వామి శ్రీ సాలిగ్రామ శ్రీనివాసాచారిగారు. వీరి వంశంవారే 1879 నుంచి ఇప్పటి వరకూ ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తున్నారు. ఇక్కడ నేను, మా స్నేహితురాలు కమలా పరచా అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆయన ఎంతో ఓపికగా సమాధానం చెబుతూ ఆ ఆలయ చరిత్ర చెప్పారు. అంత పురాతన ఆలయం గురించి చరిత్ర తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ వుంటుంది కదా. ముందుగా శ్రీ సాలిగ్రామ శ్రీనివాసాచారిగారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు సమర్పిస్తూ ఎక్కువగా ఆయన మాటల్లోనే ఆ ఆలయ చరిత్ర….
భరత, లక్ష్మణ, శత్రుఘ్న, హనుమత్ సీతా సమేతంగా శ్రీ పట్టాభిరాములవారు స్వయం వ్యక్త క్షేత్రమిది. పరమ భక్తుడు జాంబవంత మహర్షి, శ్రీమద్రామాయణ దివ్యకర్త శ్రీ వాల్మీకి మహర్షులవారు తపమాచరించిన దివ్య ప్రదేశం. వారిద్దరి కోరిక మేరకు శ్రీరామచంద్రుడు ఇక్కడ పుట్టలో స్వయం వ్యక్తమైనారు. పుట్టని సంస్కృతంలో వల్మీకం అంటారు. వల్మీకం నుంచి స్వామి స్వయం వ్యక్తమైనారు కనుక, వాల్మీకి మహర్షి ఇక్కడ తపస్సు చేశారు కనుక, ఈ గ్రామానికి వాల్మీకి పురమని పేరు. పూర్వం ఇక్కడ వావిల చెట్లు ఎక్కువగా వుండేవిగనుక వావిల పేట, వావిలపాడు, వాయల్పాడు, అలా రకరకాల పేర్లు వచ్చి, చివరికి మళ్ళీ వాల్మీకిపురంగా స్ధిరపడ్డది.
భరత, లక్ష్మణ, శత్రుఘ్న, హనుమత్, సీతా సమేత రామచంద్రస్వామి ఆలయం దక్షిణ భారత దేశంలోనేగాక, భారతదేశంలోనే ఇదే మొదటిదిగా చెప్పబడుతోంది. 13వ శతాబ్దంలో మరమ్మత్తులు చేయించినట్లుగా, తంజావూరు చక్రవర్తులు కుళోత్తుంగ చక్రవర్తులవారి ఏలుబడిలో ఈ దేవాలయానికి మహారాజ గోపురం కట్టించి, కుంభాభిషేకం జరిగినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అంతకుముందు ఎప్పటినుంచి ఈ దేవాలయం వుందో ఎవరికీ తెలియదు.
ఇక్కడ రాములవారు ఉత్తరాభిముఖంగా వున్నారు. వైకుంఠ ఏకాదశినాడు ఉత్తర ముఖంగా వున్న స్వామిని దర్శిస్తే వైకుంఠ నారాయణుడిని దర్శించినట్లే అంటారు. అంటే ఇది నిత్య వైకుంఠ నారాయణ పురం.
ఇక్కడ రాములవారు ముద్ర ప్రముఖంగా వున్నారు. ముద్రా శాస్త్రం ప్రకారం కుడి చేతిలో గ్రాస ముద్రతో వున్నారు. దానినే సుముఖి ముద్ర అంటారు. అంటే బొటన వేలు, చూపుడు వేలు చిటికెన వేలు పైకి లేపి వుంటాయి. ఏదైనా పని పడి వెళ్ళేటప్పుడు, వెళ్ళిన చోట వారు సుముఖంగా వుండాలని, కార్యం సుముఖం కావాలని కోరుకుంటాము. ఇక్కడ రాముడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నన్ను దర్శించినవారికి అంతా సుముఖమే. రాముడు ఏం చెప్పినా, ఏం చూపించినా దానికి సంకేతం వుంటుంది. దాని వెనుక శాస్త్ర నిర్దేశముంటుంది. కఠోపనిషత్తు ప్రకారం ఎన్నో జన్మల పుణ్యం కారణంగా మనకీ మానవ జన్మ లభించింది. ఈ జన్మని సార్ధకం చేసుకుని తిరిగి అజ్ఞానపు చీకట్లోకెళ్ళకుండా వుండాలి అని చెబుతున్నారు గ్రాస ముద్ర ద్వారా. సంస్కరింపబడిన దేహి తిరిగి అజ్ఞానం వైపు వెళ్ళకుండా భగవంతుణ్ణి కలుసుకోవటానికి ప్రయత్నించాలి. తెలివైనవాడు ఏ దేశంలోనైనా పూజింపబడతాడు. ఏ వ్యక్తికైనా శక్తి కావాలంటే తెలివి వుండాలి. నీకు బుధ్ధిని, జ్ఞానాన్ని సంపూర్ణంగా ఇస్తానని స్వామి చెబుతున్నాడు. గ్రాసమంటే భోజనం. ఇక్కడ భోజనం అంటే జ్ఞానం.
ఇంక ఎడమ చేతిలో వరద ముద్ర. ఇక్ష్వాక వంశ రాజులకు ఒక ప్రతిజ్ఞ వుంది. ఏమిటంటే తమని శరణుజొచ్చినవారిని సర్వదా కాపాడతామని. విభీషణుడు శరణాగతి చేసినప్పుడు రాముడు మన్నించాడు. అ సమయంలో ఒకరడిగారు. రావణాసురుడు శరణాగతి చేస్తే ఆయనని కూడా క్షమిస్తారా అని. క్షమిస్తానని చెబుతాడు. శరణాగతి చేసినవారు ఎంత శత్రువైనా రక్షిస్తానంటాడు. ఇష్ట కామ్యాలు వున్నవారిక్కడ రాముడి ఎడమ చెయ్యి చూసి నమస్కరించి మాకీ కోరిక వుంది స్వామీ అంటే నెరవేరుస్తాడు. అటువంటి గొప్ప ఆవిర్భావం.
ఇక్కడ సీతమ్మ రాములవారికి కుడివైపు వుంటుంది. యజ్ఞ యాగాదులు, దైవ కార్యాలు చేసేవారు భార్యను దక్షిణంవైపు ఆశీనురాలిని చేసుకోవాలని గృహకల్ప శాస్త్రంలో వుంది. దానికి ఆధారం మనుస్మృతి. వైష్ణవ సంప్రదాయంలో ఇది చాలా విశేషమైనది.
ఇక్కడ ఆంజనేయులవారు రెండు రూపాల్లో వుంటారు. సీతమ్మవారికి లంకలో సూక్ష్మ రూపంలో దర్శనమిస్తారు. తమ ఇద్దరినీ కలపటానికి వచ్చిన ఆ సూక్ష్మ రూప హనుమ అంటే సీతమ్మకి ఇష్టం. అందుకే ఆంజనేయస్వామి పీఠంలో కింద సూక్ష్మ రూపంతో దర్శనమిస్తారు. సీతమ్మ జాడ తెలుసుకోవటానికి సముద్రాన్ని లంఘించటానికి తయారుగా 6 అడుగుల ఆంజనేయ స్వామి దక్షిణం వైపు చూస్తూ వుంటాడు. ఇది జాంబవంత ప్రతిష్ఠ. ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు కూడా ఆంజనేయస్వామే. రాముడినుంచి మనకేం కావాలన్నా ఇక్కడ ఆంజనేయస్వామికి విన్నవించుకుంటే నెరవేరుతాయి. అటువంటి గొప్ప క్షేత్రమిది.
అన్నమాచార్యులవారు ఈ క్షేత్రాన్ని దర్శించి కొన్ని కీర్తనలు రాశారుట. మునుపు ఎండౌమెంట్స్ డిపార్టుమెంటు ఆధీనంలో వున్న ఈ ఆలయం ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్ధానం వారి ఆధ్వర్యంలో వుంది.
ఇంకొక విశేషమేమిటంటే ఇక్కడ సీతా రాముల కళ్యాణం అమ్మవారి జన్మ నక్షత్రమైన ఆశ్లేషా నక్షత్రంలో జరపడుతుంది. శ్రావణ పంచమి, షష్టి, సప్తమి, పట్టాభిషేకం, ఆశ్వీయుజ మాసంలో వాల్మీకి మహర్షి జయంతినన్వయించి పౌర్ణమి రోజు పూర్ణాహుతి జరిగేలా పవిత్రోత్సవాలు జరుగుతాయి.
ఇక్కడ ఇంకో విశేషం. రైల్వే స్టేషన్ పడమర దిక్కున వున్న కోతుల గుట్ట మీద ఒక రాతి మీద, సూర్య కిరణాలు వున్న సమయంలో ఒక బండరాయి నీడ పడుతుంది. ఇది ఒక ఋషి ఆకారంలో కనిపిస్తుంది. సూర్యుడు వున్నప్పుడు ఎప్పుడైనా చూడవచ్చు. ఇదేమీ వింతో, మాయో కాదు. ఒక బండ రాయి నీడ మాత్రమే అలా కనిపిస్తుందని చెప్పారు.
1997లో ఈ ఆలయాన్ని ఎండౌమెంట్స్ వారినుంచి తిరుమల తిరుపతి దేవస్ధానం వారు స్వాధీనం చేసుకున్నారు.
రాములవారిని ఇంకో అపురూప రూపంలో చూశామన్న సంతోషంతో అక్కడనుండి బయల్దేరాము.