[ఇటీవల యాద్గిర్, మంత్రాలయం, హంపి దర్శించి ఆ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]
[dropcap]ఉ[/dropcap]దయం సరిగ్గా ఏడున్నరకు రెడీ అయ్యాము.
పుట్టణ్ణ వచ్చేశాడు. ముందు అర్జంటుగా షుగర్ లెస్ కాఫీ కావాలన్నాము. ‘శ్యాన్ బాగ్ కేఫ్’లో బాగుంటుందని తీసుకువెళ్లాడు.
హంపీ వెళ్లే దారి మనోహరంగా ఉంది.
దూరంగా పచ్చని కొండలు, అక్కడక్కడ బండరాళ్లు, పెద్దవి ఒక దాని మీద ఒకటి, ఎవరో జాగ్రత్తగా పెట్టినట్లున్నాయి. ర్యాండమ్‌గా ఏర్పడినా, వాటిని పరిశీలనగా చూస్తే, కొన్ని ఆకృతులు గోచరిస్తాయి.
రోడ్డుకిరువైపులా మొక్కజొన్న, పత్తి పొలాలు, అరటి తోటలు! ఆ అరటి తోటలు తీర్చిదిద్దిన వరుసలలో, దూరంగా, ఒక పెయింటింగ్‌లా ఉన్నాయి. ప్రకృతి క్యాన్వాస్ మీద పంటల చిత్రాలు. ఆ అరటి తోటలు చూసి, నాకు ఆంజనేయ స్వామి వారు అరటి తోటలలో నివాసముంటారన్న శ్లోకం గుర్తుకు వచ్చింది. దాన్ని ఘంటసాల వారు ‘పాండవ వనవాసము’ సినిమాలో ఉచ్చశృతిలో పాడారు. ఎన్.టి.ఆర్ దానిని అభినయించారు.
“నమో రమ్య రంభావనీ నిత్యవాసం
నమో బాలభాను ప్రభాచారుహాసం
… … …. … … … …. .. .. ….
నమో, సంతతం, రామభూపాలదాసం!”
సంస్కృతంలో ‘రంభ’ అంటే అరటి చెట్టు. స్త్రీలను ‘రంభోరు’ అని కవులు వర్ణిస్తుంటారు.
“ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూచి, రం
భోరుని జోరు దేశముననుండగ బిల్చిన ఇద్దురాత్ము..”
అని సుయోధనుని మీదికి గద ఎత్తుకుని వెళతాడు యన్.టి.ఆర్. సదరు సుయోధన పాత్రధారి యస్.వి.ఆర్ ‘కేర్‌లెస్’గా నవ్వుతూ ఉంచాడు. ఆ నటన వారికే సాధ్యం.
అంత కోపంలోనూ, కృష్ణ (అంటే ద్రౌపది)ను, రంభోరు (అంటే అరటి బోదెల వంటి తోడలు కలిగిన దానిని) అని అనవచ్చా? అని నా డౌటనుమానం. దానికి మా గురువుగారు శ్రీ తాటిచర్ల కృష్ణశర్మగారు ఇలా చెప్పారు.
“ఒరేయ్, రంధ్రాన్వేషి! [దీనికి సరైన తెలుగు ‘దేంట్లోనైనా సరే బొక్కలు (లోటుపాట్లు) వెతికేవాడు!’] సాహిత్యంలో స్త్రీ వాచకములని ఉన్నాయి. కృశోదరి, సమున్నతకుచ, ఘన జఘన, ఇలా! వాటికి వ్యుత్పత్తి అర్థాలు తీయకూడదు రా వెధవా! అవన్నీ స్త్రీలకు సమానార్థకాలుగానే చూడాలి. ఛందస్సు కోసం ఆ ప్రయోగాలు అనివార్యమయితాయి.”
నాకు బుద్ధొచ్చింది!
ఐదారు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత ‘బనహళ్లి’ అన్న ఊర్లో, ఒక పాక హోటల్ దగ్గర ఆపాడు. ఆ హోటల్‌కు బోర్డు లేదు. కాని చాలా మంది అక్కడ టీఫిన్ చేస్తున్నారు. ఉగ్గాణి బజ్జి అక్కడ చాలా ఫేమస్ అని చేప్పాడు మా పుట్టణ్ణ. ‘ఈ ఉగ్గాణి బజ్జి గోలేమిట్రా బాబూ!’ అనుకుంటున్నారా? ‘కాకి టిపిన్ కాకికి ముద్దు!’. టిఫిన్ అద్భుతంగా ఉంది.
తొమ్మిది కల్లా హంపీ క్షేత్రంలో ప్రవేశించాము. హంపీ కొన్ని వందల చదరపు కిలోమీటర్లలో వ్యాపించి ఉంది. ఒకప్పుడు మహోజ్వలంగా విలసిల్లిన విజయనగర సామ్రాజ్య రాజధాని. చాలా మటుకు భూగర్భంలో కలిసిపోయినా, ఎన్నో దేవాలయాలు, మంటపాలు, కట్టడాలు, శిలాకృతులు ఇంకా ఉన్నాయి. అవి శిధిలాలుగా మారినా, వారి grandeur (శిల్పవైభవం) ఇంకా సజీవంగానే ఉంది.
లాంగ్ వీకెండ్ వల్ల వేలల్లో టూరిస్టులు హంపీ సందర్శన కోసం విచ్చేశారు. కాని క్షేత్రవైశాల్యం చాలా పెద్దది కాబట్టి, అంత కిటకిటగా అనిపించదు. కొందరు యువకులు సైకిళ్ల మీద తిరుగుతున్నారు. కొందరు బైక్‌ల మీద!
పుట్టణ్ణ చెప్పాడు “హంపీ అంతా కాలినడకన కవర్ చేయలేం సార్. సైకిళ్లు, బైకులు ఇక్కడ అద్దెకిస్తారు. పిల్లోండ్లు అవి తీసుకుని తిరుగుతారు. మా చిన్నప్పుడు బండి కట్టుకొని వచ్చి అంతా కాలినడకన తిరిగేవాండ్లము. ‘హంపీకి పోయి వచ్చే సరికి కొంపలు దుమ్ము పట్టి ఉంటాయి’ అనేవారు సామతి!” (సామెత).
కర్నాటక ప్రభుత్వం ‘హంపీ ప్రాధికార సమితి’ అన్న బోర్డును ఏర్పాటు చేసింది. అదే హంపీ పర్యాటకాన్ని పర్యవేక్షిస్తుంది. దాని అధికారి ఐ.ఎ.ఎస్ క్యాడర్ అయి ఉంటాడు. ఒక రాజకీయనాయకుడు, సరే, ఛైర్మన్.
క్షేత్రమంతటా, చక్కని రోడ్లు, విశాలమైన కార్, ఆటో పార్కింగ్‌లు, రెస్టారెంట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద లాడ్జీలు, రెసిడెన్సీలు! అక్కడక్కడ ‘ఆంధ్ర భోజనం’ అని కనబడింది. ఇంకేం?
మొదట ఒక రాతి ఫ్రేమ్‌లో నెలకొల్పిన పెద్ద వినాయకుడి దర్శించాము. ఆయన విగ్రహం ఏకశిలానిర్మితం (monolithic). ఆయనను ‘శశివేకళు గణేశ’ అంటారు. విగ్రహం ఆరుబయట ఉంది. 2.5 మీటర్లు ఎత్తు ఉంది (8 ft). స్వామి చతుర్భుజుడు. స్వామి పొట్ట చుట్టూ, ఒక పెనుబామును కట్టుకున్న విధానం కూడా స్పష్టం. అక్కడి శాసనం వల్ల ఆ విగ్రహం 15వ శతాబ్దం నాటిదని తెలిసింది.
గణపతి తొండం కొంత విరిగిపోయి ఉంది. విగ్రహం ఒక పెద్ద మండపంలో నిలిచి ఉంది.
తర్వాత కూడ మా మజిలీ వినాయక విగ్రహమే. ఆయన పేరు ‘కడలేకళు గణేశ’. ఆయన ఉన్న చోట చుట్టూ అందమైన ఎన్నో స్తంబాలతో కూడిన విశాలమంటపం ఉంది. ఇదీ ఏకశిలా చెక్కడమే. విగ్రహం 15 అడుగుల ఎత్తుంది. స్వామి బొజ్జ చాలా పెద్దది. అది శనగపప్పు (Bengal gram) ఆకృతిలో ఉంది. కన్నడలో ‘కడలేకళు’ అంటే శనగపప్పు అని అర్థం.
ఈ వినాయక మంటపం చాలా ఎత్తున ఉంది. క్రింద పురాతన స్తంభాలు, అరుగులతో కూడిన కట్టడాలున్నాయి. అక్కడి నుంచి ‘వ్యూ’ చాలా బాగుంది. మొత్తం వీడియో తీసుకున్నాం.
దూరంగా, సమున్నతమైన, విరూపాక్షాలయ గాలిగోపురం దర్శన మిచ్చింది. అక్కడికి వెళ్లాము.
హంపీక్షేత్ర దర్శనం, విఘ్నేశ్వరునితో ప్రారంభమైంది. భజ విఘ్ననాథమ్!
హంపీలోని పురాతన కట్టడాలన్నీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించబడినవే. విరూపము అంటే విశేషరూపము. అంటే మూడవ కన్నుగలది. ఈ బృహత్తర నిర్మాణాన్ని రెండవ దేవరాయల (ఫ్రౌఢ దేవరాయలు) కాలంలో, విజయనగర సామ్రాజ్య సేనాలలో (chieftan) ఒకరైన లక్కం దండేశనాయకునిచే నిర్మించబడిందని ఐతిహ్యం. విరూపాక్ష ప్రభువును ‘పంపాపతి’ అని కూడ పిలుస్తారు. ఇది 14వ శతాబ్ద నిర్మాణం. అన్ని కట్టడాల్లో, చెక్కుచెదరకుండా నిలిచి ఉందీ శివధామం. దీని చరిత్ర 7వ శతాబ్దం నుండి కనబడుతుంది. చాళుక్య, హోయసల రాజుల కాలంలో దీన్ని తీర్చిదిద్దారు. కాని విజయనగర రాజుల కాలంలోనే దీనికి సంపూర్ణ వైభవం కల్పించబడింది.
దేవాలయ పై కప్పు పైన అద్భుతమన పెయింటింగ్స్ ఉన్నాయి. 1565లో దేవాలయం పాక్షికంగా ధ్వంసమైంది. కాని 19వ శతాబ్ది ప్రారంభంలో మళ్లీ పునరుద్ధరణ భారీ ఎత్తున జరిగింది. ఉత్తర, తూర్ప గోపురాలను పునర్నించారు.
గర్భగుడి, ప్రక్కన మూడు విశాల మంటపాలు, (ante-chambers) కళాత్మక స్తంభాలతో కూడిన పెద్దశాల, మరో బహిరంగ స్తంభశాల గోచరమవుతాయి. వాటి శిల్పచాతుర్యం మనలను కళ్లు తిప్పుకోనివ్వదు. రాజగోపురం అంబరాన్ని చుంబిస్తున్నట్లుగా ఉంటుంది. తూర్పు ద్వార మార్గంలో 9 అంతస్తులుంటాయి. అన్నింటి కంటె పెద్దది 50 మీటర్లు ఎత్తు కలిగి ఉంటుంది.
లోపల చాలా ఉపాలయాలున్నాయి. గర్భగుడిలోని మహాదేవుని దర్శించుకున్నాము. భక్తితో నా ఒడలు గగుర్పొడిచింది. నల్లని పెండడుగుల శివలింగం. విభూతి, గంధము, కుంకుమ నుదుట తీర్చిదిద్దబడి, పైన నాగఛత్రముతో విలసిల్లుతూంది. దీపారాధనలు దేదీప్యమానంగా వెలుగుతూ, విరూపాక్షుడు దుర్నిరీక్ష్యుడై ప్రకాశిస్తున్నాడు. నాకు ఎందుకో దుఃఖం వచ్చింది. మన అస్తిత్వం ఎంత క్షణికమో అవగతమైంది. నా అపరాధాలను క్షమించు పరమేశ్వరా అని స్వామిని వేడుకున్నాను. ఇలా..
“కరచరణ కృతం వా, కర్మవాక్కాయజంవా
శ్రవణనయనజంవా, మానసంవాపరాధం
విహితమవిహితంవా, సర్వమేతత్ క్షమస్వ!
శివ శివ! కరుణాబ్ధే! శ్రీమహాదేవ! శంభో!
నమస్తే! నమస్తే! నమస్తే! నమః”
నా ప్రార్థన దేవాలయం అంతర్భాగంలో ప్రతిధ్వనించింది. అర్చకులు కూడ నన్ను ఆటంకపరచ లేదు. పైగా శ్రద్ధగా విన్నారు.
దర్శనం చేసుకుని బయటకి వచ్చాము. ఒక మంటపంలో ఒకామె ‘సత్యహరిశ్చంద్ర’ లోని ‘నమో భూతనాథా!’ పాట పాడుతూంది. ఒకాయన డప్పు వాయిస్తున్నాడు. ఆమె చుట్టూ చేరి భక్తులు వింటున్నారు. ఆమె గొంతు చాలా మధురంగా ఉంది. ధన్యాత్మురాలు.
స్వామిని అర్చించడంలో సంగీతసేవ కూడ ఉంది. దేవతార్చనలో ‘గీతమా శ్రావయామి’ అని వస్తుంది కదా!
ఉత్తరం ద్వార గోపురం వద్దకు వెళ్లాము. దానిని ‘కనకగిరి గోపుర’ అంటారు. దాని గుండా వెళితే తుంగభద్రా నదిని చేరుకుంటారు.
దేవాలయం నిర్మాణంలో గణిత శాస్త్ర సిద్ధాంతాలను ఉపయోగించారు. Fractals అనే సిద్ధాంతాల కనుగుణంగా కొన్ని నిర్మాణ రీతులు (patterns) పునఃపునః దర్శనమిస్తాయి. పైకి తల ఎత్తి చూస్తే అవి స్వయం విభాజితములై, snow flakes లాగా అగుపిస్తాయి.
సాహితీ సమరాంగణ సార్వభౌమ, గండరగండ బిరుదాంకితుడు శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి భక్తాగ్రగణ్యుడు. మధ్యలోని స్తంబాల విశాలమంటపం ఆయన నిర్మించినదే. ఆ మేరకు ఆ ప్రక్కన ఒక శిలాశాసనం కూడా ఉంది. తన విజయాన్ని పురస్కరించుకొని, మూర్దాభిషేకం సందర్భంగా 1510 AD లో దానిని ఆ చక్రవర్తి నిర్మించాడని అందులో ఉంటుంది.
విశాల మంటపాల్లో దేవతా విగ్రహాలు, సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు జరిగేవి. దేవతల వివాహాలు కూడా. విరూపాక్ష పంపాదేవిల వివాహ మహోత్సవమే కాకుండా, వారి నిశ్చితార్థం కూడా జరపడం విశేషం. ఇది ప్రతి డిసెంబరులో జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో రథోత్సవం కనుల పండువగా జరుగుతుంది.
ఆలయంలో గజరాణి ఉన్నది. దాని పేరు లక్ష్మి. అది తన తొండాన్ని ఎవరెనైనా ముట్టుకొని మొక్కనిస్తూంది. చాలా సాధుశీల.
బహుమనీ సుల్తానుల దండయాత్రలో ఆలయం పాక్షికంగా ధ్వంసమైనా పూజలు కొనసాగాయి.
స్తంభాల మంటపాన్ని ‘రంగమంటపం’ అంటారు. ఉపాలయాల్లో పంపాదేవి, భువనేశ్వరి, పాతాళేశ్వర, నవగ్రహా ఆలయాలు ప్రధానమైనవి. విద్యారణ్యులు, విజయనగర సామ్రజ్య స్థాపక యోగి పుంగవులు. ఆయనకూ ఒక ఆలయం ఉంది. ఆ వరసలో ఒక పెద్ద రాతి గంగాళం అగుపిస్తుంది. దాని మీద కళాకృతులు చెక్కారు. మొత్త పాత్ర ఒక పద్మంలో ఒదిగినట్లు అనిపిస్తుంది.
మొత్తం విరూపాక్షస్వామి దేవాలయమంతా తిరిగి చూడటానికే మాకు ముప్పావుగంట పట్టింది.
తర్వాత ఉగ్రనరసింహుని బృహద్విగ్రహం దగ్గరకు వెళ్లాము. అన్ని చోట్లకు ఆటోను అనుమతిస్తున్నారు. మాలాంటి సీనియర్ సిటిజన్స్ ను చూసి, బారికెడ్స్ తెరిచి, మరింత లోపలికి వెళ్లనిస్తున్నారు. మా ఆటోను, సెక్యూరిటీ సిబ్బంది!
స్వామి వారి విగ్రహం అద్భుతం! 6.7 మీటర్లు ఎత్తుగల ఏకశిలా నిర్మితం. స్వామివారు కూర్చున్న భంగిమలో, కాళ్లు పెడగా వేసుకుని ఉన్నారు. కాళ్లకు బిగింపుగా ఒక రాతి బెల్ట్ ఉంది. శిల్పం విడిపోకుండా నేమో? శిల్పానికి అవసరమేమోగాని, స్వామికి అవసరమా? అనిపించింది నాకు.
స్వామిని చూసి భక్త్యోద్వేగమునకు లోనైనాను. కళ్లవెంట ఆనందాశ్రువులు!
“జయజయ నరసింహా!” అని నినదించాను బిగ్గరగా!
పూర్తిగా విగ్రహం దగ్గరకి పోకుండా ఆరుడగుల దూరంలో గ్రిల్స్ అమర్చారు. స్వామి వారు ఏడు తలల నాగేంద్రుడు, ఆదిశేషునిపై ఆశీనులై ఉన్నారు. స్వామి వారికుడి చేయి మోచేతి వరకు తెగిపోయి ఉండడం చూసి నాకు విచారం కలిగింది. 1565లో స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. లక్ష్మీదేవి అమ్మవారు ఆ క్రమంలో విడిపోయింది. ఆమె విగ్రహం ప్రస్తుతం కమలాపుర మ్యూజియంలో ఉంది.
విగ్రహాన్ని 1528లో నిర్మించారు, శ్రీ కృష్ణదేవరాయలు. విగ్రహం వక్షస్థలం అతి విశాలంగా ఉంటుంది. వదనం అడ్డంగా తెరుచుకుని ఉగ్రంగా ఉంటుంది. కాని అదంతా రాక్షసులకే. మనకు నరసింహుడు అతి శాంతుడు. కరుణాసముద్రుడు.
విగ్రహం పైన మకరతోరణం ఉంది. నేను స్వామివారిపై శ్రీ భద్రాచల రామదాసు గారు రచించిన కీర్తన “నరహరిదేవా! జనార్ధనా!” ఆలపించాను. నా మిత్రుడు దివాకర్ నేను పాడుతుండగా వీడియో తీశాడు. భక్తులెవ్వరూ, నా పాట పూర్తయ్యేంత వరకు, నన్ను డిస్టర్బ్ చేయకుండా విన్నారు. కొందరు చప్పట్లు కూడాఅ కొట్టారు. కొందరు కన్నడలో, హిందీలో, నన్ను ప్రశంసించారు! నాదేముంది? పాడించుకున్నవాడు ఆయనైతే!
మా తర్వాతి మజిలీ హజార రామాలయం. ఆటోలో అక్కడికి వెళుతుంటే మా అబ్బాయి ఫోన్.
“కన్నా, చెప్పు నాన్నా” అన్నాను. వాడికి నలభై ఏళ్లు వస్తున్నా, నాకు వాళ్లమ్మకూ, వాడు చిన్నప్పటి బుజ్జకన్నే.
“ఈ రోజు రాత్రికి నీకు హోస్పేట్ నుంచి హైదరాబాదుకు తత్కాల్ చేసి, టికెట్ పంపించాను చూసుకోలేదా?”
“లేదురా. మంచిపని చేశావు. నేను నీకు చెప్పిన విషయమే మరిచిపోయాను.”
“నేను మరచిపోలేదులే. మళ్లీ, నా టూర్లంటే నీకు శ్రద్ధలేదు వెధవా! అని తిడతావు కదా!”
నేను నవ్వాను “ఎప్పుడు ఆ రైలు?”
“ఈ రోజు రాత్రి పదకొండున్నరకు. యశ్వంతపూర్ – నిజాముద్దీన్, కర్నాటక సంపర్క్ క్రాంతి. రేపు ఉదయం 8.15కల్లా కాచిగూడలో దిగుతావు!”
“యూ ఆర్ ఎ గుడ్ బాయ్!”
“నేను గుడ్ బాయ్‌నే కాని, రైల్వే వాళ్లు కాదు నాన్నా. నీకు అప్పర్ బెర్త్ వచ్చింది. ఆ టైమ్‌లో ఎవర్నయినా రిక్వెస్ట్ చేయాలన్నా, అందరూ పడుకొని ఉంటారు. తత్కాల్ కదా! సీనయర్ సిటిజన్ ఆప్షన్ ఉండదు” వాడి గొంతులో అల్లరిని ఇట్టే గ్రహించాను. వాడి బాబుని నేను! నన్ను ఆట పట్టించడానికి ప్రతి సారీ ఇలానే అంటుంటాడు. నేనేం తక్కువ తినలేదు.
“అప్పరే బెర్త్ నేను ఎక్కలేనా ఏమిటి?” అన్నా నవ్వుతూ.
“నీకంత సీన్ లేదు లేగాని. లోయర్ వచ్చిందిలే! జాగ్రత్తగా వచ్చేయి. నాన్నా, జాగ్రత్త!” వాడి గొంతు నిండా తండ్రి పట్ల కన్‌సర్నే!
“అలాగే లేరా! ఉంటా మరి!”
నా కొడుకు, కోడలు, మనమడు నా దగ్గరే ఉంటారు. నా కూతురు అల్లుడు నవీ ముంబాయి! దాన్ని చూడాలనిపిస్తే, నేనూ వాళ్లమ్మ రైలెక్కి వెళ్లిపోతామంతే! మా పిల్లల్లిద్దరూ ఆమెరికాలో సెటిలై ‘దండిగా’ సంపాదించకుండా, ఇండియాలోనే ఉన్నందుకు, మాకెంతో ఆనందంగా, గర్వంగా ఉంటుంది మరి!
హజార రామాలయం వచ్చింది. “మీ అబ్బాయా! మీకు హైదరాబాద్‌కు తత్కాల్ దొరికినట్లుంది?” అన్నాడు మా మిత్రుడు.
“మీవాడు మీరూ ఫ్రెండ్స్‌లా ఉంటారే!” అన్నాడాయన నవ్వుతూ.
“అవును దివాకర్” అన్నా, హాయిగా నవ్వుతూ.
“మరి మీ సంగతి?”
“మనకు రేపు మధ్యాహ్నం వరకు చెక్ అవుట్ టైం ఉంది శర్మాజీ! మీరు నైట్ వెళ్లిపోండి. నేను రేపు ఉదయం తీరుబాటుగా లేచి, టిఫిన్ చేసి, బళ్లారి వెళతాను. అక్కడి నుంచి మా యాద్‌గిర్‌కు డైరెక్ట్ బస్‌లుంటాయి” అన్నాడాయన.
“వెరీ గుడ్. అయితే మీరు రేపు ఉదయం టిఫిన్ ఉగ్గాణి బజ్జీ తింటారా?”
“తినను లెండి. మీరు అసూయపడతారు కదా! అయినా మాకు యాద్‍గిర్‌లో రెగ్యులర్‍గా దొరుకుతుంది లెండి” అన్నాడు దివాకర్ నవ్వుతూ.
హైదరాబాద్‍లో సెటిల్ అయినందుకు నాకు కొంచెం పశ్చాత్తపం కలిగింది.
(ఇంకా ఉంది)