యాత్రా దీపిక కృష్ణా జిల్లా – 17. యనమలకుదురు

0
2

[box type=’note’ fontsize=’16’] కృష్ణా జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా యనమలకుదురు లోని శ్రీ రామలింగేశ్వరాలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

యనమలకుదురు

[dropcap]ఇ[/dropcap]వాళ విజయవాడకు 5 కి.మీ.ల దూరంలో వున్న యనమలకుదురు శ్రీ రామలింగేశ్వరాలయం దర్శిద్దాము. విజయవాడ నుంచి బెంజి సర్కిల్, పటమట మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు. మేము చూసినప్పటికీ ఇప్పటికీ ఈ ఆలయం చాలా అభివృధ్ధి చెందింది. ప్రశాంతమైన వాతావరణంలో దర్శకులను ఆకట్టుకునేటట్లు వుండే ఈ ఆలయం నదీ తీరాననికి 600 అడుగుల ఎత్తున ఒక కొండమీద వుంటుంది. ఆలయం చేరుకోవటానికి మెట్ల మార్గం, వాహనాలు వెళ్ళే మార్గం కూడా వున్నది.

ఫోటో సౌజన్యం – ఆలయం వెబ్‍సైట్

పూర్వం దీనిని మునిగిరి అనేవారు. ఇక్కడ వెయ్యిమంది మునులు తపస్సు చేసుకుంటూ వుండేవారుట. అందుకే వేయి మునుల కుదురు అనే పేరు వచ్చింది. కాల క్రమేణా అది యనమలకుదురు అయిందంటారు. పరశురాముడు తన తండ్రిని చంపిన కార్తవీర్యార్జునుడి మీద పగతో అతను క్షత్రియుడు గనుక క్షత్రియ వంశాన్నే ఊచకోత కోస్తూ దేశమంతా తిరిగాడు. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ కొండమీద తపస్సు చేసుకుంటున్న మునులు క్రూర జంతువుల వలన పడే ఇబ్బందులు చూసి వాటి నుంచి వారిని రక్షించాడు. క్షత్రియులను చంపి తను చేసిన రక్తపాతానికి ప్రాయశ్చిత్తంగా అనేక శివలింగాలను ప్రతిష్ఠించి పూజలు చేశాడు. అందులో ఇది ఒకటి. శ్రీ రామచంద్రుడు కూడా తన వనవాస కాలంలో ఈ ఆలయాన్ని దర్శించాడని ప్రతీతి. తర్వాత చోళ రాజులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధినేతలు ఈ స్వామిని సేవించి తరించారు.

ఆలయానికి వెళ్ళే మార్గంలో పెద్ద ఆంజనేయస్వామి శ్వేత వర్ణ విగ్రహం దర్శనమిస్తుంది. ఆలయ గోపురాలలో సప్త కలశ ప్రతిష్ఠిత గోపురాలు తక్కువ. ఇక్కడ విశాలమైన ఆలయ రాజ గోపురం మీద ఏడు కలశాలను దర్శించవచ్చు. గోపురం పైన బ్రహ్మ, ఇతర దేవీ దేవతల మూర్తులు సుందరంగా మలచబడ్డాయి.

ఆలయ ముఖ ద్వారంపై శివ కుటుంబం దర్శనమిస్తారు. ఇక్కడ పరశురాముని ప్రతిష్ఠ అయిన శివుడు రామలింగేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. శివలింగం అష్టముఖ పానవట్టం మీద విరాజిల్లుతోంది. అమ్మ పార్వతీ దేవికి ప్రత్యేక మందిరం. ఆంజనేయ స్వామికి ప్రక్కనే మరో ఆలయం. గణపతి, బాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నవ గ్రహాలు వేరు వేరు మండపాలలో దర్శనమిస్తారు.

రామలింగేశ్వరస్వామికి సంవత్సరం పొడుగునా ఉత్సవాలు జరుగుతూనే వుంటాయి. ముఖ్యంగా సోమవారాలు విశేష అభిషేకాలు, హారతులు, మాస శివరాత్రి, మహా శివరాత్రి, కార్తీక మాసం వగైరా సమయాలలో ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

మహాశివరాత్రి ఉత్సవాలు

గ్రామంలో ప్రతి ఏడాది మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఆలయాలను విద్యుత్తు దీపకాంతులతో, పుష్పాలతో అలంకరిస్తారు. ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి పక్క గ్రామాల నుండే కాక జిల్లా నలుమూల నుండి ప్రజలు వస్తారు. మహా శివరాత్రి పర్వదినంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు మూడు రోజుల పాటు సాగుతాయి.

మొదటిరోజు-ప్రభోత్సవం

మొదటిరోజు మహాశివరాత్రి నాడు పెద్దఎత్తున భక్త జనప్రవాహంతో నిండిపోతుంది. ఉదయం స్వామి వారికి యనమలకుదురు లాకుల సెంటర్‌లోని కనకదుర్గ అమ్మవారి ఆలయం నుంచి పట్టువస్త్రాలను ఆలయ అధికారులు మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకుని వస్తారు. మండపం వద్ద గ్రామప్రభ వేలంపాట నిర్వహిస్తారు. ఈ వేలంపాటను ప్రజలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. తరువాత గండ దీపాలతో భక్తులు ఊరేగింపుగా మునిగిరిఫై వేంచేసి ఉన్న రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. పశువులను అందంగా పూలతో అలంకరించి కొండ చుట్టూ తిప్పుతారు. సాయంత్రం ప్రభల రథాలను లాగే ఎడ్లను ఊరేగింపుగా తీసుకొనివచ్చి గ్రామ ప్రభ చుట్టూ తిప్పుతారు. ఈ సందర్భంగా గ్రామం తీన్మార్ డప్పులు, కోలాటాలు, కోయ నృత్యాలు, మేళతాళాలతో మారుమోగిపోతుంది. రాత్రి రంగుకాగితాలు, విద్యుత్తు దీపాలతో అలంకరించిన 50 అడుగుల ప్రభలను కొండచుట్టూ మరుసటిరోజు ఉదయం వరకు ఊరేగింపుగా తిప్పుతారు.

ఫోటో సౌజన్యం – ఆలయం ఫేస్‍బుక్ పేజి

రెండవరోజు-గ్రామోత్సవం

రెండవరోజు వేకువజామున అర్చకులు పార్వతి, రామలింగేశ్వరస్వామి వార్లకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు పూలతో అలంకరించిన నందీశ్వరుని వాహనంఫై ఉత్సవ విహ్రహాలను మేళ తాళాల మద్య గ్రామ వీధులలో గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గ్రామస్థులు స్వామివారికి హారతులు ఇచ్చి, కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేస్తారు.

మూడవరోజు-వసంతోత్సవం

మూడవ రోజు ఉదయం గ్రామ వీధుల్లో స్వామి వారిని పల్లకీలో ఊరేగిస్తూ ఘనంగా వసంతోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామి వారికి కళ్యాణం చేసిన దంపతులు, గ్రామస్థులు రంగులు, రంగు నీళ్ళు ఒకరిఫై ఒకరు చల్లుకుంటూ ఊరేగింపులో పాల్గొంటారు. అనంతరం కృష్ణా నదిలో త్రిశూల స్నానాలు చేస్తారు. రాత్రి ధ్వజారోహణ సందర్భంగా స్వామి వారికి నివేదన చేసిన నందిముద్దలను భక్తులకు ఇస్తారు. ఇవి తిన్నవారికి సంతానం కలుగుతుందని నమ్మకం. ఈ కార్యక్రమంతో మహాశివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.

అవకాశం వున్నవారు తప్పక చూడవలసిన ఆలయం ఇది. ప్రశాంతమైన వాతావరణం, కొండమీదనుంచి కనబడే చక్కని దృశ్యాలు మనస్సు సంతోషంతో నిండుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here