[box type=’note’ fontsize=’16’] కృష్ణా జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా జిల్లా గురించి, కొండలు, నీటి వనరులు, ఆలయాల గురించి క్లుప్తంగా వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
[dropcap]కృ[/dropcap]ష్ణా జిల్లాకు ఆ పేరు జిల్లాలో ప్రవహించే కృష్ణా నది వల్ల వచ్చింది. జిల్లా అధికారిక కేంద్రం మచిలీపట్నం కాగా, వాణిజ్య కేంద్రం విజయవాడ. ఈ జిల్లా సరిహద్దులలో ఉత్తరాన ఖమ్మం జిల్లా, తూర్పున పశ్చిమ గోదావరి, దక్షిణాన బంగాళాఖాతము, నైరుతిలో గుంటూరు జిల్లా, వాయవ్యంలో సూర్యాపేట జిల్లా ఉన్నాయి. కృష్ణా జిల్లాను ఇంతకు ముందు “మచిలీపట్నం జిల్లా” అని పిలిచేవారు. 1859లో గుంటూరు జిల్లాలోని కొన్ని తాలూకాలను ఈ జిల్లాలో కలిపి కృష్ణా జిల్లాగా పేరు మార్చారు. 1925లో కృష్ణా జిల్లాను కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలుగా విభజించారు.
చరిత్రలో వివిధ సమయాలలో శాతవాహనులు, చోళులు, పల్లవులు, కాకతీయులు, రెడ్డిరాజులు, గజపతులు, విజయనగర సామ్రాజ్యాధీశులు, కుతుబ్ షాహీలు, నిజాములు, ఆంగ్లేయులు మొదలైనవారు ఈ ప్రాంతాన్ని పాలించారు.
జిల్లా వాతావరణ పరిస్థితులు వేసవికాలం చాలా వేడిగా, శీతాకాలం తేలికపాటిగా ఉంటాయి. అంతేకాక ఇక్కడి వాతావరణం పరిస్థితులనిబట్టి ఉష్ణ ప్రాంతంగా చెప్పబడుతుంది. ఏప్రిల్ ప్రారంభ కాలం నుండి జూన్ వరకు చాలా వేడిగా ఉంది..
కొండలు
జిల్లాలో ప్రధాన కొండ నందిగామ – విజయవాడ పట్టణముల మధ్య 24 కిలోమీటర్ల దూరంలో వున్న కొండపల్లి. జమ్మలవాయిదుర్గం, మొగల్రాజపురం, ఇంద్రకీలాద్రి జిల్లాలోని ఇతర ప్రముఖ కొండలు.
భారతదేశములో అత్యంత ప్రసిద్ధమైన కనకదుర్గ దేవాలయం, విజయవాడలో ఇంద్రకీలాద్రి కొండ మీదనే ఉంది.
నీటి వనరులు
జిల్లాలో ప్రవహించే ముఖ్యమయిన నది కృష్ణా నది పొడవు 1280 కి.మీ. బుడమేరు, మున్నేరు, తమ్మిలేరు ఇతర నదులు. ఇవి కాక జిల్లాలో చిన్న కొండవాగులు కూడా ప్రవహిస్తాయి. ఇవి జయంతి, కట్టలేరు, ఇప్పలవాగు, ఉప్పుటేరు, తెల్లేరు, బళ్ళలేరు, మరియు నడిమేరు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సులో కొంత భాగం కృష్ణా జిల్లాలో ఉంది.
కృష్ణా జిల్లా పట్టణ ప్రాంతాలలో ఎక్కువ మంది వ్యక్తులు వ్యాపారము చేస్తారు. వ్యవసాయం, జిల్లా ప్రజల యొక్క ఇంకో ముఖ్యమైన వృత్తి.
కృష్ణా జిల్లాలో ఎన్నో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో కెసీపి చక్కెర కర్మాగారం చెప్పుకోతగ్గది. ఉయ్యూరు వద్ద ఉన్న కె.సి.పి. షుగర్ ఫ్యాక్టరీ భారతదేశంలోని అతిపెద్ద చక్కెర కర్మాగారములలో ఒకటి. ఇబ్రహీంపట్నం సమీపంలో, విజయవాడ థర్మల్ పవర్ స్టేషను వుంది. దాని పనితీరునకు భారతదేశంలో నం.1 అధిక పవర్ ఉత్పత్తి యూనిట్‌గా స్థానం పొందింది. ఇది కాక, అనేక మీడియం స్కేల్ సిమెంట్ కర్మాగారాలు జిల్లా అంతటా ఉన్నాయి. మచిలీపట్నం వద్ద గోల్డ్ కవరింగ్ ఆభరణాలు, కొండపల్లి వద్ద బొమ్మలు, జగ్గయ్యపేట వద్ద సంగీత సాధన తయారీ పరికరాలు వంటి పలు చిన్న తరహా పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి.
ఇంక ఆలయాల సంగతయితే చెప్పనక్కరలేదు. ప్రసిధ్ధిగాంచిన కనకదుర్గమ్మ ఆలయం విజయవాడలో ఇంద్రకీలాద్రి పర్వతం మీద వున్నది. ఇంకా ఎన్నో పురాతన, నూతన ఆలయాలున్నాయి. మరి వీటన్నిటి గురించీ వచ్చే వారం నుంచీ చెప్పుకుందాము.