Site icon Sanchika

యాత్రా దీపిక కృష్ణా జిల్లా – 11. నెమలి

[box type=’note’ fontsize=’16’] కృష్ణా జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా నెమలి లోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

నీలమేఘశ్యాముని నెమలి

[dropcap]మొ[/dropcap]న్నీమధ్య దీవావళి చేసుకున్నారు, దాని గురించి బోలెడు కథలు చెప్పుకున్నారు కదా. మరి దీపావళి అంటే మనకి గుర్తుకొచ్చేది ముందుగా పిల్లలకయితే టపాకాయలు, పెద్దలకయితే పిండివంటలూ, పూజలూ, ముఖ్యంగా ఈ పండుగకు కారకులయిన కృష్ణుడూ, సత్యభామా. మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ కాలంలోనేకాదు, ఈ కాలంలో, అంటే 60 ఏళ్ళ క్రితం తన మహిమను చూపించిన కథ గురించి తెలుసుకోవాలంటే శ్రీ కృష్ణునితో అత్యంత సాన్నిహిత్యమున్న నెమలి పేరు పెట్టుకున్న గ్రామానికి వెళ్ళాల్సిందే.

కృష్ణాజిల్లాలో శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్రీకృష్ణుడు ఇక్కడ వేణుగోపాలుడిగా స్వయంభువుడు. ఆయన తన భక్తుల కోర్కెలు తీర్చటమేకాదు, వారి దీర్ఘ రోగాలను నయం చేస్తాడని ప్రసిధ్ధి.

ఈ స్ధల పురాణం ఏమిటంటే 1953 సంవత్సరంలో ఈ గ్రామములో శ్రీ వనమా సీతారామయ్యగారు అనే షావుకారు తన పొలములోకి సారవంతమైన మట్టి కావాల్సివచ్చి శ్రీ దారా నర్సయ్యగారి పొలం నుండి కొనుగోలు చేశారు. తన పాలేరు శ్రీ కఠారు వెంకటేశ్వర్లు గారిచే మట్టి తవ్వించబోయారు. మొదటిసారి గడ్డపలుగు వేసిన వెంటనే ఖంగుమని ధ్వని వచ్చిందట. ఎందుకు అలా ధ్వని వస్తోందో అర్థం కాక కొంచెం పక్కనే మళ్ళీ పలుగు వెయ్యగా మళ్ళీ అదే ధ్వని వచ్చిందట. మళ్ళీ పలుగు వెయ్యబోగా ఆ ప్రదేశంనుండి బ్రహ్మాండమైన మిరుమిట్లతో ఒక మెరుపు మెరిసిందట. ఆ కాంతి తీవ్రతకు శ్రీ కఠారు వెంకటేశ్వర్లు మూర్ఛపోయారుట. అది చూసిన మిగతా పనివాళ్ళు ఆందోళనతో అతని ముఖముపై చల్లని నీరు చల్లి కొంచెంసేపు ఉపచర్యలు చేయగా అతడు కొంచెం తేరుకుని తనకేమీ కన్పించటంలేదని అన్నారుట. అపుడు మిగిలినవారంతా కలిసి ఆ ప్రాంతములో నెమ్మదిగా తవ్వి చూడగా ఒక విగ్రహము, దానిదగ్గరే ప్రాచీన శంఖము, పాచిక లభ్యమయ్యాయి. కొందరు వెళ్ళి పొలము యజమానికి, ఊరి పెద్దలకు ఈ విషయము చెప్పారు.

ఆ రోజు 23-3-1953 పరమ పవిత్రమైన శ్రీ రామ నవమి. పొలం యజమాని ఇతర గ్రామ పెద్దలు శ్రీ సీతా రామ కళ్యాణోత్సవ వేడుకలలో వున్నారు. ఈ సంఘటన తెలిసిన పొలం యజమాని ఆ పనులను వేరేవారికి అప్పగించి మరి కొందరిని తనతో తీసుకుని వెంటనే విగ్రహము దొరికిన స్ధలానికి చేరుకున్నారు. పెద్దలందరూ కలిసి దొరికిన విగ్రహాన్ని పరిశీలించి శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్య మంగళమూర్తిగా గ్రహించారు. దగ్గరలోనే వున్న పెనుగొలను గ్రామములోని దేవాలయ అర్చకులైన శ్రీ తూమాటి వేంకట కృష్ణమాచార్యులుగారిని రప్పించి శ్రీ స్వామివారి విగ్రహము చూపించారు. వారు దానిని పరిశీలించి ఈ శిల ఏక శిలా విగ్రహము యొక్క సంపూర్ణ స్వరూపమని వివరించి ఇట్టి శిలా విగ్రహము చాలా అరుదుగా లభించే సాలిగ్రామమని చెప్పారుట.

తర్వాత స్వామివారిని గ్రామములో ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో ఊరేగింపుతో బయలుదేరబోగా శ్రీ స్వామివారు ఒక భక్తుని ఆవహించి నేను దర్శనమిచ్చిన చోటనే నన్ను ప్రతిష్ఠించాలని ఆదేశించారుట. స్వామి వెలసినది ఉత్తరాభిముఖంగా. ఆయనను తూర్పుముఖంగా ప్రతిష్ఠించబోగా ఆకస్మికంగా గాలివానతో కూడిన పెను తుఫాను విరుచుకుపడి వేసిన పందిళ్ళు ఛిన్నాభిన్నమైనాయట. జరిగిన పొరపాటు గ్రహించి శ్రీ స్వామివారిని యథావిధిగా ఉత్తరాభిముఖంగా నెలకొల్పగా కొద్ది క్షణములలోనే తుఫాను శాంతించింది. వెంటనే గ్రామ పురోహితులైన శ్రీ సూరావఝ్యల విశ్వనాధంగారు అర్చనలు జరిపారు.

శ్రీ స్వామివారి ఆదేశానుసారం దేవాలయ నిర్మాణము పూర్తయ్యి, విగ్రహ ప్రతిష్ఠ 6-2-1957వ తేదీన అశేష భక్త జన సందోహం నడుమ శ్రీమద్వైఖానస సాంప్రదాయం ప్రకారం అంగ రంగ వైభవంగా జరిగింది. అప్పటినుంచి అత్యంత భక్తి శ్రధ్ధలతో నిత్య పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ దేవాలయంలో వున్న బావి దగ్గర స్నానం చేసి తడి బట్టలతో స్వామికి ప్రదక్షణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా దీర్ఘ వ్యాధులు తగ్గుతాయని చాలామంది నమ్ముతారు. దీర్ఘ వ్యాధులతో బాధపడేవారు వ్యాధి నివారణకోసం ఒక మండలం రోజులపాటు ఇక్కడ స్వామిని సేవిస్తూ, గుళ్ళో నిద్రిస్తారు.

ఇవండీ నెమలి విశేషాలు. అన్నట్లు స్వామిని దర్శించేటప్పుడు పూజారిగారిని అడగండి, స్వామి దగ్గరే వున్న శంఖం, పాచిక చూపిస్తారు. అదేనండీ స్వామితోబాటు దొరికినవి. మేము ముందు తెలియక పాచికను చూడలేదు. మీరు మర్చిపోవద్దు. మరి బయల్దేరుతున్నారా? ఎలా వెళ్ళాలంటే….

ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం – కృష్ణా జిల్లాల సరిహద్దులోని కుగ్రామం నెమలి.. ఖమ్మం జిల్లా వైరా దాటిన తర్వాత వచ్చే పినపాక సెంటరులో కుడి ప్రక్కకు తిరిగి 20 కి.మీ.లు వెళ్తే నెమలి గుడి దగ్గరకు వెళ్తాము. ఇక్కడ వసతికి కొత్తగా కట్టిన గదులు వున్నాయి. రోజుకి అద్దె 150 రూ. కానీ ఎందుకైనా మంచిది వెళ్ళే ముందు ఈ క్రింది ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి అన్నీ కనుక్కుని వెళ్ళండి.

ఆఫీసు ఫోన్ నెంబర్లు 08673 – 288808, 08673—288633

గోపాలరావు (గదులు అద్దెకిచ్చే వ్యక్తి) 9440269156.

భోజన వసతి లేదు. ఉదయం ముందుగా వెళ్ళి గుడి కార్యాలయంలో చెప్తే 4, 5 గురికి ఏమైనా ఏర్పాటు చెయ్యగలరేమోగానీ సాయంకాలం అది కూడా వుండదు. బండి మీద వేసే బోండాలు, బజ్జీలు, వడలే ఆకలేస్తే అమృతంలాగా వుంటాయి (అది కూడా వాళ్ళ వీలుని బట్టి వుంటుంది). కానీ రుచి బాగున్నాయి. మేము తిన్నాము.

దేవాలయాన్ని ఇదివరకుకన్నా ఇప్పుడు బాగా అభివృధ్ధి చేశారుట. ఇంకా చాలా చెయ్యాలి. అప్పటిదాకా వెళ్ళే వాళ్ళు మాత్రం ముందుగా వసతి సౌకర్యం కనుక్కుని, భోజన ఏర్పాట్లు చేసుకుని మరీ వెళ్ళిరండి. అవసరమైతే గుడి పరిసరాల్లో కనుక్కోండి, ఒక ఇంటావిడ కావాలంటే ఉప్మా చేసి పెడతానన్నారు. లేకపోతే ఖమ్మంలో బస చేసి ఉదయం బయల్దేరి వైరా, నెమలి చూసి రావచ్చు. ఇది ఎండౌమెంట్స్ డిపార్టుమెంటు వాళ్ళ హయాంలో వున్న దేవాలయం.

ఆలయం తెరచి వుంచు వేళలు

సోమ, శుక్రవారాలలో ఉదయం అభిషేకం జరుగుతుంది. దీనిలో పాల్గొనదలిస్తే ముందు రోజు రాత్రే అక్కడ వుండటం మంచిది. ఈ రెండు రోజులూ గుడి ఉదయం 6 గంటల నుంచీ మధ్యాహ్నం 2 గంటల దాకా తిరిగి సాయంత్రం 3 గంటల నుంచీ దాత్రి 9 గంటల దాకా.

మిగతా రోజుల్లో ఉదయం 6 గంటల నుంచీ మధ్యాహ్నం 1 గంట దాకా మళ్ళీ సాయంకాలం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా తెరచి వుంటుంది.

Exit mobile version