యథాకాష్ఠంచ…

    8
    3

    పరిశోధనలో తలమునకలుగా ఉన్న సారసని ఒకరోజు అర్జెంటుగా రమ్మని కబురుపెట్టారు రాజారావుగారు, ఎందుకో చెప్పకుండా! తీరా వెళ్ళేకా తెలిసింది ఆమెకి, తనకి రాజమండ్రి లోనే ఉన్న మరో ప్రముఖ వైద్యుడు శివానందు గారి కుమారుడు డా. సురేష్ తో పెళ్ళి చేసే ఉద్దేశంతో, ఆ విషయాలు మాట్లాడ్డానికి రమ్మన్నారని. సురేష్ తనకి బాల్యంనించీ తెలిసినవాడే. కార్డియాలజీలో సూపర్ స్పెషాలిటీ చేస్తున్నట్టు కూడా తెలుసు. రాజారావుగారు సహజంగా జెనరల్ ఫిజీషియను ఐనా ఎక్కువ గుండెకు సంబంధిచిన కేసులే వస్తాయి ఆయన దగ్గరికి. అందుచేతనే కార్డియాలజీ చేసిన సురేష్ ని అల్లుణ్ణి చేసుకుంటే తన ప్రాక్టీసంతా అతనికే వస్తుందని, కొన్నాళ్ళ తరువాత తను రిటైర్ కావచ్చుననీ ఆయన ఉద్దేశం.

    ‘బేబీ, అన్నీ బాగా ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. నువ్వు దీనికి ఒప్పుకోవాలి’ అని తండ్రి అనేసరికి సారస నిర్ఘాంతపోయింది. ఇది ఆమె ఊహించని విషయం!  “నాన్నగారూ, నాకు మళ్ళీ డాక్టర్ల కుటుంబం లోకే వెళ్ళడం ఇష్టంలేదు. క్షణంతీరికలేని వ్యక్తితో నాకు సరిపడదు. ఐనా, నా పెళ్ళి నా అభిప్రాయం ప్రకారం నాకు నచ్చినవారితో జరగాలి కదా? నా చదువుకూడా పూర్తికాలేదు. అదయ్యాకే పెళ్ళిసంగతి నాన్నగారూ” అంది సారస.

    “బేబీ, పెళ్ళిలాంటి ముఖ్యవిషయాల్లో నువ్వు నా మాట వినక తప్పదు. అసలు నిన్ను కూడా డాక్టర్నే చేద్దామనుకున్నాను. కానీ నువ్వు సాహిత్యం, సంగీతం అంటూ నా మాట వినకుండా ఎమ్మే చదివావు. అప్పుడు సరేనని ఊరుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నామాట వినకతప్పదు. నేను శివానంద్ గారికి మాట ఇచ్చేశాను. ఈ పెళ్ళి జరగాలి, అంతే” అని ఖండితంగా చెప్పేసారు రాజారావు గారు.

    “నాన్నగారూ, నా ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ఎందుకిలా చేసారు? నా అభిప్రాయానికి విలువలేదా? నేను చిన్నపిల్లని కాదు కదా! ఐనా, నేనూ భాస్కరం గారూ పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకున్నాం. నాలుగేళ్ళనించి మాకు పరిచయం. ఒకర్నొకరం బాగా అర్థం చేసుకున్నాం. ప్లీజ్, మా పెళ్ళికి ఒప్పుకోండి నాన్నగారూ” అని సారస ఎంత ప్రాధేయపడినా ఆయన తన పట్టు వదల్లేదు. దీనితో అలిగిన సారస, తండ్రి బిజీగా ఉన్న సమయం చూసి, నేను వైజాగు వెళ్ళిపోతున్నాను అని చీటీ రాసి పెట్టి వెళ్ళిపోయింది. తిన్నగా భాస్కరం ఇంటికి వెళ్ళింది. అతనికి తన తండ్రి చేస్తున్న ఘోరాన్ని వివరించింది. విన్న భాస్కరం, అతని తల్లిదండ్రులూ నిర్ఘాంతపోయారు. వెంకట్రామయ్యగారు తాను రాజారావుగారితో మాట్లాడతానన్నారు.  అనుమానాలూ, ఆందోళనలూ కలగలిసిన హృదయంతో సారస వైజాగు వెళ్ళిపోయింది.

    అన్నప్రకారం వెంకట్రామయ్యగారు ఒకరోజు సారస తండ్రిని కలిసారు. పిల్లల పెళ్ళి విషయం కదిపి, సారసను తమ కోడలుగా చేసుకుంటామన్నారు.

    “అయ్యా, లాయరుగారూ, నా కూతురి పెళ్ళి నా ఇష్టప్రకారం చెయ్యాలనుకోవడం తప్పా?  అది చిన్నపిల్ల, అనుభవం లేనిది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే దాని వెనక నా కారణాలు నాకుంటాయి. మీరు కూడా ఒక ప్రొఫెషనలే కదా! మీలాగే మీ అబ్బాయి కూడా లాయరు కావాలనే కదా లా చదివించారు? నా కూతురు నా వృత్తిలో లేదు కాబట్టి నా అల్లుడిగా డాక్టర్ని తెచ్చుకోవాలనుకోడం తప్పా? క్షమించండి, నా నిర్ణయాన్ని మార్చుకోలేను. మా అమ్మాయంటే మీకున్న ప్రేమకి ధన్యవాదాలు. నన్ను ఇంక వదిలేయండి “

     రాజారావుగారి మాటలకు చివుక్కుమన్న హృదయంతో వెంకట్రామయ్య గారు వెనుదిరిగారు.

    విషయం తెలుసుకున్న భాస్కరం, సారస పోనీ తామే రాజారావు గారికి తెలియకుండా పెళ్ళి చేసేసుకుందామా అని ఆలోచించారు. ఐతే, అతని తల్లిదండ్రులు వారించారు. తమ ఒక్కగానొక్క కొడుకు పెళ్ళీ ఇలా సమస్యలు తెచ్చేదిగా మారడం వారికిష్టం లేకపోయింది.  ఇంతలో రాజారావుగారు కూడా ఏదో అనుమానం వచ్చినట్టు సారసను వైజాగు నించి రాజమండ్రి తీసుకొచ్చేసారు, ప్రొఫెసర్‌కి యేదో కారణం చెప్పి!

    కొద్ది రోజుల్లోనే సారస వివాహం డా. సురేష్ తో జరిగిపోయింది.

    ***

    సురేష్ చదువుతో పాటు సంస్కారం, సహృదయం ఉన్నవాడు. పెళ్ళయ్యే వరకు అతనికి సారస ప్రేమకథ తెలియదు. సారస తనకి బాల్యంనించీ తెలుసు, తండ్రికి మిత్రుడైన మరో డాక్టర్ కూతురు కావడంవల్ల! ఐతే, పెళ్ళి వేళ ఆమె ముఖంలో సంతోషంకనబడకపోవడాన్ని అతను గమనించాడు. అదే విషయంఆమెను అడిగాడు. ఏ విషయమూ దాచకుండా సారస అన్నీ అతనికి చెప్పేసింది.  సురేష్ జరిగినదాన్ని ఒక స్మృతిగానే తన మనసులో దాచుకోమనీ, అనుకున్నవన్నీ జరగకపోతే జీవితం ఆగిపోదనీ చెప్పి ఆమెను ఓదార్చి ఆమెకు తన ప్రేమనే పంచాడు కాని ఆమెను గతాన్ని గుర్తు చేసుకునే అవకాశాన్ని ఎప్పుడూ రానియ్యలేదు. సారసకు కూడా జీవితంతో సమాధానపడక తప్పలేదు.

    సారస మరొకవ్యక్తిని పెళ్ళాడి వెళ్ళిపోవడం భాస్కరం మనసుని బాగా గాయ పరచింది. ఆమెలా తను రాజీ పడలేకపోయాడు.  ఇల్లూ కోర్టూ అన్ని వదిలేసి కొన్నాళ్ళు దేశమంతా పిచ్చివాడిలా తిరిగాడు. కొన్నాళ్ళు ఇలా బాధపడినా క్రమంగా కోలుకుంటాడులెమ్మని ఊరుకున్నారతని తల్లిదండ్రులు. కొన్నాళ్ళ తరువాత సుభద్రమ్మ గారు భాస్కరాన్ని తనవద్ద కూర్చోబెట్టుకొని ” నాయనా, జరిగినదాన్ని మర్చిపోరా! ఆ పిల్లకి నా కోడలయ్యే రాత లేదు. దాన్నే తల్చుకొని నీ జీవితాన్ని ఎందుకురా మోడు చేసుకుంటావు? నీ జీవితం పచ్చగా కొత్తచిగుళ్ళు వేస్తుంటే చూడాలని తల్లిగా నాకు ఉండదా? నీకు నచ్చిన పిల్లని తెచ్చి చేస్తాం, పెళ్ళి చేసుకోరా నాయనా” అని యెంతో నచ్చజెప్పారు. కానీ భాస్కరం వివాహానికి విముఖుడు గానే ఉండిపోయాడు.

    కాలక్రమంలో భాస్కరంమెల్లగా స్తిమితపడ్డాడు. పెళ్ళిచేసుకోలేదు కాని వృత్తిపై మనసు లగ్నం చేసి  గతస్మృతులను మనసుపొరల్లో అణచివేశాడు. భాస్కరం పెద్దక్క భర్త తనకి మేమమామ కొడుకు. అతనికి భాస్కరం మీద చాలా అభిమానం, అధికారం ఉన్నాయి.  భాస్కరం పరిస్థితి చూసి కొన్నాళ్ళతడు ఇంటికి దూరంగా ఉంటే బాగుపడతాడని అతన్ని లండన్‌లో  అంతర్జాతీయ న్యాయశాస్త్రం అభ్యసించమని  చెప్పి ఒప్పించి అక్కడికి పంపేశాడు అతను. ఇంగ్లండులో చదువు పూర్తయ్యాక ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అవకాశం వచ్చి అక్కడ అధ్యాపకుడిగా చేరిపోయాడు భాస్కరం. కాలం సాఫీగా గడుస్తోంది.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here