యథాకాష్ఠంచ…

    8
    4

    వెంకట్రామయ్య గారికి టైఫాయిడ్ వచ్చి బాగా నీరసించి పోయారని తెలిసి తండ్రిని చూడ్డానికి రాజమండ్రి వచ్చిన భాస్కరాన్ని అంబాజీపేట దగ్గరున్న తమ పొలాలనూ కొబ్బరితోటనూ చూసి అక్కడ చెయ్యవలసిన పనులను పూర్తిచేసుకు రమ్మని చెప్పారాయన. ఆ పనులమీదే భాస్కరం ఇక్కడికి రావడం జరిగింది.

    ***

    “అబ్బాయి గారూ, మిమ్మల్ని రాత్రి బోయనానికి ఆరింటికి రమ్మని చెప్పమని పెదనాన్నగారు చెప్పారండి. ఇప్పుడే ఇటేపెల్లారండి. తిరిగెల్లేటప్పుడు మిమ్మల్ని తీసుకెల్తామన్నారండి. తయారుగా ఉండమన్నారు” అని అన్నవరం అంటుంటే భాస్కరం గతస్మృతుల్లోంచి బయట పడ్డాడు. అలాగేలే అన్నాడు అన్యమనస్కంగా. ఇన్నేళ్ళ తరువాత అకస్మాత్తుగా ఎదురైన సారస అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆమె ఇక్కడెందుకుంది? ఆ తెల్లబట్టలూ, ఆశ్రమవాసమూ ఏమిటి? ఇన్నాళ్ళ తరువాత ఆమెను ఇలా చూడ్డమేమిటి? తమ ప్రేమ భగ్నం కాకపోతే తామిద్దరూ భార్యభర్తలుగా పిల్లాపాలతో ఆనందంగా ఉండేవారు కదా! ఎంత చదువుకున్నా ఆమె చివరికి సగటు ఆడపిల్లలా పరిస్థితులకు దాసోహం అన్నది. ఆమెను పొందలేక తానెంత చిత్రవధననుభవించాడు! ఆ రోజు వాడిన ముఖంతో తమ ఇంటినించి వెళ్ళిపోయిన తరువాత ఆమెను మళ్ళీ చూడ్డం ఇదే! ఆమె తన పెళ్ళికి పిలిచినా, ఉక్రోషంతో తను వెళ్ళలేకపోయాడు. ఇంతలో పెదనాన్నగారి పలకరింపు విని, ఆలోచనల్లోంచి బయటపడి ఆయన వెంట నడిచాడు భాస్కరం.

    ***

    మర్నాడు పొద్దున్నే అన్నవరాన్ని తీసుకుని కొబ్బరితోట వైపు వెళ్ళాడు భాస్కరం. దాన్నీ, తమ వరిచేలనీ చూసుకున్న తరువాత అంబాజీపేటలోని కొబ్బరి-కోకో ప్లాంటేషన్‌ కేంద్రానికి వెళ్ళి, వెంకట్రామయ్యగారు వేద్దామనుకుంటున్న కోకో ప్లాంటేషన్‌ గురించి మాట్లాడి వచ్చాడు. ఆ వూళ్ళోనే ఉన తన బాల్యమిత్రుడి ఇంట భోజనం చేసి తోటలోని తమ ఇంటికి చేరాడు. సాయంత్రం ఒక్కడే బయలుదేరి మాతాజీ ఆశ్రమానికి వెళ్ళాడు.  ఆవిడతో కొద్ది సేపు మాట్లాడి, జంకుతూనే సారస గురించి అడిగాడు.

    “బాబూ, ఆవిడ జీవితంలో అన్నీ ఎదురుదెబ్బలే! చదువూ, సంస్కారం, ఉన్నత కుటుంబం అన్నీ ఉండీ విషాదాన్నే అనుభవించిది పిల్ల. ఆమెను గురించి మీరెందుకు అడుగుతున్నారో నాకు తెలీదు. ఈ కుటీరానికి వెనుకనున్న గదిలోనే ఆమె ఉంటుంది ఎప్పుడు ఇక్కడికి వచ్చినా.  మీరు కలవాలనుకుంటే ఆమెను ఇక్కడికే పిలిపిస్తాను” అన్నారు మాతాజీ.  భాస్కరం తల ఊపడంతో ఆవిడ సారసకు కబురు పెట్టి, బయటికి వెళ్ళిపోయారు.

    కొన్ని నిమిషాల్లో మెల్లగా లోపలికొచ్చింది సారస, వాడిన మల్లెచెండులా! ఒకప్పుడు తనది అనుకున్న సారస, తెల్లచీర లో కాంతిమాసిన చందమామలా తన ముందు ఇలా! అతని కళ్ళలో తిరుగుతున్న కన్నీటిని గమనించిన సారస తనే ముందు మాట్లాడింది.

    “ఎలా ఉన్నారు భాస్కరంగారూ? మీరిక్కడికి మళ్ళీ వస్తారని నాకు తెలుసు. మీ కోసమే ఎదురు చూస్తున్నాను”

    “సారసా, ఇదేమిటి, ఇక్కడ నువ్వు ఇలా…ఈ వేషం ఏమిటి? నిన్ను చూసి పదిహేనేళ్ళయింది. “

    “ఎక్కడుంటున్నారు? పిల్లలెందరు? మీ శ్రీమతి రాలేదా? “

    “నేను ఢిల్లీ లో ఉంటున్నాను. నా స్టూడెంట్సే నా పిల్లలు. ఇన్నాళ్ళూ నీ సమాచారం ఏదీ నాకు లేదు. మా వాళ్ళెవరూ కూడా నీగురించి నాకెప్పుడూ ఏమీ చెప్పలేదు”.

    భాస్కరం టూకీగానే తన కథనంతా వివరించాడు.

    ***

    “భాస్కరం గారూ, ఆనందంగా గడపవలసిన జీవితాలు విధిశాపంవల్ల ఎలా కూలిపోయాయో చూడండి. నా జీవితంలో మీ స్నేహంలో గడిపిన ఆ నాలుగేళ్ళు, అంతకుముందు అమ్మ జీవించి ఉండగా గడిచిన బాల్యమూ మాత్రమే ఆనందం అంటే ఏమిటో చెప్పాయి. అమ్మ పోయాకా నాన్నగారెప్పుడూ హాస్పిటలూ, రోగులూ తప్ప ఎప్పుడూ నాకు చేరువగా లేరు. నా పెళ్ళి విషయంలో తన మాటే నెగ్గాలని పట్టుపట్టి చివరికి నా జీవితం ఇలా అవడానికి కారణమయ్యారు.  ఆయన కేవలం నిమిత్తమాత్రులే. నా బతుకు ఇలా కావాలని రాసి ఉన్నప్పుడు ఆయన్ని అనుకొని లాభంలేదు. నా భర్త సురేష్ గారు దేవుడిలాంటి వ్యక్తి. మన ప్రేమ గురించి తెలిసినా, నన్ను ఎంతో గౌరవంగా చూశారు.

    దురదృష్టం నన్ను పెళ్ళి తరువాత కూడా వదల్లేదు. ప్రేమ విఫలమైనా, మంచి భర్త దొరికారని ఆనందిస్తూ ఉండగానే, మెడికల్ కాన్‌ఫరెన్‌సుకి ఢిల్లీ వెళ్ళిన సురేష్ గారు అక్కడే గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా నాకు దూరమయ్యారు. మూడు పదులు రాకుండానే వైధవ్యం వచ్చిపడింది. దేవుడి దయవల్ల అప్పటికి నాకు సంతానం కలగలేదు.  లేకపోతే నా పిల్లలు తండ్రిలేని వారయ్యేవారు. ఆయన ఉండగానే నన్ను ప్రోత్సహించి పీ హెచ్ డీ పూర్తి చేయించారు.

    ఎక్కడైనా ఉద్యోగంలో చేరదామనుకుంటూ ఉండగానే ఇలా అయింది.

    అల్లుడి మరణం నాన్నగారిని చాలా కృంగదీసింది. “నువ్వు కోరుకున్న వాడితో నీ పెళ్ళిజరిపించి ఉంటే ఇలా అయ్యేదికాదురా” అంటూ నన్ను అక్కునచేర్చుకొని బాధపడేవారు. బెంగతో ఆరోగ్యాన్ని పాడుచేసుకొని కొద్ది నెలల్లోనే ఆయనా తనువు చాలించారు. “

    చెప్పుకు పోతున్న సారస కన్నుల్లో బాష్పధారలు దోగిసలాడుతున్నాయి. భాస్కరం అచేతనుడై వింటున్నాడు.

    “భాస్కరం గారూ, ఆ పరిస్థితిలో నాకు చిన్నప్పటినించీ పుస్తకాల ద్వారా నేర్చుకున్న విషయాలే దారిచూపాయి. మనసు రాయి చేసుకున్నాను. నా జీవితం ఇంతకంటే మరి పాడవదు కదా అని సమాధానపరచుకున్నాను. జీవితంలో నేను కోరుకున్నదేదీ నాకు దొరకదని, దొరికినదేదీ నిలవదనీ తెలుసుకున్నాను. మా మామగారు ఆధ్యాత్మికతని ఆశ్రయించమని ఉపదేశం చేసారు.   ఆయన సాయంతో మా నాన్నగారి ఇల్లూ, ఆసుపత్రీ మరో డాక్టరుకి అమ్మేసి, నాన్న గారి స్వగ్రామం కోరుకొండ చేరాను. అక్కడ మాకు మరో ఇల్లు ఉంది. చాలా పెద్దది. దానిలో సగం ఒక అనాధాశ్రమానికి ఇచ్చేశాను. మిగిలిన  దాంట్లో నేనూ, నా బుక్సూ! మాతాజీ పరిచయం అయ్యాకా తరచు ఇక్కడికి వచ్చి ప్రశాంతిని పొందుతున్నాను.”

    “నేను చాలా కాలం నిన్ను మరువలేక యెంత క్షోభ పడ్డానో నీకు తెలీదు సారసా! నువ్వు హాయిగా సంసారంలో ఇమిడిపోయి ఉంటావనే అనుకున్నాను. నువ్వు ఇలా మిగలడం నాకు మళ్ళీ…” అంటూ మరి మాట్లాడ లేకపోయాడు భాస్కరం.

    “భాస్కరంగారూ, మనం ఒకసారి వైజాగు బీచిలో కూర్చున్నప్పుడు రామాయణం మీద చర్చించుకున్నాం గుర్తుందా మీకు? భరతుడితో రాముడు అన్న మాటల గురించి చెప్పుకుంటూ ఈ శ్లోకాన్ని అనేక సార్లు అనుకున్నాం మీకు జ్ఞాపకం ఉందా? నాకు చాలా ఇష్టం అప్పట్లో ఇది.

    యథా కాష్టంచ కాష్టం చ
    సమయేతాం మహోదధౌ
    సమత్యచ వ్యపేయేతాం
    తద్వద్భూత సమాగతం

    వరదనీటి ప్రవాహంలో కొట్టుకొస్తున్న కట్టెలు ఆ ప్రవాహంలో ఒకసారి కలిసి ప్రయాణిస్తుంటాయి. కొంత సేపటికి వరదవడికి, కెరటాల తాకిడికి విడిపోయి, దూరమైపోతూ ఉంటాయి. అవి ఒడ్డుకి చేరనూవచ్చు, ములిగిపోనూ వచ్చు. కానీ మళ్ళీ కలుస్తాయా అన్నది అనుమానమే!

    ఈ శ్లోకాన్ని ఎందుకు ఇష్టపడ్డానో అప్పుడు! నా జీవితానికే బాగా అతికింది ఇది. ఎప్పటికీ ఒడ్డుని చేరకుండా నిరంతర ప్రవాహంలో కొట్టుకుపోయే కట్టెను నేను. నాతో పాటు కొంత ప్రయాణించి, మీకు విధించబడ్డ తీరాలను చేరిన వారు మీరు, నాభర్త, నాన్నగారు, అమ్మాను! నేను ఎప్పటికీ ఎవరితోనూ శాశ్వతబంధం ఏర్పడని ఒంటరి కట్టె లాగ మిగిలిపోయాను. ఈ కట్టె కడతేరేలోగా ఇంకెన్ని కాష్టాలతో సహప్రయాణం చెయ్యాలో, భగవంతుడు ఏంరాశాడో నా నుదుటిమీద”

    సారస నోట భారంగా వస్తున్న మాటలు వింటూ భాస్కరం మరింత ఖిన్నుడైపోయాడు.

    “అంత మాట అనకు సారసా! నువ్వు ఎంచుకున్న ఈ మార్గమే నిన్ను తీరం చేస్తుంది” అని మాత్రం అనగలిగాడు.

    “ఇప్పుడైనా మీరు పెళ్ళి చేసుకొని ఓ ఇంటివారవండి భాస్కరం గారూ” అన్నది సారస పెదవిదాటి రాలేని నవ్వుతో.

    “సారసా, నువ్వు ప్రవాహంలో కొట్టుకు పోతున్న కాష్టానివైతే, నేను అతీ గతీ లేని ఎడారిలో దారితప్పి తిరిగే బాటసారిని. మన జీవితాలు ఇలాగే గడవాలని విధి లిఖితమేమో! ” అంటూ సెలవు తీసుకొని భారంగా అడుగులేస్తూ బయటికి నడిచాడు భాస్కరం.

    శిలలా నిలబడి చూస్తోంది సారస!

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here