యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-7

0
2

[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా పులిగుండు లోని ‘శ్రీ పులిగుంటేశ్వరస్వామి దేవాలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

పులిగుండు

[dropcap]సా[/dropcap]యంత్రం 4-20కి పులిగుండు చేరుకున్నాము. ఇది చిత్తూరుకు 18 కి.మీ.ల దూరంలో, మండల కేంద్రం పెనుమూరుకు సమీపంలో వుంది. దూరంనుంచే రెండు జంట పర్వతాలు మధ్యలో చీలికతో పక్కపక్కనే ఒకటో, రెండో తెలియనట్లు ఆకర్షించాయి. అదే పులిగుండు. పూర్వం ఇక్కడ పులి తిరుగుతూ వుండేది కనుక పులిగుండు అన్నారని కొందరంటే, ఆ పులి ఒక బోయవాణ్ణి చంపబోగా వాడా భయానికి ఆ గుండు మీదకి చేతులతో ఎగబాకినట్లు పైకెక్కాడుట. అందుకని దానిని పులిగుండు అన్నారంటారు. ఇంకా కొందరు ఆ కొండల్లో ఒక పులి నివసించేదని, అది గాండ్రిస్తే దూరాన ఎక్కడో వున్న పశువులు అదిరి పడేవన్నారు. పులే కాదు ఇంకా చాలా జంతువులు పూర్వం ఈ కొండల్లో వున్న గుహల్లో వుండేవి అని కూడా అన్నారు.

అంతే కాదండోయ్. ఈ పర్వతాలు రెండూ పక్కపక్కనే వున్నాయి. పైగా కొండపైన చిన్న శివాలయం ఇంకా కొన్ని ఆలయాలు వున్నాయి. కొండకింద శివాలయం వుంది. అందుకని వీటిని పార్వతీ పరమేశ్వరులు అని కూడా అన్నారు. ఈ రెండింటికీ మధ్యలో చాలా సన్నటి సందు వుంది. ఈ సందులో ప్రస్తుతం ఇనుప మెట్లు వున్నాయి. వాటి ద్వారా దాదాపు 1000 అడుగుల ఎత్తున వున్న శిఖరం మీదకి చేరుకోవచ్చు. అయితే వెళ్ళివచ్చినవారి ఉవాచ ఏమిటంటే పైకి వెళ్తున్నకొద్దీ చుట్టూతా ఏమీ లేవు కనుక మనుషులని తోసేస్తున్నట్లు ఈదురు గాలి వుంటుంది. చాలా సన్నటి దోవ.. పైన కొంతమేర సన్నగా, చీకటిగా వుంటుంది. జాగ్రత్తగా ఎక్కాలి. సాయంకాలం అయింది, పొద్దున్న నుంచి తిరిగి తిరిగి వున్నాం గనుక మాకా ఆలోచన కూడా రాలేదనుకోండి. ఆ కొండ దరిదాపులనుంచి వెళ్ళినా ఆ మెట్లు కనిపించలేదు. అంత సన్నగా వున్నాయన్నమాట.

పూర్వం ఆ కొండ మీదకెక్కటానికి బలమైన తాళ్ళ నిచ్చెనలు, మోకుల సహాయంతో ఎగబాకేవాళ్ళుట. మునుపు ఇక్కడ పెద్ద పెద్ద తేనెపట్లు వుండేవిట. గిరిజనులు ఇక్కడ పట్టిన పెద్ద పెద్ద తెనెపట్లని కొండమీదకు సాహసంతో ఎగబాకి సాధించి తెచ్చేవారు. రానురానూ అడవులు తరిగిపోవటం, వాతావరణ కాలుష్యం వల్ల కూడా తేనెపట్లు పట్టటం తగ్గింది. మనుష్యుల సందడి కూడా పెరిగింది. ఇప్పుడు మెట్ల దోవ వుంది.

మెట్ల దోవలో శ్రీ వెంకటేశ్వరస్వామి, అలివేలు మంగమ్మలను ప్రతిష్ఠించారుట. అక్కడనుంచి కొన్ని కిలోమీటర్లు పర్యంతం చక్కని ప్రకృతి దృశ్యాలు, ఊళ్ళు కనబడతాయి. పైన శివుడు స్వయంభూ అంటారు. అంతేకాదు అంతెత్తు కొండమీద ఒక సహజ సిధ్ధమైన కోనేరు వుందిట.

చారిత్రకంగా కూడా ఈ పులిగుండు ప్రసిధ్ధికెక్కింది. పూర్వం శత్రు ప్రమాదం సంభవించినప్పుడు పాలెగాళ్ళు (ఆ ప్రాంతపు సామంత రాజులు) పులిగుండు ఎక్కి రక్షణ పొందేవారని, అవసరమైనప్పుడు శత్రువులపై తుపాకులు పేల్చేవారని చెబుతారు.

ప్రతి సంవత్సరం సంక్రాంతి పడుగల్లో కనుమ రోజు పులిగుండు కొండచుట్టూ ఉత్సవం చాలా అట్టహాసంగా జరుగుతుంది.

పులిగుంటేశ్వరస్వామి ఆలయం

పులిగుండుకి ముందు వుంది శ్రీ పులిగుంటేశ్వరస్వామి ఆలయం. 700 సంవత్సరాల క్రితం స్వామి స్వయంభూగా వెలిశాడుట. ఆలయంలో రెండు శివలింగాలుంటాయి. ముందున్న లింగం కోనేరులో వుందని ఒకరి కలలో కనపించి చెబితే తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. వెనకది ఆది శంకరాచార్యుల వారి ప్రతిష్ఠ అని పూజారిగారు చెప్పారు. శివలింగం ఐదు అడుగుల ఎత్తున వుండి వెనక బల్లపరుపుగా వుంటుంది.

ఈ ఆలయం ముందు ఒక గుహాలయంట. ముందు గర్భాలయానికే పరిమితమైన ఈ ఆలయాన్ని తర్వాత రాజులు, పాలెగాళ్ళ సహాయంతో అంతరాళం, అర్ధ మండపం వరకు నిర్మింపబడిన ఆలయాన్ని తర్వాత ఇంకా అభివృధ్ధి పరచి ముఖమండపం కూడా నిర్మించారు.

పక్కన శ్రీ పార్వతీ అమ్మవారి ఆలయం. అమ్మవారి విగ్రహం చిన్నదే. ఆ ఆలయం వెనుక అయ్యప్ప, షిర్డీ సాయిబాబా ఆలయాలు చిన్నవి 10 సంవత్సరాల క్రితం కట్టినవి వున్నాయి.

ఉత్సవాలు

ఇక్కడ శివరాత్రి చాలా వైభవంగా జరుగుతుంది. సంక్రాంతి, కనుమ రోజుల్లో కొండ చుట్టూ తిరునాళ జరుగుతుంది. పూర్వం నుంచీ వస్తున్న ఆచారం ప్రకారం పెనుమూరులో పాలెగాళ్ళ కాలంనుంచీ వున్న శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంనుండి స్వామివార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా పులిగుండుకు తీసుకు వస్తారు. అప్పుడు పార్వతీ సమేత పులిగుంటేశ్వర స్వామి శ్రీ రామలింగేశ్వర స్వామిని, అమ్మవారిని మేళతాళాలతో ఎదురు వెళ్ళి సాదరంగా ఆహ్వానిస్తారు. తర్వాత అందరూ కలిసి పులిగుంటేశ్వరస్వామి ఆలయం చేరుకుంటారు.

అతిథి మర్యాదలు, మంగళ హారతులు, పూజాదికాలు ఘనంగా సాగుతాయి. సాయంత్రం శ్రీ పార్వతీ సమేత పులిగుటేశ్వస్వామి మాత్రం కొండ చుట్టూ ఊరేగింపుకి వెళ్తారు. ఆ సమయంలో కొండ చుట్టూ వున్న గ్రామాల వారు స్వామికి పూజలు చేసి, హారతులు ఇస్తారు. ఈ తిరునాళలో వేలాదిమంది భక్తులు పాల్గొంటారు.

పార్వతీ పరమేశ్వరులు ఆ పర్వతాలను చుట్టటం అంటే తన సంతానమైన సకల ప్రాణులనూ అనుగ్రహించటం కోసమే అని అంతా భావిస్తారు.

దర్శనం సమయాలు

ఉదయం 4 నుంచి 12 దాకా, సాయంకాలం 4 గంటల నుంచి 7 గంటల దాకా. గుడి సమీపంలో ఏమీ దొరకవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here