జీవిత సత్యాల ‘యాత్ర’

0
2

[dropcap]ఈ[/dropcap]మధ్య చాగంటి తులసి గారి ‘యాత్ర’ చదివాను. చక్కని నవలిక ఇది.

కొంత వయసొచ్చాకా ప్రతీ మనిషిలోనూ ఓ రకమైన అన్వేషణ మొదలవుతుంది. తానెంటీ, తన జీవనం ఏంటి? ఇదేనా జీవితం, ఇంకా మెరుగ్గా జీవించగలమా అన్న ప్రశ్నలు వేసుకుంటాడు. కాలం మారుతూంటుంది… కాలంతో పాటు కొన్ని అభిప్రాయాలను, పద్ధతులనూ మార్చుకోవాలి. అన్నేళ్ళు పాటించిన/అవలంబిన పద్ధతులు, విధానాలు… మారే కాలంలో నప్పకపోతే… ఇన్నాళ్ళు పాటించినవే కదా… ఇప్పుడెందుకు అమలు చేయకూడదనుకుంటూ వాటినే పట్టుకుని వేలాడితే… జీవితంలో ఘర్షణ చెలరేగుతుంది. కుటుంబాలలో అభిప్రాయభేదాలు తలెత్తి బంధాలు బీటలు వారుతాయి. అపోహలు ఏర్పడి కలతలు రేగుతాయి… అలాంటప్పుడే బంధాల్ని తెంచుకుని తమ బ్రతుకు తాము బ్రతుకుదామని కొందరు ప్రయత్నిస్తారు.

కాలంతో పాటు మారుతూ, జీవితంలోని ఒడిదుడుకులను ఆహ్వానిస్తూ, తాముంటున్న ప్రాంతంలోని సంప్రదాయాలను గౌరవిస్తూ కాలానికి తగ్గ ఆచారాలని పాటిస్తూ, నప్పని వాటిని బలవంతంగా పాటించాలనే నిర్బంధం లేకుండా స్వచ్ఛందంగా వదులుకుంటూ జీవనయానం సాగించేవారు సంతృప్తిగా ఉంటారు. అటువంటివారిని చూసి మరికొందరు నేర్చుకోవాలనుకుంటారు. ఇంకొందరు నేర్చుకొని, జీవన విధానాన్ని మార్చుకోవాలనే సంకల్పం స్వీకరిస్తారు. ఏదీ శాశ్వతం కాదు, మార్పు తప్ప అని నిరూపితమవుతుంది.

***

అమ్మన్న అనే ఆవిడ కలకత్తా నుంచి కటక్ లోని తన స్నేహితురాలు సీతమ్మగారింటికి వస్తారు. స్నేహితురాలిని చూడ్డానికి వచ్చారని పాఠకులు తొలుత భావిస్తారు. సీతమ్మగారి కుటుంబం కూడా ఆమెకి ఊళ్ళోని వింతలూ, విశేషాలు చూపించి, పూరీ జగన్నాథస్వామి దర్శనం చేయిస్తారు. పది రోజులు దాటిపోతాయి. ఈ క్రమంలో చదువరులకు తెలుస్తుంది – అమ్మన్నగారు తన కొడుకు కోడల్ని వదిలిపెట్టి వచ్చేశారనీ, వాళ్ళతో ఇక ఇమడలేనని, తాను విడిగా ఉండాలని నిర్ణయించుకుని వచ్చారని!

కానీ సీతమ్మ గారి కుటుంబంలో సభ్యులు నడుచుకునే తీరు, అందంగా జీవనం సాగిస్తున్న వైనం, చుట్టూ ఉండే ఒడియా వారి పద్ధతులని గౌరవిస్తూ, వారిలో ఒకరిలా మసలుకుంటూ జీవితాన్ని సంతోషంగా గడపటం చూసిన అమ్మన్నగారిలో ఆలోచన మొదలవుతుంది.

ఈ ఊరు వచ్చిన కొత్తలో తాను క్షేమంగా కటక్ చేరానని కొడుక్కు ఉత్తరం వ్రాయించడంతో, ఆ అడ్రసు పట్టుకుని ఆమె కొడుకు తీసుకువెళ్ళడానికి వస్తాడు. బతుకు ఒక సర్దుబాటు అని ఈ యాత్రలో గ్రహించిన అమ్మన్నగారు సంతోషంగా తిరుగుముఖం పడతారు. ఇదీ కథ.

***

“మా వాళ్ళకి విజయనగరం అంటే నచ్చదమ్మా! ఏభై అరవై ఏళ్ళ క్రితం ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే ఉందంటారు. ఎన్నెన్ని ఊర్లో మారేయట కాని విజయనగరంలో ఎదుగూ బొదుగూ లేదుట…” అని అమ్మన్న గారు సీతమ్మ కోడలు లక్ష్మితో అంటే, బదులుగా ఆమె కలకత్తా గురించి “ఏ టైమ్‌లో చూసినా ఏమిటో కొంపలంటుకుపోతున్నట్టు పరుగుల మీద ఉంటారు. ఆ స్టేషన్ దగ్గరనుంచి చూస్తే రోడ్డు క్రాస్ చేస్తున్నవారు మనుషుల్లా అనిపించరు. చీమల పుట్టల్లోంచి బిలబిల్లాడుతూ చీమల్లా ఉంటారు” అంటుంది. చూసే దృక్పథాన్ని బట్టి కనబడే దృశ్యం ఒక్కొక్కరికి ఒకలా కనిపిస్తుంది.

మరో సందర్భంలో “మనల్నాడించే వాడు ఆ పైవాడు” అని అమ్మన్న గారు అంటే బదులుగా సీతమ్మగారు “మనం ఆడ్డం మన చేతిలోనే ఉందే అమ్మన్నా! వాడు కాదు ఆడించేవాడు! మన బుద్ధీ, మన మనస్సూ మనల్ని తైతెక్క లాడిస్తుంది. మనం చేసే ప్రతి పనినీ, ఆ కనిపించని వాడికి అంటకట్టి లబోదిబోమనడం మనకి అలవాటైపోయింది” అని అంటారు. ఆ కాలంలోనే ఎంతటి స్థిరమైన అభిప్రాయం!!

ఓ సందర్భంలో సీతమ్మగారి అబ్బాయి స్నేహితుడు ఓ ఒడియా పాట పాడితే విని ఆస్వాదిస్తారు అమ్మన్నగారు. “లయలో ఉన్న తియ్యదనానికి భాష ఎందుకు? మనిషిని మనిషిగా చూస్తే, జాతీ భాషా అడ్దొస్తాయా? ఏ అడ్డులూ లేనిది సంగీతం. ఏ ఎల్లలూ లేనిది మానవత్వం! ఏ అడ్దులూ లేనిది జీవన మాధుర్యం” అని అంటారు తులసి గారు. ఎంత చక్కని అవగాహన!

ఇంకో సందర్భంలో “చూడు అమ్మన్నా! కాలం మారుతోంది. కాలంతో పాటు మన బతుకులూ మారుతున్నాయి. మన తాతలు నానమ్మలూ బతికినట్టు మనం బతికేమా? మనం బతికినట్టు మన పిల్లలు బతుకుతారా? మన పిల్లలు బతికినట్టు మన మనవలు బతుకుతారా? తర తరానికీ మార్పు ఉంటుంది. అందులో ఈ రోజుల్లో చాలా తొందరగా మార్పు వస్తోంది. ఇప్పటి బతుకులే ఉరుకుల పరుగుల బతుకులు! ఆ పరుగులో వెనకవి వెనుకబడిపోతాయి. ముందువాటిని అందుకుంటూ పరిగెట్టాల్సిందే. మనం సుఖపడాలి అంటే పరుగులో వెనుకబడిపోకూడదు. అందరి అడుగులతో బాటు మన అడుగులూ పడాలి” అంటారు సీతమ్మగారు. 1979 నాటికే ఈ మాటలు సరైనవి అనుకుంటే ఇప్పటి కాలానికి శిరోధార్యాలు అవుతాయి.

తెలుగమ్మాయిని పెళ్ళి చేసుకుని ఒరియా యువకుడి మిశ్రో తల్లి అంటుంది “బతుకంటేనే సద్దుకోడం! నీ కోసం నేనూ, నా కోసం నువ్వూ సద్దుకుంటేనే బతుకు సరిగ్గా వెళ్తుంది. పెళ్ళి చేసుకుంటేనే సద్దుకు బతకడం ఎలాగో తెలుస్తుంది. వస్తుంది! పట్టు పడుతుంది. ఒకళ్ళ కోసం తనకిష్టమైనది వదులుకోవడం, ఒకళ్ళ కోసం తన కయిష్టమైనవి అలవర్చుకోవడం ఎలాగో ఏమిటో తెలుస్తుంది” అని. ఇదే సూత్రాన్ని పెద్దది చేసి మొత్తం సమాజానికి వర్తింపజేస్తారు తన మాటలతో సీతమ్మగారు. అవి ఎవరికి వారు చదువుకుని జీర్ణించుకోవలసిన వాక్యాలు.

“నువ్వు నీ చుట్టూరా ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే నీ మనస్సు విశాలమవుతుంది. సంకుచిత్వం పోతుంది. నీ బతుకుని నువ్వు హాయిగా బతకగలవు. ఇతరుల కష్టాల్నీ తీర్చగలవు. నువ్వు నవ్వుతావు. నీ చుట్టూరా ఉన్నవాళ్ళని నవ్విస్తావు. నువ్వూ వాళ్ళతో కలిసి నవ్వుతావు” అనే సీతమ్మగారి మాటలు జీవిత సత్యాలు.

కొడుకుతో కలకత్తా బయలుదేరుతూ తాను నేర్చుకున్న ఒడియా పాటని పాడతారు అమ్మన్నగారు. “మనం ఇద్దరం మన మన త్రోవలంట వెళ్ళిపోదాం, వెనకటి సంగతులన్నీ మనస్సులో పదిల పర్చుకొని వెళ్ళిపోదాం” అని దాని భావం.

చదివించే నవలిక ‘యాత్ర’.

***

యాత్ర (నవలిక)
రచన: చాగంటి తులసి
ప్రథమ ప్రచురణ: 1979, ద్వితీయ ప్రచురణ: 2018
ప్రచురణ: ఎన్.కె. పబ్లికేషన్స్
పుటలు: 159, వెల: 120/-
ప్రతులకు:
గురజాడ బుక్ హౌస్,
షాప్ నెంబర్ 1, ఎన్.జీ.వో. హోమ్,
తాలూకా ఆఫీస్ రోడ్
విజయనగరం – 535002

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here