యాత్రా దీపిక కృష్ణా జిల్లా – 10. మోపిదేవి

0
2

[box type=’note’ fontsize=’16’] కృష్ణా జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా మోపిదేవి లోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

భుక్తి ముక్తి ప్రదాయకుడు మోపిదేవి సుబ్రహ్మణ్యుడు:

[dropcap]త[/dropcap]మిళనాడులో లాగా మన రాష్ట్రంలో సుబ్రహ్మణ్య దేవాలయాలు ఎక్కువ సంఖ్యలో ప్రత్యేకంగా లేవు గానీ సుబ్రహ్మణ్య ఆరాధన మాత్రం దాదాపు ప్రతి హిందువూ చేస్తాడు. ప్రతి ఆలయంలోనూ భక్తుల పూజలందుకునే నాగ ప్రతిమలే ఇందుకు తార్కాణం. చిన్న పిల్లలకు చెవికి సంబంధించిన బాధలు వస్తే వెంటనే సుబ్రహ్మణ్యస్వామికి మొక్కుకునే తల్లులెందరో. కంటి, చెవి, చర్మ వ్యాధులను నయం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించే వరదుడు సుబ్రహ్మణ్యుడని భక్తుల నమ్మకం.

భక్తులు నాగుల చవితికి, సుబ్రహ్మణ్య షష్టికి, నాగ పంచమికి, పుట్టలో పాలుపోసి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యస్వామి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలోని మోపిదేవి గ్రామంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయ దర్శనం చేసొద్దాం రండి.

స్కాంద పురాణంలో ఈ క్షేత్ర ప్రశంస కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యస్వామిని గుర్తించినవారు అగస్త్య మహర్షి. మరి అగస్త్య మహర్షి కాశీలో వుండేవాడు, దక్షిణాపథానికి ఎందుకొచ్చాడు అంటే, పూర్వం మహానుభావులు ఏమి చేసినా ప్రజా శ్రేయస్సు కోసమే చేసేవారు. అలాగే అగస్త్యుడు కూడా ప్రజల శ్రేయస్సు కోసమై కాశీలో సదాశివుని సన్నిధి విడిచి దక్షిణాపథానికి వచ్చాడు. ఆ కథ ఏమిటంటే…

పూర్వం వింధ్య పర్వతం అహంకారంతో తానే ఎత్తుగా వుండాలని ఆకాశం వైపు పెరగసాగింది. దానితో సూర్య చంద్రులు, మిగతా గ్రహ గతులకి ఆటంకం ఏర్పడి లోకమంతా అంధకారమయమయింది. దేవతలు, మహర్షులు ఆందోళన చెంది కాశీలో విశ్వేశ్వరుని సేవించుకుంటూ వున్న అగస్త్య మహర్షి దగ్గరకు వెళ్ళి వింధ్య పర్వతం గర్వమణచి ప్రపంచాన్ని కాపాడాలని ప్రార్థించారు. మహర్షులు ఎప్పుడూ ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తారు. అగస్త్య మహర్షికి తాను దక్షిణాపథానికి వెళ్తే కల్పాంతమైనా తాను తిరిగి కాశీ రాలేనని తెలుసు. కానీ ప్రజా శ్రేయస్సుకోసం కాశీ పట్టణాన్ని విడిచి భార్య లోపాముద్రతో, కొంత శిష్యగణంతోనూ దక్షిణాపథానికి బయల్దేరాడు.

దారిలో వింధ్య పర్వతం అగస్త్య మహర్షి రాకను చూసి సాష్టాంగ నమస్కారం చేశాడు. అగస్త్యుడు తాను తిరిగి వచ్చేవరకు వింధ్య పర్వతాన్ని అలాగే వుండమన్నాడు. ఆ విధంగా లోక సంక్షోభాన్ని నివారించి, తాను భార్యా, శిష్య సమేతంగా సంచరిస్తూ కృష్ణానదీ తీరానికి చేరుకున్నాడు. అక్కడ కనక దుర్గాదేవిని, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువుని దర్శించుకుని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నాడు. అప్పుడు అప్రయత్నంగా మహర్షి నోటి నుంచి, “వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమార క్షేత్రముత్తమమ్ సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్” అని వచ్చింది. ఆ ప్రాంతమంతా అనేక పుట్టలతో నిండి వున్నది. మహర్షి ఆ ప్రాంతంలో వెతికి ఒక పుట్టనుంచి దివ్య తేజస్సు రావటం గమనించి దానినే కుమారస్వామి నెలవుగా గ్రహించాడు. మాండవ్యుడనే శిష్యుని అనుమాన నివృత్తి చేస్తూ కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒకరేనని వివరిస్తూ, ఆయన అక్కడికి వచ్చి తపస్సు చేయటానికి కారణం ఈ విధంగా వివరించాడు.

పూర్వం సనక, సనత్కుమారాది మహర్షులుండేవారు. వారు గొప్ప భక్తులు. ఎల్లప్పుడూ దైవ నామస్మరణతో గడిపేవారు. వారు ఎప్పుడూ ఐదు సంవత్సరాల బాలురులాగా వుండేవారు. పైగా దిగంబరులు. వారు ఒకసారి శివ దర్శనానికి కైలాసం వెళ్ళారు. ఆ సమయంలో శివుడు కైలాసంలో లేడు. పార్వతీ దేవి, కుమారస్వామి, ఇంకా అనేకమంది దేవతలు అక్కడ సభ తీరివున్నారు. ఒకవైపు అత్యుత్తమ వేషభూషణాలతో విలసిల్లుతున్న దేవతలు, ఇంకొకపక్క జటాధారులైన శివ గణాలు, మహర్షులు, .. వీరి వేషభూషణాలలోని వ్యత్యాసం చూసి కుమారస్వామికి నవ్వు వచ్చి నవ్వాడు.

అది గమనించి పార్వతీ దేవి తనయుడి నవ్వుకి కారణం అడిగింది. కుమారునికి అక్కడివారు తన తండ్రివలె, తల్లివలె కనిపించలేదాని ప్రశ్నించింది. తల్లి ప్రశ్నతో తన ఆలోచనలకు సిగ్గుపడ్డ కుమారస్వామి తల్లి పాదాలపైబడి క్షమార్పణ అడిగి, అవసరం లేదని తల్లి వారించినా వినక తన పాపానికి ప్రాయశ్చిత్తంగా తపస్సు చెయ్యటానికి వెళ్ళాడు. ఈ ప్రాంతంలో తన తపస్సు భగ్నం చేసేవారుండరని తలచి, ఎవరికంటా పడకుండా ఒక పుట్ట నిర్మించుకుని అందులో సర్పరూపంలో తపస్సు చేయసాగాడు.

అగస్త్య మహర్షి చూసింది ఆ పుట్టనే. ఆయన కుమారస్వామి తపస్సుకి భంగం కలగకుండా, పుట్టమీద పాము పడగతోవున్న ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి, రోజూ పత్నీ, శిష్య సమేతంగా దానికి పూజలు చేయసాగాడు. కొంతకాలం అక్కడ గడిపిన తర్వాత మహర్షి తన పరివారంతో ఆ ప్రదేశాన్ని వీడి వెళ్ళిపోయాడు. తర్వాత కొందరు మునులు అక్కడ శివలింగానికి పూజలు చేశారు. కానీ కాలాంతరమున ఆ లింగానికి పూజలు చేసేవాళ్ళు లేక దానిపైన కూడా పుట్టలు వచ్చాయి.

కలియుగంలో ఆ ప్రాంతంలో కుమ్మరులు నివాసమేర్పరచుకున్నారు. అందులో వీరారపు పర్వతాలు ఒకరు. ఆయన దైవ భక్తుడు. ఒకనాడు ఆయన కలలో సుబ్రహ్మణ్యస్వామి కనబడి తానువున్న పుట్ట గురించి చెప్పి, తనని వెలికి తీసి గుడి కట్టించి, పూజలు చేయమని చెప్పాడు. పర్వతాలు తనవారందరికీ ఆ విషయం చెప్పి, అందరినీ తీసుకుని, స్వామి పుట్ట తవ్వి, స్వామిని బయటకి తీశారు. వారంతా కలసి చిన్న గుడి కట్టించి స్వామిని పూజించసాగారు. పర్వతాలు మట్టితో రకరకాల బొమ్మలు చేసి, వాటిని కాల్చి బాగా మన్నేటట్లు తయారుచేసి స్వామికి సమర్పించసాగాడు. అవి కాలగర్భంలో కలిసిపోయినవి పోగా, ప్రస్తుతం వున్నవి నంది, గుఱ్ఱం. కళ్యాణ మండపంలో వీటిని ఇప్పటికీ చూడవచ్చు.

ఆలయ విశేషాలు:

ఆలయ ప్రవేశ ద్వార గోపురం తూర్పు ముఖంగా వుంటుంది. లోపలకి ప్రవేశించగానే ఎదురుగా ప్రధాన ఆలయం దర్శనమిస్తుంది. మహా మండపం స్తంభాలపై వివిధ దేవతా మూర్తులు, నెమళ్ళు దర్శనమిస్తాయి. ఇక్కడే ధ్వజస్తంభముంటుంది. ఇది దాటి అంతరాలయంలోకి వెళ్ళగానే గర్భగుడిలో పాము చుట్టుకుని వున్నట్లున్న పీఠంపై సుబ్రహ్మణ్యేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఈ పీఠానికి కింద ఒక రంధ్రం కనిపిస్తుంది. పక్కనే మండపంలో వున్న పెద్ద పుట్టలో దివ్య సర్పం వుంటుందని, అది ఆ రంధ్రం గుండా వచ్చి స్వామిని సేవిస్తుందనీ చెప్తారు. స్వామికి ఇరువైపులా వున్న మండపాలలో వల్లీ, దేవసేనలు భక్తుల పూజలందుకుంటూ దర్శనమిస్తారు.

ఆలయం పక్కనేవున్న పుట్ట, నాగ ప్రతిమలకు భక్తులు పాలు పోస్తుంటారు. ఆలయంలోనే భక్తుల సౌకర్యార్ధం పాలు అమ్ముతారు.

పూర్వం ఈ ఊరి పేరు మోహినీపురం. అది క్రమేణా మోపిదేవి అయింది. ప్రస్తుతం వున్న ఆలయం 300 సంవత్సరాల క్రితం దేవరకొండ పాలకులు నిర్మింపచేశారు. తర్వాత చల్లపల్లి జమీందారులు ఈ ఆలయ అభివృధ్ధికి విశేష కృషి చేశారు.

ఇక్కడ భక్తులు చిన్నపిల్లలకు చెవులు కుట్టించటం, తల నీలాలు సమర్పించటం, అన్నప్రాశన వగైరా కార్యక్రమాలు చేయిస్తారు. నాగ దోషం వున్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయిస్తారు. అలాగే వివాహం జరగటం ఆలస్యమయినా ఇక్కడ మొక్కుకుంటే త్వరగా అవుతుందంటారు.

ఉత్సవాలు:

నాగుల చవితి, సుబ్రహ్మణ్యషష్టి వంటి పర్వదినాలలోనేగాక, గురువారం, ఆదివారం, ఇంకా ఇతర సెలవు రోజులలో భక్తుల రాక అధికంగా వుంటుంది. పర్వదినాలలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరుగుతాయి. ప్రతి రోజూ శాంతి కళ్యాణం జరుగుతుంది. ప్రతి నెలా కృత్తిక నక్షత్రం రోజు రాహు, కేతు, సర్ప దోష నివారణ కోసం ప్రత్యేక పూజలు జరుగుతాయి.

సకలేశ్వరస్వామి ఆలయం:

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం పక్కనే సకలేశ్వరస్వామి ఆలయం వుంటుంది. ఈయన స్వయంభువు. సగర మహారాజు పూజించిన లింగం కావటంతో ఆ పేరు వచ్చింది. 1783లో మోపిదేవి వరదలలో కొట్టుకుపోయినప్పుడు ఈ లింగం బయటపడింది. అప్పటి జమీందారు అడుసుమిల్లి గంగభొట్లు ఆలయం నిర్మిపచేశారు. అయితే ఈ లింగం భూమిలో చాలా లోతువరకు వుందని కొందరి ఆభిప్రాయం. ఈ ఆలయ నిర్వహణ అడుసుమిల్లివారి కుటుంబ సభ్యులదే. దీని పక్కనే సరస్వతీ దేవి ఆలయం కూడా వున్నది.

సౌకర్యాలు:

భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం ఆలయంలో భోజన వసతి ఏర్పాటు చేశారన్నారు. ఇక్కడ చిన్న చిన్న షాపులు తప్ప వేరే సౌకర్యాలు అంతగా లేవు. ఆహారం మీరు తీసుకువెళ్తే అక్కడ ఆలయంలో కూర్చుని తినవచ్చు.

రవాణా సౌకర్యాలు:

విజయవాడనుంచి 70 కి.మీ.లు, మచిలీపట్నంనుంచి 35 కి.మీ.లు, గుంటూరు జిల్లాలోని రేపల్లెనుంచి 8 కి.మీ.ల దూరంలో వున్న ఈ ఊరుకి బస్సు సౌకర్యం అన్ని చోట్ల నుంచి వున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here