[dropcap]య[/dropcap]మునకు ఎటువైపు తిరిగి పడుకున్నా గుండె భారంగా ఉంది. అది ఏ జబ్బో అనుకుంటే పొరపాటే.
ఆడదన్నాక ఏదో ఒక విషయంలో ఎప్పుడో ఒకప్పుడు బాధ పడ్తూ గుండెను భారం చేసుకోవలసిందే కదా…
ఎందుకు వాడికి నేను శత్రువయ్యాననే హృదయ ఘోష తరచి తరచి అడుగు తున్నది. ప్రతి క్షణం కలవర పెడుతున్నది.
రోజూ అనిపించేదైనా ఈ రోజు తన కొడుకు రవి అన్న మాటలకు గుండె భారం మరికాస్త పెరిగింది.
కావ్య అడుగుతున్నది. “ఎందుకు మీకు అత్తయ్య అంటే ఇష్టం లేదు.”
కావ్య మాటలకు అంత పెద్ద ఇల్లైనా ఆ మాటలు తన చెవిన బడ్డాయి. “ఎప్పుడూ మా అమ్మ గురించి నన్ను అడగకు” అన్నాడు కాస్త కటువుగా రవి. అది విన్నాక మనసు మూగదై గుండె భారం బాగా పెరిగింది.
తను అలా మారటానికి కారణం తనకు తన మనసుకు తప్ప ఎవరికి తెలుసు, ఎవరితో చెప్పుకో గలదు. కన్నీళ్ళు జలజలా రాలి ఆనకట్ట లేని నదీ ప్రవాహంలా జాలువారి పోతూ ముప్ఫై ఏళ్ల నాటి జ్ఞాపకాల తెప్పలను కుప్పలుగా వదిలి వెళ్ళాయి.
“యమునా” అత్తగారి పిలుపు కాదది అరుపు.
“వస్తున్నా అత్తయ్యా” అంది కంగారుగా
“ఏం చేస్తున్నావు”
“బాబుకు అన్నం పెడుతున్నా అత్తయ్యా” అంది. ఎందుకు పిలిచారోనని కంగారు పడుతూ.
“ఎందుకా దరిద్రపు అలవాట్లు. కంచంలో అన్నం కలిపి పెట్టి ఇస్తే వాడే తింటాడుగా.”
లోపల లోపల సణుగుడు వినిపించీ వినిపించక పోయినా బాగా అర్థం అయింది యమునకు. పని తప్పించుకుందామని ఇదో సాకు అంటుండటం చాలా బాధగా అనిపించింది. పట్టుమని రెండేళ్ళు పూర్తిగా లేవు రవికి, ఎలా తింటాడు, ఇంటి పనుల్లో పడి ఇప్పటికే వాణ్ణి బాగా అశ్రద్ధ చేసింది. ఈ మాత్రం భోజనం కూడా దగ్గరుండి పెట్టకపోతే వాడి ఆరోగ్యం ఏమి కాను. ఎత్తుకుంటే ఎముకలే తగులుతున్నాయి ఆ బక్క చిక్కిన శరీరంలో. కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి యమునకు. మనసు రాయి చేసుకుని అన్నం పళ్ళెం వాడి ముందు పెట్టి వేరే పనిలోకి వెళ్ళింది. ఇల్లు దులపటానికి చీపురు అన్నీ సిధ్ధం చేసుకుంటున్న అత్తగారి దగ్గర నుండి తీసుకుని మొదలు పెట్టింది పని యమున. అన్నీ చేసుకుని వచ్చి చూసేసరికి అన్నం కింద పడేసి అందులో గరిటేసి కలుపుతున్న కొడుకును చూడగానే బాధ తన్నుకు వచ్చింది యమునకు. చుట్టూ చూసింది అత్తగారు టీవీ ముందు సీరియల్ చూస్తోంది. అదేదో మనవడికి కాస్త అన్నం తినిపిస్తే బాగుండేదని పించింది.
యమున నాన్న ముకుందరావు – కూతురు డిగ్రీ చదివింది, ఒక్క గానొక్క కూతురిని మంచి కలవారి సంబంధం చూసి చేయాలనే తలంపుతో తనకు తెలిసిన వారి ద్వారా వాకబు చేసి మంచి కుటుంబం, బోలెడు ఆస్తిపాస్తులు పెద్ద స్వంత ఇల్లు అబ్బాయి డిగ్రీ చదివి వ్యాపారం చేస్తున్నాడు, బుద్ధిమంతుడు, అత్తా మామ ఒక కొడుకు కూతురు, కూతురికి పెళ్లి చేశారు. ఏ బాదరబందీ లేని సంబంధం అని చెప్తే మనసు ఆగక ఒకత్తే కూతురని చుట్టు పక్కల వాకబు చేయించాడు. అందరూ మంచి వాళ్ళు అనే అన్నారు.
తీరా చేసుకున్నాక తెలిసింది ఆస్తి పాస్తులు విశాలమే కానీ వారి మనసులు మాత్రం కావని. కూతురు పెళ్లి అయిపోయింది. అంత పెద్ద ఇంటికి పనిమనిషి లేదు. అత్తగారికి శుభ్రమెక్కువని పనిమనిషిని పెట్టుకోక అంతా ఆమే చేసుకునేది. ఇప్పుడు యమున వచ్చాకా ఆవిడకు నడుము నొప్పి, వయసైపోయిందనే భావన బాగా వచ్చింది. అలా అని పనిమనిషిని మాత్రం పెట్టలేదు.
సహజంగానే ఎంతో ఓర్పు ఉన్న యమున ఎంతో ఓపికగా చేసినా ఏదో ఎక్కడో బాగా లేదనే నసుగుడు, ఈ లోపు ఓ బిడ్డకు తల్లి అయింది యమున. కాన్పు 10 రోజుల ముందు పుట్టింటికి పంపారు. అప్పటి దాకా పని చేస్తూనే వుంది. బలహీనంగా ఉండి పురుడు రావడం కష్టమై ఆపరేషన్ అవ్వటంతో ఎలాగో మూడవ నెలలో రమ్మన్నారు. రాగానే పని తప్ప లేదు. గంపెడు చాకిరీ చేసినా కష్టమనిపించని యమునకు బాబును ఎత్తుకుంటే అలవాటై పోతుంది క్రింద మంచం మీద ఉంచి పడుకోబెట్టమనేది అత్త సత్యవతి.
చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టం ఉన్న యమున స్వంత కొడుకును అలా దూరం పెట్టడం చాలా బాధ కలిగింది ఎప్పుడన్నా ఆవిడ చూడలేదు కదా అని ఎత్తుకుంటే కయ్యిమని నోరేసుకుని పడిపోయేది. పోనీ ఏడుస్తాడేమో ఎత్తుకుందామంటే అసలు ఏడ్చేవాడే కాదు రవి, యమున తపనకు తగ్గట్టు. రవికి ఊహ వచ్చేసరికి యమున అత్తగారి ఆంక్షలకు భయపడి ప్రేమానురాగాలు మనసులోనే సమాధి చేసుకుని రవికి దూరంగా ఉండటం అలవాటు అయింది. తల్లి తనను గారం చేయదు, ఎత్తుకోదు, ఎప్పుడూ ముద్దు కూడా పెట్టదు ఎందుకు అని తల్లి మీద ఒక లాంటి నిరసన భావం యమునకు తెలియకుండానే పెరిగి పెద్ద దయ్యింది రవిలో. కానీ ఎవరికీ తెలియని రహస్యం, అందరూ ఎప్పుడెప్పుడు పడుకుంటారా అని చూసి అప్పటికే గాఢ నిద్రలో ఉన్న రవిని గారంగా ముద్దాడుకునేది. తల్లి మాటకు ఎప్పుడూ సమాధానం ఇవ్వ వద్దనే రాఘవకు భార్య మనసు అర్థం చేసుకునే ధైర్యం లేదని ఆ ఇంటికి వచ్చిన మరునాడే అర్థం అయింది యమునకు.
రవి ఎదిగాక తన మనసు లోని బాధనంతా చెప్పుకోవాలని అనుకుంది. ఏడవ తరగతిలో ఉండగనే తన మనసులోని మాట చదివేసినట్లు అత్తగారు మంచి చదువు కావాలంటే హాస్టల్‌లో వేస్తేనే బాగుంటుందని యమున వద్దు వద్దని నెత్తి నోరు బాదుకున్నా వినకుండా కొడుకు మెత్తదనాన్ని ఆసరా చేసుకుని బలవంతంగా రవి వెళ్ళనని గొడవ పెడుతున్నా బలవంతంగా వేయించింది హాస్టల్‌లో. ఏడుస్తున్న యమునను బెదిరించింది – మొత్తానికి వాడి చదువు మాన్పించి ఇంట్లో కూర్చోబెడతానని. గుండెల్లో నుండి వస్తున్న ఏడుపును లోలోపలే అదిమేసింది యమున తన దురదృష్టానికి తిట్టుకుంటూ. ఆ తరువాత శెలవులకు ఇంటికొచ్చిన రవితో మనసు విప్పి మాట్లాడుదామన్నా అసలు సరిగ్గా మాట్లాడే వాడు కాదు. తండ్రి,నానమ్మ లతో బాగానే మాట్లాడే వాడు. కుమిలి కుమిలి ఏడ్చేది యమున.
అలా అలా పై చదువులు చదివి మంచి ఉద్యోగం వచ్చింది, అత్త కూతురు కావ్య అంటే రవికి చిన్నప్పటి నుండి ఇష్టం. ఆ మాట తను ఎత్తితే అత్తగారు మొదటే నా మాట ఎందుకు చెల్లాలని అడ్డు పుల్ల వేస్తుందని తనంటే ఎంతో అభిమానం చూపే ఆడపడుచు లతను కోరింది. తనకూ కావ్యకు రవి అంటే ఇష్టం అని తల్లికి చెప్పి వివాహం చేద్దామని చెప్పింది లత. తను కోరినట్లు మాత్రం ఎక్కడా బయటకు రానివ్వవద్దని వేడుకుంది యమున. యమున భయం అర్థం కాక అలాగేనని తల్లితో తన మనసులోని మాట చెప్పింది. మనవరాలు, కూతురు అంటే ప్రాణమిచ్చే సత్యవతి వెంటనే ఒప్పుకుంది.
యమున ఆనందానికి హద్దులు లేవు. రవి జీవితంలో వెలుగు దివిటీ వెలిగిందంటే అది కావ్య వలనే అనుకున్నాడు. ఇద్దరూ హైదరాబాద్‌లో కాపురం పెట్టారు.
కొన్నాళ్ళకు సత్యవతికి పక్షవాతం వచ్చి మంచాన పడింది. యమున మంచి మనసుతో సత్యవతికి సపర్యలు చేసి భర్తకు చెప్పి మంచి వైద్య మిప్పించింది చేయి వచ్చింది కానీ మాటరాక కొన్ని రోజులకు చనిపోయింది. గతం తాలూకు జ్ఞాపకాలను బలవంతంగా పక్కన పెట్టి జరగబోయే తంతు గురించి పనులు చక్క బెట్టాలని లేచింది.
ఇప్పుడు దినం కార్యక్రమాలకు వచ్చారు రవి, కావ్య, ఆడపడుచు లత.
కార్యక్రమం ముగిశాక అందరూ ఎవరి దారిన వారు వెళ్ళి పోయారు.
కొడుకు వైపు దిగాలుగా చూస్తూండి పోయింది యమున.
రవి వాళ్ళు వెళ్ళిన నెలకు కావ్య తల్లి కాబోతుందని లత ఫోన్ చేసి చెప్పింది.
యమున సంతోషానికి అవధులు లేవు. తన కొడుకును ఎలాగూ లాలించలేక పోయింది. కనీసం వాడికి పుట్టబోయే వాళ్ళనైనా ఆడిస్తే తన జన్మ సార్థక మౌతుందని సంతోషం. ముందు అసలు తశతో మాట్లాడటమే ఇష్టం లేని రవి తన పిల్లలను ఇస్తాడా అనే భాధే ఎక్కువై పీడిస్తోంది.
ఆ రోజు రానే వచ్చింది. కావ్యకు నొప్పులు వస్తున్నాయని వెంటనే ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని ఫోన్ చేసింది లత. వెంటనే భర్తతో కలిసి బయలు దేరి వెళ్ళింది యమున.
ఆసుపత్రి లోపల గదిలోకి వెళ్ళగానే రవి బాబును తీసుకుని వచ్చి యమున చేతుల్లో పెడుతూ ఎంతో ప్రేమగా “అమ్మా వీణ్ణి పెంచి పెద్ద చేసే బాధ్యత నీదే” అంటూ చేతుల్లో పెడుతుంటే తన చెవులు, కళ్ళను తానే నమ్మలేక పోయింది యమున. ఎన్నో సంవత్సరాల తరువాత తప్పిపోయిన పిలిచినట్టున్న అమ్మా అనే పిలుపుకు ఆశ్చర్య చకితురాలై నోట మాట రాక స్థాణువయి నిల్చుంది. “అమ్మా నన్ను క్షమించు” అన్నాడు కాళ్ళు పట్టుకుని. ఎన్నాళ్ళు గానో మనసులో దాచిన ప్రేమ లావాలా కరిగి కనుల నుండి జారిపోతుంటే తిరిగి తనను మళ్ళీ తల్లి ప్రేమను అందించమంటున్న కొడుకును ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంది. ఎక్కిళ్ళు పెడుతున్న తల్లి కన్నీటిని తుడుస్తూ “నన్ను క్షమించమ్మా నిన్ను అర్థం చేసుకోలేక పోయాను” అని అంటుంటే రవి గొంతు బాధతో జీరపోయింది. కావ్య, రాఘవ , లత ఆశ్చర్యంగా చూస్తుంటే రవి జేబులో నుండి తనకు నానమ్మ పశ్చాత్తాపంతో వ్రాసిన చివరి ఉత్తరం తీశాడు.
తన భర్త రాజారావు మంచితనంతో కానీ కట్నం లేకుండా యమున ఇంటికి రావడం సత్యవతికు మింగుడు పడలేదు. అందుకే తల్లి ప్రేమ మీద దెబ్బ కొట్టింది. అంతలా వేధించినా చివరి రోజుల్లో జబ్బు పడ్డ తనను కంటి పాపలా చూసుకుంది యమున. అది తాను ఊహించనిది. అందుకే ఏ ప్రేమనైతే వేర్లతో సహా విడగొట్టాలని చూసిందో తన పాపం ప్రక్షాళన కావలంటే ఆ తల్లీ కొడుకులను కలపాలని అన్నీ వివరాలతో రవికి ఉత్తరం వ్రాసి పోస్ట్ చేయమని దూరపు బంధువు కిచ్చింది. అతను మరిచిపోయి మొన్న గుర్తొచ్చి పోస్ట్ చేశాడు సరిగ్గా అది కావ్య డెలివరీ రోజు రవికి అంది తల్లి మనసులోని బాధ అతనికి అర్థం అయ్యేలా చేసి ఇద్దరి మనసులను బాధ నుండి బంధ విముక్తులను చేసింది అందరినీ. యమున కష్టాల నావ సంతోషాల తీరానికి చేరింది….