[box type=’note’ fontsize=’16’] కృష్ణా జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా విజయవాడ లోని కనక దుర్గ ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
కనక దుర్గ ఆలయం విజయవాడ
[dropcap]వి[/dropcap]జయవాడ అంటే వెంటనే గుర్తొచ్చేది కనకదుర్గ గుడి. ఇది భారత దేశంలోనే ప్రసిధ్ధిచెందిన దేవాలయం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండో పెద్ద దేవాలయం. ఇది విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద వున్నది.
హిందూ పురాణాలలో ఈ అమ్మవారి ప్రస్తావన వున్నది. ఈ పర్వతం పేరుకి, ఊరు పేరుకి సంబంధించి రకరకాల కథలు వున్నాయి. కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేశాడు. అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైన అమ్మవారిని తన హృదయస్ధానంలో నిలిచి వుండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని, కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలచి వుంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కోసం ఎదురుచూస్తూ వున్నాడు. మాట ఇచ్చిన ప్రకారం అమ్మ మహిషాసుర సంహారం తర్వాత ఇక్కడ స్వయంభూగా వెలిసింది. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. అంతే కాదు. దుర్గముడు అనే రాక్షసుని సంహరించినందువల్ల దుర్గతులను బాపే దుర్గ అయింది.
అర్జనుడు అరణ్యవాసం సమయంలో ఇక్కడే శివుడి గురించి తపస్సు చేశాడని చెబుతారు. శివుడు కిరాతుడి రూపంలో రావటం, వారిద్దరి మధ్య ఒక అడవి పంది గురించి వాగ్వివాదం, చివరకు అర్జునుడికి శివుడు ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్నివ్వటం ఇక్కడ జరిగినదంటారు. అందుకే ఈ ప్రాంతానికి విజయవాడ అనే పేరు వచ్చింది.
ఆదిశంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. అప్పటినుంచి అమ్మ శాంతమూర్తిగా దర్శనమిస్తోంది అంటారు. అంతకు ముందు ఇక్కడ జంతు బలులు కూడా వుండేవిట. శ్రీ శంకరాచార్యులవారు వచ్చినప్పటినుంచీ వాటిని మానేశారుట.
ఈ దేవి గురించి కాళికా పురాణంలో, దుర్గా సప్తశతిలోను వున్నది.
కనకదుర్గ:
ఈ దేవిని గూర్చి వర్ణించటానికి మాటలు సరిపోవు. పచ్చని ముఖంతో, మందహాసంతో, ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది.
ఆలయం:
ఆలయం చేరుకోవటానికి రెండు మెట్ల మార్గాలు ఒక రోడ్డు మార్గము వున్నది. కొన్ని సంవత్సరాల క్రితం మెట్ల మార్గాలే వుండేవి. ఆలయం దిన దినాభివృధ్ధి చెందుతూ అనేక సౌకర్యాలు చేకూర్చుకుంది. నడవలేనివారికి ఆలయం దాకా రోడ్డు సౌకర్యాన్ని ఏర్పరచటమేగాక ఆలయం వారు భక్తుల సౌకర్యార్థం బస్సులు కూడా నిర్వహిస్తున్నారు. సొంత వాహనాల్లో, ఆటోల్లో కూడా ఆలయానికి చేరుకోవచ్చు. అంతేగాక పెద్ద పెద్ద లిఫ్టులు ఏర్పాటు చేశారు. వాహన సౌకర్యం లేనివారు లిఫ్టు ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. 5, 6 అంతస్తుల భవనంలో భక్తులకు నిత్యాన్నదాన వసతి కూడా ఏర్పాటు చేశారు.
రోడ్డు మార్గంలో వెళ్ళిన వారికి రాజగోపురం దర్శనమిస్తుంది. వెనకే గర్భగుడి గోపురం బంగారు కాంతులతో మిరుమిట్లు కొలుపుతూ అత్యద్భుతంగా కనబడుతుంది. ఆలయం ముంది రావి చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు కూడా అనేక వందల సంవత్సరాలనుంచీ వుందని భక్తులు దానికి కూడా పూజలు చేస్తారు. దాని కిందే నమస్కార ముద్రతో ఆంజనేయస్వామి చిన్న ఆలయం వుంటుంది. ఈయన ఇక్కడి క్షేత్ర పాలకుడు. ఆయనకి ప్రణమిల్లిన భక్తులు క్యూ మార్గం ద్వారా అమ్మవారి దర్శనం చేసుకుని తరిస్తారు.
అక్కడనుంచి బయటకి వచ్చిన భక్తులు ఆలయానికి ఎడమపక్కన వున్న అతి ప్రాచీనమైన నాగ పుట్టను దర్శించి పూజిస్తారు. పక్కనే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి. ఈయనని పూజిస్తే సర్ప దోషాలు పోతాయని ప్రశస్తి. పక్కనే ఉపాలయాలలో వినాయక స్వామి, నటరాజు, శివకామేశ్వరిల దర్శనం లభిస్తుంది. అక్కడనుంచి శ్రీ మల్లికార్జునస్వామి ఆలయానికి వెళ్ళే దోవలో రాధా కృష్ణుల రాస లీలలు, గంగావతరణం, విగ్రహాలు అందంగా మలచబడ్డవి కన్పడతాయి.
శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం:
బ్రహ్మ దేవుడు శతాశ్వమేధ యాగాలు చేశాడుట. ఆ కారణంగా పరమేశ్వరుడు ఇక్కడ వెలిశాడు. బ్రహ్మ ఆ దేవ దేవుని మల్లెపూలతో పూజించాడుట. అందుకనే ఆయనకి మల్లికార్జునస్వామి అనే పేరు వచ్చింది. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమై విలసిల్లుతున్నాడు. అంతకు ముందు అదృశ్యంగా వున్న ఈ స్వామిని శంకరాచార్యులవారు వచ్చినప్పుడు ఉత్తరాన ప్రతిష్ఠించారుట.
ఈ ప్రాంగణంలోనే నవగ్రహ మండపం, అద్దాల మండపం వున్నాయి. అద్దాల మండపంలో గంగా పార్వతీ సమేత శ్రీ మల్లికార్జునస్వామి ఆనంద డోలలూగుతూ దర్శనమిస్తారు. శివాలయం నుంచి వెళ్తూ శంకరాచార్యుల వారిని, శాంతి కళ్యాణ మండపాన్నీ దర్శించవచ్చు.
అంతే కాదు. కొండమీదనుంచి చూస్తే విజయవాడ నగరంలో పలు ప్రాంతాలు, కృష్ణానది అందంగా కనిపిస్తాయి. రాత్రి సమయంలో దీపాల వెలుగులో మిరుమిట్లు కొలుపుతూ వుంటుంది.
పండుగలు:
శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగలలో బ్రహ్మ ఉత్సవాలు, శివరాత్రి మరియు దశమి/నవరాత్రి ఉన్నాయి.
కనక దుర్గను ప్రత్యేకంగా బాలత్రీపుర సుందరి, గాయత్రి అన్నపూర్ణ అని అలంకరించారు. నవరాత్రి పండుగ యొక్క ప్రతి రోజు మహాలక్ష్మి, సరస్వతి, లలిత త్రిపుర సుందరి, దుర్గా దేవి, మహిసుసుర మార్దిని మరియు రాజ రాజేశ్వరి దేవి అవతారాలు. విజయ దశమి రోజున, దేవతలను కృష్ణ నది చుట్టూ హంస ఆకారంలో ఉన్న పడవలో తీసుకువెళతారు, దీనిని “తెప్పోత్సవం” అని పిలుస్తారు.
- మొదటి రోజు స్వర్ణ కవచాలంకార దుర్గ దేవి
- రెండవ రోజు బాల త్రిపురసుందరి దేవి
- మూడవ రోజు గాయత్రి దేవి
- నాలుగవ రోజు అన్నపూర్ణా దేవి.
- ఐదవ రోజు లలితా త్రిపురసుందరి దేవి
- ఆరవ రోజు సరస్వతి దేవి
- ఏడవ రోజు దుర్గాదేవి
- ఎనిమిదవ రోజు మహాలక్ష్మిదేవి
- తొమ్మిదవ రోజు మహిషాసురమర్దిని
- పదవ రోజు రాజరాజేశ్వరి దేవి
ఈ ఐదవ రోజున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ రోజు అమ్మవారి జన్మనక్షత్రంగా అనగా మూలానక్షత్రంగా భావిస్తారు. ఆ రోజున వేలాది మంది భక్తులు, విద్యార్థులు తరలివస్తారు. ఈ దేవాలయంలో వినాయక స్వామి, ఈశ్వరుడు, శ్రీ రాముల వారు కొలువుతీరి ఉన్నారు. ఈ దేవాలయాన్ని దర్సించుటకు అనేక మంది భక్తులు అనేక ప్రదేశాల నుండి వస్తారు.
ఈ ఆలయం గురించిన మరిన్ని వివరాలు ఈ లింక్ లో చదవవచ్చు.
వచ్చే వారం మరో ఆలయం.