Site icon Sanchika

యాత్రా దీపిక కృష్ణా జిల్లా – 9. కంచికచర్ల

[box type=’note’ fontsize=’16’] కృష్ణా జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా కంచికచర్ల లోని శివసాయి క్షేత్రం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]హై[/dropcap]దరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు కుడి వైపు ఒక పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం కనబడుతుంది. దాని వెనకే బంగారు రంగు గోపురాలు కనీ కనబడనట్లు కనబడతాయి. ఆ ఆలయాన్ని చూడాలని చాలాసార్లు అనుకున్నా తర్వాత ఒకసారి కుదిరింది. అప్పటిదాకా మాకు ఆ ఊరు పేరు కూడా తెలియదు. ఇంతకీ అది కంచికచర్ల. దగ్గరకు వెళ్ళి ఆ అద్భుతానికి ఆశ్చర్యపోయాము. ఇంత చక్కని దేవాలయాన్ని ఇటు వైపునుంచీ వెళ్తూ ఇన్ని రోజులూ చూడలేదా అని అనుకున్నాము. మొత్తానికి ఆ రోజన్నా చూసినందుకు చాలా సంబరపడ్డాము. ఇంతకీ ఈ విశేషాలన్నీ ఎందుకా? మీకు చెప్పకపోతే మరి మీరెలా వెళ్తారు? అందుకే!!

 

శివసాయి క్షేత్రం, కంచికచర్ల

ఈ క్షేత్రం అనేక ఆలయాల సమూహం. అన్ని ఆలయాలు బంగారంతో నిర్మించారా అన్నట్లు ధగ ధగా మెరిసి పోతున్నాయి. మెరిసేదంతా బంగారమనుకోకండి. రంగు మాత్రమే. దీనిలోని విశేషాలు చూసే ముందు అసలు ఈ ఆలయ నిర్మాత ఎవరో తెలుసుకుందాము. శ్రీ గద్దె ప్రసాద్ గారికి షిర్డీ సాయి అంటే అపారమైన భక్తి. ఆయన కొలిచే ఇంకో స్వామి శివుణ్ణీ ఆయన సాయిలోనే చూసుకుంటారు. దాని ఫలితమే ఈ శివ సాయి క్షేత్రం. వారిద్దరి పట్ల గల భక్తితో ఇరువురినీ ఒకే చోట నెలకొల్పాలనే ఆయన సంకల్పం ఆయన అపారమైన భక్తి వలన ఆయన తలపెట్టిన 4 నెలలలో పూర్తయింది.

ఇప్పుడు ఆలయం గురించి. ఆలయం ముందు ఇంత పెద్ద శివలింగం పెట్టారేమిటా అని ఆశ్చర్య పోకండి. బంగారు ఛాయతో పెద్ద శివలింగం, పైన తూర్పు ముఖంగా శివమూర్తి, జటాజూటంలో ఉరుకుతున్న గంగ అద్భుతమైన శిల్పాన్ని అలా చూస్తూ నుంచుండి పోయారా. అదే ముఖ ద్వారమండీ. దానిలోంచే ఆలయ ప్రవేశం చేయాలి. ముందు పెద్ద ఏనుగులు. ముఖ్యాలయంలో లయకారుడు, విశ్వ స్వరూపుడు అయిన శివుడు కొలువై వున్నాడు. ఏ విధంగా? అష్టోత్తర శత లింగేశ్వరస్వామి లాగా. అంటే ఒక లింగం మీద 108 లింగాలు చెక్కారు. ఆ స్వామికి అభిషేకం చేసినా, అర్చన చేసినా 108 లింగాలకు చేసినట్లే. అంతే కాదండీ. ఆ శివాలయం స్తంభం మీదకూడా చూసి తీరవలసిన ఒక అద్భుతమైన శివ మూర్తిని చెక్కారు.

పక్కనే వేరే ఉపాలయంలో సకల జగాలనూ కాచే అమ్మ పార్వతీ దేవి. ఆ దేవి అద్భుత సౌందర్యాన్ని కన్నార్పకుండా చూసి శిరస్సు వంచి నమస్కరించి ఇవతలకి వస్తే అనేక ఉపాలయాలు.

శివ సాయి క్షేత్రం కదండీ. అందుకే షిర్డీ సాయికి కూడా ప్రత్యేక ఆలయం వుంది. అన్ని లోకాలనూ లయం చేసే లయకారుని క్షేత్రంలో అతి ప్రశాంతంగా నవ్వుతూ భక్తులను ఆదరిస్తున్న సాయి విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా వుంటుంది. ఇంకో విశేషం తెలుసా? ఈ బాబా తలపాగా చుట్టుకుని ఎంత అందంగా వుంటాడో!!!

మిగతా ఉపాలయాలలో రమా సహిత సత్యన్నారాయణ స్వామి, వీర భద్రుడు, కుమారస్వామి, చేతిలో వీణతో అత్యద్భుత రూపంలో జ్ఞాన సరస్వతి, పంచ ముఖ ఆంజనేయస్వామి, అయ్యప్ప, తర్వాత నవగ్రహాలు.

ఇంత అందమైన ఆలయాన్ని అటువైపు వెళ్తే తప్పక దర్శించండి. ఇంతకీ మార్గమంటారా.. విజయవాడనుంచి గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, పరిటాల మీదుగా కంచికచర్ల చేరవచ్చు. ఆలయం దగ్గర ఏమీ దొరకవు.

Exit mobile version