యాత్రా దీపిక చిత్తూరు జిల్లా – 63 – అగస్త్యేశ్వర కొండ, గవి మఠం

0
2

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా అగస్త్యేశ్వర కొత్త కోటలో ఉన్న అగస్త్యేశ్వర స్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

అగస్త్యేశ్వర కొండ

[dropcap]రా[/dropcap]జనాల బండ నుంచి అగస్త్యేశ్వర స్వామి కొండ చేరేసరికి మధ్యాహ్నం 2-20 అయింది. ఈ కొండకి పౌరాణిక ప్రాశస్త్యమే కాదు, చారిత్రక ప్రాశస్త్యం కూడా వుంది. పుంగనూరు మండలం నెక్కుంది గ్రామ పంచాయితీ.. అగస్త్యేశ్వర కొత్త కోట.. సమీపంలో కొండమీద ఈ ఆలయం వుంది. కర్ణాటకలోని నెక్కుంది ప్రాంతం నుంచి వచ్చిన జమీందార్లు నెక్కుందిలో స్ధిరపడి కొత్తకోట కేంద్రంగా ఈ ప్రాంతాన్ని పాలించినట్లు చెబుతారు. అంతే కాదు, చోళ రాజుల పాత రాజధానీ నగరం (జయం కొండ చోళపురం) కొత్తకోటకూ కొండకూ మధ్యగల స్ధలంలో వుండేది అనటానికి అనేక ఆధారాలు వున్నాయంటారు. ఇదివరకు కాలినడకనే కొండ ఎక్కేవారు. కానీ ఈ మధ్య కొండపైకి వెళ్ళటానికి తారు రోడ్డు వేశారు. అందుకనే ముందు కింద వున్న గవి మఠం చూసి, తర్వాత కారులో పైకి వెళ్ళాము. కానీ మేము వెళ్ళేసరికి ఆలయం ఇంకా తెరవలేదు. సమయాభావం వల్ల మేము ఆలయం తెరిచేదాకా వేచి వుండలేదు. కానీ బయటనుంచే చక్కని ఫోటోలు తీసుకోగలిగాను. ఆలయ చరిత్ర తెలుసుకోగలిగాను.

అక్కడ పెట్టిన క్షేత్ర ప్రాశస్త్య బోర్డువల్ల తెలిసిన వివరాలు.. అగస్త్య మహాముని తపః ప్రభావం వల్ల ఉద్భవించిన స్వయంభూ లింగము యోగ అగస్త్యేశ్వర లింగము. క్రీ.శ. 920 సంవత్సరంలో పరాంతక చోళ చక్రవర్తి, తన బ్రహ్మ హత్యా పాతకాన్ని పోగొట్టుకోవటానికి ప్రధాన దేవాలయంలో భోగ లింగమును ప్రతిష్ఠించి, నిత్య పూజ, ఉత్సవ వైభవములను నిర్వహింప చేశారు. క్రీ.శ. 1126 సంవత్సరంలో కుళోత్తుంగ చోళ చక్రవర్తి భార్య పుడమి సెల్వగంగ ప్రాకార మంటపములు, గాలి గోపురము నిర్మించి, పార్వతీదేవిని, సుబ్రహ్మణ్య స్వామిని, చౌడేశ్వరి దేవిని ప్రతిష్ఠించారు. క్రీ.శ. 1320 సంవత్సరంలో పుడమి గంగమ చోడుడు స్వామిని పునః ప్రతిష్ఠించారు. ఈ వివరాలు ఆలయ గోడల మీద వున్న మూడు శిలా శాసనాల ద్వారా తెలుస్తున్నాయి.

శక్తివంతమైన దక్షిణ ద్వారము మోక్షద్వారముగా వున్న క్షేత్రము కావున దక్షిణ కాశి, భక్తుల కోర్కెలు తీర్చునది కావున వరాల కొండ, సువర్ణముఖి అను జీవనది అంతర్వాహినిగా వున్నందున పవిత్రవంతము, పర్వతమున వెలసినందున ఉత్తమ ఫలదాయి. యోగ అగస్త్యేశ్వరుల సేవకు రాత్రులందు అదృశ్య రూపమున ఋషులు, సిధ్ధ పురుషులు వచ్చి కొండపై జపతపాదులు చేస్తూ వుంటారు.

ఏకశిలా పర్వతముపై వెలసిన ఈ ఆలయము త్రిలింగములు, పంచ నందులు, నవ శక్తులతో కూడి మహిమాన్వితముగా వున్నది. ఈ క్షేత్రమునకు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర పాలకుడు, శ్రీ మహా విష్ణువు క్షేత్ర సంరక్షకుడు, సాలగ్రామ శిలతో తయారు చేయబడిన శ్రీ పార్వతీ దేవి నమ్మి కొలిచిన భక్తులపాలిటి కల్ప వృక్షము.

మద్రాసు నగరము ఆంధ్ర, తమిళనాడు ఈ రెండు రాష్ట్రలకు ఉమ్మడి రాజధానిగా వున్నప్పుడు నార్త్ ఆర్కాటు నవాబుల పాలనలోను, తర్వాత కొంత కాలము కోలారు ఏకుల దొరల పరిపాలనలోను, పుంగనూరు జమీందారీ ఏర్పడినప్పటినుంచీ, స్వాతంత్ర్యం వచ్చేదాకా పుంగనూరు జమీదారుల పాలనలోను ఆలయం వున్నది.

గవి మఠం

కొండ కింద కొద్ది మెట్లు ఎక్కగానే గవి మఠం వుంది. అది చూశాము. ఇప్పుడు వున్న ప్రయాణ సాధనాలు పూర్వం లేవు. యాత్రీకులు కాలి నడకనో, ఎద్దుల బళ్ళమీదో ప్రయాణం చేసేవారు. అలాంటివారి నిత్య కృత్యాల కోసం, దేవతార్చన కోసం అప్పటి రాజులు అక్కడక్కడా మఠాలు నిర్మింప చేశారు. ఇలాంటి మఠాలలో ప్రయాణీకులు ఆగి విశ్రాంతి తీసుకుని వెళ్ళేవారు. సాధు, సన్యాసులు తమ జప తపాలు కొనసాగించేవారు. అలాంటి మఠం ఒకటి అగస్త్యేశ్వర కొండకింద వున్నది. దీనిని గవి మఠం అంటారు. గవి అంటే గుహ. ఈ మఠంలో కొంత భాగం గుహలో వున్నది. ఇదివరకు ఈ గుహ మార్గం చాలా లోపలకి వుండేదిట. పూర్వం ఒక ఋషి ఒక ఆవుని, దూడని తీసుకుని ఆ గుహలోకి వెళ్ళి తిరిగి రాలేదుట. అప్పటినుంచి ఆ సొరంగ మార్గాన్ని మూసేశారుట.

అర్చక స్వాములు కొండ కింద ఊళ్ళో వుంటారని తెలిసి మా మిత్రులు పిలుచుకొచ్చారు. వంశ పారంపర్య అర్చకులు. చరిత్ర సరిగా చెప్పలేక పోయారు. తాత ముత్తాతల కాలంనుంచి వున్నది. ఎవరు, ఎప్పుడు కట్టించారో తెలియదు అన్నారు. మొదటి అంతస్తులో గురు మఠం వుంది. కొంతమంది ఋషులు అక్కడ తపస్సు చేసుకునేవారు.

ఇక్కడ ప్రతిష్ఠ చేయబడ్డ దేవుడు వీరభద్రస్వామి. శివలింగం కూడా వున్నది. నిత్య పూజలు జరుగుతున్నాయి. ఈ అగస్త్యేశ్వర కొండకంతా రక్షణ ఈయనే. ఈయన పెళ్ళికాని వీరభద్రుడు. ముందు చిన్న మండపంలో అమ్మవారి ఫోటో వుంది. ఎవరో సరిగా తెలియక కాళికా అని అడిగితే అప్పుడు చెప్పారు. ఈయన పెళ్ళికాని వీరభద్రుడు. ఆ ఫోటోలో వున్నది చాముండి. ఆయన తల్లి. ఇక్కడ తల్లి కుమారుల దర్శనం అవుతుందని చెప్పారు. అమ్మవారిది.

మఠం ముందు బావి వుంది. దానిలో ఎప్పుడూ నీళ్ళు వుంటాయిట. పైగా ఆ తీర్ధం చాలా మహిమగలదట. పుంగనూరు జమీదార్లకి ఆరోగ్యపరమైన ఏ సమస్య వచ్చినా గుర్రం మీద ఇక్కడికి వచ్చి ఆ నీళ్ళు తాగితే ఆరోగ్యం బాగుపడుతుందని వచ్చేవారు. వారి నమ్మకం అది. వారికే కాదు. ఇప్పటివారు కూడా దానిని నమ్ముతారు.

ప్రస్తుతం ఈ మఠం ఎండౌమెంట్స్ వారి అధీనంలో వున్నది.

అర్చకస్వామి పేరు శ్రీ ప్రకాశ స్వామి . సెల్ 9110376978.

ఇంక ఆ రోజుకి ఆలయ దర్శనాలు ఆపి మదనపల్లిలో బస చేశాము. అక్కడ శ్రీ సాంబశివ రెడ్డిగారి తమ్ముడి కొడుకు శ్రీ హేమంత్, వారి స్నేహితులు శ్రీ అనిల్ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. వారికి ముఖాముఖి ధన్యవాదాలు కూడా చెప్పలేక పోయాము. వారి ఆఫీసు పని మీద వేరే ఊరు వెళ్ళటంతో. పత్రికా ముఖంగా వారిరువురికీ మా ఆశీస్సులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here