‘యాత్ర’ చూద్దామా – ముగింపు

0
2

[dropcap]ఎ[/dropcap]లాంటి ప్రయాణమైనా పూర్తవక తప్పదు.

‘యాత్ర’ చూద్దామా కాలమ్ ఈ వారంతో ముగుస్తుంది. నిజానికి ఇంకా 13,14,15 ఎపిసోడ్లు ఉండాలి. కానీ దూరదర్శన్ వారి వద్ద కూడా అవి లభ్యం కాకపోవడంతో, యూట్యూబ్‌లోనూ అందుబాటులో లేవు.

‘యాత్ర’ సీరియల్ పొడవునా గోపాలన్ నాయర్ వ్యాఖ్యానంతో కథ నడుస్తుంది. కన్యాకుమారి నుంచి జమ్మూతావి దాకా ఒక మార్గంలోని ప్రయాణాన్నీ, రాజస్థాన్ లోని జైసల్మేర్ నుంచి అస్సాం లోని ‘డూమ్ డూమా’ వరకు రెండో మార్గంలో ప్రయాణాన్నీ చూపిన ఈ టెలీ సీరియల్ భారతదేశంలోని భిన్నత్వాన్ని చాటుతుంది. భౌగోళికంగా భిన్నత్వం ఉన్నా, భారతీయత అనే ఏకత్వం అంతర్లీనంగా ఉన్నట్టుగానే, రైలు ప్రయాణీకులలో కూడా ఈ లక్షణాలు ద్యోతకమవుతాయి.

ఇది రైల్లో సాగిన సీరియల్ కాబట్టి ‘ప్రయాణం’ కేటగిరీలో వేస్తాం, కానీ ఇదే రైలులో కాకుండా ఇంటి సెట్‌లో కథని నడిపిఉంటే గొప్ప ‘సోషల్ సీరియల్’ అయి ఉండేది. రైలు ఆయా స్టేషన్ల గుండా సాగుతూంటే, మానవుల సహజ స్వభావాలను దర్శకులు గొప్పగా పట్టుకున్నారు. ఒక్కో ఎపిసోడ్‌లో నన్ను బాగా ఆకర్షించిన విశేషాన్ని ఇక్కడ మళ్ళీ చెప్తాను. ఒకరకంగా ఇది 12 ఎపిసోడ్ల సారం అనుకోవచ్చు.

***

ఎపిసోడ్-1 లో భావుకుడైన భర్త, అంతగా భావుకత్వం లేని, ప్రాక్టికల్‌గా ఆలోచించే భార్య… తన ఆలోచనలని తనలోనే దాచుకునే భర్తా…. భర్త ఆలోచనలు తనకి తెలిస్తే తమ సంసారం సామరస్యంగా ఉంటుందనుకునే భార్య… ఇలా వీళ్ళిద్దరూ దేశంలోని ఎందరో దంపతులకు ప్రతీకగా ఉంటారు. ఈ ఎపిసోడ్‌లో రైల్లో ప్రయాణించేవారి స్వభావాలనీ, ధోరణులనీ, కాస్తంత అసౌకర్యాన్ని కూడా సహించలేనితనాన్ని అత్యంత సహజంగా చిత్రీకరించారు. మనలో చాలామంది ఇప్పటికీ ఇటువంటి వారిని చూస్తూనే ఉంటాం.

ఎపిసోడ్-2 లో కొత్త ఆశలలో వెళ్ళేవాళ్ళు, ఉన్న ఊరిని వదిలి వెళ్ళేందుకు సంశయించేవారు, ఆత్మీయులని పోగొట్టుకుని కొత్త ప్రదేశానికి వెళ్ళడానికి వెనుకాడడం… గ్రూప్‌గా ప్రయాణిస్తున్నవారిలో ఒకరో యిద్దరో వెనుకబడిపోవడం, మరికొందరు వారిని వెతుక్కోంటూ వెళ్ళడం, మిగతావారు వాళ్ళొచ్చి రైలెక్కేంతవరకూ ఆందోళన పడడం… ఇవన్నీ తెరపై చూడడం బావుంటుంది. “రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు మనకి గమ్యమే ముఖ్యం. కానీ జీవితపు యాత్రలో గమ్యం కన్నా గమనమే ముఖ్యం” అని నాయర్ నోట గొప్ప సత్యాన్ని పలికిస్తారు దర్శకులు.

ఎపిసోడ్-3 లో ఆనాటి రైస్ స్మగ్లర్ల అతి తెలివితేటలని చూపిస్తారు దర్శకులు. ఆడపిల్లలను కనే తల్లుల పట్ల అప్పట్లో సమాజంలో ఉన్న వ్యతిరేకతని రేఖా మాత్రంగా చూపించారు. ఆడపిల్ల పుడుతుందేమోనని గర్భవతి భయపడడం, ఓ కన్నీరు చుక్క కార్చడం నాటి సమాజంలోని దురాచారాలను కళ్ళకు కడుతుంది. అందమైన అమ్మాయి కనబడి కాస్త దగ్గరగా మసలుకుంటే, ఊహల్లో తేలిపోయే కుర్రాళ్ళూ అప్పుడూ ఉన్నారూ, ఇప్పుడూ ఉన్నారని రాహుల్ ఉదంతం గుర్తు చేస్తుంది.

ఎపిసోడ్-4 లో రైలు నెమ్మదిగా వచ్చి విజయవాడ స్టేషన్‌లో ఆగుతుంది. మనకెంతో పరిచితమైన ఈ స్టేషన్‌ 33 ఏళ్ళ క్రితం ఎలా ఉందో తెర మీద చూడడం బావుటుంది. ప్లాట్‌ఫామ్ మీద  డిస్‌ప్లే‌లో ఉన్న పోస్టర్స్ సినీరంగానికీ, విజయవాడ నగరానికీ ఉన్న అవినాభవ సంబంధాన్ని చెప్పకనే చెబుతాయి. నగలు ధరించే విషయంలో తెలుగువారి స్వభావాన్ని ఈ ఎపిసోడ్‌లో చూస్తాం. అప్పట్లో విజయవాడ మార్గంలో రైల్లో దొంగతనాలు చేయడానికి అగంతకులు ఎలా రెక్కీ చేసేవారో ఈ ఎపిసోడ్‌లో చూస్తాం.

ఎపిసోడ్-5 లో రైల్లో జరిగిన దొంగతనం చూస్తాం. ప్రయాణీకులు సంఘటితంగా దొంగల్ని వెంబడించి సొత్తుని చేజిక్కించుకుంటారు. తమని ఎదిరించిన వేణుగోపాల్ అనే వ్యక్తి అడ్డు తొలగించుకోడానికి భూస్వాములు తెగించడం, చూస్తాం. తోటి వారికి సాయం చేయాలనుకునే వారు ఉన్నట్టే, మనకెందుకులే అనుకునే వారూ ఉంటారని ఈ ఎపిసోడ్ తెలుపుతుంది.

ఎపిసోడ్-6 లో ఓ భార్య బంధం తెంపుకోవాలని అనుకుంటుంటే, దాన్ని నిలుపుకోవలనుకుంటాడు భర్త. తన తండ్రి ఇంట జరిగే ఓ వేడుకకి భార్యని బలవంతంగా ఒప్పించి తీసుకెళ్ళడం… రాజీకి ప్రయత్నిస్తాడు… ఇలాంటివి ఘటనలు మనక్కూడా ఏదో ఒక ప్రయాణంలో తారసపడేవే. మద్యం వల్ల కలిగిన ప్రమాదంతో దాని దుష్పరిణామాలు గ్రహించి తనంతట తానుగా మద్యం మానేస్తాడో వ్యక్తి. అతనిలో అప్పటిదాక నిబిడీకృతమైన ఉన్న శక్తి బయల్పడుతుంది.

ఎపిసోడ్-7 లో ప్రసవానికి పుట్టింటికి వెళ్తున్న ఒంటరి మహిళకి రైల్లోనే పురుడొస్తుంది. ఓ వైద్యురాలు, ఓ వృద్ధ వనిత కలిసి డెలివరీ చేస్తారు. స్వామీజీ అనారోగ్యంతో ఉంటే స్టేషన్‍లో ఉండే వైద్యుడు వచ్చి పరీక్షిస్తాడు. అప్పట్లో ఇలా స్టేషన్‌లలో వైద్య సహాయం లభించేది.

ఎపిసోడ్-8 లో ప్రయాణమంటే సంతోషాలూ ఉత్సాహాలతో పాటూ సమస్యలూ ఇబ్బందులు కూడా ఉంటాయని తెలుస్తుంది. మనిషి జీవితంలో అన్ని ఘటనలు – బాధ అయినా, దుఃఖం అయినా, ఉల్లాసం అయినా, సంతోషం అయినా ప్రయాణంలో మనిషి తోడుంటాయి. ఒక్కోసారి మనిషికంటే అవే ముందుంటాయి కూడా అని ఈ ఎపిసోడ్ చెబుతుంది. అందరం ఏదో ఒకనాడు మట్టిలో కలిసిపోవలసివాళ్ళమేనని అంటూ, మానవ జీవితపు ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటో గ్రహించి దాన్ని సాధించేందుకు కృషి చేయాలని అంటారు స్వామీజీ.

ఎపిసోడ్-9 లో “ప్రతీ వ్యక్తీ ఎక్కడికోక్కడికి చేరుకోవాల్సిందే. ప్రతీ మనిషికీ తనకంటూ ఓ గమ్యం ఉంటుంది” అంటూ నేపథ్యంలో నాయర్ గొంతు వినిపిస్తుంది. పర్యాటక స్థలాలలో మహిళలను, ముఖ్యంగా విదేశీ మహిళలను వేధించడమనే జాడ్యం 30 యేళ్ళ క్రితమూ ఉందని ఈ ఎపిసోడ్ చెబుతుంది. అవిద్య, అనారోగ్యం, అంధవిశ్వాసాలు ఒకనాడెంత బలంగా రాజ్యం చేశాయో ఈ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. ప్రయాణంలో సామాన్యులు ఎంత హాయిగా ఉండగలరో, ఇరుక్కుని ప్రయాణం చేస్తున్నా, హృదయాలు విశాలంగా చేసుకుని ఉదారంగా ఉండగలరో తెలుస్తుంది.

ఎపిసోడ్-10 లో “గత ఏడాది జోధ్‌పూర్ – ఆగ్రా ట్రెయిన్‌లో డ్యూటీ వేశారు. ప్రతీ రోజూ రైల్లోంచి మా ఇల్లు చూస్తాను… కానీ ఇంటికి వెళ్ళే అదృష్టం కలగడం లేదు…” అంటూ వాపోతాడో టిటిఇ. గేటు మూసి ఉన్నప్పుడు పట్టాలు దాటడానికి ప్రయత్నించి రైలు ఢీ కొట్టి చనిపోతాడో గ్రామస్థుడు. “యుద్ధంలో ఎన్నో చావులు చూసాను. కాని  ఇలాంటి దుర్ఘటనలు చూస్తే మనిషి జీవితం ఎంత అల్పమో అర్థమవుతుంది” అనుకుంటాడు నాయర్. రైల్వే ఉద్యోగులపై ఉండే ఒత్తిడి వారి మానసిక స్థితినీ, వారి కుటుంబ జీవితాలని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ ఎపిసోడ్‌లో చూపిస్తారు. ఆధునిక కాలంలో మనం మాట్లాడుకుంటున్న ‘స్ట్రెస్’ అప్పుడూ ఉండేది.

ఎపిసోడ్-11 లో నవదంపతులిద్దరూ తాజ్‌మహల్ చూసి అబ్బురపడతారు. షాజహాన్ తన భార్య స్మృతిలో నిర్మించాడని భర్త భార్యకి చెబుతాడు. ఆ రాజు తన భార్యని అంతగా ప్రేమించాడా అంటుంది భార్య. ఓ ముస్లిం పండితుడు రైలెక్కుతాడు. బోగీలో ఉన్నవారి మధ్య మతాల సారం, మత సామరస్యం, లౌకికవాదంపై చర్చ జరుగుతుంది.

ఎపిసోడ్-12 లో మొదటి సన్నివేశాలు అంతగా చదువుకోని, గ్రామీణ మహిళల సహజ ఉత్సుకత, బాగా చదువుకుని ఉద్యోగం చేసుకుంటూ రిజర్వుడ్‌గా ఉండే పట్టణ నేపథ్యపు మహిళల మధ్య ఉండే తేడాని కళ్ళకు కడతాయి. తాము స్థానికులమంటూ, విద్యార్థులమంటూ ఏ బోగీలోనైనా ఎక్కే హక్కు తమకుందంటూ కొందరు గోల చేస్తారు. ఇది ఇప్పటి మూకస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అప్పుడూ, ఇప్పుడూ నోరున్నవాడిదే రాజ్యమనేది ‘మూకస్వామ్యం’లో బలంగా వినబడుతుంది.

***

“A journey never ends. Only the travellers end” అని అంటారు José Saramago. ఎంతో నిజం. అలాగే, “It is good to have an end to journey toward; but it is the journey that matters, in the end” అని Ernest Hemingway చెప్పినదీ గుర్తుంచుకోవాలి. యాత్రల ముగింపు గురించి మరో చక్కని కొటేషన్ Antonio Brown చెప్పారు – “The journey is never-ending. There’s always gonna be growth, improvement, adversity; you just gotta take it all in and do what’s right, continue to grow, continue to live in the moment”. ఇంకా, “People don’t take trips, trips take people” అని John Steinbeck అన్న మాటలు ఎంతో విలువైనవి.

ఈ యాత్ర టెలీసీరియల్‌ని టూరిస్ట్ దృక్పథం నుండి కాకుండా ట్రావెలర్ దృక్కోణం నుంచి చిత్రీకరించారు కాబట్టి – ప్రయాణం చేస్తూనే, ఎందరెందరినో కలవడం, వాళ్ళ కథలు తెలుసుకోవడం, వాళ్ళ సమస్యలు వినడం… జరిగి వీక్షకులు కూడా కథలో లీనమవుతారు. అన్ని ఎపిసోడ్లు చూడడం పూర్తయ్యాకా, ఒక చక్కని ట్రావెలోగ్ చదివిన భావన కలుగుతుంది.

భారతదేశాన్ని అనుభూతి చెందాలంటే అప్పుడూ ఇప్పుడూ రైళ్ళే ఉత్తమం. కాకపోతే సమయమూ, తోటి ప్రయాణీకుల పట్ల సహిష్ణుత ఉండాలి.

‘దోస్త్’ సినిమాలో కిషోర్ కుమార్ అద్భుతంగా పాడిన “గాడీ బులా రహీ హై సీటీ బజా రహీ హై” అనే పాట మరోసారి గుర్తుచేసుకుందాం. “ఆతే హైఁ లోగ్, జాతే హైఁ లోగ్” అనీ, “చల్‌నా హీ జిందగీ హై, చల్‌తీ జా రహీ హై” అంటారు గీత రచయిత ఆనంద్ బక్షీ. ఈ పాటని అత్యద్భుతంగా స్వరపరిచింది లక్ష్మీకాంత్ ప్యారేలాల్.

ఏ ప్రయాణమైనా ఓ అందమైన పాటలాగా సాగాలని కోరుకుంటూ… సెలవు.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here