Site icon Sanchika

యాత్రా దీపిక కృష్ణా జిల్లా – 6. వేదాద్రి

[box type=’note’ fontsize=’16’] కృష్ణా జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా వేదాద్రి లోని శ్రీ నరసింహస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

కృష్ణా తీరాన వెలసిన శ్రీ వేదాద్రి నరసింహుడు:

[dropcap]ఇ[/dropcap]వాళ కృష్ణానదీ తీరాన వెలసిన చెంచులక్ష్మీ, రాజ్యలక్ష్మీ సమేత శ్రీ నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం విజయవాడ – హైదరాబాదు రహదారిలో చిల్లకల్లు కూడలికి 10 కి.మీ. లు, జగ్గయ్యపేటకి 9 కి.మీ.ల దూరంలో వున్నది. ఈ క్షేత్రానికి చిల్లకల్లునుంచీ, జగ్గయ్యపేట నుంచీ ఆటోలు కూడా దొరుకుతాయి.

సోమకాసురుడనే రాక్షసుడు వేదాలని అపహరించి సముద్రంలో దాక్కోవటం, శ్రీ మహా విష్ణువు మత్స్యావతారంతో ఆ రాక్షసుణ్ణి సంహరించి, వేదాలను రక్షించి బ్రహ్మదేవునికి అప్పజెప్పటం, ఈ కథ మీకు తెలిసే వుంటుంది. అప్పుడు వేదాలు పురుష రూపం ధరించి తమని తరింపచేయమని ప్రార్థించాయి. వారి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు రాబోయే కాలంలో తాను నరసింహావతారమెత్తినప్పుడు మీ శిరస్సునందు ఐదు రూపాల్లో వుండగలననీ, కృష్ణవేణినది కూడా నన్ను ప్రతి దినం అభిషేకించవలెనని కోరుకుంటున్నదనీ, మీ అందరి కోరికలూ ఆ అవతారంలో తీరగలవనీ, అప్పటిదాకా మీరు కృష్ణవేణి నదిలో సాలగ్రామ పర్వతం స్వరూపంతో వుండమని ఆనతీయగా వారు స్వామి ఆనతిని పాటించారు.

తర్వాత కాలంలో ప్రహ్లాదుని రక్షించటానికి హిరణ్యకశిపుని సంహరించటానికి శ్రీ నరసింహావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణు, హిరణ్యకశిపుని సంహారానంతరం వేదమూర్తులకు వరమిచ్చిన విధంగా జ్వాలా నరసింహమూర్తిగా ఆ పర్వత శిఖరంపై వెలిశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి సత్యలోకంలో సాలగ్రామ నరసింహ రూపంతో వేంచేసి తమని అనుగ్రహించమని కోరగా, స్వామి సత్యలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడి పూజ పూర్తి కాకముందే స్వామి ఉగ్రం తట్టుకోలేక సత్యలోకము సెగలు కక్కింది. అప్పుడు బ్రహ్మ దేవుడు నరసింహస్వామిని తిరిగి కృష్ణానదిలో ప్రతిష్ఠించాడు. అప్పటినుంచీ కృష్ణవేణి నదీ జలం స్వామినభిషేకిస్తున్నది. ఇప్పుడు కూడా కృష్ణానదిలో కనిపిస్తున్న పెద్ద రాయి సాలిగ్రామ నరసింహమూర్తి స్వరూపంగా భావిస్తారు.

తర్వాత ఋష్యశృంగుడు మొదలయిన మహర్షులు ప్రార్థించగా స్వామి యోగానంద నరసింహుడై పర్వతం మధ్యలో కొలువైనాడు. గర్భగుడిలో మనం దర్శించే స్వామి ఈయనే. ఈయనని త్రేతాయుగంలో ఋష్యశృంగుడు ప్రతిష్ఠించాడంటారు. గరుత్మంతుడు మొదలగువారి ప్రార్థనలతో వీర నరసింహమూర్తిగా, స్వయంభూగా గరుడాచలంపై వెలిశారు. వనదేవత ప్రార్థనతో లక్ష్మీ నరసింహ రూపాలతో వెలిశాడు. ఈ విధంగా పంచ నరసింహమూర్తులు ప్రకాశించు స్ధలం ఇదేనని సూత మహర్షి శౌనకాది మునులకు చెప్పారు.

శ్రీ నరసింహస్వామి ఇక్కడ పంచ రూపాలలో ప్రకాశించే ప్రదేశాలు.. వేద పర్వత శిఖరంపై జ్వాలా నృసింహస్వామి, కృష్ణా నది గర్భంలో సాలగ్రామరూపం, ఋష్య శృంగ మహర్షి ప్రతిష్ఠించిన యోగమూర్తిగా గర్భగుడిలో, లోక కళ్యాణార్థం గర్భగుడిలో స్వామి పీఠముపైనే లక్ష్మీ నరసింహస్వామిగా, అక్కడికి 5 కి.మీ.ల దూరంలో వున్న గరుడాద్రి పై వీర నరసింహాకృతిలో.

కలియుగ ప్రవేశానంతరం కొందరు ఋషులు కలియుగంలో మానవులు తరించే మార్గం తెలుసుకోగోరి వ్యాస మహర్షి దగ్గరకెళ్ళారు. ఆయన వీరి రాకలో ఆంతర్యం గ్రహించి, “కలౌ స్మరణన్ ముక్తః” కలికాలంలో మానవులు భగవంతుని నామజపం చేసినంతమాత్రాన ఆ పరమాత్మ కటాక్షించి వారి అభీష్టాలు తీర్చగలడని తెలిపారు. అంత వారు తపస్సు చేసుకునే ప్రదేశం గురించి వెతుక్కుంటూ ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ తపస్సు చేసుకున్నారు. ఆ విధంగా నరసింహస్వామి పంచ రూపాల్లో విలసిల్లటమేకాక, ఋషులు చేసిన తపస్సువల్ల కూడా ఈ స్థలం అత్యంత ప్రభావితమైనది.

చారిత్రిక విశేషాలు:

చారిత్రిక ఆధారాలు ప్రకారం ఈ ఆలయానికి ప్రాకారాలు సుమారు 900 సంవత్సారాల క్రితం రెడ్డి రాజులచే నిర్మింపబడ్డాయి. వారి పోషణలో ఈ ఆలయం అత్యంత వైభవోపేతంగా విలసిల్లినది.

కవిత్రయంలో ఒకరైన ఎఱ్ఱాప్రగడ ఈ స్వామిని దర్శించి, స్తోత్రాలు, దండకం చెప్పారని, కవిసార్వభౌముడు శ్రీనాధుడు తన కాశీఖండంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించాడనీ తెలుస్తోంది. సుప్రసిధ్ధ వాగ్గేయకారులు నారాయణ తీర్దులు శ్రీకృష్ణ లీలా తరంగిణ (కృష్ణ తరంగాలు) ఈ స్వామి కృప చేతనే రాశారని చెబుతారు. శ్రీ నారాయణ తీర్ధులవారి అత్తగారిల్లు వేదాద్రికెదురుగా కృష్ణానదికవతల వడ్డున వున్న గింజుపల్లి. ఒకసారి ఆయన అత్తగారింటికి వచ్చి తిరిగి వెళ్ళే సమయంలో, వేసవికాలం అవటంవల్ల కృష్ణలో నీరంత లేదని రావిరాల వద్దనుండి కృష్ణానది దాటే ప్రయత్నం చెయ్యగా, నది మధ్యకు వెళ్ళేసరికి నీరు గొంతు వరకు వచ్చి ఇంక ప్రాణం పోతుందని భయపడ్డారు. ఆ సమయంలో అయనకి నువ్వు సన్యాసం తీసుకో, కృష్ణ నీకు దోవ ఇస్తుందని వినిపించటంతో ఆయన నది మధ్యలోనే మానసిక సన్యాసం తీసుకున్నారు. అప్పుడాయన ఆ నదిని క్షేమంగా దాటటమేగాక, అకస్మాత్తుగా వచ్చిన కవితా ప్రవాహంతో “వేదాద్రి శిఖర నరసింహమా కలయామి“ అని స్వామిని స్తుతించి, వారి అనుగ్రహంతో అనర్గళంగా కవితా స్రవంతి ఉప్పొంగగా తరంగాలు వ్రాశారు. ఆయన రాసిన తరంగాలు దక్షిణ భారత దేశంలో సుప్రసిధ్ధాలు.

అమ్మవార్లు:

స్వామి దేవేరులు చెంచు లక్ష్మి, రాజ్య లక్ష్మిలకు గర్భగుడి పక్కన ప్రత్యేక ఉపాలయాలు వున్నాయి.

ఉపాలయాలు:

క్షేత్రపాలకుడు శ్రీ విశ్వేశ్వరస్వామికి, నవగ్రహాలకు ఉపాలయములు కలవు.

మహత్యం:

శారీరిక, మానసిక రుగ్మతలు వున్నవారు ఇక్కడ కొన్నాళ్ళు వుండి, కృష్ణవేణిలో స్నానం చేసి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, స్వామివారి కరుణతో స్వాస్థ్యం పొందుతున్నారు.

వసతి సౌకర్యాలు:

స్వామి దర్శనానికి వచ్చే భక్తులకోసం వసతి సౌకర్యం వున్నా, వసతి, ఆహారం, జగ్గయ్యపేటలో చూసుకుంటే మంచిది. స్వామికి పువ్వులు వగైరా తీసుకెళ్ళదలచినవారు జగ్గయ్యపేటనుంచీ తీసుకెళ్ళటం మంచిది. మేము వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ లేవు. పైగా కోతులు ఎక్కువ. చేతిలో కవరు కనబడితే లాక్కు పోతాయి.

Exit mobile version