Site icon Sanchika

యాత్రా దీపిక కృష్ణా జిల్లా – 16. నందిగామ

[box type=’note’ fontsize=’16’] కృష్ణా జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా నందిగామ లోని శ్రీ శుక శ్యామలాంబా సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

శ్రీ శుక శ్యామలాంబా సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం(శివాలయం), నందిగామ

[dropcap]ఈ[/dropcap] ఆలయం జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్ళే దోవలో వున్నది. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, సుమారుగా 300 సంవత్సరాల క్రితం కట్టించారు. ఈ దేవాలయంలో నాలుగు దిక్కులా రామేశ్వర, సోమేశ్వర, భీమేశ్వర, చంద్రమౌళీశ్వర స్వామివారల ఉపాలయాలున్నవి. మధ్యలోని ప్రధానాలయంలో శ్రీ రామలింగేశ్వరస్వామివారు కొలువుదీరి ఉండటంతో, ఈ దేవాలయము పంచలింగక్షేత్రంగా ప్రసిద్ధిచెందినది. ఈ ఆలయానికి మాన్యం భూములున్నవి. ఆ భూముల వలన ప్రతి సంవత్సరం ఆలయానికి ఆదాయం వచ్చుచున్నది. ఈ ఆలయము ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖవారి ఆధీనములో ఉండి వాసిరెడ్డి రామనాథబాబు ధర్మకర్తగా ఉన్నారు.

ఇక్కడి శివలింగం స్వయంభూ అని చెబుతారు. చారిత్రక ప్రాముఖ్యత కల దేవాలయం. 300 సంవత్సరముల క్రితమే జీర్ణోధ్ధరణ జరిగిందని చెబుతారు. అంటే ఆలయం అంతకుముందెన్ని సంవత్సరాలనుంచి వున్నదో తెలియదు. ఈ స్వామి నిజ దర్శనం అభిషేక సమయంలోనే. తర్వాత వివిధ రకాల పుష్పాలతో అలంకరింపబడిన శివలింగం, పైన పంచ పడగల నాగేంద్రుడు ఛత్రంలా నిలచి వుండగా, ఎదురుగా తన స్వామి పూజలను పర్యవేక్షిస్తున్నట్లుండే నందీశ్వరుడి దర్శనం.

గోపురాలు, ప్రాకారాలు, విమాన శిఖరాలు రకరకాల శిల్పాలతో అలంకరింపబడి వుండేవి. చాలా మటుకు దాడులలో నాశనమైనాయి. 300 సంవత్సరాల క్రితం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుగారు పునర్నిర్మాణ సమయంలో జగదంబ విశిష్టావతారానికి ప్రతీకగా శుక శ్యామలాంబని ప్రతిష్ఠించారు. పంచలింగాలకు ప్రతీకగా 5 కలశాలు, మూడు లోకాలకు ప్రతీకగా మూడు అంతస్తుల రాజ గోపురం నిర్మింపజేశారు. రాజగోపురం అనేక శిల్పాలతో అలంకరించబడింది. ఆలయ ప్రకారం పై ఋషీశ్వరులు తపస్సులో వున్న విగ్రహాలు. లోపల ఆవరణలో చిరుగంటల సవ్వడితో ఆశీర్వదించే ధ్వజస్తంభము.

పంచ లింగ క్షేత్రమని చెప్పాను కదా. ఈ ఆలయంలో మధ్యలో రామలింగేశ్వరస్వామి కొలువు తీరితే నాలుగు వైపులా సోమేశ్వర, భీమేశ్వర, అమరేశ్వర, చంద్రమౌళీశ్వ లింగాలు ఉపాలయాలలో దర్శనమిస్తాయి. ప్రదక్షిణ మార్గంలో చండీశ్వరుడు, జంట నాగులు, స్తంభాలలో శిలా శాసనాలని చూడవచ్చు. తెల్లని నంది.

అమ్మవారు ఆది పరాశక్తి. శ్యామలాంబ సప్త స్వరూపాలలో వున్నదని పురాణ ప్రామాణికము. అందులో శుక శ్యామలాంబను ఇక్కడ అనుగ్రహ దేవతగా ప్రతిష్ఠించారు. వినాయకుడు, బాల సుబ్రహ్మణ్యం తదితర శైవ పరివారమితర ఉపాలయాల్లో దర్శనమిస్తారు.

రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారు ఏక కాలంలో 108 శివాలయాలని నిర్మించారని చెబుతారు. వాటిలో ఈ ఆలయం, అమరావతి ఆయనకి ప్రత్యేకం. మాఘ శుధ్ధ చతుర్దశినాడు స్వామికి జరిగే కళ్యాణంలో స్వయంగా ఆయనే పీటల మీద కూర్చునేవారని చెబుతారు. పౌర్ణమి నాడు రథోత్సవం వైభవంగా జరిగేది. ఈ ఆలయంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడుగారి నిలువెత్తు విగ్రహం చూడవచ్చు.

శివాంశ సంభూతుడైన వీరభద్రస్వామి, నవగ్రహాలు కూడా ఇక్కడ భక్తుల కోరికలు నెరవేరుస్తారు.

ఈ దేవాలయములో ప్రతి పూర్ణిమకు, మాసశివరాత్రికి ప్రత్యేకపూజలు జరుగుతాయి కార్తీక మాసంలో ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ఆ మాసమందు నెలరోజుల పాటు భక్తుల గోత్ర నామములతో అభిషేకములు, కార్తీక పూర్ణిమ రోజు జ్వాలాతోరణము, కార్తీక మాస శివరాత్రిరోజు లక్షబిల్వార్చన చాలా బాగా జరుగుతాయి.

Exit mobile version