[dropcap]మ[/dropcap]నం ఏ ఊరికైనా వెళ్తున్నామంటే, ప్రయాణం తేదీ దగ్గర పడేకొద్దీ, ఓ రకమైన ఉత్సుకత తలెత్తుంది, రైలు ప్రయాణం, కిటికిల నుంచి చెట్లూ చెరువులు, పక్షులను చూడడం, తోటి ప్రయాణీకులతో ముచ్చట్లు… ఆ ఊరు చేరాకా మనం కలవబోయే మనవాళ్ళు… ఇలా ప్రయాణం తేదీ సమీపించే కొద్దీ ఉత్సాహం కలుగుతూంటుంది. అదే విధంగా ఈ ఆదివారం ఈ సిరీస్ ప్రారంభించడానికి నేనూ అంతే ఆసక్తిగా ఉన్నాను. నా ఈ ప్రయాణాన్ని ఎప్పుడెప్పుడూ మొదలుపెడతానా అని నాలో తహతహ!
***
శ్యామ్ బెనెగళ్ గారి ‘యాత్ర’ ధారావాహిక మొదటి ఎపిసోడ్ ఒక రైలుని, స్టేషన్‌లో రైల్వే సిబ్బందినీ, ప్లాట్‌ఫాం మీద ప్రయాణీకులని చూపిస్తూ, రైల్వేల గురించి ఒకటి రెండు వ్యాఖ్యలతో ప్రారంభమవుతుంది.
తర్వాత ఇరువైపులా పచ్చని కొబ్బరి చెట్లు ఉన్న ట్రాక్ మీదుగా రైలు వెళ్ళడం చూపిస్తారు. ఆ వెంటనే కన్యాకుమారిలో వివేకానంద రాక్ వెనుకగా సూర్యోదయం అవడాన్ని చూపిస్తారు. పక్షుల కూతలతో, సముద్రం నుంచి సూర్యుడు ఉదయించడాన్ని గోపాలన్ నాయర్ అనే సైనికుడు (ఓం పురి) తన గెస్ట్‌హౌస్ గది బాల్కనీలోంచి చూస్తూంటాడు. భార్య పిలుస్తుంది లోపలికి రమ్మని. సూర్యోదయాన్ని పూర్తిగా తిలకించి, పక్షుల కిచకిచలను ఆలకించి లోపలి వస్తాడు.
“ఇంకో రెండు మూడు గంటలలో వెళ్ళిపోతారు కదా, బయట ఒంటరిగా ఎందుకు నిలుచున్నారు?” అని అడుగుతుంది భార్య.
“బయట వివేకానంద రాక్ వెనుకగా సూర్యోదయం ఎంత అద్భుతంగా ఉందో తెలుసా?” అంటాడు.
“దొరికిందే ఒక నెల రోజుల సెలవు… దాన్లో కూడా స్నేహితులు, బంధువులను చూడ్డానికే చాలా కాలం పోయింది….” అంటుంది. “మనం ఇద్దరమే గడపడానికి చాలా తక్కువ సమయం దొరుకుతుంది. అలా దొరికినప్పుడు కూడా ఒంటరిగా గడిపేస్తున్నారు” అంటూ అలుగుతుంది. తనని అనునయించి, “సరే, టీ చెప్పి, సామాన్లు ప్యాక్ చేయి. నేను స్నానం చేసి వస్తాను” అంటూ బాత్రూమ్లోకి వెళ్ళబోతాడు.
“అసలు ఈ సైన్యంలో ఎందుకు జేరారు? ఏవైనా వేలకి వేలు జీతాలా?” అంటుంది (ఇలా అడగడంలో భర్త తన సమక్షంలో ఉండడనే బాధ తప్ప, సైనిక వృత్తిపై కోపం కాదు).
“సైన్యంలో పని చేయడం తప్ప నాకింకేం రాదుగా” అంటూ బాత్రూమ్లోకి వెళ్ళబోతాడు.
“కృష్ణన్ ఉత్తరం రాశాడు… మిమ్మల్ని దుబాయ్ పంపించమంటున్నాడు… అక్కడ బాగా సంపాదించుకోవచ్చట…” అని చెప్తుండగానే…. “వచ్చి వింటాను” అంటూ బాత్‌రూమ్‌లో దూరతాడు.
“మూడేళ్ళ కొకసారి సెలవు దొరుకుతుంది అతనికి” అంటూ లోపలినుంచి చెప్తాడు.
“నేనేం అడుగుతున్నాను, మీరేం చెబుతున్నారు? ఎప్పుడూ సరిగా మాట్లాడరు” అంటూ లేచి సామాన్లు సర్దడం మొదలుపెడుతుంది.
***
స్నానం చేసి వివేకానంద రాక్ చూడ్డానికి వస్తాడు. అక్కడ ఓ తల్లి పిల్లాడికి సముద్రంలో స్నానం చేయించి, నీటితో శ్రీరామరక్ష అని దిగతుడుస్తుంది. జాలర్లు సముద్రంలోకి వెళ్ళడానికి తమ వలలు సరిజేసుకుంటుంటారు. వీళ్లని దాటుకుని కొంచెం ముందుకు వెళితే… అక్కడ కొందరు తమ పెద్దలకి తర్పణాలు వదులుతుంటారు.
ఒక వృద్ధ మరాఠీ జంట ఒక రాగిచెంబులో చితాభస్మాన్ని తెచ్చి కన్నీళ్ళతో సముద్రంలో కలుపుతారు. ‘అయ్యో’ అనుకుని ఓ క్షణం ఆగి, మరో వైపు కదులుతాడు. ఆ దంపతులు భారమైన హృదయంతో వచ్చి ఓ పడవ మీద కూర్చుంటారు. కట్నం ఎక్కువ ఇచ్చుకోలేని కారణంగా అత్తవారింట్లో వేధింపులకు గురై వాళ్ళ కూతురు ఆత్మహత్య చేసుకుందట! “అదనపు కట్నం ఇచ్చి ఉంటే అమ్మాయి బ్రతికేది” అని భార్య; “భర్తని విడిచి పుట్టింటికి వచ్చేస్తానంటే నువ్వే వద్దన్నావు…” అని భర్త అనుకుంటారు. ఆనాటి సమాజంలో ప్రబలంగా ఉన్న ఓ సామాజిక దురాచారాన్ని ఈ సన్నివేశం ఆర్ద్రంగా కళ్ళకు కడుతుంది. మొత్తానికి వాళ్ళ కడుపుకోత తీరేది కాదు. ‘రైలుకి టైమ్ అవుతోంది, స్టేషన్‍కి వెళ్ళాలి’ అంటూ వాళ్ళు అక్కడ్నించి కదులుతారు.
***
తదుపరి దృశ్యం స్టేషన్‌లో ప్లాట్‌ఫాం మీద ఇంజన్‍ని బోగీలతో కలపడం చూపిస్తారు. ఢిల్లీలో ప్రదర్శన ఇవ్వాల్సిన ఒక బృందంలో వారికి ప్రయాణ ఏర్పాట్లలో ఏవో అవరోధాలు ఎదురవుతాయి. ఆ ట్రూప్ నిర్వాహకుడి పాత్ర పోషించిన ‘హరీష్ పటేల్’ ఎవరికో ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతాడు. రైలు బోగీలని అన్నీ తనిఖీ చేసి ప్రయాణానికి సిద్ధం అని నివేదించే అధికారి పరిశీలిస్తాడు. అవసరమైన చిన్న చిన్న రిపేర్లు చేయిస్తాడు.
***
సముద్రంలో లాంచి ఎక్కుతాడు నాయర్. జనాల్ని దాటుకుంటూ వచ్చి ఓ స్వామీజీ పక్కన కూర్చుంటాడు. ఆ స్వామీజీకి అనారోగ్యంగా ఉంటుంది. వెంట ఉన్న వైద్యుడు మందలిస్తాడు – ‘బయటకు ఎందుకు వచ్చారు’ అంటూ. “డాక్టరు గారూ, స్వామీజీ ఎవరి మాటా వినరు” అంటాడు శిష్యుడు. “హిమాలయాలకి వెళ్ళాలని స్వామీజీ నిర్ణయించుకున్నారు, టికెట్లు కూడా రిజర్వ్ చేయించుకున్నాం” అంటాడు శిష్యుడు. “వీల్లేదు, రెండు వారాల పాటు వీరికి సంపూర్ణ విశ్రాంతి అవసరం” అంటాడు వైద్యుడు.
“నేను నా చివరి యాత్రకు సన్నద్ధమవుతున్నాను డాక్టర్ గారూ, వెళ్ళనివ్వండి” అంటారా స్వామీజీ. తనువు చాలించే ముందు హిమాలయాల దర్శనం చేసుకోవాలని ఆయక కోరిక. “మీరీ పరిస్థితిలో ప్రయాణం చేయకూడదు” అని వైద్యుడు చెబితే, “ఏం పర్వాలేదు. చాలా తేలిక. ఇక్కడ రైలు ఎక్కుతాను, మూడు రోజుల తర్వాత దిగుతాను… ఇబ్బందేముంది?” అంటారా స్వామీజీ. శిష్యుడు కూడా ఈ యాత్రలో స్వామీజీ వెంటే ఉంటాననేసరికి వైద్యుడికి సరేననక తప్పదు.
***
భార్యతో కలిసి పడవెక్కి, వివేకానంద రాక్ మెమోరియల్‌కి వస్తాడు నాయర్. “మళ్ళీ మీరొచ్చేది, ఏడాది తర్వాతేగా?” అని అడుగుతూ, “అన్నాళ్ళు నేను ఒంటరిగా ఎలా ఉండను?” అంటుంది. “ఆ తర్వాత ఫ్యామిలీ పోస్టింగ్ ఇస్తారు… అప్పుడు కలిసే ఉండచ్చు” అంటాడు. సముద్రం అలల ఉధృతిని చూస్తూండిపోతాడు. “ఏమాలోచిస్తున్నారు?” అని భార్య అడిగితే, “ఇటు చూడు ఆ వైపు బంగాళాఖాతం, ఈ వైపు అరేబియా సముద్రం. ఈ రెండూ కలిసి హిందూ మహాసముద్రమవుతున్నాయి” అని చెప్తాడు. “కనుచూపు మేరంతా నీరే…. ఈ నీరే ప్రపంచానికి ఆవలి వైపు వరకూ ప్రవహిస్తుంది” అంటూ ఓ జీవిత సత్యం అవగతమయినట్లుగా చిన్నగా నవ్వుతాడు. “ఇక్కడ్నించి…. హిమాలయాల వరకూ… అంతా మన దేశమే” అంటాడు. “మీరు ఆలోచించేదేదీ నాతో చెప్పరెందుకు?” అంటుదామె.
ఆమె మాటని దాటవేస్తూ, “ఎంత అందమైన ప్రదేశమో కదా?” అంటాడు. “అయితే ఇక్కడే ఉండిపోవచ్చుగా…” అంటుందామె. “ఉండాలనే మనసు అంటుంది, కానీ…” అని ఆపుతాడు… “లఢాక్‌లో జరిగినట్లుగా….” అని భర్త డైరీలోని పంక్తులను చదువుతుంది. “ఈ డైరీ నాది, నీకెలా దొరికింది?” అంటాడు. “డైరీలో అన్నీ రాసుకుంటారు, నాతో చెప్పచ్చు కదా?” అంటుందామె. ‘అది నాది ఇచ్చేయ్’ అని అతనంటే, ‘లేదు ఇది ఇక నాది, మీరు ఇంకోటి తీసుకోండి’ అంటుంది. నవ్వేసి అక్కడ్నించి కదులుతాడు.
భావుకుడైన భర్త, అంతగా భావుకత్వం లేని, ప్రాక్టికల్‌గా ఆలోచించే భార్య… తన ఆలోచనలని తనలోనే దాచుకునే భర్తా…. భర్త ఆలోచనలు తనకి తెలిస్తే తమ సంసారం సామరస్యంగా ఉంటుందనుకునే భార్య… ఇలా వీళ్ళిద్దరూ దేశంలోని ఎందరో దంపతులకు ప్రతీకగా ఉంటారు.
***
కన్యాకుమారి రైల్వే స్టేషన్! రైలు ప్లాట్‌ఫాం మీద ఉందని మూడు భాషలలో ప్రకటన! మనకి ఇప్పటి వరకు పరిచయమైన వారంతా తమ బోగీని వెదుక్కుంటూ వస్తారు. ప్లాట్‌ఫామ్ మీద నిలబడ్డ టిటిఇ ప్రస్తుతం ఈ బోగీ ఎక్కమని, త్రివేండ్రమ్‌లో మరో బోగీలోకి మారాలని వివరిస్తాడు. అప్పుడు ప్రయాణీకుల మదిలే మెదిలే ప్రశ్నలు, సందేహాలు అన్నీ మనకీ ఏదో ఒకప్పుడు ఎదురయ్యేవే!
కూతురు పెళ్ళికని ఓ మలయాళీ ఆసామి కన్యాకుమారి వచ్చి చవకగా బియ్యం బస్తాలు కొనుక్కుని, హరీష్ పటేల్ ఉన్న బోగీలో అతను కూర్చున్న బల్ల మీద పెట్టిస్తాడు. పాపం! అతనికి ప్లేస్ సరిపోదు. “ఇలా ప్రయాణీకుల బోగీలో సామను తీసుకెళ్ళడం తప్పు, మీరు లగేజ్ వ్యాన్‌లో ఎక్కించాలి” అంటాడు. “రెండు స్టేషన్లు సర్దుకోండి. త్రివేండ్రమ్‌లో మారిపోతాను….” అంటూ ఆ ఆసామి బ్రతిమాలతాడు. బియ్యం బస్తాలన్నీ హరీష్ మీదకి వాలిపోతుంటాయి. అవస్థ పడుతూ కూర్చుంటాడు.
***
నాయర్, అతని భార్య పడవ దిగి స్టేషన్‌కి వచ్చేసరికి అతనెక్కాల్సిన రైలు బయల్దేరిపోతుంది. రైలు వెంట పరిగెడుతూ రెండు నిమిషాలు ఆపమని గార్డుని బ్రతిమాలుతాడు. ఇంకొంచెం వేగంగా పరిగెత్తి, తలుపేసేస్తున్న స్వామీజీ శిష్యుణ్ణి తలుపు తీయమని కోరతాడు. ‘తీయద్దు, టికెట్ లేని వాళ్ళంతా ఎక్కేస్తారు’ అంటాడు మరాఠీ వృద్ధుడు. శిష్యుడు తలుపు తీయడు. రైలు వెళ్ళిపోతుంది. నాయర్ ఎక్కలేకపోతాడు. బయటకొచ్చి తర్వాతి స్టేషన్ నాగర్ కోయిల్ వెళ్ళడానికి టాక్సీ ఎక్కుతాడు.
పచ్చటి పొలాల మధ్య నుండి రైలు, రోడ్డు మీదుగా టాక్సీ….!
“నేరుగా స్టేషన్‌కి వెళ్తే సరిపోయేది…” అంటుంది భార్య, వివేకానంద రాక్‌కి అనవసరంగా వెళ్ళామనే ఉద్దేశంతో.
“నువ్వు సామాన్లన్నీ ముందే సర్దేసి ఉంచితే ఇలా అయ్యేది కాదు” అంటాడు నాయర్.
“అసలు సైన్యంలో చేరకపోతే… ఇంత హడావిడిగా పరిగెత్తాల్సిన అవసరమే ఉండదు. ఈ ఉద్యోగం ఎందుకు వదిలెయ్యరో నాకర్థం కాదు”
“ఏం మాట్లాడుతున్నావ్, నేను సైన్యంలో పనిచేస్తూ నా దేశానికి సేవ చేస్తున్నాను, మీ అన్నయ్యలా దుబాయ్‍లో ఐస్‌క్రీమ్ అమ్ముకోవడం లేదు” అంటాడు.
“సరే, వెళ్ళేముందు మన మధ్య గొడవలొద్దు” అంటూ భార్య సర్దుబాటు చేస్తుంది.
“నాగర్ కోయిల్ వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది?” అని డ్రైవర్‍ని అడుగుతాడు.
“పావుగంట” అంటాడతను. “సరే కొంచెం త్వరగా పోనివ్వండి” అంటాడు.
ఇంతలో ఒకచోట గేట్ పడి వీళ్ళ టాక్సీ ఆగాల్సి రావడం, రైలు ముందుకి వెళ్ళిపోవడం జరుగుతుంది.
రైలు నాగర్‌కోయిల్ స్టేషన్‌లో ఆగుతుంది. కొందరు ఎక్కుతారు.
నాయర్ పరిగెత్తుకొచ్చేసరికి రైలు కదిలిపోతుంది. అదే టాక్సీలో త్రివేండ్రమ్ బయలుదేరుతాడు.
ఈ ఎపిసోడ్‌లో రైల్లో ప్రయాణించేవారి స్వభావాలనీ, ధోరణులనీ, కాస్తంత అసౌకర్యాన్ని కూడా సహించలేనితనాన్ని అత్యంత సహజంగా చిత్రీకరించారు. మనలో చాలామంది ఇప్పటికీ ఇటువంటి వారిని చూస్తూనే ఉంటాం.
కొన్ని సన్నివేశాలలో ఉపయోగించిన చిన్న చిన్న సంభాషణలు… నాటి సామాజిక స్థితికి అద్దం పడతాయి. కూతురు పుట్టింటికి తిరిగొచ్చేస్తే నలుగురు ఏమనుకుంటారో అనే సాంఘిక వెఱపునీ; పరాయిదేశం వెళ్ళి బోలెడు డబ్బు సంపాదించుకునే కన్నా సైన్యంలో ఉండి దేశానికి తన వంతు సేవ చేయడం గొప్ప అనుకుంటూ తనదైన జీవితాన్ని గడపాలనుకునే వ్యక్తి కోరికనీ – క్లుప్తమైన సంభాషణలు గొప్పగా వ్యక్తం చేసాయి.
***
ఈ తొలి ఎపిసోడ్‌ని ఇక్కడ చూడొచ్చు.
వచ్చే వారం రెండో ఎపిసోడ్‌తో కలుద్దాం!
(సశేషం)