యాత్రా దీపిక చిత్తూరు జిల్లా – 64 – 67 గార్గేయ కొండ, ఆవులపల్లి, మల్లేశ్వరం, చెరుకువారిపల్లి

0
2

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా పలు ఆలయాల గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

64 గార్గేయ కొండ

[dropcap]మా[/dropcap] యాత్రలో నాల్గవ రోజు 8-3-22 ఉదయం 9-20కి మదనపల్లి నుంచి బయల్దేరి గార్గేయ కొండ చేరుకునేసరికి ఉదయం 11-25 అయింది. దీనిని దుర్గం కొండ అంటారు. సోమల మండలంలో వున్నది. కొండ మీద ఇదివరకు ఊరు, దుర్గం వుండేవిట. ప్రధాన రహదారి నుంచి కూడా లోపలకి చాలా దూరం వచ్చాము. అక్కడ ఏమీ దొరకవు. కొత్తగా వేసిన తారు రోడ్డు బాగుంది. కోనమందనుంచి కొండపైకి 6 కి.మీ.లు, పెద్ద ఉప్పరపల్లినుంచి 12 కి.మీ.లు. రోడ్డు వెయ్యటానికి 9.8కోట్ల రూపాయలు ఖర్చయినయిట. శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి, ఆంధ్ర ప్రదేశ్ లో కొండమీద వున్న ఆలయాలకి.. ఆగస్త్య, గార్గేయ, మల్లేశ్వర ఆలయాలకి ఈ మధ్యనే రోడ్లు వేయించారు. భక్తులు సులభంగా ఆలయాల దాకా చేరుకోవచ్చు.

ఇది గార్గేయ మహర్షి తపస్సు చేసిన పుణ్య స్ధలం. కృత, త్రేతాయుగాల మధ్య కాలంలో కాశీనుంచి వచ్చి, కొన్నాళ్ళు ఇక్కడ వుండి తపస్సు చేసుకున్నారు. అందుకే ఆయన పేరు వచ్చింది. ఇక్కడ ప్రారంభం అయిన నదికి కూడా ఆయన పేరే గార్గేయ నది. ఇదివరకు కొండమీదకి 10 కి.మీ.లు నడిచి వెళ్ళాల్సి వచ్చేది. అనేక ప్రాచీన శిధిలాలు, చెరువులు, పొలాలు కొండపై వున్నాయిట. ఇది ఒక ప్రాచీన శిధిల దుర్గం. పూర్వం ఇది ఏకిల దొరల రాజ్యం.

గార్గేయ కొండమీదకి వెళ్ళాక తెలిసింది. ఇంత ఖర్చు పెట్టి రోడ్డు వేసినా, అది అక్కడ మొదట్లో వున్న చిన్న వినాయకుడి గుడి దాకానేనని, కొండ పైన వున్న శివాలయానికి చేరుకోవటానికి ఇంకా 250 మెట్లు ఎక్కాలని. మేము కొండ ఎక్కలేమంటే, అర్చక స్వామి అక్కడ పూజ చేసి, హారతి ఇచ్చారు. రోడ్డు పడ్డందువల్ల అనుకుంటా భక్తులు ఆటోల్లో, కారుల్లో వస్తున్నారు. వినాయకుడి గుడిదాకా వాహనాలు వెళ్తాయి. కొండమీద చెట్లతో వాతావరణం ఆహ్లాదకరంగా వున్నది. ఇక్కడికి 3 కి.మీ.ల దూరంలో కొండల్లో పార్వతి, కాశీ విశ్వనాథుడి ఆలయాలు వున్నాయిట.

ఈ కొండమీద శివుడు గార్గేయ మహర్షి తపస్సుకి మెచ్చి ఆవిర్భవించాడు. ప్రత్యక్ష లింగం. కోరికలు తీర్చే స్వామిగా కొలుస్తారు. సంతానం, వివాహం, ఇలా ఏ ఇబ్బంది వున్నా తీర్చే స్వామిగా ప్రసిధ్ధిగాంచాడు. కార్తీక పౌర్ణమికి ఇక్కడ శివుడికి భస్మాభిషేకం చేస్తారు. ప్రతి సోమవారం అభిషేకం. రాత్రిళ్ళు శివలింగం పక్కన వున్న గుహలోంచి సుగంధాలు వస్తాయంటారు. మంత్రాల, ధ్వనులు ఇప్పటికి కూడా వినబడతాయిట.

ఇక్కడ కోనేట్లే స్నానం చేస్తే రోగాలు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. ఆ నీళ్ళు ఇంటికి తీసుకెళ్ళి కూడా ఔషధంలా సేవిస్తారు. బి.పి., షుగర్ వ్యాధులు తగ్గుతాయనే నమ్మకం. కొండల్లో, ఔషధ మొక్కల్ని ఒరుసుకుంటూ రావటంవల్ల ఆ నీటికి ఆ గుణం వున్నది. మినరల్ వాటర్ కన్నా బాగుంటుందిట.

ఇక్కడ అర్చక స్వామి పేరు శ్రీ వినయ కాశ్యప్ శర్మ. ప్రతి సోమవారం ఉదయం 5 గంటల నుంచీ మధ్యాహ్నం 2 గంటల దాకా వుంటారు. వేరే రోజుల్లో ఫోన్ చేస్తే వస్తారు.

సెల్ నెంబరు 7337590302


65 ఆవులపల్లి

ఆవులపల్లి పెద్ద ఉప్పరపల్లికి 2 కి.మీ.లు, సోమలకు 13 కి.మీ.ల దూరంలో వున్నది. ఇక్కడ టి.టి.డి. వారి ఆధ్వర్యంలో వున్న ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవాలయం వున్నది. ప్రస్తుతం టి.టి.డి. వారి అధీనంలో వున్నా ఈ ఆలయాన్ని చాలా కాలం క్రితం వెంకటపతి రాయలు అనే ఏకిల దొర నిర్మించాడని తెలుస్తోంది. అప్పట్లో 24 పరగణాలకి కేంద్ర బిందువు ఈ ఊరు. ఇక్కడనుంచే పరిపాలన సాగేది. ఇక్కడి వారికి భక్తి ఎక్కువ. రాయలకి సైన్యం సమకూర్చేవారు. వెంకటపతి రాయలు, ఆయన భార్య ఇద్దరూ వెంకటేశ్వరస్వామికి గొప్ప భక్తులు. ఈయన ప్రతి రోజు కొందరు భటుల చేత తిరుమల నుండి అంచెలంచెలుగా చంద్రగిరి, పాకాల, జాండ్రపేట, దుర్గం కొండ మీదుగా తీర్థ ప్రసాదాలు తెప్పించి, అవి స్వీకరిస్తేగానీ ఆహారమేమీ తీసుకునేవాడు కాదు.

ఒకసారి వెంకటేశ్వరస్వామి వీరిని పరీక్షించటానికి వరుసగా 8 రోజులు కుంభ వృష్టి కురిసేటట్లు చేశాడు. ఆ రోజుల్లో ఇన్ని ప్రయాణ సాధనాలు లేవు. తిరుమల నుంచి ప్రసాదం అంచెలంచెలుగా గుర్రాల మీద తెచ్చేవారు. 8 రోజులు ఆగకుండా కురిసిన జడివాన వల్ల భటులు ప్రసాదం తీసుకు రాలేక పోయారు. ఆ 8 రోజులూ దొర, ఆయన భార్య పచ్చి మంచినీళ్ళయినా ముట్టుకోకుండా ఉపవాసం వున్నారు. వారి భక్తికి మెచ్చిన వెంకటేశ్వరస్వామి కలలో కనిపించి, స్వంత గ్రామంలోనే నా ఆలయం నిర్మించుకోండి. స్వయంగా నేనే వచ్చి అక్కడ నిలుస్తాను అని చెప్పారుట. స్వామి ఆజ్ఞతో వెంకటపతి రాయలు ఈ ఆలయాన్ని నిర్మించాడు.

ఇంకొక కథ ప్రకారం అప్పుడు పత్తి వ్యాపారం బాగా సాగేది. ఒకసారి వర్షాలు ఎక్కవ పడి విషమించాయి. రాజుకి ఆరోగ్యం బాగాలేదు. గుర్రాలు రాలేని సమయంలో రాజుకి స్వామి కనబడి మీ గ్రామానికి పత్తి వ్యాపారులతో నేనే వస్తాను అని చెప్పారుట. వ్యాపారులతో వచ్చిన ఒక పత్తి మూట చాలా బరువుగా వుందని దించలేక పోయారుట. విప్పి చూస్తే స్వామి విగ్రహం. ప్రతిష్ఠ చేసి, ఆలయం నిర్మించారు. ఏ కథ ఎలా వున్నా ఆలయ నిర్మాత మాత్రం వెంకటపతి రాయలే. ఈ ఆలయానికి హంపీ నుంచి చిన్న స్తంభాలు, సరిగమలు పలికేవి తెచ్చి అమర్చారు. కొట్టి చూపించారు కానీ శబ్దం సరిగా లేదు.

హైదర్ ఆలీ గుర్రం కొండనుంచి వస్తూ ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. స్తంభాలు పగలగొట్టాడు. ఇక్కడనుండి రాయలకి సైన్యం వెళ్తోందని అందర్నీ నాశనం చేశాడు. బాంబులతో బయట మండప స్తంభాలు పగలగొడితే తీసి వేరే స్తంభాలు పెట్టారు.

బ్రిటిష్ గవర్నర్ మేజర్ మండ్రో ఈ ఆలయాన్ని దర్శించినట్లు ఆధారాలు వున్నాయి.

ఇది వరకు ఎండౌమెంట్స్, ఇప్పుడు టి.టి.డి. ఆధ్వర్యంలో వున్న ఈ ఆలయంలో ఫాల్గుణ శుధ్ధ పాడ్యమి నాడు రథోత్సవం జరుగుతుంది. ఉగాది, శ్రీరామ నవమి బాగా జరుగుతాయి. ఆవులపల్లి, పెద్ద ఉప్పరపల్లి, అన్యంగారి పల్లి ఈ మూడు పంచాయితీలవారు కలిసి బ్రహ్మోత్సవాలు చేస్తారు. ఈ ఏడాది మర్నాటినుంచి (9-3-22) జరిగే బ్రహ్మోత్సవాలు కరోనా దృష్ట్యా ఏకాంతంగా చేయాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇక్కడ అర్చక స్వామి శ్రీ కె. గోపీనాధాచార్యులు. ఇది వరకు మేము టి. పుత్తూరు కోదండ రామాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అర్చకులుగా వున్నారు. ఇప్పుడ ఇక్కడ వంశపారంపర్య అర్చకులు. ఆయనే ఆలయ వివరాలు అన్నీ చెప్పటమేగాక, వారింట్లో మా అందరికీ మంచి భోజనం కూడా పెట్టించారు. ధన్యవాదాలు గోపీనాధాచార్యులు గారూ.

సెల్ శ్రీ కె. గోపీనాధాచార్యులు .. 9959857721

బొజ్జ నిండిందిగా. మిట్ట మధ్యాహ్నమయినా 2-10 కల్లా మళ్ళీ బయల్దేరాము. వీలయినన్ని ఆలయాలు చూడాలని మా తపన.


66 మల్లేశ్వరం

సోమలనుండీ 10 కి.మీ.లు, పెద్ద ఉప్పరపల్లినుంచి 5 కి.మీ. ల దూరంలో వున్న ఈ ఆలయానికి చారిత్రాత్మక నేపథ్యం కూడా వున్నది. హైదరాబాదు సేనాని రణదుల్లా ఖాన్ కోలారుపై దండెత్తి, అక్కడి రాజు తిమ్మరాయలను హత్య చేశాడు. ఆయన భార్య సతీ సహగమనం చేసింది. వారి కుమారుడు 6 ఏళ్ళ చిక్కరాయలను పినతల్లి హలసమ్మ(హలసాంబ) తీసుకువచ్చి, ఈ ఘోరాటవిలో ఒక సంవత్సర కాలం జీవించింది. ఆ సమయంలో ఈవిడ ఈ ప్రాంతంలో 5 శివాలయాలను నిర్మించి శివుని తమ క్షేమం కోసం పూజించింది. ఆలయానికి ఎదురుగా పెద్ద కోనేరుని తవ్వించింది.

మొదట పుంగనూరు సమీపంలోని అల్సాపురంలో వున్న అలసమ్మ దురాక్రమణదారుల భయంతో, భద్రతా కారణాల దృష్ట్యా క్షేమకరమైన ఈ ప్రాంతానికి వచ్చింది. ఇక్కడ ఆలయాన్ని నిర్మించి, ఈశ్వరునికి మల్లేశ్వరుడని, మహా మల్లేశ్వరుడని నామకరణం చేయటమేగాక ఆలయానికి చక్కని మాన్యాలని కూడా సమర్పించింది.

బిడ్డ రక్షణార్ధం రాజ్యం మంత్రులకి అప్పజెప్పిరాగా, వారు దురాశకు లోనై శత్రుపరం చేశారని విన్న హలసమ్మ భద్రత దృష్ట్యా ఇంక అక్కడ వుండటం క్షేమం కాదని సదుం సమీపంలోని మరింత ఘోరాటవీ ప్రాంతమైన చెరుకువారిపల్లె ప్రాంతానికి పారిపోయింది.

ప్రస్తుతం గ్రామస్తుల సహకారంతో ఆలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. ఆలయం అభివృధ్ధి చెందుతోంది. చిన్న ఆలయం.


67 చెరుకువారిపల్లి

మల్లేశ్వరంనుండి మా ప్రయాణం చెరుకువారిపల్లి కాశీ విశ్వేశ్వరాలయానికి (సదం మండలం). పూజారిగారిల్లు దగ్గరకాబట్టి సమయం కాకపోయినా మన మిత్రులు వెళ్ళి పిలిస్తే వచ్చారు. మల్లేశ్వరాలయం కన్నా పెద్దది. ఎందుకు పోలుస్తున్నానంటి మల్లేశ్వరాలయం గురించి చెప్పేటప్పుడు హసనాంబ గురించి చెప్పాను. ఆవిడి శత్రువులనుంచి పారిపోయి రాజ కుమారుణ్ణి కాపాడటానికి కోలారు ప్రాంతంనుండి మల్లేశ్వరానికి వచ్చి అక్కడ కొన్నాళ్ళు వుండి శివాలయాన్ని నిర్మింపజేసింది అని.

మంత్రి, దండనాయకులు రాజ్యాన్ని రణదుల్లా ఖాన్‌కు అప్పగించడంతో తిరిగి పోలేక ఈ ఆడవి ప్రాంతములో తలదాచుకుని, తన బిడ్డని రక్షించమని, రాజ్యములకు దిక్కు సృష్టించమని కాశీశ్వరుని లింగాన్ని ప్రతిష్ఠించి పూజించింది. ఇక్కడ అగ్రహారం నిర్మించి వారి మధ్య 3 సంవత్సరాల కాలం జీవించింది. ఈ కాలంలో బాపన చెరువు మరికొన్ని కుంటలను, ఈశ్వరాలయమునకు పడమరగా వెంకటేశ్వరాలయాన్ని నిర్మించినదిట. వందలాది ఎకరాల భూములు మాన్య మీరాశీలిచ్చినది. శత్రు భయంతో అక్కడనుండి ఈ ప్రాంతానికి వచ్చిందని అంటారు. ఈ ప్రాంతమంతా అప్పడు దట్టమైన అడవులతో వున్నది. ఈ ఆలయం కూడా ఆవిడ కట్టించినదేనని చెబుతారు. పూర్వం ఈ ప్రాంతాన్ని అలసాంబ అగ్రహారం అని కూడా పిలిచేవారట. క్రీ.శ. 1936లో సీతారామయ్య గురుకుల్ గారు ఆలయాన్ని అభివృధ్ధి చేశారు.

ఇక్కడ శివాలయమే కాదు వెంకటేశ్వరస్వామి ఆలయం కూడా నిర్మించిందట. బాపన చెరువు నిర్మించి వందలాది ఎకరాల భూములను మాన్యమిరాశీలిచ్చినదట. అలసమ్మ బిడ్డనెత్తుకుని ఈశ్వరుని ఓవైపు, వెంకటేశ్వరుని రెండోవైపు రక్షించమని వేడుకుంటున్న దృశ్యములు చెక్కి నాటబడిన బండ వెంకటేశ్వరాలయ సమీపంలో నేటికీ చూడవచ్చు. (ఈ వివరాలను శ్రీ మునిరత్నంగారి పుంగనూరు జమిందారీ – ఆలయాలు పుస్తకం ద్వారా సేకరించినవి). మేమీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని చూడలేదు.

ఆలయంలో శివలింగం చాలా చిన్నది. ఆలయం పరిశుభ్రంగా, ముందంతా ముగ్గులు పెట్టబడి, ప్రశాంతంగా వున్నది. మరీ పెద్ద ఆలయం కాదు. చుట్టూ ప్రహరీ. మూడంతస్తుల ముఖ ద్వారం పై నంది మీద వినాయకుడు, శివుడు, పార్వతి కూర్చున్నట్లు విగ్రహాలున్నాయి. వారికి ఎడమవైపు కుమారస్వామి, ఆయన వాహనంతో, కుడివైపు నటరాజు.. విగ్రహాలు అందంగా చెక్కబడ్డాయి.

ప్రస్తుతం అర్చకస్వామి శ్రీ మురళి గురుకుల్ గారు. ఆయన చెప్పినదాని ప్రకారం ఈ ఆలయం 700 సంవత్సారాల నాటిది. అల్లసాంబ నిర్మాణం. ఇక్కడ నాలుగు అఖండాలు (స్వామి దగ్గర, అమ్మవారి దగ్గర) ఆ కాలంనుంచీ వెలుగుతూనే వున్నాయి. కాశీ లింగం కనుక కాశీ విశ్వేశ్వరుని పేరు. ప్రతిష్ఠిత లింగం. నిత్య పూజలు జరుగుతాయి. శివరాత్రికి తిరణాల జరుగుతుంది. ధనుర్మాస పూజలు, దసరాలో అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి.

భక్తులు ఎవరికైనా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే 41 రోజులు అఖండ దీపం వెలిగిస్తామని మొక్కుకుంటారు. అలా వెలిగించే అఖండ దీపాలు కూడా వున్నాయి.

ఆలయం ఎదురుగా చెట్ల కింద నాగ ప్రతిష్ఠలున్నాయి. ఆ చెట్లకి చుట్టూ దారాలు కట్టి వున్నాయి. అవి ఎందుకు అలా కట్టారంటే అక్కడ నాగ దేవతలను ప్రతిష్ఠించారు. భక్తులు కొందరు వాటికి ప్రదక్షిణలు మొక్కుకుంటారుట. ఒక్కోసారి ప్రదక్షిణ చేసినప్పుడు ఒక్కోసారి దారం చుడతారుట. లెక్కకోసమేమో.

ఇక్కడ అర్చకస్వామి పేరు శ్రీ యస్. మురళీ గురుకుల్. సెల్ 9346648729.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here