Site icon Sanchika

యాద్గిర్ – మంత్రాలయం – హంపీ యాత్ర – 5

[ఇటీవల యాద్గిర్, మంత్రాలయం, హంపి దర్శించి ఆ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]హ[/dropcap]జార రామాలయం చిన్న కట్టడమే. కాని క్షేత్రం మధ్యలో ఉంది. విజయనగర రాజులకు ఎంతో ప్రీతిపాత్రమైన మందిరమది. దాని కుడ్యాల మీద రామాయణం లోని వివిధ ఘట్టాలను అందంగా చెక్కి ఉన్నారు. రెండవ దేవరాయల పాలనలో, 15వ శతాబ్దపు తొలి సంవత్సరాలలో ఈ నిర్మాణం జరిగింది. ముందుగా గర్భాలయం, ఒక స్తంభాల మంటపం, ఒక అర్ధమంటపం మాత్రమే ఉండేవట. తర్వాత దాన్ని పునరుద్ధరించి, ముందు విశాలమైన ప్రాంగణాన్ని కళాత్మకమైన స్తంభాలతో తీర్చిదిద్దారు.

హజారము అంటే వెయ్యి. రాముని రూపాలు బహుళ సంఖ్యలో దర్శనమిస్తాయి కాబట్టి దానికా పేరు వచ్చింది. అవేగాక కుడ్యాల మీద అశ్వములు, ఏనుగులు, రథాలు, దసరా ఉత్సవాలతో నృత్యం చేస్తున్న స్త్రీలు – శిల్పాలుగా శోభిల్లుతున్నాయి. మందిరానికి ఉత్తరం వైపున ఒక విశాలమైన పచ్చిక బయలు (Lawn) పరచుకొని ఉంది. గర్భాలయంలో ఒక ఖాళీ వేదిక ఉంది. అందులో ఒకప్పడు సీతాలక్ష్మణ హనుమత్సమేత రామచంద్ర ప్రభువుల వారి విగ్రహలుండినట్లుగా, రంధ్రాలున్నాయి. తురుష్కులు వాటిని ధ్వంసం చేసి ఉంటారు! పారవేసి ఉంటారు. ఇతర మతాలను అంతగా ద్వేషించమని ఏ మతమైనా చెబుతుందా! ఆ ఖాళీ వేదికను చూసి నా గుండె బరువెక్కింది!

రాత్రిలో రాసిన రమణీయ రామాయణం హజార రామాలయం!

బయటికివచ్చి, పార్కింగ్ దగ్గర ఉన్న రకరకాల స్టాళ్లను చూశాము. ‘టీ’ ఎక్కడా లేదు! కూల్ డ్రింక్స్ మాత్రం బోలెడు! ఐస్ క్రీమ్స్ సరేసరి! ఒకచోట ఒక ముసలవ్వ వేయించిన వేరుశనక్కాయలు, బఠాణీలు, కీరదోస ముక్కలు, పుచ్చకాయ ముక్కలు వగైరా అమ్ముతూంది. ఆమె వద్ద ఉన్న రాచ ఉసిరిక కాయలు నన్ను ఆకర్షించాయి. వాటికి ఉప్పు, కారం దట్టంగా పట్టించి ఉన్నాయి.

ఒక పది రూపాయలవి కొన్నాము. వాటి రుచి అమోఘం! రాచ ఉసిరిలో కొండ ఉసిరిలోలాగా వగరు ఉండదు. నోటికి ఎంతో హితవుగా ఉన్నాయవి. మౌత్ ఫ్రెషనర్స్ మాత్రమే కాదు, మాత్ ఎన్‌రిచర్స్ కూడా!

అక్కడినుంచి, రాణీవారి జనానా, లోటస్ మహల్ దగ్గరికి వెళ్లాము. అక్కడ టికెట్ నలభై రూపాయలు. అదీ టికెట్ విఠలాలయానికి కూడా వర్తిస్తుందట. బయట ఒక స్కానర్ పెట్టి, ఆన్‌లైన్‌లో చెల్లించమని ఉంది. వచ్చిన అక్‌నాలెడ్జ్‌మెంట్‌ను ద్వారం వద్ద ఉన్న సెక్యూరిటీ వారికి చూపి (ఫోన్‌లో), లోపలికి వెళ్లాలట. కర్నాటక టూరిజమ్ వారి వెబ్ సైట్లోకి వెళ్లి వివరాలు నింపి..

ట్రై చేశాము. మా తరంవారికి అంత సాంకేతిక జ్ఞానం ఏది? పిల్లలుంటే క్షణాల్లో చేసేవారు. మేం కొంత అసహనానికి ఆనవుతుంటే, ఒక అమ్మాయి హిందీలో చెప్పింది.

“డ్యాడీ, ఉధర్ ఏక్ కౌంటర్ హై, ఆప్ జైసే లోగ్ కీలియే! ఆప్ వహఁ సే డైరెక్ట్ టికెట్ లే సక్‌తే!”

“జీతే రహో జీటీ!” అని ఆ పిల్లను ఆశీర్వదించాము. ఆ కౌంటర్ దగ్గర మేం తప్ప ఎవరూ తీసుకోలేదు! క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్ అలా పెరిగింది మరి. టీ తాగి, ఆ పది రూపాయలు కూడ ‘ఫోన్ పే’ చేసేస్తున్నారు! బాగానే ఉందిగాని, ఒక్కోసారి అవి రెస్పాండ్ అవవు! ఈ సో కాల్డ్ యూత్ దగ్గర క్యాష్ ఉండదు!

రాణీగారి స్నానశాల అట అది. ఒక బహిరంగ కొలను ఉండేదేమో! ప్రస్తుతానికైతే అక్కడ దాని బేస్ మాత్రమే ఉంది. దాని మీద ఎక్కి టూరిస్టులు తిరుగుతున్నారు. అది కూడా కళాత్మకంగా ఉంది!

అచ్యుతరాయలు, రాణివాస స్త్రీల కోసం, దాన్ని నిర్మించాడు. అత్యంత విలాసవంతమైన స్నానఘట్టమది. దాని నిర్మాణం ఇండో ఇస్లామిక్ శైలిలో ఉంది.

చతుర్భుజి ఆకారంలో ఉంది రాణిగారి స్నానశాల. 30 చ.మీ. వైశాల్యం కలిగి 1.8 మీటర్ల లోతుండేదట. స్నాన కొలను చుట్టూ అందమైన ఆర్చిలు, వరండాలు, స్తంభాలు, బాల్కనీలతో సుసంపన్నమై ఉండేదట. అవన్నీ ఇప్పుడు లేవు!

స్నానశాల ఆకారం octagonal గా ఉంది.

అక్కడికి కొంతదూరంలో లోటస్ మహల్ ఉంది. అది ఒక ఇంజనీరింగ్ మార్వెల్. పద్మం ఆకారంలో నిర్మించారు. దానిని కమలమహల్ అనీ, చిత్రాంగిమహల్ అనీ అంటారు. అది శిధిలం కాలేదు. చెక్కుచెదరలేదు. దాని మీద కళాత్మకమైన డోమ్‌లు ఉన్నాయి. సెంట్రల్ డోమ్ ఒక తామర మొగ్గ ఆకృతితో ఉంది. నిర్మాణంలోని వంపుల్లో కొంత ఇస్లామిక్ టచ్ ఉందనిపించింది. అది రెండంతస్తులుగా ఉంది. Symmetrical అన్న దానికి చక్కని ఉదాహరణ లోటస్ మహాల్. నాలుగు శిఖరాలు పిరమిడ్ షేపులో తీర్చిదిద్దారు. కిటికీలకు అందమైన ఆర్చ్‌లు, బాల్కనీలు, వాటికి సపోర్టుగా 24 అందమైన స్తంభాలు! గోడలు స్తంభాల మీద సముద్ర జీవులు, పక్షుల బొమ్మలు అందంగా చెక్కి ఉన్నాయి!

ఆ ఆవరణ అంతా పెద్ద పెద్ద వృక్షాలున్నాయి. చల్లని నీడనిస్తూ, యాత్రికులను సేద తీరుస్తున్నాయి. కూర్చోడానికి సిమెంట్ బెంచీలు కూడా ఉన్నాయి! రాత్రి లోటస్ మహల్ విద్యుద్దీప కాంతులతో, చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటుందట! అక్కడ రాణీవారు ఎక్కువ కాలం గడిపేవారట. దీనిని Fariborz Sahba అని ఇరానీయుడు రూపకల్పన చేశాడట. ఆయన కాలిఫోర్నియాలోని లా జోలా (La Jolla) లో స్థిరపడ్డాడు, మంత్రివర్గ సమావేశాలు రాజు గారు అక్కడ జరిపేవారట.

బయటకు వచ్చాము. కడుపులో పేగులు “అన్నమో రామచంద్రా!” అని అరవడం ప్రారంభించాయి. “పుట్టణ్ణ తండ్రీ! వెంటనే ఏదైనా హోటల్‌కు తీసుకువెళ్ళు!” అని అతన్ని అడిగాము.

భోజనం అంత సులభంగా దొరకలేదు! ప్రతి హోటల్ దగ్గరా విపరీతమైన రద్దీ! అరగంటకు పైగా వేచి ఉండాలట. చివరకు మళ్ళీ లింగాయత హోటలే మాకు దిక్కైంది. వారి పద్ధతిలో జొన్న రొట్టె, చిన్న కప్పుతో అన్నం, పచ్చి సలాడ్, పప్పు, కర్ర, సాంబారు, మజ్జిగ! ఆత్మారామ్ జీ ప్రశాంత్ హో గయా జీ!

నాకు ఒక వేదాంతి మాటలు గుర్తొచ్చాయి ఎందుకో!

“అన్నమైతే నేమిరా మరి సున్నమైతే నేమిరా?
అందుకే ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా!”

తెలివైన వేదాంతం అంటే ఇదేమరి.

ఒక అరగంట సేపు, ఒక మంటపంలో సేదతీరాము. హంపీ క్షేత్రంలో అలాంటి isolated మంటపాలు కావలసినన్ని.

మా తర్వాతి గమ్యం విఠలాలయం. అక్కడికి ఆరు కి.మీ. ఉంటుందట. మేం అక్కడికి చేరుకునేసరికి రెండున్నర కావస్తోంది. అక్కడ పార్కింగ్‌లో వందలాది కార్లు నిండిపోయి, బైట రోడ్డుకు ఒక వైపు అర కిలోమీటరు పొడవున నిలిపి ఉంచారు. ఆటోలు ఎక్కడో ఆపేశారు.

మేం నడుచుకుంటూ వెళ్లి చూస్తే, అక్కడో పెద్ద క్యూ లైన్ ఉంది! విఠలాలయం కనుచూపు మేరలో లేదు! అది అక్కడికి రెండు కి.మీ. లోపు ఉంటుందని, బ్యాటరీతో నడిచే 10 సీటర్ వ్యాన్‌లో టూరిస్టులను తీసుకు వెళ్లి, దర్శనం అయింతర్వాత మళ్లీ తీసుకువచ్చి దింపుతారని తెలిసింది. ఇరవై నిమిషాలకు పైనే నిరీక్షణ తర్వాత, మరో బ్యాటరీ వ్యాన్‍లో సీట్లు దొరికాయి. నడవగలిగిన ఔత్సాహికులు, వీటి కోసం చూడకుండా చక చక నడిచి వెళ్లిపోతున్నారు!

తీరా వెళ్లి చూస్తే, ఆలయం గొప్పగా ఉంది కాని, గోపురాలతో శిధిలమై ఉంది. అయినా దాని వైభవం స్పృహణీయంగానే ఉంది. వెళ్లి చూశాము. విఠలేశ్వరుని పెద్దపాంగణం, అద్భుతమైన స్తంభాల మంటపాలు, కళాత్మక నడవాలు, స్తంభాల మధ్యలోని సూక్ష్మమైన నగిషీలు, లతలు, పువ్వులు, అంత minute గా ఎలా చెక్కగలిగారో ఆలోచిస్తే అబ్బురమనిపించింది. ఆలయం బయట పెద్ద పచ్చికబయలు, కూర్చోవడానికి బెంచీలు ఉన్నాయి!

ఆలయం లోనే రాతిరథం ఉంది. అదో నిర్మాణ కౌశలం. ముట్టుకుంటే స్వరాలు పలికే స్తంభాలు కూడా అక్కడే ఉన్నాయి. ఈ ప్రాంతం ‘ఆనెగొంది’ అనే ఏరియాలో ఉంది. దీనిని ఆంజనేయస్వామి జన్మస్థలంగా భావిస్తారు. ఇది ఎత్తుగా ఉంది. తుంగభద్రా నదీ తీరం నుండి కూడా కనపడుతుంది. ఆలయంలోకి మెట్లు (సుమారు 30) దిగి వెళ్లాలి. చుట్టూ ప్రాకారం, నాలుగు వైపులా ద్వార గోపురాలు ఉన్నాయి. లోపల ఎన్నో ఉపాలయాలు కూడా ఉన్నాయి.

విఠలుడు, విష్ణురూపమే! ఈ గుడిని కూడ 15వ శతాబ్దంలోనే నిర్మించారు. తర్వాతి రాజవంశీయులు, విజయనగర సామ్రాజ్యపాలకులు దీనికి మరింత సొబగులద్దారు. ఈ దేవాలయం చుట్టూ, విఠలపురం అనీ పట్టణం విస్తరించి ఉండేది. మహాన్నత గ్రానైట్ స్తంభాల మీద వెలసిన ప్రాంగణాలు, నమ్మలేని శిల్పచాతుర్యానికి ప్రతీకలు!

ఇక రాతిరథం హంపీ శిల్పాలకే తలమానికం. రాతిరథం తూర్పుద్వార గోపురం క్రిందినుండి వెళితే దర్శనం ఇస్తుంది. అది నిజానికి రథాకారంలో ఉన్న ఒక మందిరమే! లోపల గర్భగుడిలో గరుత్మంతుని విగ్రహం ఉంది. గరుడుడు విష్ణువుకు వాహనం కదా! గరుడ గమనుడు, గరుడవాహనుడు, అని ఆయనకు పేరు. సంస్కృతంలో ఆయనను ‘గరుత్మాన్’ అంటారు. ప్రధానాలయం వద్ద ఈ గరుడాలయం ఉండడం సాంప్రదాయం కూడా!

రాతిరథం ఏకశిలా నిర్మితంగా అనిపిస్తుంది కాని, పెద్ద పెద్ద గ్రానైట్ శిలలతో దీనిని కట్టారు. జాయింట్స్ మనకు కనబడనంత నేర్పుగా పేర్చారు. వాటిని, చెక్కిన లతలలో, ఇతర కళాకృతులలో దాచారు. రథం, ఒక అడుగు పైగా ఉండి, చతురస్రాకారంగా ఉన్న వేదిక పై నిలిచిఉంది. చుట్టూ ఇతిహాసాలలోని యుద్ధ దృశ్యాలు చెక్కి ఉన్నారు, సజీవంగా భ్రమింపచేసే విధంగా! రథం వేదిక మీద ఆనుకోలేదు, దాని నాలుగు సమున్నత చక్రాలు, ఇరుసులు, వేగనిరోధకాలు (brakes) అంత నేర్పుగా నిలబెట్టారు. చక్రాల నిండా, వాటి మధ్య ఉన్న pokes నిండా పూలు, లతలు! చక్రాలు వేదిక మీద నుంచి కదలటానికి సిద్ధంగా ఉన్నట్లు మనల్ని భ్రమింప చేస్తుందా నిర్మాణం.

రథం మీది పెయింటింగ్స్ చాలా మటుకు వెలిసిపోయాయి. రథం ముందు రెండు గజములు, రథాన్నవి లాగుతున్నాయా అన్నట్లు నిలుచున్నాయి. వాటి వెనుక అశ్వాలు! వాటి తోకలు, వెనుక కాళ్లు, చలన భంగిమలో చెక్కడం విశేషం! రెండు ఏనుగుల మధ్య, రథం మీదికి ఎక్కడానికి ఒక రాతినిచ్చెన ఉంది. అది విరిగిపోయి ఉంది.

రథం చూసి, విఠలాలయం ముందున్న ప్రధాన ప్రాంగణం లోకి వెళ్లాము. దీనిని ‘మహామంటపం’ అంటారు. మంటపం ఇరువైపులా సింహాలు, గున్న ఏనుగులతో చెర్లాటమాడుతున్న శిల్పాలు అమోఘం!

మహామంటపం నాలుగు వైపులా నాలుగు శాలలు ఉన్నాయి. పశ్చిమ దిక్కు హాలు కూలిపోయింది. స్తంభాలన్నీ ఏకశిలానిర్మితాలే, ఆ మహామంటపంలో పూర్తి చివరగా ఉన్న స్తంభాలు సంగీత స్వరాలు పలికేవి! వాటిని ముట్టుకుంటే చాలు, సంగీత తరంగాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అవి నిజంగా సంగీతం కాదు కాని, వాటిని చెక్కిన శిల్ప అసమాన ప్రతిభ వల్ల వాటిలోని ప్రకంపనలు(vibes) ధ్వని తరంగాలుగా వినిపిస్తున్నాయి. భారత శిల్పకళామతల్లీ! నీకు జోహార్!

సందర్శకులు అత్యుత్సాహంతో ఆ సంగీత స్తంభాలను గట్టిగా తాకడం వల్ల, అవి తమ స్పందనను కోల్పోయాయి. అందుకే వాటిని స్పృశించడాన్ని నిషేధించింది హంపీ ప్రాధికార సంస్థ!

తూర్పుశాలను సంగీత విద్వాంసుల శిల్పాలు ఆక్రమించాయి. నృత్యం చేసేవారు, డ్రమ్స్ వాయించేవారు, ఇతర సంగీత వాయిద్యకళాకారులు సజీవ శిల్పాలైనా కూడా. ఉత్తరం వైపున్న శాల లోని స్తంభాలపై నరసింహవతార ఘట్టాలను చెక్కారు. నరసింహస్వామి, హిరణ్యకశిపుడిని, తన తొడల మీద పరుండ బెట్టుకొని, వాడి నఖములతో ఆ అసురుని సంహరించే శిల్పం చూస్తే, మన ఒళ్ళు గగుర్పొడుస్తుంది! అంత life-like గా ఉందా శిల్పం! ప్రక్కనే భక్తాగ్రేసరుడైన ప్రహ్లాద కుమారుడు ముకుళిత హస్తుడై నిలిచి ఉన్నాడు. స్వామిని చూసిన నా మనసు భక్తితో పరవశించింది.

“ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యుమృత్యుం నమామ్యహం”

అని నరసింహమంత్రాన్ని గద్గద స్వరంతో చదివాను.

అప్రయత్నంగా, బ్రహ్మండపురాణంలో చెప్పబడిన, ప్రహ్లాదోక్తమైన, ‘నృసింహకవచము’ లోని చివరి శ్లోకాన్ని పాడాను.

“గర్జంతం గర్జయంతం నిజభుజపటలమ్
స్ఫోటయంతం హటంతమ్
రూప్యంతం తాపయంతం దివి భువి
దివిజం క్షేపయంతం క్షిపంతమ్
క్రదంతం రోషయంతం, దిశి దిశి సతతం
సంహరంతం భరంతమ్
వీక్షంతం ఘూర్ణయంతం, శరనికరశతైః
దివ్యసింహం నమామి!”

నా కళ్లవెంట ఆనందాశ్రువులు! వెక్కివెక్కి ఏడ్చాను! దివాకర్ కంగారు పడ్డాడు!

“శర్మగారు! ఏమయింది?” అనడిగాడు. తీరుకొని, ఏమీ కాలేదని, అంత సజీవ శిల్పాకృతిలో నరసింహుని దర్శించి, తట్టుకోలేక పోయానని చెప్పాను.

“మీరు ధన్యులు!” అన్నాడాయన!

గర్భగుడిలో ఏ విగ్రహమూ లేదు. గర్భగుడి కుడ్యాల మీద కుంభ పంకజములు, అంటే కుండలలో నాటబడి, వెలికివచ్చిన పద్మములు చెక్కబడి ఉన్నాయి. ఒక చోట ఒకే జంతువుకు వృషభముఖం, ఏనుగుముఖం, రెండూ చెక్కారు. ఈశాన్యాన, అమ్మ వారి మందిరం, నైరుతిన వందస్తంభాల కల్యాణ మంటపం దర్శించుకున్నాము. లోటస్ మహల్ దగ్గర కొన్న టికెట్టే విరలాలయానికి కూడ పనికొచ్చింది. ఒక అనిర్వచనీయమైన అనుభూతి మమ్మల్ని చాలా సేపు వీడలేదు! మళ్లీ బ్యాటరీ వ్యానెక్కి, ఎంట్రన్స్ దగ్గరికి చేరుకున్నాము. అక్కడ ఒక పిల్లవాడు ఒక స్టీలు క్యాన్‌లో మధురమైన మజ్జిగను పేపర్ గ్లాసుల్లో పోసి యిస్తున్నాడు. ఇరవై రూపాయలు, ఎక్కువే అనిపించినా, చాలా బాగుంది.

వ్యాన్ ఎక్కే ముందే పుట్టణ్ణకు ఫోన్ చేశాము. అతడు ఎంట్రన్స్ దగ్గరికి వచ్చి ఉన్నాడు.

“సార్. ఐదవుతూ ఉంది. ఇంకో రెండు గంటలు తిరగవచ్చు. జనరల్‍గా అందరూ హంపీ చూడటానికి రెండు రోజులు పెట్టుకుంటారు. మీరు..” అన్నాడు.

“ఫరవాలేదబ్బాయ్, ముఖ్యమైనవి చూసి వెళ్లిపోదాం” అన్నాను.

అతనిలా అన్నాడు – “వానరపర్వతం, మీరు దూరం నుంచి చూడవచ్చు. మాతంగ పర్వతం కూడా. హేమకూట పర్వతం దారిలోనే వస్తుంది. గుర్రపుశాలలు, మెట్ల కొలను, అచ్యుతరాయ ఆలయం, శివలింగం, దసరా దిబ్బ, బాలకృష్ణ మందిరం, మాల్యవంతం, మ్యూజియం, ఏకశిలా వృషభశిల్పం, కోదండరామాలయం, పట్టాభిరామాలయం పురందరదాస మంటపం. వీటిలో ఏది చూపించమంటే అది చూపించుకుంటూ వెళతాను”

“గుడ్! మ్యూజియం వద్దు. పర్వతాలు ఎక్కలేము, వాటిని వీలైనంత దగ్గరగా చూపించు. ఆలయాలు చూద్దాం!” అని చెప్పి, “ముందు ‘టీ’ పడాలి వేడిగా” అన్నా.

“పదండి, ఇక్కడ ఉడిపి హోటలు ఉంది. ఫిల్టర్ కాఫీ చాలా బాగుంటుంది. టీ సంగతి చెప్పలేను” అన్నాడు.

కాఫీ నిజంగా బాగుంది. శర్కరరహితం!

***

మొదట వానరపర్వతం చూశాము. అది అసలు హనుమాన్ మందిరం. ఆనెగొంది అంజనాద్రి పర్వత శిఖరం మీద ఉంది. దానిపై కప్పు పిరమిడ్ ఆకృతితో ఉంది. లోపల ఆంజనేయుని విగ్రహం ఉంది. కొండపైకి ఎక్కి చూడగలిగితే చక్కని సీనిక్ బ్యూటీని చూసి ఆనందించవచ్చునట. దాని ఐతిహ్యం ఇది. శ్రీ వ్యాసరాయలవారు హనుమంతుని బొమ్మను ప్రతిరోజూ చిత్రించి, ఆయనను ధ్యానించేవారట. ప్రార్థన పూర్తవగానే, గీసిన బొమ్మ మాయమయ్యేదట. అలా వరుసగా 12 రోజులు జరిగింది. పైకి చేరడానికి 575 మెట్లు ఎక్కాలి. అక్కడ, అధిక సంఖ్యలో కోతులు ఉండేవట. రానురాను వాటి సంఖ్య తగ్గిపోయింది.

ఇక్కడి హనుమాన్ ఆలయాన్ని 14వ శతాబ్దంలో కట్టారు. దానిని ‘యంత్రోద్ధార ఆంజనీయ మందిరం’ అని కూడ అంటారు. అది కోదండరామస్వామివారి గుడికి వెనుక, చక్రతీర్థానికి దగ్గరలో ఉంది.

చిత్రాలు మాయమవడంతో, వ్యాసరాయలవారే స్వామి విగ్రహాన్ని ఒక పెద్ద బండరాయి మీద చెక్కి, ప్రతిష్ఠించారని ఐతిహ్యం. అక్కడ చిన్న సీతారాముల విగ్రహం కూడా ఉంది. ఆంజనేయ యంత్రాన్ని కూడా వ్యాసరాయలవారు అక్కడ నిక్షేపించారు. స్వామివారు పద్మాసనస్థితులై ఉంటారు. యంత్రమునకు షట్ కోణములుండి, మధ్యలో జ్వాల ఉంటుంది, సూర్యుని సూచిస్తూ. పన్నెండు కోతులు, ఒకదాని తోక ఒకటి పట్టుకొని ఒక నక్షత్రం చుట్టూ ఉంటాయి.

అన్నిమెట్లు ఎక్కలేక, కింది నుంచే మందిరానికి నమస్కరించి, కోదండ రామాలయానికి వెళ్లాము. అది గొప్ప కట్టడం. యునెస్కో వారి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది. రాముడు, సీత, లక్ష్మణుల పెద్ద విగ్రహాలు, ఒకే పెద్ద శిలపై చెక్కబడాయి. అక్కడికి తుంగభద్రానది దాపునే ఉంటుంది.

శ్రీరామచంద్ర ప్రభువు సుగ్రీవునికి రాజ్యపట్టాభిషేకం చేసింది ఇక్కడే అని ఐతిహ్యం. శ్రీరాముని ముందు మోకరిల్లుతూన్న సుగ్రీవుని విగ్రహం కూడ ఉంది. ఆలయ స్తంభాలు అమూల్య శిల్పకళకి ఆలవాలాలు. హోయసల, ద్రవిడ నిర్మాణశైలులు నిర్మాణంలో గోచరిస్తాయి. రాముడు వాలిని వధించింది కూడా ఇక్కడే అని నమ్ముతారు. మందిరం లోని విగ్రహాలను సుగ్రీవుడే చెక్కాడని మరో నమ్మకం.

మందిరం ముందు పెద్ద స్నానఘట్టం, చక్రతీర్థం ఉంది. తుంగభద్రకు వరదలు వస్తే, వరద నీరు కోదండరామాలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తుంది. నది వెంట వెళితే, హంపీ బజారును విఠలాలయాన్ని కలిపే దారిని చేరుకోవచ్చు.

హంపీ బజారుకు చివర పెద్ద ఏక శిలానిర్మితమైన నంది విగ్రహం గోచరిస్తుంది. నంది విగ్రహం ఉన్న గుట్ట వెనుక  అచ్యుతరాయల గుడి ఉంది. ఆలయం 1534లో పునరుద్ధరింపబడింది. ఇది తిరువేంగళనాథునికి అంకితం ఇవ్వబడింది. ఆయన విష్ణు స్వరూపుడే. నిర్మించినవాడు అచ్యుతరాయల ఆస్థానంలోని ఒక అధికారి.

ఆలయం చాలా మటుకు శిధిలమైంది. దాని ముందు చిన్న లోయ లాంటిది ఉంది. రెండువైపుల గంధమాదన, మాతంగ పర్వతాలున్నాయి. లోపల గరుడుని విగ్రహం ఉంది.

అక్కడి నుంచి, విజయనగర రాజుల ఏనుగుల శాలకు వెళ్లాము. అవి కూడా కళాత్మక నిర్మాణాలే. ఇండో- ఇస్లామిక్ శైలిలో నిర్మించబడినాయి. భవనం పొడుగ్గా ఉంటుంది. పెద్దగా శిధిలమవలేదు. పొడవునా 11 గదులు, పైన డోమ్‍లు. అవి ఏనుగులను కట్టి వేసేందుకు ఉపయోగిస్తారు. మధ్యలోది చాలా పెద్దగా, కళాశోభితమై ఉంది. పైకప్పులో లోహపు కొక్కీలు కనబడతాయి. వాటికీ ఏనుగులను బంధిస్తూండవచ్చు. వెనుకవైపు, మావటీలు గదుల్లోకి ప్రవేశించడానికి వీలుగా పెద్ద కంతలున్నాయి. 1565లో  విజయనగర సామ్రాజ్యం పతనమై, ఎన్నోనిర్మాణాలు శిధిలమయినా, ఈ ఏనుగుల శాల మాత్రం పెద్దగా డ్యామేజ్ అవలేదు. శాలకు మధ్యలో పైన ప్రధాన డోమ్ పుత్యేక ఆకర్షణ. మిగతా డోమ్స్ అన్నీ రకరకాల ఆకృతులలో ఉన్నాయి.

ఏనుగుల శాల

తర్వాత బాలకృష్ణ మందిరం చేరుకున్నాము. టైమ్ చాలదని గబగబా కవర్ చేయసాగాము. దీనిని శ్రీకృష్ణదేవరాయలు 1513లో నిర్మించాడు, ఒరిస్సాలోని ఉదయగిరి దుర్గాన్ని వశం చేసుకొన్న సందర్భంగా. ఆ మేరకు గుడిలో ఒక పెద్ద శిలాఫలకం ఉంది. ప్రస్తుతం విగ్రహం లేదు. చెన్నై స్టేట్ మ్యూజియంలో ఉంది.

లోపల స్తంభాలమీద సింహాకృతులు చెక్కారు. కొన్ని చోట్ల ఏనుగుల బొమ్మలు. దూరంగా, మందిరపు వంటశాల ఉందట. ప్రధానగోపురం శిధిలమైంది, ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. లోపల దశావతారాల విగ్రహాలు సుందరంగా చెక్కబడి ఉన్నాయి.

మా చివరి మజిలీ దసరా దిబ్బ. అది ఒక కళావేదిక. ప్రజల కోసం సంగీత, నృత్య ప్రదర్శనలు అక్కడ జరిగేవి, ముఖ్యంగా దసరా నవరాత్రులలో. అందులోని చక్కని మండపాన్ని తురుష్కులు ధ్వంసం చేశారు. దానిని మహర్నవమి దిబ్బ అని కూడా అంటారు. దిబ్బ అంటే అచ్చ తెలుగులో ఎత్తైన ప్రదేశం అని అర్థం.

ఇక్కడ సైన్యం కవాతును, విలువిద్యా, ఖడ్గ విద్యా ప్రదర్శనలను కూడా చక్రవర్తి వీక్షించేవాడు.

దసరాదిబ్బ 12 మీటర్ల ఎత్తు ఉంది. మూడు చతురస్రాకారపు రాతి వేదికలు ఒకదాని మీద ఒకటి ఏర్పడ్డాయి. అన్నిటికంటే క్రిందది 40 చ.మీ., పైది 24 చ.మీ. ఉన్నాయి. పైకి ఎక్కే మెట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి. రాజుగారి ప్రవేశద్వారం వేరు, ప్రజలది వేరుగా ఉన్నాయి. వేదిక తూర్పున జంతువులు, విదూషకుల బొమ్మలు చెక్కబడ్డాయి. చైనా రాయబారి, అరబ్బు దేశీయులు, వ్యాపారం కోసం, గుర్రాలకోసం విజయనగర రాజ్యానికి వచ్చినట్లు, కొన్ని బొమ్మల ద్వారా తెలుస్తూంది.

ఏడు గంటల పదిహేను నిమిషాలకు మా హంపీ యాత్ర ముగిసింది. మేము రూము చేరుకుని, స్నానాలు చేసి సేదదీరాము. పుట్టణ్ణ వేచిఉన్నాడు. మమ్నల్ని షాన్‌బాగ్ (వెజ్) అన్న రెస్టారెంట్‌కు డిన్నర్‌కు తీసుకొని వెళ్లాడు. అక్కడ టమోటో రైస్ తిని, మజ్జిగ తాగాము. బటర్ టమోటో రైస్ అని అక్కడ స్పెషల్ అట. బాగుంది.

మమ్మల్ని రూము దగ్గర దింపాడు. ఎంత ఇవ్వమంటావని అడిగితే, పదిహేను వందలివ్వండి అనడిగాడు. అతని నిజాయితీకి మాకు ఆశ్చర్యం కలిగింది!

“ఇంత అమాయకుడివి ఎలా బతుకుతావు?” అని రెండువేలు ‘ఫోన్ పే’ చేశాము. నా రైలు పదకొండున్నరకు .

“సార్, ఆ టైంలో రైల్వేస్టేషన్‌కి ఆటోలు దొరకడం కష్టం! నేను పది ముక్కాలుకు (10.15) వస్తాను.” అని చెప్పి వెళ్లిపోయాడు.

మా మిత్రుడు దివాకర్ నాకు మంచి కంపెనీ ఇచ్చాడు. నేను వెళ్లేముందు ఆయన నన్ను ఆలింగనంచేసుకుని, “మీ సాంగత్యం అద్భుతం!” అన్నాడు. ఆయనేం తక్కువ తిన్నాడా? సౌజన్యమూర్తీ! స్నేహశీలి! ఆయనకు వీడ్కోలు చెప్పాను.

పుట్టణ్ణ వచ్చి, నన్ను స్టేషన్‌లో దింపాడు. వంద రూపాయలు ఇవ్వబోతే మొహమాటపడుతూ, “శానా ఇచ్చినారు కద సార్, వద్దు” అంటే బలవంతంగా అతని జేబులో పెట్టాను. ఇలాంటి వారి వల్లే ధర్మం నిలిచి ఉంది.

రైలు సకాలానికే వచ్చింది . ఎక్కి పడుకున్నాను. ఎంత గాఢనిద్ర పట్టిందంటే, షాద్‌నగర్ దాటింతర్వాతగాని మెలకువ రాలేదు! ఎనిమిదిన్నరకు కాచిగూడలో దిగి, ఉబర్ ఆటోలో ఇల్లు చేరుకున్నాను. ఒక చక్కని సేయింగ్‌తో ఈ ట్రావెలాగ్‌ను ముగిస్తాను.

“Travel is an investment in yourself for your physical, mental, spiritual and emotional well-being.”

(అయిపోయింది)

Exit mobile version