Site icon Sanchika

యాత్రా దీపిక కృష్ణా జిల్లా – 2 – గన్నవరం

[box type=’note’ fontsize=’16’] కృష్ణా జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా గన్నవరం లోని శ్రీ చిదానందాశ్రమము, శ్రీ భువనేశ్వరీ పీఠము గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

శ్రీ భువనేశ్వరీ పీఠము, శ్రీ చిదానందాశ్రమము

[dropcap]ఈ[/dropcap] జిల్లా ప్రారంభంలో నాకు గురు వందనానికి అవకాశం దొరికింది.

ఈ పీఠము శృంగేరీ శ్రీ విరూపాక్ష శ్రీ పీఠము వారి భారతీ సంప్రదాయమునకు చెందినది. అత్యంత తపోనిష్ఠాగరిష్టులైన శ్రీ చిదానంద సరస్వతీ స్వామివారు ఈ ఆశ్రమాన్ని 1952లో స్ధాపించారు. దీనిలో శ్రీ శృంగేరీ పీఠాధిపతులచే పంపబడిన శ్రీ శంకరాచార్యులవారి పాలరాతి విగ్రహము ప్రతిష్ఠించబడి నాటి నుంచి నేటివరకు పూజలందుకుంటోంది.

అసలు ఈ ఆశ్రమం వున్న స్ధలం కేసరపల్లి గ్రామములో కీ.శే. శ్రీ ద్రోణవల్లి అనంతకోటి పద్మనాభ చౌదరిగారి పొలం. వారు 1950 వ సంవత్సరంలో అక్కడ గుమ్మడి పాదు పెట్టగా సుమారు 4 గజముల పొడుగు పెరిగిన ఆ తీగ రెండు తెల్లటి సర్పాకారములుగా పెరిగి, ఒక్కొక్క సర్పానికి 5 తలల వంతున రెండు సర్పాకారాలకు రెండైదులు 10 తలలు, 20 కన్నులు గలిగి, జంట సర్పములవలె ఆ తీగెలు మెలివేసుకుని నాట్యము చెయ్యటం చూసిన ఆ రోజులలోని ప్రజలు నాగదేవత వెలిసిందని సంతోషించి పూజలు చేసేవారు. గుమ్మడి పాదునుండి అవతరించిన నాగదేవత గనుక గుమ్మడి నాగేంద్రుడనే పేరు వచ్చి, ఆ క్షేత్రం గుమ్మడి నాగేంద్ర క్షేత్రంగా ప్రసిధ్ధి కెక్కింది. అనేకమంది భక్తులు వచ్చి నాగేంద్రుని కొలిచేవారు. నాగుల చవితికి, సుబ్బరాయ షష్టికి వేలాదిమంది భక్తులు స్వామి దర్శనం కోసం వచ్చేవారు. తర్వాత శ్రీ ద్రోణవల్లి అనంతకోటి పద్మనాభ చౌదరిగారే 3 ఎకరాల పొలం ఇక్కడ ఆశ్రమానికి, ఆలయాలకు దానం చేశారు. ఇప్పటికీ అక్కడ పెద్ద పుట్ట వున్నది.

ఆశ్రమం 1952లో స్ధాపించబడింది అని చెప్పాను కదా. దీని స్ధాపకులు, శ్రీ చిదానంద సరస్వతీ స్వాములవారు పూర్వాశ్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా పూళ్ళ గ్రామంలో కుసుమ హరనాథాశ్రమమనే పేరుతో ఒక ఆశ్రమాన్ని స్ధాపించి భక్తి ప్రచారము చేసేవారు. నిత్యాన్నదానము చెయ్యటమేగాక ప్రతి సంవత్సరం వేదసభలను, పండిత సమావేశములను నిర్వహిస్తూ, వేద శాస్త్ర విద్వాంసులకు సన్మానము చేసేవారు. వీరి శిష్యులు ఉభయ గోదావరి, కృష్ణా, ఖమ్మం జిల్లాలలో వున్నారు. వారు ఇప్పటికీ ఈ ఆశ్రమాన్ని దర్శిస్తూ వుంటారు. వీరి గురువుగారు బ్రహ్మజ్ఞాన సంపన్నులైన శ్రీశ్రీశ్రీ జ్ఞానానంద సరస్వతీ స్వాములవారు. శ్రీ చిదానంద సరస్వతీ స్వామి ఋషీకేశములో కొంత కాలము, హరిద్వారములో కొంతకాలము, హిమవత్పర్వత ప్రాంతములందు సంచరించి సుమారు ముప్పది సంవత్సరాలు యోగనిష్టలో గడిపారు. ఆశ్రమ స్వీకారానికి ముందే అన్నము తినకుండా, కొంచెము కలకండో, బెల్లమో తిని నీరు తాగేవారు. అందుకే వీరికి బెల్లం స్వామి అనే పేరు వచ్చింది. ఆయన భోజనం చెయ్యకపోయినా, ఆశ్రమానికి వచ్చిన భక్తులకందరికీ సంతుష్టిగా భోజనం పెట్టేవారు. వీరు సుమారు నూరు సంవత్సరాలు జీవించారు. ఈ ఆశ్రమానికి వారే చిదానందాశ్రమమని నామకరణం చేశారు. 1977లో బ్రహ్మైక్యము చెందిన వీరికి శిష్యులు ఆశ్రమావరణలోనే సమాధి నిర్మించి వారి ప్రతిమతో సహా శివ లింగాన్ని ప్రతిష్ఠించారు.

తర్వాత ఇక్కడి ధర్మకర్తలు ఈ ఆశ్రమంలో ఒక ఆచార్య పీఠము నెలకొల్పాలని, ఒక యతీశ్వరుని పీఠాధిపతిగా చేసి గురు పరంపర కొనసాగించాలని నిశ్చయించారు. విజయవాడలో శ్రీ సత్యానంద భారతీ స్వామివారు తురీయాశ్రమం స్వీకరిస్తున్నట్లు తెలిసి వెళ్ళి ఆయనను ప్రార్థించి తీసుకువచ్చి 14-11-1978న శ్రీ భువనేశ్వరీ పీఠమునకు అధిపతిగా పట్టాభిషేకము చేశారు.

శ్రీ సత్యానంద భారతీ స్వామివారు పూర్వాశ్రమంలో తెనాలి తాలూకా హైస్కూలులో చాలా సంవత్సరాలు తెలుగు పండితులుగా పని చేశారు. ఉభయ భాషా ప్రవీణులు. కవి, పండితులు, మార్గదర్శకులు, మంచి రచయిత, విమర్శకులు, శ్రీ విద్యోపాసకులు, పెక్కు పాఠ్య గ్రంధ వ్యాఖ్యలను, ఉప వాచకములను రచించి గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఆ కాలంలో పులిగడ్డ గైడ్స్ చాలా పేరు పొందినవి. మా అదృష్టవశాత్తూ, పూర్వశ్రమంలో వారు మా పెదనాన్నగారు. వీరు జగద్గురు శ్రీ కల్యాణానంద భారతీస్వామి వారి ప్రియ శిష్యులైన శ్రీ వడ్లమూడి లక్ష్మీనారాయణగారి వద్ద శ్రీ విద్యోపదేశమందారు. శ్రీ విద్యను సాంగోపాంగముగా ధారణ చేసి, శ్రీ చక్రరాజానికి నవావరణార్చనను నిర్వహించిన ప్రజ్ఞానిధి. వీరు కుర్తాళం శ్రీ సిధ్ధేశ్వరీ పీఠమునకు ఉత్తరాధికారిగా ఎన్నుకొనబడిన ప.ప. శ్రీ విమలానంద భారతీ స్వామివారి వద్ద 12-10-1978న తురీయాశ్రమము స్వీకరించారు.

వీరు పీఠాధిపత్యము వహించిన వెంటనే ఆశ్రమములో శ్రీ చక్రరాజాన్ని ప్రతిష్ఠించారు. తర్వాత శ్రీ విమలానంద భారతీస్వామివారు పంపిన శ్రీ భువనేశ్వరీ దేవి విగ్రహాన్ని శ్రీ చక్రాకృతితో నిర్మించిన మండపంలో ప్రతిష్ఠించారు. ఆ పీఠానికి శ్రీ భువనేశ్వరీ పీఠమని పేరు పెట్టారు. ఆ విగ్రహ ప్రతిష్ఠ కుర్తాళం ఫీఠాధివతి శ్రీ విమాలానంద భారతీ స్వామి వారి పర్యవేక్షణలో, శ్రీ వడ్లమూడి వెంకటేశ్వరరావుగారి నేతృత్వములో, ఇంకా కొందరు పీఠాధీశ్వరుల ఆశీస్సులతో అత్యంత వైభవంగా జరిగింది. అప్పటినుంచి శ్రీ భువనేశ్వరీ సహితంగా శ్రీ చక్రరాజానికి నిత్యార్చన, మధ్యాహ్న వేళల్లో తీర్థ ప్రసాద వినియోగము, పూర్ణిమనాడు నవావరణార్చన మొదలైన పీఠ సంప్రదాయాలు ప్రవేశపెట్టబడ్డాయి.

తర్వాత రెండు మూడు సంవత్సరములలోనే ఆశ్రమమునకు ప్రాకారము, ఋతు రసాగ్ని (367) లింగాత్మక రుద్ర మండల ప్రతిష్ట, పంచముఖాంజనేయస్వామి, నాగేంద్రస్వామి,సరస్వతి అమ్మవారు మొదలగు అనేక ఆలయాలు నిర్మింపబడ్డాయి.

వీరి తర్వాత శ్రీశ్రీశ్రీ చిదానంద భారతీ స్వామి, శ్రీశ్రీశ్రీ ప్రకాశానంద భారతీస్వామి వార్ల ఆధ్వర్యంలో ఈ పీఠము అభివృధ్ధి చెందింది. ప్రస్తుతం శ్రీశ్రీశ్రీ సత్యానంద భారతీస్వామి-2 వారి పీఠాధిపత్యంలో, శ్రీశ్రీశ్రీ కమలానంద భారతీ స్వామి వారు ఉత్తర పీఠాధిపతులుగా దసరా సందర్భంగా నవరాత్రి మహోత్సవాలు శ్రీ పులిగడ్డ రాఘవేంద్ర దంపతులు, తదితర పెద్దల సహకారంతో అత్యంత వైభవంగా జరపబడుతున్నవి. సమీప ప్రాంతాలవారు పీఠాన్ని దర్శించి, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులుకండి.

నవరాత్రుల సందర్భంగా గురు పరంపరకు, చల్లని తల్లి ఆ భువనేశ్వరీ మాతకు అనేక నమస్కారములు.

(ఈ వ్యాసం వ్రాయటానికి శ్రీ హనుమంతరాయశర్మ, కళ్యాణానంద పీఠము, బాగ్ లింగంపల్లి, హైదరాబాదు వారు రచించిన భువనేశ్వరీ పీఠము అవతారిక ఆధారము. వారికి కృతజ్ఞతలతో).

Exit mobile version