యాద్గిర్ – మంత్రాలయం – హంపీ యాత్ర-2

0
3

[ఇటీవల యాద్గిర్, మంత్రాలయం, హంపి దర్శించి ఆ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]మా[/dropcap] తర్వాత గమ్యం మైలాపుర. అక్కడ ఒక కొండ మీద శ్రీ మైలార లింగేశ్వర స్వామి వారు, ఒక గుహలో వెలసి ఉన్నరు. మైలాపుర గ్రామం విజయనగర జిల్లాలోని హూవినహడగళి తాలూకాలో ఉంది. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోనే తుంగభద్రా నది ప్రవహిస్తూ ఉంటుంది.

స్వామి వారు ఒక కొండ గుహలో ఉంటారు. అక్కడికి చేరుకోడానికి 280 మెట్లు ఎక్కాలి. వాటిని చూసి నాకు భయం వేసింది. “సీనియర్ సిటిజన్స్‌కు లిఫ్ట్ సౌకర్యం లేదా?” అనడిగాను బసవరాజ్‌ను, అమాయకంగా.

అతడు పడీ పడీ నవ్వాడు. “అలాంటివేం ఉండవు సార్” అన్నాడు.

మా మిత్రుడన్నాడు “శర్మాజీ, రెయిలింగ్ పట్టుకుని నెమ్మదిగా ఎక్కుదాం. ప్రతి పది మెట్లకు, కొంత సమతలం వదిలారు చూడండి. అక్కడక్కడ కూర్చోడానికి చిన్న గద్దెల్లాంటివి ఉన్నాయి. 50 మెట్లకోసారి కాసేపు కూర్చుని అలుపు తీర్చుకుంటే సరి. మీకు స్టెంట్స్ లాంటి వేవీ వెయ్యలేదు కదా?”

“అబ్బే! దేవుని దయ వల్ల లేదండీ. మొన్న ఇ.సి.జి. కూడా చూపిస్తే నార్మల్‌గా వచ్చింది. డయాబెటిక్ నండి గత పాతిక సంవత్సరాలుగా.”

“సూపర్! మనం పైకి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చే సరికి మీ షుగర్ లెవల్స్ బిలో నార్మల్‌కి వచ్చేస్తాయి.”

“మీకు షుగర్..!”

“భేషుగ్గా ఉంది. కంట్రోల్లోనే ఉంది.”

“నాక్కూడా దాని వల్ల ఏ ఇబ్బంది లేదు సార్.”

హరహర మహాదేవ! శంభో శంకర! అని నినదిస్తూ మెట్లు ఎక్కసాగాను. దివాకర్ నాతో గొంతు కలిపాడు. బసవరాజ్ అవతలగా, చకా చకా ఎక్కుతూ వెళ్లిపోయాడు. అతని వయసులో, నేనూ, ఒక చేత్తో సూట్ కేసు, మరో చేత్తో మా సంవత్సరంన్నర పాప నెత్తుకుని, రైల్వే స్టేషన్లలో ఓవర్ బ్రిడ్జ్ మెట్లెక్కిన వాడినే!

చుట్టూ మనోహరమైన ప్రకృతి. సస్యశ్యామలాలైన పొలాలు. తాటి చెట్ల వరుసలు. దూరంగా పచ్చటి కొండలు. వాటి వెనుక అక్కడక్కడ తెల్లని మేఘాలు గల వినీలాకాశం. వెరసి, అదంతా భగవంతుడు గీచిన ఆయిల్ పెయింటింగ్! కాదు! ఆర్గానిక్ రంగుల చిత్రం!

మేము పైకి చేరుకోవడానికి 40 నిమిషాలు పట్టింది. పైన ఆరడుగుల ఎత్తెనా లేని గుహ. దానిలోకి ప్రవేశించడానికి నిర్గమించడానికి వేర్వేరు మార్గాలు. అవి ఇరుకుగా ఉన్నాయి. నాలుగడుగుల ఎత్తు ఉన్నాయంతే!

మల్లయ్య స్వామి వారిని వెండి తొడుగుతో అలంకరించారు. పెద్ద పెద్ద కళ్లు. మీసాలతో స్వామి వారు మనోహరంగా ఉన్నారు.

నాకు మా అహోబిల నరసింహస్వామి వారు గుర్తుకు వచ్చారు.

ఆయనా ఇలాగే, ఎగువ అహోబిలంలో గుహంతర్భాగంలో కొలువై ఉంటారు. భక్తితో శివుడిని ఇలా స్మరించాను.

“మహాదేవ మహాదేవ మహాదేవ దయానిధే!

భవానేవ భవానేవ భవానేవ గతిర్మమ!

శివ శివేతి శివేతివా, హరహరేతి హరేతివా

భజమనః! శివమేవ నిరంతహం!

భజమనః! శివమేవ నిరంతరం!”

నా గొంతు గుహంతర్భాగంలో ప్రతిధ్వనించింది. పూజారి మా నుదుటన విభూతి పూశాడు. తీర్థం ఇచ్చాడు. “దక్షిణమాడిరి” అని పళ్లెం చూపాడు. బయటకు వచ్చే దారిలో ఇబ్బంది పడ్డాము. అంత క్రిందికి వంగ లేను. మోకాళ్ల మీదుగా మెట్ల మీద నుంచి వచ్చేశాము.

ఈ వయసులో, మూడు వందలు దాదాపు మెట్లు ఎక్కి, గుహలోని మల్లయ్య స్వామిని దర్శించుకోగలిగామంటే, కేవలం శివాను గ్రహం వల్ల మాత్రమే!

50 మెట్ల దిగువన ఇద్దరు అమ్మవార్లున్నారు. మొదట ‘గంగి మాళమ్మ’ను దర్శించుకున్నాము. ఒక పది మెట్లు దిగి లోపలికి వెళ్లాలి. తర్వాత స్వామి వారి రెండవ భార్య ‘శ్రీ తురంగ బాలమ్మ’ను దర్శించాము. ఆమె అశ్వరూపిణిగా ఉన్నారు.

గంగి మాళమ్మ

అక్కడ మంటపంలాంటి దాంట్లో కాసేపు కూర్చున్నాం. కోతులు, కొండముచ్చులు, యథేచ్ఛగా తిరుగుతున్నాయి. మెట్ల మీది రేకుల కప్పుపై, వాటి గెంతుల ధ్వనులు!

శ్రీ తురంగ బాలమ్మ

క్రిందికి వచ్చి, పైకి చూసి “ఫరవాలేదు, 67 నాట్ ఔట్ అయినా, ఆ మాత్రం ఫిట్ గానే ఉన్నాంలే” అని సంతోషపడ్డాము.

మా బసవరాజ్ మాకు గైడ్ కూడా! కారులో క్షేత్రప్రాశస్త్యాన్ని వివరించాడు మాకు.

“సార్, మల్లాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడిని గురించి తపస్సు చేసిండాడు. నరులతోన తనకు చావు లేకుండా వరము పొంది, మునులను సతాయిస్తుండాడు. వాండ్లు శివునితో మొర బెట్టుకుండారు. స్వామి వారు తన గొరవయ్యల సైన్యంతో మల్లాసురుని, వాని తమ్ముడు మానికాసురునితో పదిరోజులు రణము చేసి, తన విల్లతో వాండ్లను చంపేసినాడు. స్వామినే మైలారదేవుడంటారు. ఆయన ఆ దుర్మర్గుల ప్రేగులను తన తలపాగా మాదిరి చుట్టుకున్నాడంట. వాండ్ల దంతాలను హారముగా దాల్చినాడంట. వాండ్ల నోళ్లను చిన్న ఢక్కీగా, వాండ్ల పుర్రెలను భిక్షపాత్రలుగా, వాండ్ల చర్మాన్ని అంగీగా చేసుకున్నాడు.”

“మైలారలింగయ్యను గొరవయ్యలు కొలుస్తారు. వారి నృత్యాన్ని ‘గొరవ కుణిత’ అంటారు. వారు నల్లని కంబది ధరించి, నల్లని కోటు వేసుకుని, తెల్లని ధోవతితో, ధమరుకం వాయిస్తూ శివుని ఎదుట నాట్యం చేస్తారు.”

“వారు కాలభైరవ స్వామి రూపాలైన కుక్కలాగా ధ్వనులు చేస్తారు. నుదుట పసుపుపచ్చ గంధం ధాలుస్తారు. ఫ్లూటు వాయిస్తారు. మైలారలింగయ్య శునకరూపుడుగా కూడ దర్శనం ఇస్తాడని అంటారు.”

“మైలార జాతర, కన్నడ దేశంలోని అతి పెద్ద తిరునాళ్లు సార్. ఇంచుమించు పది లక్షల మంది భక్తులు వస్తారు. జాతరను ‘కార్నికోత్సవ’ అంటారు. కురుబగౌడ వంశ పాలకులకు మైలార లింగడు ఇంటి దేవుడు. ఫిబ్రవరి నెలలో వచ్చే పౌర్ణమికి ఈ జాతర జరుగుతుంది. స్వామి వారి నైవేద్యం, అరటిపండ్ల గుజ్జు, చక్కెర, నెయ్యి పాలతో కలిపి చేస్తారు.”

“స్వామి వారికి ‘ఎలుకోటి’ అన్న పేరు కూడ ఉంది సార్. స్వామి వారు వెంకటేశ్వర స్వామి వారి పెండ్లి కోసం ఏడుకోట్ల వరహాలు ఇచ్చారట. ఎలు అంటే ఏడు. అది అప్పు అట. వేంకటేశ్వరుడు దానిని తిరిగి ఇవ్వక పోతే స్వామి వారికి కోపం వచ్చింది. భక్తులు ఆయనను ‘ఎలుకోటి’ అని పిలిచి చల్లబరచారు.”

“స్వామి వారు జాతర సమయంలో తన భార్య గంగ మల్లవ్వతో, తెల్ల గుఱ్ఱమెక్కి తిరుగుతాడట.” అని చెప్పాడు బసవరాజ్.

“ప్రొఫెషనల్ గైడ్స్‌కు ఏమీ తీసిపోడు మా బసవరాజ్” అన్నాడు దివాకర్. నిజమే! అంత చక్కగా వివరించాడు! రీజనింగ్, లాజిక్ పక్కన బెడితే, మైలార లింగయ్య కథ చాలా బాగుంది. మత విశ్వాసాలు ఆధ్యాత్మికమైనవి. అవి సైన్సుకు లోబడవు.

మేము యాద్గిర్ చేరే సరికి సాయంత్రం నాలుగు ఐంది. ‘టీ టైం’ అన్న చోట షుగర్ లేని బాదం టీ తాగాము, ఉస్మానియా బిస్కెట్లు మంచుకొని.

రాత్రి గెస్ట్ హౌస్‌లో దివాకర్ అన్నాడు.

“శర్మగారు! ఇక్కడికి హోసపేట దగ్గరే. ఐదుగంటల ప్రయాణం. మీరు సరేనంటే, వెళ్లి తుంగభద్ర డ్యామ్, హంపీ చూసి వద్దాము.”

నేను సంతోషంగా ఒప్పుకున్నా. విశ్రాంత జీవితాన్ని సాధ్యమైనంత వరకు యాత్రల ద్వారా సుసంపన్నం చేసుకోవడమే నా లక్ష్యం.

“రేపు ఉదయాన్నే రైలుంది. దానికి రిజర్వేషన్ కూడ అవసరం లేదు. మధ్యాహ్నం హోసపేట చేరుకోవచ్చు. హుబ్బళ్లి (Hubli) వెళ్లే రైలది. స్లీపర్ క్లాసులో ఎక్కి కూర్చుని, టి.టి.యి.కి తలా వంద ఇస్తే సరి.”

‘ఇదేదో బాగుందే!’ అనుకున్నాను.

రాత్రి డిన్నర్ పోహా (అటుకుల కిచిడీ) విత్ మజ్జిగ.

***

మర్నాడు ఉదయమే లేచి యాద్గిర్ స్టేషన్ చేరుకున్నాము. రైలు అంత రష్‌గా లేదు. ‘యస్’తో వచ్చే డబ్బాలన్నీ ముందున్నాయి. రైలు మమ్మల్ని దాటి వెళుతుంటే, ఇంజను వెనుక జనరల్ కంపార్టుమెంట్లలో ఖాళీగా చాలా సీట్లు కనబడ్డాయి. ఇంకేం? అనుకొని ఎక్కి కూర్చున్నాము.

ఎదురు సీట్లో ఒక దంపతులు కూర్చున్నారు. వారితో మాటలు కలిపాము. మేము హోసపేట వెళుతున్నామని తెలిసి ఆయన ఇలా అన్నాడు.

“సార్ ఈ రోజు కర్నాటక్ బంద్‌కు బిజెపి పిలుపు ఇచ్చింది. కావేరీ జలాల ఇష్యూ మీద. గట్టిగానే ఉండేట్లుంది. మీరు ఇబ్బంది పడతారేమో.”

దివాకర్ అన్నాడు నాతో “శర్మగారు, ఆయనన్నది నిజమే. ఏం చేద్దాం?”

“మీరే చెప్పాలి!”

“అయితే మనం తుంగభద్ర స్టేషన్‌లో దిగిపోయి, ఈ రోజు మంత్రాలయం దర్శిద్దాం. రేపు ఎమ్మిగనూరు, ఆదోని, బళ్లారిల మీదుగా హోసపేటకు వెళదాం! ఏమంటారు? ”

“అంతకంటేనా మిత్రమా! రాఘవేంద్రస్వామి వారి దర్శనం అనుకోకుండా లభిస్తూంది.”

మేం తుంగభద్ర స్టేషన్‌లో దిగే సరికి తొమ్మిది కూడా కాలేదు. జనరల్ టికెట్టే కాబట్టి పెద్దగా నష్టం లేదు. అయినా తప్పదు. బంద్ అంటున్నారు కదా!

నాకెందుకో శ్రీశ్రీ గారి “ఛందో బందోబస్తులన్నీ బంద్!” అన్న మాటలు, దానికి విశ్వనాథవారి కౌంటర్ “ఛందస్సు వద్దని ఛందస్సు లోనే చెప్పాడు అమాయకుడు!” అన్న మాటలూ గుర్తొచ్చాయి.

తుంగభద్ర స్టేషన్ ఎ.పి.లోదే. బయట ఎ.పి.యస్.ఆర్.టి.సి వారి బస్ సిద్ధంగా ఉంది. తుంగభద్రను ‘మంత్రాలయం రోడ్’ అని కూడా అంటారు. మంత్రాలయ క్షేత్రం అక్కడికి 27 కిలోమీటర్లు ఉంటుంది. మేం మంత్రాలయం చేరే సరికి పదకొండు. తుంగభద్ర స్టేషన్ ముందు ఒక టిఫిన్ సెంటర్‌లో పొగలు కక్కే బొంబాయి రవ్వ ఉప్మా, పల్చని కొబ్బరి చట్నీ లభించింది మాకు. శొంఠి కాఫీ కూడా.

***

మంత్రాలయం, కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. కాని, శ్రీరాఘవేంద్ర స్వామి వారి భక్తులు ఆంధ్రప్రదేశ్‌లో కంటే, కర్నాటక రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఉన్నారు. మేము మంత్రాలయం బస్ స్టాండులో దిగాము. కె.యస్.ఆర్.టి.సి బస్సులే ఎక్కవ కనబడ్డాయి.

కర్నాటక రాష్ట్రంలోని ప్రతి ప్రధాన పట్టణం నుండి మంత్రాలయానికి బస్ సౌకర్యం ఉంది. బయట రోడ్డు వారగా ఎన్నో ప్రైవేటు ట్రావెల్స్ వారి వోల్వా బస్సులు పదుల సంఖ్యలో ఆగి ఉన్నాయి. స్వామివారికి గురువారం ముఖ్యం. ఆ రోజు, వారాంతాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని తెలుసుకున్నాము.

మా లగేజ్ పెద్దగా ఏం లేదు. ఇద్దరివి ట్రాలీ బ్యాగులే. నడుచుకుంటూ, దేవస్థానం వారి రూములు బుక్ చేసే కేంద్రానికి చేరుకున్నాము. దారిలో ‘రాఘవేంద్ర సర్కిల్’ అని వచ్చింది. అక్కడ ట్రాఫిక్ ఐలండ్‌ను, నాలుగు వైపులా స్వామి వారి విగ్రహాలతో తీర్చిదిద్దారు. చాలా ప్రయివేటు లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లు కనబడ్డాయి దోవ పొడుగూనా.

హోటళ్లు, దుకాణాల పైన బోర్డులు పెద్ద అక్షరాలతో కన్నడలోను, చిన్నక్షరాలలో తెలుగులోను దర్శనమిచ్చాయి.

అద వీకెండ్ కాదు కాబట్టి, రూం సులభంగానే దొరికింది. చల్లగా ఉంది వాతావరణం. నాన్ ఎ.సి రూం తీసుకున్నాం. 400/- రూపాయలు అద్దె. వంద నుంచి 3 వేల వరకు, ఎవరి పర్సును బట్టి వారికి రూములు దొరుకుతాయి. అందరూ దర్శించేది రాఘవేంద్ర స్వామినైనా, వసతి, భోజన సదుపాయాలను ఆర్థిక ప్రమాణాలే నిర్దేశిస్తాయి.

దేవస్థానాన్ని ‘మఠ్’ అంటారు. దానికి పరంపరగా వచ్చే పీఠాధిపతి, లేదా మఠాధిపతి ఉంటారు. ప్రతి చోటా ఆయన లైఫ్ సైజు ఫోటోలు పెట్టారు. ఆయన యువకుడే. నాకెందుకో, స్వామి చిత్రాల కంటే ఆయన చిత్రాలే ఎక్కువన్నాయేమో అనిపించింది. నాకెందుకో అలాంటి ఆలోచనలే వస్తాయి. ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. మఠాధిపతి సుందరుడే.

మఠానికి పక్కనే రూములు ‘సుధీంద్ర కాంప్లెక్స్’ అటాచ్‌డ్ బాత్, ఫ్యాన్, రెండు మంచాలు. పరిశుభ్రంగా ఉంది. వెంటనే స్వామి వారి దర్శనానికి బయలుదేరాం. నేనెప్పుడో ఏళ్ల క్రందట వచ్చిందే. చాలా అభివృద్ధి చేశారు. ముందు భాగాన కళాకృతులతో అందమైన ఆర్చి. రెండు వైపులా అత్యద్భుతమైన శిల్పాలు. స్తంబాలు, దశావతారాలు, కృష్ణలీలలు, క్షీరసాగరమథనం లాంటి దృశ్యాలు చెక్కిన కుడ్యాలు. కళ్లు తిప్పుకోలేని వైభవం!

దేవాలయం పక్క నుండి రెండు మూడు వందల మీటర్ల దూరంలోనే తుంగభద్రా నది. వెళ్లాము. నదిలో నీళ్లు నిండుగా ఉన్నాయి. మెట్లు దిగి వెళ్లి నడుము లోతు వరకు వెళ్లి స్నానం చేశాము. “గంగా స్నానం తుంగాపానం” అన్నారు కదా! నీళ్లు దోసిలితో తీసుకుని తాగాము. మధురంగా ఉన్నాయి.

నాకు తెనాలి కవి వ్రాసిన పద్యం గుర్తొచ్చింది. పాడమంటారా? అని మిత్రుడిని అడిగితే “అంత కంటేనా?” అన్నాడాయన.

తుంగభద్రమ్మ ఒడిలో నిల్చొని ఆ పద్యాన్ని ఆలపించాను.

శా.

గంగా సంగమ మిచ్చగించునె, మదిన్ కావేరి దేవేరిగా

నంగీకారము సల్పునే, యమునతో నానందమున్ బొందునే,

రంగోత్తుంగ తరంగ హస్తముల నా రత్నాకరేంద్రుండు, నీ

యంగంబంటి సుఖించునట్టి తరి, గుణభద్రా! తుంగభద్రానదీ!

సముద్రుడు సర్వనదులకు రాజు. నదులను స్త్రీలుగా భావించడం మన సాంప్రదాయం. తుంగభద్రమ్మను తాను స్వీకరించే సమయంలో, సముద్రస్వామి, గంగను కలవడానికి ఇష్టపడట, యమునతో ఆనందము పొందడట. కావేరిని దేవేరిగా అంగీకరించడట. భార్యల్లో కలహాలు పుటించడానికి కాకపోతే, తెనాలివారు, ఈ పద్యాన్ని ఎందుకు రాస్తారు? సాహిత్యంలోని మంచి చమత్కార పద్యాలలో ఇదొకటి.

పంచె, కండువా ధరించి స్వామి దర్శనానికి వెళ్లాము. పెద్దగా రద్దీ లేదు. క్యూలైన్ మలుపులు మలుపులు తిరిగి ఉంది. కానీ, సీనియర్ సిటిజన్స్‌కు డైరెక్ట్‌గా వేరే క్యూలైన్ ఉంది. పది నిమిషాలలో దర్శనం లభించింది.

స్వామి వారు జీవ సమాధి పొందిన చోట ‘బృందావనం’ అన్న కట్టడాన్ని నిర్మించారు. నల్లరాతితో, చుట్టూ చిన్న గోపురాలతో. స్వామి వారు భక్త ప్రహ్లాదుని అంశ అని ప్రతీతి. బృందావనం అగ్రభాగాన శ్రీలక్ష్మీనరసింహ స్వామిని చూసి నా మనసు పరవశించింది. చాలా విశాలమైన ఆవరణ. భక్తులు ప్రదక్షిణాలు చేస్తున్నారు. కొందరు పొర్లు దండాలు పెడుతున్నారు.

షర్టు, బనియన్ తీసివేసిన తర్వాతే, భక్తులను క్యూలైన్ లోనికి అనుమతిస్తున్నారు. ఆవరణలో స్వామివారి బంగారు పూత పూసిన రథం, పల్లకీ, చూశాము.

ఒంటిగంట అయింది. భక్తి తగ్గి, భుక్తి కోసం మనస్సు తహతహలాడసాగింది! అక్కడ రెండు అన్నదాన వితరణ చేసే సంస్థలు వున్నాయి. ఒకటి బ్రాహ్మణులకు, రెండవది అందరికీ. శ్రీశైలంలో ఐతే కులాల వారీగా సత్రాలుంటాయి. సర్వత్ర సమదర్శనయోగాన్ని ప్రవచించిన స్వామి ఇదంతా చూసి నవ్వుకుంటుంటాడేమో!

దేవాలయంలో నుంచే బ్రాహ్మణ సత్రానికి దారి ఉంది. ముందుగానే పేర్లు, గోత్రం రాయించుకోవాలట. నాకు వీలు కాలేదు. ద్వారం దగ్గర ఒకాయన మా గోత్రాలు అడిగాడు. చెప్పాము.

లోపల చాలా పెద్ద భోజనశాల. వెయ్యి మంది ఒకే సారి భోంచేయవచ్చు. క్రింద కూర్చోలేని వారికి ఒక మూల టేబుల్స్ ఏర్పాటు చేశారు. మంచిదే.

కొబ్బరి కోరుతో చేసిన స్వీట్, ఒక కూర, అన్నం, ఏదో కూటులాంటిది వడ్డించారు. తర్వాత “సారుగె అన్న, సారుగె అన్న” అని అరుస్తూ ఒకాయన వచ్చాడు. అంటే చారు కోసం అన్నం పెట్టించుకోమని. ఆ చారు మాత్రం అద్భుతమైన రుచితో అలరారుతూంది. ఘమఘుమలాడుతోందనుకోండి!

తర్వాత “మజ్జిగిగె అన్న” అంటూ వస్తారనుకున్నాను. కాని పెరుగున్నం వడ్డించారు. వడ్డించే, పర్యవేక్షణ చేసే వైష్ణవస్వాములంతా పుష్టిగా, మంచి రంగుతో, ఈగ వాలితే జారిపోతుందేమో అన్నంత నునుపుదేరి ఉన్నారు. వెనక గోష్పాదం కంటె పెద్ద శిఖలు ముడి వేసుకుని, నుదుట, చెతుల మీద, వక్షం మీద త్రిపుండ్రములు ధరించి అపర రాఘవేంద్రస్వాముల వలె ఉన్నారు. బాగుంది. కానీ, ఎందుకో ప్రసన్నంగా లేరు. కొంచెం అసహనాన్ని, భోక్తలపై ప్రదర్శిస్తున్నారు. కసురుకుంటున్నారు కూడా. అదే నాకు నచ్చ లేదు! శమము లేని వాడు స్వామి ఎలా అవుతాడు చెప్పండి!

యాద్గిర్ దగ్గరి, ‘కాళబెళగుంది’ బసవేశ్వరస్వామి వారి అన్న ప్రసాద వితరణ గుర్తొచ్చింది. ఎంత సింపుల్‌గా ఉండింది! ఎంత ఆదరంతో పెట్టారు!

రూంకి వచ్చి విశ్రాంతి తీసుకున్నాం. నాలుగున్నరకు లేచి తయారై బయటకు వెళ్లాము. అక్కడికి 30 కిలో మీటర్ల దూరంలో ‘పంచముఖి’ అనే గ్రామం ఉంది. అక్కడ ఆంజనేయస్వామి వారు ఐదు ముఖాలతో, ఒక చిన్న గుట్ట మీద ఒక శిలాకృతిగా వెలిశారు. ఆయన అత్యంత మహిమాన్వితుడు. స్వామిని చూసి వద్దామని అనుకున్నాం.

అక్కడ సీరియల్ షేర్ ఆటోలున్నాయి. “పంచముఖి! పంచముఖి!” అని ఆటో డ్రైవర్లు అరుస్తున్నారు. ఒక్కో ఆటోలో పది మందిని ఎక్కిస్తున్నారు. డ్రైవర్ కిరువైపులా కూడా కూర్చోబెట్టుకుంటున్నారు. డ్రైవర్ మోచేతులు వారికి తగులుతున్నాయి. ఛార్జీరాను పోను 80 రూపాయలు అట. మనకు కుదరదని, కేవలం మా ఇద్దరికే ఒక ఆటో మాట్లాడుకున్నాం. ఎనిమిది వందలు చెప్పి, ఆరు వందల యైభైకి దిగి వచ్చాడు.

పంచముఖి చేరడానికి నలభై నిమిషాలు పట్టింది. పైకి చేరడానికి 50, 60 మెట్లున్నాయి. రెయిలింగ్ ఉంది. మెట్లు ఎత్తుగా ఉన్నాయి. స్వామి వారు పైన ఒక పెద్ద బండరాయి మీద స్వయంభూగా అవతరించారు. ఐదు ముఖాలతో! దాని మీద ఒరిజినల్ స్వామి కనబడకుండా, హనుమత్ స్వరూపంతో వెండి తొడుగుతో అలంకరించారు.

స్వామికి నమస్కరించి, హారతి, తీర్థం పుచ్చుకుని కిందికి దిగాము. ఎదురుగ్గా చిన్న చిన్న హటళ్లున్నాయి. “బర్రి, బర్రి” అని పిలుస్తున్నారు. అంటే రమ్మని!

ఏవైనా స్నాక్స్ పడకపోతే, సాయంత్రం పూట, దత్తశర్మ బండి నడవదు! వంకాయ బోండాలు వేడి వేడిగా వేస్తున్నారు, వంకాయలను ముందు మగ్గించి, దాన్ని కోసి, ఉల్లికారం కూరి, శనగపిండిలో ముంచి వేస్తున్నారు.

చెరి రెండు తిన్నాము. అద్భుతంగా ఉన్నాయి. వీటి గురించి యూట్యూబ్‌లో ఒక సారి ఏదో పుడ్ ఛానెల్ వారు చూపించిన గుర్తు. వాళ్ల దగ్గర నిమ్మకాయ సోడా కూడా ఉంది. ‘ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండేనే ఉంద’ని మాయాబజార్‍లో శకుని మామ చెప్పినట్లు, ఈ మసాల వంకాయ బోండాలకు, ఆ నిమ్మకాయ సోడా విరుగుడు. దాంట్లో ఉప్పు, జీలకర్ర పొడి వేశారు. చాలా బాగుంది.

దివాకర్ అన్నాడు “శర్మాజీ! మీ ఫుడ్ సెన్స్ చాలా బాగుంటుంది!”. నేను నవ్వాను. “కామన్ సెన్స్‌తో బాటు అది కూడా అవసరమే కదా మిత్రమా!” అన్నాను.

మేము మంత్రాలయం చేరే సరికి ఎనిమిది కావస్తుంది. మళ్లీ స్వామి వారి దర్శనం చేసుకున్నాము. స్వామి వారి మందిరం భవనం చుట్టు పక్కల భవనాలు, ఆర్చి ఇరువైపు కళాకృతలను విద్యుద్దీపాలతో అలంకరించారు. మొత్తం దేదీప్యమానం. మందిర ముఖ ద్వారం మీద

“పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ

భజతాం కల్పవృక్షాయ, నమతాం కామధేనవే”

అన్న సంస్కృత శ్లోకాన్ని కన్నడ లిపిలో వ్రాసి ఉన్నారు. పెద్ద పెద్ద అక్షరాలతో. వాటికి లైట్లు అమర్చారు.

‘మంచాలమ్మ సన్నిధి’ అని రాసి ఉన్న మందిరానికి వెళ్లి, అమ్మను దర్శించాము.

మందిరం ముందు విశాలమైన ప్రాగంణం. అక్కడ సాలంకృతలైన మహిళలు కోలాట నృత్యం చేస్తున్నారు. మధ్యలో ఒక అందమైన పదహారేళ్ల పడుచు పెద్ద ఢక్కా మెడలో ధరించి, రెండు వైపులా లయబద్ధంగా శబ్దం చేస్తూన్నది. స్త్రీలందరూ ఆ సంప్రదాయ నృత్యంలో లీనమై, భక్తి పరవశులై ఉన్నారు. చుట్టూ గుంపుగా జనం చేరి, ఆ నృత్యాన్ని వీడియోలు తీసుకుంటున్నారు. మేమూ ఆ గుంపులో జోరబడి నృత్యాన్ని చూసి, వీడియో తీసుకున్నాం.

కొంచెం ప్రక్కగా, ఒక ఆడిటోరియం ఉంది. రాఘవేంద్ర స్వామి వారు సంగీతజ్ఞులు, సంగీత ప్రియులు. ఆడిటోరియం గోడ మీద స్వామి వారు వివిధ రూపాలతో సంగీత కచేరీ చేస్తున్న బొమ్మలు చెక్కి ఉన్నాయి.

అక్కడ సంగీత కచేరీ జరుగుతూంది. ఇద్దరు గాయకులు కన్నడలో స్వామి వారి కీర్తనలు పాడుతున్నారు మధురంగా. వారికి వయెలిన్, మృదంగం, కంజీరాల పై వాద్య సహకారం అందిస్తున్నారు. కర్నాటక సంగీతమే. తెలిసిన రాగాలే. కీర్తనల్లో సంస్కృత పదాలు ఎక్కవగా ఉన్నాయి. సులభంగానే అర్ధమయింది. అయినా, “music has no language” అని కదా అన్నారు. ఒక అరగంట, అక్కడ వేసిన కుర్చీల్లో కూర్చుని, ఆ సంగీతాంబుధిలో ఓలలాడాము.

మళ్లీ భోజనానికి బ్రాహ్మణ సత్రానికి వెళదామని దివాకర్ అంటే, వైష్ణవ స్వాముల వైఖరి వల్ల వద్దన్నాను. ఆర్చికి ప్రక్కన ఇద్దరు దంపతులు ఒక టిఫిన్ బండి పెట్టుకుని ఉన్నారు. వారి వద్ద పొగలు కక్కే ఇడ్లీలు చెరో రెండు కారందోసెలు చెరి ఒకటి తిన్నాము. సూపర్‌గా ఉన్నాయి. పక్కన ఉన్న కూల్ డ్రింక్స్ షాపులో మజ్జిగ పాకెట్లు కొనుక్కుని, తాగాము. సో. డిన్నర్ సుసంపన్నం.

రూం చేరుకుని, విశ్రమించాం. కాసేపు సాహితీ చర్చలు చేశాం.

“రేపటి కార్యక్రమం?” అని అడిగాను.

“ఇక ట్రెయిన్‌తో పని లేదు. ఎమ్మిగనూరు ఇక్కడికి ఇరవై కిలోమీటర్లు. అక్కడి నుంచి, ఆదోని మీదుగా బళ్లారికి ఎక్స్‌ప్రెస్ బస్సులుంటాయి. రోడ్డు కూడ బ్రహ్మండంగా ఉంటుందని విన్నా. బళ్లారి చేరితే అక్కడి నుంచి హోస్పేటకు నాన్ స్టాప్ బస్సులుంటాయి. గంటన్నర ప్రయాణం!” అని వివరించాడు మిత్రుడు.

“అయితే ఉదయం ఆరుకే వెళ్లిపోదాం” అన్నా నేను.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here