యాత్రా దీపిక కృష్ణా జిల్లా – 20. పెద్ద కళ్ళేపల్లి

0
2

[box type=’note’ fontsize=’16’] కృష్ణా జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా పెద్ద కళ్ళేపల్లి లోని దుర్గా నాగేశ్వరస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

పెద్ద కళ్ళేపల్లి

[dropcap]పె[/dropcap]దకళ్ళేపల్లి, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన గ్రామం. ఇక్కడ దుర్గా నాగేశ్వరస్వామి ఆలయం ప్రసిధ్ధి చెందింది. స్కాంద పురాణం ప్రకారం ఇది నాగ, ఋషి క్షేత్రం. పౌరాణికంగా వేల సంవత్సరాల చరిత్ర కల క్షేత్రం. పురాణాల ప్రకారం భారత దేశంలో 8 రకాల అరణ్యాలు వున్నాయి. వాటిలో కదళీ వనం ఆఖరుది. పూర్వం ఇక్కడ అంతా కదళీ వనాలు ఎక్కువగా వుండేవి. వాటినే రంభా వనాలు అని కూడా అనేవాళ్ళు. అందుకేనేమో ఈ ఊరుని ఇదివరకు రంభాపురం, కడలుపల్లి, కడలు పురం, వగైరా పేర్లతో పిలిచేవాళ్ళు.

ప్రశాంతమైన వాతావరణంలో మారుమూల కుగ్రామం ఇది. ఆలయం ఎదురుగా పుష్కరిణి. దీనినే నాగ కుండం అనీ, నాగ సరోవరం అనీ అంటారు. ఇది చాలా మహిమాన్వితమైనది. ఉత్తమ తీర్థాలన్నీ దీనిలో సంగమించటం వల్ల దీనికి పరికర్ణికా తీర్థమనే పేరు వచ్చిందని చెప్తారు. ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా ఈ తీర్థంలో స్నానాదికాలు కానిచ్చుకుని స్వామి దర్శనానికి వస్తారు.

ఆలయం ముందు ఉన్నతమైన గాలి గోపురం అందమైన శిల్పాలతో అలరారుతుంటుంది. ఈ ఆలయం కాకతీయుల పరిపాలన కాలం నాటికే శిధిలావస్థకు చేరుకుంది. అలాంటి ఆలయాన్ని సోమశివాచార్యులు అనే భక్తుడు పునర్నిర్మించినట్లు తెలుస్తోంది. చారిత్రక ఆధారాల ప్రకారం కుమార రుద్రదేవ మహారాజు పాలిస్తున్నప్పుడు ఈ సోమశివాచార్యులు క్రీ.శ. 1292లో రాతి గుడి కట్టించినట్లు తెలుస్తున్నది. సోమశివాచార్యుల ప్రతిమ ఆలయ దక్షిణ గోడలో కనిపిస్తుంది. అయితే 1782లో యార్లగడ్డ కోదండరామయ్య దేశాయి మరమ్మత్తులు చేయించారు. 1796లో నాగేశ్వరనాయుడు అనే భక్తుడు ఆలయానికి ముందు భాగంలో ఒక గాలిగోపురాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.

ఫోటో సౌజన్యం – ఇంటర్‌నెట్

విశాలమైన ఆలయ ప్రాంగణం. ప్రదక్షిణ మార్గంలో సత్య స్తంభం పాలరాతి మీద అస్పష్టంగా బ్రాహ్మి లిపిలో శాసనం. ఇక్కడ సత్య ప్రమాణాలు చేసేవారుట. ఇక్కడే కర్కోటకుడి నాగ ప్రతిమ వుండటం వల్ల కర్కోటక స్తంభం అని కూడా పిలుస్తారు. ఈశాన్యం వైపు 16 స్తంభాల కళ్యాణ మండపం, దానికి సమీపంలో పంచముఖ గణపతి విగ్రహాలు వున్నాయి.

పురాణ కధల ప్రకారం నాగమాత కద్రువ శాపం వల్ల తామంతా (సర్పాలన్నీ) మంత్ర శక్తి వల్ల నశిస్తామనే సంగతి మరపురాక అనంత, వాసుకి, తక్షక, కర్కోటక అనే సర్పాలన్నీ ఇక్కడ ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణానదీ తీరంలో ఈశ్వరుని గురించి తపస్సు చేస్తాయి. అవి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించటంవల్ల స్వామికి నాగేశ్వరుడని, ఈ క్షేత్రానికి నాగేశ్వర క్షేత్రమనీ పేరు వచ్చింది.

మరో పురాణ కథ ప్రకారం జనమేజయుడు ఈ ప్రాంతంలో సర్పయాగం చేశాడు. ఆస్తికుడు ఆ యాగాన్ని ఆపుచేయిస్తాడు. శివుడి వర ప్రసాదం వల్ల అనంత, వాసుకి మొదలగు సర్పాలు ముందే రక్షింపబడతాయి. ఆ దోషాన్ని కూడా ఆస్తికుడే పోగొట్టి, జనమేజయుడు ఇక్కడ యాగం చేసిన కారణంగా ఆ క్షేత్రం జనమేజయ క్షేత్రంగా పిలవబడుతుందుని వరమిస్తాడు.

ఈ క్షేత్రంలో నెలకొన్న ఇతర దేవీ దేవతలు.. గణపతి, దుర్గామాత, ఎడమవైపు వీరభద్రస్వామి, భద్రకాళి, నవగ్రహాలు, కాల భైరవుడు, కుమార స్వాములని దర్శించవచ్చు.

శివరాత్రికి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది. మర్నాడు రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది.

ఇక్కడ నెలకొన్న నాగేశ్వరస్వామి దివ్య ప్రకాశంతో అజ్ఞానాన్ని పారదోలి భక్తులలో జ్ఞాన జ్యోతులు వెలిగిస్తాడని నమ్మకం. ఇంతటి మహిమాన్విత క్షేత్రానికి చేరుకోవటానికి బస్సు సౌకర్యం వున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here