Site icon Sanchika

యాద్గిర్ – మంత్రాలయం – హంపీ యాత్ర-3

[ఇటీవల యాద్గిర్, మంత్రాలయం, హంపి దర్శించి ఆ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]పొ[/dropcap]ద్దున్నే ఐదుకే లేచి తయారయ్యాము.

“మనం ‘తుంగభద్ర’ స్టేషన్‌కు వెళ్లి ట్రైయిన్ ఎక్కలేమా?” అనడిగాను మిత్రుడిని.

“నిన్న మనం వచ్చిన ట్రెయిన్ బై వీక్లీ. యాద్గిర్ నుంచి డైరెక్ట్ ట్రెయినని దాన్ని ప్రిఫర్ చేశాము. ఇప్పుడు ట్రెయిన్‌లు ఏవీ లేవు. ఉన్నా అవి గుంటకల్ జంక్షన్ మీదుగా వెళతాయి. రౌండ్ అబౌట్‌గా. ఇలా అయితే కేవలం రెండున్నర గంటల్లోనే మనం బళ్లారికి చేరుకుంటాము. అక్కడి నుంచి గంటన్నర” అన్నాడు దివాకర్.

నేను కర్నూలు జిల్లా వాడినైనా, ఉద్యోగరీత్యా నలభై ఏండ్లకు పైగా ఉత్తరాంధ్రా, హైదరాబాదుల్లో ఉంటున్నాను. కాబట్టి పరిజ్ఞానం తక్కువ. “సరే నండి, అయితే!” అన్నాను.

మంత్రాలయం బస్టాండులో ఎమ్మగనూరు వెళ్లే ‘పల్లె వెలుగు’ బస్ ఎక్కాము.

“మీ ఆధార్ తీయండి. బళ్లారి వరకు ఆంధ్ర బస్సుల్లో మీకు 25 శాతం రాయితీ లభిస్తుంది చార్జీల్లో. నా ఆధార్ కూడ ఉపయోగిస్తాను” అన్నాడు. అరగంటలో ఎమ్మిగనూరు చేరాము. ఏడు గంటలకు ఆ డిపో వారికి ఎక్స్‌ప్రెస్స్ బస్ బళ్లారి వెళ్లేది, ప్లాట్‌ఫాం మీద ఆగి ఉంది. ఖాళీగానే ఉంది. ఎక్కి కూర్చున్నాము. కదిలింది.

అరగంటలో ఆదోని చేరింది. బళ్లారి బస్టాండులో నిలిచింది. అక్కడ బస్సు నిండిపోయింది. ఎనిమిదిన్నరకు ‘తుంగభద్ర విలాస్’ అనే చోట టిఫిన్ కోసం ఆపాడు. అక్కడ ఉగ్గాణి, బజ్జీ పూరీ, మాత్రమే ఉన్నాయి. నా ఓటు ఎప్పుడూ ఉగ్గాణి బజ్జీకే! ఎందుకంటే హైదరాబాదులో దాని గురించి తెలియదు. ఇంట్లో చేస్తే ఈ రుచి రాదు.

“విత్ యువర్ పర్మిషన్, నేను పూరీ తింటాను.” అని దివాకర్ అన్నాడు.

అది ఆయన సంస్కారం!

ఉగ్గాణి మీద వెల్లుల్లి కారం పొడి, పుట్నాలపొడి లైట్‌గా చల్లి ఇచ్చాడు. మిరపబజ్జీలు మెత్తగా, కారంగా, బంగారు రంగులో మెరిసిపోతున్నాయి. ఈలపాట రఘురామయ్యగారి వలె “ఔనులే, ఔనులే, ఈ సుఖమే సుఖమూ..” అని పాడుకుంటూ తినేశాను. “నచ్చిన ఆహారాన్ని లభించినప్పుడే భుజించవలయును” అని విప్రసంహిత అనే గ్రంథంలో చెప్పారు కూడా! ఏమిటి నవ్వుకుంటున్నారు? ఎలాగోలా సమర్థించుకోవాలి కదండీ!

బళ్లారి ముందు ‘హలహర్వి’ వచ్చింది.. అదే ఆంధ్రాలో చివరి ఊరు. టిఫిన్ చేయడానికి ముందు ఆలూరు వచ్చింది. మేం బళ్లారి చేరేసరికి తొమ్మిదిన్నర.

హోసపేట బస్‌లు ఎక్కడ ఉంటాయి? అని విచారిస్తే చూపించారు. ‘రాజహంస’ సర్వీస్ అని బళ్లారి హోసపెట నాన్ స్టాప్ సర్వీసు. లాంగ్ డిస్టెన్స్ బస్సుల పాతవైతే ఇలా ఉపయోగిస్తారట. అది డొక్కు బస్సు. దూరం 70 కిలోమీటర్లు అయినా, గంట ముప్పావు తీసుకున్నాడు. నో సినియర్ సిటిజన్ రాయితీ. కాని మహిళలకు మాత్రం ఉచితం! రోడ్డు కూడ బాగోలేదు. ఫ్లైఓవర్లు నిర్మాణంలో ఉన్నాయి. అన్నీ టేక్ డైవర్షన్ లే!

మొత్తానికి హోసపేటకు పన్నెండులోపు చేరాం. లాంగ్ వీకెండ్. రంజాన్, గాంధీ జయంతి రెండు సెలవులు కలిశాయి. హంపీ చూడటానికి యాత్రీకులు తామరతంపరగా దిగబడ్డారట. ఒక ఆటో వాడిని పిలిచి రూం ఏదైనా చూపించమన్నాము. బళ్లారి, హోసపేట ప్రాంతాలలో అందరికీ తెలుగు వచ్చు. కాని అది కొంచెం ‘కన్నడ యాస’తో ఉంటుంది. అతనిలా చెప్పాడు.

“సార్, మెయిన్ రోడ్ మీద లాడ్జీలన్నీ ఫుల్. హంపీలోని రిసార్టులు, త్రీస్టార్ హోటళ్లన్నీ ముందుగానే బుక్ చేసుకున్నారు. కొంచెం లోపలికి ఒక పాత లాడ్జి ఉంది. దాంట్లో దొరకొచ్చు. కాని అంత బాగుండదు.”

దారిలో ప్రతి లాడ్జి ముందు ‘రూమ్స్ ఫుల్’ అని బోర్డు పెట్టుకున్నారు. ఒక హోటల్ ‘హంపీ రెసిడెన్సీ’ అని కనబడింది. కొంచెం పాష్‌గా ఉంది. ఫుల్ బోర్డు లేదు! వెళ్లి అడిగితే ఒకే రూం ఉందనీ. రెంట్ రోజుకు ఆరు వేల ఐదువందలు + జి.యస్.టి అని చెప్పాడు!

అంత డబ్బు పెట్టడం మా తరం వారికి నచ్చదు!

“సరే, పద అబ్బాయ్. ఆ లోపలికి ఉన్న, పాత లాడ్జీకే వెళదాం” అన్నాం.

మెయిన్ రోడ్‌కు ఒక 750 మీటర్ల దూరంలోనే ఉంది. దాని పేరు ‘హోయసల నివాస్’. కౌంటరులో ఒక ముసలాయన (మేం కానట్లు) కూర్చుని ఉన్నాడు. రూం ఉందన్నాడు. పదిహేను వందలు. నాన్ ఎ.సి.

‘సమ్‌థింగ్ ఈజ్ బెటర్ దేన్ నథింగ్’ అన్న సూత్రం ప్రకారం సరే అన్నాం. రూఫ్‌కు చెక్క బీమ్స్. బాత్ రూంలో గీజర్ లేదు. ఉదయం 20 రూపాయలు ఇస్తే ప్లాస్టిక్ బిందెతో వేడినీళ్లు ఇస్తారట. రూం శుభ్రంగానే ఉంది. కింద పాలిష్‌డ్ నాపరాళ్లు పరిచారు. పైన తిరుగుతున్న ఫాన్ హోయసల సామ్రాజ్యం నాటిదేమో! గటగట శబ్దం చేస్తుంది. ప్లస్ పాయింట్ ఏమిటంటే చాలా పెద్ద కిటికీ ఉంది. బయట మొక్కలు, పెద్ద బూరుగు చెట్టు ఉన్నాయి. ధారాళంగా గాలి వెలుతురు వస్తున్నాయి.

రెండు రోజుల రెంట్ కట్టేశాం. “గూగుల్ లేదా ఫోన్ పే ఉందా?” అనడిగితే “క్యాష్ మాత్ర!” అన్నాడు. ఈ మధ్య అంత డబ్బు దగ్గరుంచుకోవడం లేదు కదా! కొంత దూరంలో కర్నాటక బ్యాంక్ ఎ.టి.ఎం ఉంది. వెళ్లి, డ్రా చేసి ఇచ్చాము.

ఆటో అతను వెళ్లిపోలేదు. రూం చూపినందుకు ఏదైనా ఆశిస్తున్నాడేమోనని, ఒక వంద రూపాయలివ్వబోతే, నవ్వి వద్దన్నాడు. అతని పేరు ‘పుట్టణ్ణ’ట. ఇలా చెప్పాడు.

“సార్, మీరు టి.బి. డ్యామ్‌కు, హంపీకి వెళతారు కదా! నేనే తీసుకు వెళతాను. నా నంబరు తీసుకోండి” అన్నాడు. అతని నంబరు ఫీడ్ చేసుకున్నాము.

“సార్ మరి మీ భోజనం?” అని అడిగాడు. అతని కన్‌సర్న్ మమ్మల్ని కదిలించింది. మంచివాడిలా ఉన్నాడే! అనుకున్నాం.

“మీరు ఫ్రెష్ అవండి! నేను అరగంటలో వస్తా. మిమ్మల్ను లంచ్‌కు తీసుకువెళతా. మీకు ఆటో కావాలంటే మెయిన్ రోడ్ వరకు నడవాలి” అని వెళ్లిపోయాడు. మేం స్నానం చేసి డ్రస్ చేసుకున్నాము.

‘బసవేశ్వర భవన్, లింగాయత ఖానావళి, శుద్ధ సస్యాహారి’ అని కన్నడలో రాసి ఉన్న హోటల్ ముందు ఆపాడు. “ఇక్కడ తిండి శానా బాగుంటాది సార్” అన్నాడు.

“నేను వెయిట్ చేస్తాను. మీరు తిని రండి.”

“నీవూ తిందువుగాని రా!” అంటే తాను ఇంటికి వెళ్లి తింటానన్నాడు.

భోజనం బాగుంది. క్యాబేజీ, క్యారెట్, ఉల్లిల తురుమును పెరుగులో కలిపిన సలాడ్. పెసల గుగ్గిళ్ల మసాలా, పల్చని రసం, ముందుగా ఒక మృదువైన పెద్ద జొన్నరొట్టె. కర్రీస్ సెట్ టేబుల్ మీదే ఉంచారు. కావలసినన్ని వేసుకోవచ్చు. తర్వాత ఒక మీడియం సైజు స్టీలు కప్పుతో అన్నం ఇచ్చి వెళ్లారు. పెరుగు ఇవ్వలేదు! అన్న పరిమాణం మా లాంటి డయాబెటిక్స్‌కి ఐడియల్. చివర్లో ఒక స్టీలు గ్లాసులో మజ్జిగ ఇచ్చారు. దానిలో నిమ్మకాయ పిండి పచ్చి మర్చి, అల్లం కొత్తిమీర ముక్కలు కలిపారు. అద్భుతంగా ఉంది. అడిగి ఇంకో గ్లాసు తాగాము. భోజనం చాలా లైట్‌గా, హాయిగా ఉంది.

పుట్టణ్ణ మమ్మల్ని హోటల్ దగ్గర దింపి. వెళ్లిపోతూ, “సార్. మీరు నాలుగురన్న వరకు రెస్ట్ తీసుకోండి. తుంగభద్ర డ్యామ్ సైట్ సాయంత్రం చీకటి పడిన తర్వాతే చూడాలి. డ్యామ్ పొడువునా లైట్లు వేస్తారు. క్రింద పెద్ద పార్కు ఉంది. 7 గంటల నుండి 7.30 వరకు మ్యూజికల్ ఫౌంటెన్ విత్ కలర్‌ఫుల్ లైట్స్ ఉంటుంది. ఎనిమిదికి అన్నీ క్లోజ్ చేస్తారు. రేపు ఉదయం బయలుదేరి హంపీకి వెళదాం. సాయంత్రానికి తిరిగి రావచ్చు.”

“బాగుంది సరే. ఇంతకూ నీకెంత ఇవ్వాలి. మొత్తానికి?”

“మీ దయ సార్. నా ప్రాప్తము. మీరే చూసి యివ్వండి.”

అతను వెళ్లిం తర్వాత లాడ్జి పెద్దాయననడిగాం. ఆటోకు ఎంత తీసుకుంటారని.

“టి.బి.డ్యామ్ పొయ్యేకి వచ్చేకి నాలుగు నూర్లు. హింపీ చూపించేకి రెండు వెయ్యిలు. మిమ్మల్ని తిండికి కూడా తీసుకుపోతుండాడు. అంతా కలిపి రెండు వేల ఐదు నూర్లు ఇవ్వవచ్చును. దీనికి జాస్తిగనే అడుగుతారు గాని. తగ్గేది ఉండదు.”

మాకు ఒక క్లారిటీ వచ్చింది. వెళ్లి, లుంగీలు కట్టుకొని, హాయిగా పడుకున్నాం.

నాలుగుకు లేచి తయారయ్యాము. నాలుగున్నరకి పుట్టణ్ణ ఫోన్. వచ్చేశానని. దారిలో షుగర్ లెస్ ఇలాచీ టీ తాగించమన్నాం. ‘నందిని హెరిటేజ్ రెస్టారెంట్’ అన్న చోటికి తీసుకువెళ్లాడు. అక్కడ ‘కూర్గ్ స్పెషల్ ఫిల్టర్ కాఫీ’ అన్న బోర్డు చూసి మనసు మార్చుకున్నాం. స్నాక్స్ ఏమయినా ఉన్నాయా అని అడిగిచే ఆనియన్ పాలక్ పకోడి ఉందనీ. వేడి వేడిగా ఇస్తామని, ప్లేటు నలభై రూపాయలనీ చెప్పాడు వెయిటర్.

నందిని హెరిటేజ్ రెస్టారెంట్‌లో కాఫీ

తెమ్మన్నాము. కరకరలాడుతూ బాగుంది. ఒక ప్లేట్ చాలన్నాం. దాని మీద లైట్‌గా ఛాట్ మసాలా చల్లారు. కాఫీ అయితే సూపర్. అడయార్ ఆనందభవన్, కుంబకోణం కాఫీ, కంటే బాగుంది. పుట్టణ్ణ టీ మాత్రం తాగాడు.

హోసపేట నించి తుంగభద్ర డ్యామ్ 15 కిలోమీటర్ల లోపు ఉంది. మేం అక్కడికి చేరేసరికి, ఐదున్నర. ఎదురుగా ముఖద్వారం పైన అందమైన ఆర్ట్. దాని మీద ‘తుంగభద్ర జలాశయ. స్వాగత’ అని కన్నడలో, “welcome to Tungabhadra Dam” అని ఇంగ్లీషులో వ్రాసి ఉంది.

ఒక వంద మీటర్లు నడిచాము. అక్కడ ఒక కౌంటర్ ఉంది. అక్కడి నుండి డ్యామ్ సైట్ రెండు కిలోమీటర్లు ఉంటుందట. ప్రభుత్వం వారి మినీ బస్సులున్నాయి. రానుపోను 40 రూపాయలు టికెట్. బస్సుల కోసం పెద్ద క్యూలైనే ఉంది. ఇరవై నిమిషాల నిరీక్షణ తర్వాత మాకు బస్‍లో ప్రవేశం లభించింది. అప్పుడే కను చీకటి పుడుతూంది. బస్సు కొండల మధ్య అడవిలో ప్రయాణించింది. చుట్టూ ఎత్తయిన వృక్షాలు. గోడల మీద కన్నడ భాషలో రకరకాల సూక్తులు పెయింట్‌తో రాసి ఉన్నాయి. మచ్చుకు కొన్ని.

“అసంతృప్తితో కూడిన సంపద కంటే సంతృప్తితో కూడిన పేదరికమే మేలు.”

“విద్వత్తు వేరు, సంస్కారం వేరు.”

“నడుస్తూ ఉంటేనే దారి తెలుస్తుంది.”

“ఆత్మజ్ఞానం పెరిగే కొద్దీ అహంకారం నశిస్తూ ఉంటుంది.”

‘మీకు కన్నడ రాదు కదా, ఎలా అనువదించగలిగారు?’ అనుకుంటున్నారా కామ్రేడ్స్? కన్నడ లిపి తెలుగు లిపికి దగ్గరగా ఉంటుంది. చాలా దగ్గరగా. మన దేశ భాషలన్నింటిలో సంస్కృత పదాలుంటాయి. అలా అన్నమాట!

పది నిమిషాల్లో, డ్యామ్ సైట్ చేరాము. ఎడమవైపు పెద్ద గట్టు. దాని మీద సిమెంటుతో భారతదేశం పటం, భారత్ ఇండియా అన్న అక్షరాలు carve చేసి, వాటికి త్రివర్ణ పతాక లోని రంగులు వేశారు. ఎదురుగా ఒక పెద్ద డోమ్ లాంటి నిర్మాణం, దాని కిరువైపుల కళాత్మకమైన స్తంభాలు, కనబడ్డాయి. సంధ్యా సమయం చీకటి చిక్కబడలేదు. డ్యామ్ దగ్గరికి నడిచాము. క్లుప్తంగా దానిని టి.బి. డ్యామ్ అంటారు.

కొద్ది దూరానికే తుంగభద్ర జలాలు ఆనకట్టను బలంగా తాకి, అలలు అలలుగా వెనుదిరుగుతున్న హోరు శబ్దం వినబడుతూంది. ఇంతలో డ్యామ్ సైటంతా విద్యుత్ దీపాలు వెలిగాయి! ఆనకట్ట మీదికి సందర్శకులకు అనుమతించరు. చాలా కాలం క్రిందట మేం నాగార్జన సాగర్ డ్యామ్‌కు వెళ్లినప్పుడు అనుమతించినట్లు గుర్తు. డ్యామ్ పొడుగునా దీపాల తోరణం! డ్యామ్ మీద ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్ల వెలుగు జలాల మీద పరుచుకుని, చాలా మేర స్పష్టంగా కనబడుతుంది. జలాల నానుకొని రెయిలింగ్, గ్రిల్స్ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచే అన్నీ చూడాలి.

తుగంభద్రామాత, తనను ప్రవహించనీయకుండా బంధించారని, కోపంతో ఘూర్ణిల్లుతోంది. ఆనకట్టను విసురుగా తన అలలతో తాడిస్తోంది. ఇంచుమించు సముద్ర తీరంలోని కొండ రాళ్ల వద్ద సాగరం ఎలా విరుచుకు పడి, నురగలు కక్కుతూ, వెనుదిరిగిపోతుందో, అలా ఉందా దృశ్యం. సాగరునికి భగవంతుడు స్వీయ క్రమశిక్షణ నేర్పాడు. అందుకే ఆయన చెలియలిక్ట దాటడు (సునామీలప్పుడు తప్ప)! కాని నదులు నిత్య ప్రవాహశీలములు. మానవుడు తన పొలాల సాగు కోసం, విద్యుత్ కోసం వాటిని ఆనకట్టులతో బంధిస్తాడు. కాని, ప్రవాహ ఉదృతి ఉన్నప్పుడు మాత్రం ఆనకట్ట స్లూయిస్ గేట్లు తెరవాల్సిందే. లేకపోతే ఆనకట్టను విచ్ఛిన్నం చేసి వెళ్లగలిగే శక్తి నదీజలాలకుంది!

అక్కడ నుంచి కదలాలి అనిపించడమే లేదసలు. కనుచూపు మేర తుంగభద్రాదేవి అపార జలరాశిగా పరుచుకొని ఉంది. డ్యామ్ దగ్గరే ఆమె హడావుడి! తర్వాతంతా ప్రశాంతం! మా నాన్నగారు ఇలాంటి చోట్లను ‘జలభూతం’ అనేవారు. పంచభూతాల్లో ఒకటి కదా నీరు!

డ్యామ్ అటు వైపుకు వెళ్లాం. అక్కడ చుక్క నీరు లేదు. ఒక పవర్ హైస్ ఉంది. గేట్లు తెరిచినప్పుడు నీరు మహోగ్రవేగంతో క్రిందకి దుమికి, దుమికిన చోట ఫేన(నురగ) పుంజమలు సృష్టిస్తుంది. కానీ మాకా అద్భుత దృశ్యం చూసే అదృష్టం లేదు. ఆ సీజన్ దాటింతర్వాత వచ్చాము.

కొంచెం ఇవతలగా, పార్కు లాంటి ప్రదేశంలో, ఒక బస్ట్ సైజ్ విగ్రహం ఉంది. వెళ్లి చూశాము. క్రింద ఆయనను గురించి వ్రాసి ఉంది. ఆయన శ్రీ ఎమ్.ఎస్.తిరుమలై అయ్యంగార్. ఆయన తుంగభద్ర ప్రాజెక్ట్ నిర్మాణ పర్యవేక్షకులుగా ఉండేవారు. ఎక్జిక్యూటివ్ ఇంజనీరుగా (1940-42), లోలెవెల్ కెనాల్ నిర్మాణంలో చీఫ్ ఇంజనీర్‌గా (1949 – 52) ఈ మహోన్నత ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసినందుకు, ఆయకట్ట రైతులంతా, ఆయనకు కృతజ్ఞలుగా ఉంటారని విగ్రహం క్రింద అలా ఫలకం మీద వ్రాసి ఉంది. నిజంగా ఆయన ప్రాతఃస్మరణీయుడే!

శ్రీ ఎమ్.ఎస్.తిరుమలై అయ్యంగార్

తుంగభద్ర జలాశయాన్ని ‘పంపా సాగర్’ అని కూడా అంటారు. ఇది బహుళార్థ సాధక(multipurpose) ప్రాజెక్టు. దీని వల్ల వ్యవసాయం, విద్యుత్, వరదల నివారణ వంటి లాభాలున్నాయి. సిమెంటు ఉపయోగించకుండా మన దేశంలో కట్టబడిన డ్యామ్ లు రెండు. ఒకటి ఇది. రెండవది కేరళలోని ముళ్ల పెరియార్ డ్యామ్. సున్నపురాయి, మట్టిల మిశ్రమం (surki mortar). దీని నిర్మాణం 1949లో మొదలై, 1953లో ముగిసింది. అప్పట్లో దీనికి 1,066,342 డాలర్లు ఖర్చు అయిందంటారు. ‘తుంగభద్ర బోర్డు’ ఆధ్వర్యంలో దీని నిర్వహణ అంతా జరుగుతూంది. దీని స్పిల్ వే పొడువు 701 మీటర్లు. ఎత్తు పునాది లోతుల నుంచి 162 అడుగులు. పొడవు 8035 అడుగులు అంటే 2450 మీటర్లు. స్పిల్ వే కెపాసిటీ 650000 క్యూసెక్కులు. దీని పూర్తి సామర్థ్యం 3.73క్యూబిక్ కిలోమీటర్ల. రిజర్వాయరు విస్తీర్ణం 140 చదరపు మైళ్లు. క్యాచ్‌మెంట్ ఏరియా 10880 చదరపు మైళ్లు.

పవర్ స్టేషన్ ఇన్‌స్టాల్డ్ సామర్థ్యం 127 మెగా వాట్లు. టర్బైన్లు డ్యామ్ క్రింది భాగాన ఉంటాయి.

హైదరాబాదు (నిజాం రాజ్యం) ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీలు సంయుక్తంగా దీనిని చేపట్టాయి. 1950లో ఇండియా రిపబ్లిక్‌గా అవతరించినప్పుడు మైసూర్ స్టేట్ మరియు ఆంధ్ర స్టేట్‌ల ఉమ్మడి పర్యవేక్షణలోకి వచ్చింది. 70 ఏళ్లుగా చెక్కు చెదరకుండా నిలిచి, ఉందీ సేతురాజం.

మద్రాసు పి.డబ్ల్యూ.డి.కి చెందిన శ్రీ వేపా కృష్ణమూర్తి గారు దీని నిర్మాణంలో ప్రముఖపాత్ర వహించారు. డ్యామ్ కాంట్రాక్టరు శ్రీ మురుమళ్ల వెంకటరెడ్డిగారు. మహబూబ్‌నగర్ జిల్లా కోనూరు ఆయన స్వస్థలం.

1860 లోనే సర్ అర్ధర్ కాటన్ దీనికి రూపకల్పన చేశాడు. ఎన్. పరమేశ్వర పిళ్లై గారు 1933లో దీనిని రివైజ్ చేశారు. బళ్లారి జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ ఎల్. వెంకటకృష్ణ అయ్యర్, F. M. Dowley చీఫ్ ఇంజనీర్, ఎన్నో ప్రత్యామ్నాయ నిర్మాణ విధానాలను సూచించారు. వాటిని సమీక్షించి, నిర్మాణము చేపట్టిన వారు మనం మొదట చెప్పుకున్న శ్రీ. ఎమ్. ఎస్ తిరుమలై అయ్యంగారు.

నిర్మాణ ప్రక్రియల్లో ఇంజనీర్ల మధ్య విభేదాలు వచ్చాయి. అప్పటి మైసూరు రాజ్య ప్రధాని శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి అధ్యక్షతన, ఒక అత్యున్నత విధాయక మండలి, ఆ విభేదాలను పరిష్కరించి, తుది ప్రక్రియను సూచించింది. విశ్వేశ్వరయ్య గారు కృష్ణరాజసాగర్ డ్యామ్ నిర్మాత.

అలా అంతమంది, నిస్వార్థ, వృత్తికి అంకితమైన మేధావుల శ్రమ ఫలితంగా తుంగభద్ర డ్యామ్ ఏర్పాటయింది. 7 గంటలకు డ్యామ్ సైట్ మూసేస్తారు. 6.30 నిమిషాలకు తిరిగి బస్ ఎక్కాము. బస్ మమ్మల్ని క్రింద ఉన్న పార్క్ వద్ద దింపింది. పార్క్ ముఖద్వారం లైట్ల వెలుగులో కాంతులీనుతూంది. పార్కులో పెద్ద్ అక్వేరియం ఉంది. జలాశయంలో దొరికే చేపల రకాలన్నీ అక్కడ ఉన్నాయి. లాన్స్‌ను అందంగా తీర్చిదిద్దారు.

ఏడున్నరకు మ్యూజికల్ ఫౌంటెన్ చేరుకున్నాము. రంగు రంగుల దీపాలు కలిసిన నీరు రకరకాలుగా పైకి విరజిమ్ముతూంది. జలయంత్రం నయనమనోహరంగా ఉంది. పది నిమిషాలు దాని విన్యాసాలు చూసి ఆనందించాం. దాని నృత్యానికి నేపథ్యంగా, ఇంకే పాటా దొరకనట్లు, మన తెలుగు మాస్ పాట “ఆ.. అంటే అమలాపురం – ఇ – అంటే ఇచ్ఛాపురం” పెద్ద సౌండ్‌తో ప్లే చేస్తున్నారు. ఆ పాటకు ఫౌంటెన్ చేసే డాన్స్‌కు పొంతన కుదరలేదు.

బృందావన్ గార్డెన్స్ లోని మ్యూజికల్ ఫౌంటెన్ అంత పెద్దది కాదిది. నేను సింగపూర్‌లో ఒకటి చూశాను. అది చాలా పెద్దది!

పార్కులో ఒక వైపు పెద్ద కృత్రిమ సరస్సు ఏర్పాటు చేశారు. ఫ్లడ్ లైట్ల వెలుగులో నీళ్లు ముదురు నీలం రంగులో మెరుస్తున్నాయి. అక్కడ బోటింగ్ సౌకర్యం ఉంది. సెల్ఫ్ ప్రొపెల్లింగ్ లేదా పెడలింగ్ విధానంలో అందమైన బుజ్జి బోట్లలో తల్లిదండ్రులు తమ పిల్లలను విహరింప చేస్తున్నారు. ఇంకా హర్రర్ కేవ్, యానిమల్ కింగ్‌డమ్, స్కేటింగ్ గ్రౌండ్ లాంటి ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. అవన్నీ పిల్లల కోసమే! మేం వాటి జోలికి వెళ్లలేదు. ఎనిమిదిన్నరకు క్లోజింగ్ సైరన్ మ్రోగింది!

ఠంచన్‌గా వచ్చేశాడు మా పుట్టణ్ణ. “అన్నీ చూశారా సార్?” అని ఆదరంగా విచారించాడు. నోరంతా తెరిచి నవ్వుతుంటాడు నిరంతరం. నిత్య సుస్మితుడు! వెనక్కు బయలుదేరాం. అతని కుటుంబం గురించి అడిగాం. ఒక్కడే కొడుకట. వాడి పేరు రాజ్ కుమార్. తొమ్మిదవ తరగతి చదువుతున్నాడట.

“నాను కన్నడ కంఠీరవ డా. రాజ్ కుమార్ సారుకు జాస్తి అభిమాని సార్. అందుకే మా వాడికి ఆయన పేరు పెట్టుకున్నా” అన్నాడు. తల్లీ తండ్రీ అతని దగ్గరే ఉంటారట. తండ్రే ఇల్లు కట్టించాడట.

“ఆయన ఏం చేసేవారు?”

“హోసపేటలోనే ఒక చేనేత మిల్లులో పని చేసేవాడు సార్. మిల్లు వారు ఇంటి స్థలం ఇచ్చారు. కష్టపడి ఇల్లు కట్టినాడు మా అప్ప. అప్పుడు నాను శానా చిన్న వయసు.”

“ఒక చెల్లెలు. ఆయమ్మను గదగ్ కిచ్చినాము. మా అమ్మ తమ్మునికే. మా మామకు గదగ్‍లో సెల్ ఫోన్ రిపేరు షాపుంది.”

మా గురించి అడిగితే చెప్పాము. మమ్మల్ని ‘షిరిడీ సాయి టిఫిన్ సెంటర్’కు తీసుకువెళ్లాడు పుట్టణ్ణ. వెళ్లిపోమ్మటే వినలేదు.

“మీరు పలారం చేసినంక, రూం దగ్గర దింపిపోతాను సార్” అంటాడు.

విపరీతమైన రద్దీగా ఉందక్కడ! సమస్తమైన టిఫిన్స్ ఉన్నాయి. సెల్ఫ్ సర్వీస్. అతన్ని తినమంటే వద్దన్నాడు.

సింగిల్ వడ, సాంబారు, ఉతప్పం లకు టోకెన్లు తీసుకున్నాము. వడలు సాంబారులో నాన వేశారు. అవి ఉబ్బి, అద్భుతంగా ఉన్నాయి. ఒక గిన్నెనిండా సాంబారు వడతో వేసి, కొబ్బరి చెట్నీ కూడ వేసి స్పూన్ వేసిచ్చాడు. అమృతోపమానంగా ఉంది!

తర్వాత ఆనియన్ ఉతప్పం తెచ్చుకున్నాం. చాలా దోరగా కాల్చాడు. పొట్టలు నిండిపోయాయి.

తొమ్మదిన్నరకు రూం చేరుకున్నాం.

“సార్ రేపు ఉదయం ఏడున్నరకల్లా వస్తాను. సిద్ధంగా ఉండండి.” అన్నాడు వెళ్లేముందు.

“సరే అబ్బాయ్! హంపీ ఎంత దూరం?”

“పదిహేను కిలోమీటర్లు ఉంటుంది సార్. దారిలో మీకు మంచి ఉగ్గాణి బజ్జీ తినిపిస్తాను.”

నాకు మహదానందమయింది!

(ఇంకా ఉంది)

Exit mobile version