‘యాత్ర’ చూద్దామా ఎపిసోడ్-10

0
1

[dropcap]’యా[/dropcap]త్ర’ పదవ ఎపిసోడ్ ఎడారి ప్రాంతం గుండా సాగే రైలు మార్గాన్ని చూపడంతో ప్రారంభం అవుతుంది. తర్వాత ఓ ఇంట్లో మంచం మీద జ్వరంతో బాధ పడుతున్న వ్యక్తినీ, అతని భార్యని చూపిస్తారు. అతను గేట్ మాన్. “నాకు బానే వుంది, నువ్వు వెళ్ళి గేట్ వెయ్యి. రైలు వచ్చే వేళ అయింది” అంటాడతను.

“ఇంత అనారోగ్యంలోనూ రైలు గురించి ఆలోచించడం ఎందుకు, నేను గేటు సంగతి చూస్తాను. తర్వాత జైపూర్ వెళ్ళి డాక్టర్‌కి చూపించుకుందాం” అంటుంది భార్య.

“సెలవు కోసం వ్రాసినా అధికారులు పట్టించుకోలేదు, నేనిక ఊర్కోను, మనం జైపూర్ వెళ్ళిపోదాం… లేకపోతే నీ ఆరోగ్యం పూర్తిగా పాడయిపోతుంది” అంటుంది భార్య. “సరే, ముందు గేటు వెయ్యి, లేకపోతే ప్రమాదం జరగవచ్చు” అంటాడతను.

భార్య వెళ్ళి గేటు వేస్తుండగా, ఒక గ్రామస్థుడు పట్టాల మీదుగా సైకిల్‌ని దాటించబోతాడు. “ఓ రామ్‌విలాస్ ఆగు!” అని ఆమె వారిస్తుంది.”అరే గేట్ కీపర్‌వి… స్టేషన్ మాస్టర్‌లా ప్రవర్తించకు…” అంటాడు. పైగా “వచ్చేది పాసెంజర్, దాని స్పీడ్ కన్నా, నా సైకిల్ స్పీడే ఎక్కువ” అంటాడు.

తన భర్తకి జ్వరం వచ్చి బాధపడుతున్నా, సెలవు దొరకలేదు, ఇంకో మనిషిని గేట్ కీపర్‌గా పంపడం లేదంటూ వాపోతుందామె.

“నేను స్టేషన్ వైపుకే వెళ్తున్నాను. నేను కనుక్కొంటాను. వీలైతే డాక్టర్‌ని పంపిస్తాను…” అంటూ అక్కడి నుంచి కదులుతాడతను.

***

శ్వేత వనిత తమకి ఎదురుగా ఉన్న కొత్త దంపతులతో మాటలు కలుపుతుంది. వాళ్ళ కిష్టమైతే వాళ్ళ ఫోటోలు తీస్తానంటుంది. భర్త ఒప్పుకున్నా, భార్య అంగీకరించదు. ‘సర్లెండి, ఆమె సిగ్గు పడుతోంది’ అంటుంది శ్వేత వనిత. తమ పెళ్ళయి నాలుగు రోజులే అయిందని, అంతకు పూర్వం ఆమె తనకు తెలీదని భర్త అంటాడు. శ్వేత వనిత ఆశ్చర్యపోతుంది.

ఇంతలో సింగ్ వచ్చి శ్వేత వనిత పక్కన కూర్చుని ఆమెని మళ్ళీ వేధించడం ప్రారంభిస్తాడు. నాయర్ అభ్యంతరం చెప్పినా పట్టించుకోడు. కొత్త పెళ్లికొడుకు వారించినా వినడు. “వెళ్ళి. మీ సీట్లో కూర్చోండి, అసలు మీ టికెట్ చూపించండి” అని నాయర్ అడిగితే, “మీకెందుకు చూపించాలి? నువ్వేమైనా రైల్వే టీసీవా?” అంటూ హేళన చేస్తాడు. నాయర్ వెళ్ళి టీటీఇని పిలుచుకు వచ్చి అతని టికెట్ చెక్ చేయమంటాడు. సింగ్ లేచి వెళ్ళి తన స్థానంలో కూర్చుంటాడు.

టీటీఇ కాసేపు వీళ్ళ పక్కనే కూర్చుంటాడు. ఇంతలో ఒక అటెండర్ టీ తెచ్చి ముందుగా, కప్పు ఇవ్వబోతుండగా, కప్పు చేజారి కిందపడి పగిలిపోతుంది. టీటీఇ అతన్ని తిడతాడు, శుభ్రం చేసి వెళ్ళిపోమంటాడు. అతను వెళ్ళిపోయాక, నాయర్ టీటీఇని మాటల్లో పెడతాడు.

తన ప్రవర్తనకి క్షమాపణలు చెప్తాడు టీటీఇ. “నేను మూడు నెలలుగా ఇంటికి వెళ్ళనే లేదు. డ్యూటీలోనే ఉన్నాను” అంటాడు.

“మీరెంతో అదృష్టవంతులు సార్. నాకు ఒక సంవత్సరం తర్వాత ఒక నెల రోజులు సెలవు దొరికింది” అంటాడు నాయర్.

“అరే, మీరు సైన్యంలో ఉన్నారు. మీ విషయం వేరు. మీరు కనీసం నేల మీదే ఉన్నారు. మేమైతే నేలని తాకాలని తపించిపోతుంటాం… నా కాళ్ళూ… ఈ రైలు బండీ…” అంటాడు టీటీఇ.

“మీదే ఊరు?” నాయర్ అడుగుతాడు.

“జైపూర్. గత ఏడాది జోధ్‌పూర్ – ఆగ్రా ట్రెయిన్‌లో డ్యూటీ వేశారు. ప్రతీ రోజూ రైల్లోంచి మా ఇల్లు చూస్తాను… కానీ ఇంటికి వెళ్ళే అదృష్టం కలగడం లేదు…”

“మీరు బదిలీ చేయించుకోలేరా?”

“పిల్లల చదువుల సమస్య అండీ… నా కొడుకు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అస్సలు నా మాట వినడు. కొత్త ప్రదేశానికి బదిలీ చేయించుకుంటే మా వాడికి కొత్త పిల్లలతో సావాసం ఏర్పడుతుంది. వాళ్ళ నుంచి ఏం నేర్చుకుంటాడో అని భయం…”

“రైల్లో పని చేసే ఉద్యోగులు కావాలనుకుంటే డెస్క్ జాబ్స్ కూడా ఎంచుకోవచ్చు కదా?” నాయర్ అడుగుతాడు.

“ఏమంటున్నారు సార్! డెస్క్ మీద కూర్చోవడం నాకు అస్సలు ఇష్టం ఉందదు. ఆఁ, ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం” చెబుతాడు టీటీఇ.

మళ్ళీ తనే మాట్లాడూతూ, “వర్క్ ఈజ్ వర్షిప్ కదండీ… నేనేదో మీలాంటి వారితో మాట్లాడి నా మనసులోని బాధని కొంత దింపుకుంటాను…” అంటాడు. “ఏదైనా ఇబ్బంది వస్తే పిలవండి” అంటూ అక్కడ్నించి కదులుతాడాయన.

శ్వేత వనిత తన ఫ్లాస్క్ నుంచి వంపుకుని టీ తాగబోతూ, ఎదురుకుండా కూర్చున్న కొత్త దంపతులకి టీ ఆఫర్ చేస్తుంది. భార్య వద్దంటుంది. పైగా ‘ఆమె చాలా ఎక్కువసార్లు టీ తాగుతోంది, అది ఆరోగ్యానికి మంచిది కాదు’ అంటుంది. భర్త భార్య మాటల్ని తర్జుమా చేసి చెబుతాడు.

అందుకా శ్వేత వనిత, “నేను టీ తాగేది దాహం తీర్చుకోడానికి.. ఎందుకంటే… నేను కాచి చల్లార్చిన నీళ్ళనే తాగుతాను. ఇక్కడ అలాంటి నీళ్ళు దొరకడం లేదు. టీ అయితే నీళ్ళు కాచి తయారు చేస్తారు కదా అని టీ తాగుతున్నాను” అని చెబుతుంది. తమ దగ్గరున్న మిఠాయిల్లోంచి ఒకటి తీసి ఆ శ్వేత వనితకిస్తారు. ఆ క్రమంలో పెళ్ళి కూతురు చేతులకున్న గోరింటాకుని చూసి “తర్వాత ఇది పోతుందా?” అని అడుగుతుందామె. ఓ వారం పదిరోజుల్లో పోతుందని చెప్తాడు భర్త.

“ఆర్ యూ టూరిస్ట్?” అని భర్త అడుగుతాడు.

“షార్ట్ టర్మ్…” అంటుందామె. నిజానికి తన తాతగారి సమాధిని చూడాడానికి వచ్చాననీ, ఆయన 1936 ఆఫ్ఘన్ యుద్ధంలో పాల్గొన్నాడని చెబుతుంది.

“ఏ రెజిమెంట్?” అని అడుగుతాడు నాయర్.

“పఠాన్ రెజిమెంట్”

“అదిప్పుడు పాకిస్తాన్‍లో ఉంది… మీ తాతగారు యుద్ధవీరులా?” అడుగుతాడు నాయర్.

“కాదు.”

“మీ తాతగారి సమాధి కనబడిందా?”

“ఆఁ, అజ్మీర్‌లోని ఓల్డ్ సెమెటరీలో ఉంది. తాతగారు యుద్ధంలో చనిపోలేదు, కలరా వల్ల చనిపోయారు” అని చెబుతుంది. కాసేపు ఆఫ్ఘన్ యుద్ధం గురించి మాట్లాడుకుంటారు.

***

మరో బోగీలో రాజస్థానీ కళాకారుల బృందం మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకతను తాను అజ్మీర్ షరీఫ్ నుంచి బొంబాయి వెళ్ళిపోతానని, మళ్ళీ వెనక్కి రానని అంటాడు. బొంబాయిలో అవకాశాలు వెతుక్కుంటాను అంటాడు.

“అక్కడ రోడ్డు మీద బిచ్చమెత్తుకోవాలి…” అంటాడు ఇంకో అతను.

“ఏం అక్కడ కళాకారులకు డబ్బులు దొరకవా?”

“అయినా ఈ పనికిరాని మాటలెందుకు? నువ్వెళ్ళిపోతే నీలాంటి వాడ్ని మళ్ళీ ఇంకొకర్ని నేనెక్కడ తెచ్చేది గ్రూప్‌లోకి…” అంటాడు ఇంకోతను.

“మరి వాడు ఇంగ్లాండ్ వెళ్తున్నా మీరేం అనరే?” అంటూ ఇంకో వ్యక్తి చూపిస్తాడతను.

వాళ్ళల్లో వాళ్ళు కాసేపు మాట్లాడుకుంటారు.

***

రైలు ముందుకు సాగుతూంటుంది. కెమెరా మళ్ళీ ఆ గేట్ మాన్ వైపు మళ్ళుతుంది. గేట్ కీపర్ దగ్గుతూ ఉంటాడు. “నేను అన్నీ సర్దేశాను. మధ్యాహ్నం మనం బయలుదేరుదాం. నీ స్థానంలో వేరు మనిషి వచ్చినా రాకపోయినా…” అంటుంది భార్య.

“రామ్ విలాస్ వెళ్ళాడుగా, ఎవరినైనా పంపిస్తార్లే” అంటాడా గేట్ కీపర్.

రామ్ విలాస్ తాను గేట్ వేస్తుంటే, తన మాట వినకుండా ఎలా దాటబోయాడో చెబుతుంది.

అతనికి దగ్గు ఎక్కువవుంది.

“సరే నువ్వు పడుకో! ఎక్స్‌ప్రెస్ వచ్చే టైమ్ అయితోంది. గేటు వేయాలి” అంటూ ఆమె కదులుతుంది.

“స్టేషన్ మాస్టర్ సిగ్నల్‌కి జవాబివ్వు…” అంటాడు భర్త. అలాగే అంటుందామె.

పొగలు కక్కుతూ రైలు వస్తూంటుంది. కెమెరా ఎంత గొప్పగా పని చేస్తుందంటే… మనం నిజంగా రైల్వే ట్రాక్ పక్కనుండి రైలుని చూస్తుంటే పొగ ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అలా ఉంటుంది. డ్రైవర్ అసిస్టెంట్ ఏవో నెంబర్ల గురించి మాట్లాడుకుంటారు. లెవెల్ క్రాసింగ్ తర్వాత ఉంటుంది అనుకుంటారు.

ఇంతలో రామ్ విలాస్ సైకిల్ మీద వస్తాడు. గేట్ వేసి ఉన్నా పట్టించుకోకుండా తన సైకిల్‌ని పట్టాలెక్కించి దాటబోతాడు. రైలు వేగంగా వచ్చి గుద్దేస్తుంది. అతను వెంటనే చనిపోతాడు. రైలు కొంచెం ముందుకెళ్ళి ఆగుతుంది. డ్రైవరు, గార్డు, టీటీటి, నాయర్, ఇంకా కొందరు ప్రయాణీకులు దిగి వస్తారు. శవ పరీక్ష కోసం శవాన్ని జైపూర్ తీసుకువెళ్ళాలి అంటాడు గార్డు. గేట్ కీపర్ భార్య అరుస్తు పరిగెత్తుకొస్తుంది…

“నేనెన్ని సార్లో చెప్పాను. గేట్ వేసినప్పుడు పట్టాలు దాటద్దని…” అంటూ రోదిస్తుంది.

“ఈయన నీకు తెలుసా?” అని టీటీఇ అడుగుతాడు.

“తెలుసు. దగ్గరలోని గ్రామంలో ఉంటాడు. పేరు రామ్ విలాస్” అని చెబుతుంది.

గేట్ కీపర్ ఏడి అని అడిగితే, తన భర్త అనారోగ్యం గురించి, అతని స్థానంలో వేరొకరిని పెట్టమని అడుగుతున్నా పెట్టకపోవడం గురించి చెబుతుంది. టీటీఇ తాత్కాలికంగా ఒక మనిషిని ఏర్పాటు చేసి, గేట్ కీపర్ కుటుంబాన్ని రైలెక్కిస్తాడు.

“యుద్ధంలో ఎన్నో చావులు చూసాను. కాని  ఇలాంటి దుర్ఘటనలు చూస్తే మనిషి జీవితం ఎంత అల్పమో అర్థమవుతుంది” అనుకుంటాడు నాయర్.

కాసేపాగి రైలు మళ్ళీ బయలుదేరుతుంది.

డ్రైవరు, అసిస్టెంట్ మాట్లాడుకుంటూటారు. ఎంత టైమ్ పోయిందని అసిస్టెంట్ అడిగితే, ఐదు నిమిషాలు అంటాడు డ్రైవర్. “ఇంక జైపూర్ చేరాకనే మనకు విశ్రాంతి” అంటాడు.  రైలు ముందుకు సాగుతుంది.

***

ఓ స్టేషన్‌ని చూపిస్తారు. ఒక డ్రైవరు తన డ్యూటీ కోసం వచ్చి ఎదురుచూస్తూంటాడు. ఇంతలో మరో డ్రైవర్ వచ్చి “బాగున్నవా కిషన్ బాబూ” అని పలకరిస్తాడు. వాళ్ళ మాటల్లో రామ్ చంద్ర చౌబే అనే డ్రైవర్ మెడికల్‌లో ఫెయిలయ్యాడనీ, అతన్ని బి గ్రేడ్‌లో వేశారని చెప్తాడు రెండో డ్రైవర్.

“అయ్యో, అతను చాలా కాలం నుంచి ఏ గ్రేడ్‌లో ఉన్నాడు… మనకి ఏ గ్రేడ్ సర్వీస్‌లో చేరాకా చాలా కాలం తర్వాత వచ్చింది” అంటాడు కిషన్ బాబు.

“పాపం ఈ రోజు నుంచి షంటింగ్ ఇంజన్ నడపాలి” అంటాడు రెండో డ్రైవర్.

“అతను వెళ్ళిపోతాడు, చూస్తూ ఉండు. వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుని అతను వెళ్ళిపోతాడు. ఎందుకంటే తక్కువ కేటగిరీలో వేస్తే డబ్బులూ తక్కువ వస్తాయి, గౌరవమూ పోతుంది” అంటాడు కిషన్ బాబు.

ఇంతలో కిషన్ బాబు అసిస్టెంట్ వచ్చి నమస్కరిస్తాడు. ‘ఇంత ఆలస్యంగానా వచ్చేది, రైలు టైమ్ తెలియదా’ అని కిషన్ బాబు కోపగించుకుంటాడు. ‘రైలు ఆలస్యంగా వస్తోంది’ అంటాడు అసిస్టెంట్. ఎందుకు అని అడిగితే కారణం తెలియదు అని చెప్తాడు.

రెండో డ్రైవర్ బి కేటగిరికి మార్చిన ఇంకో డ్రైవర్ గురించి చెప్తాడు.

“ఆఁ, రెండు రోజుల తర్వాత నాకూ మెడికల్ ఉంది. ఏమవుతుందో తెలియదు” అంటాడు కిషన్ బాబు. “45 ఏళ్ళు దాటితే, ప్రతీ సంవత్సరం మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇదో ఇబ్బంది” అనుకుంటాడు.

అప్పటికే రావల్సిన ఎక్స్‌ప్రెస్ రైలు గురించి స్టేషన్ మాస్టర్  మరో స్టేషన్ మాస్టర్‌తో ఫోన్‌లో మాట్లాడుతారు. ఈ పాటికి వచ్చేయాలి కదా అని అంటారు. “ట్రాక్ మీద ఏదో అబ్‌స్ట్రక్షన్ ఉండడం వల్ల ఆలస్యమైందట, వచ్చేస్తుంది” అని కిషన్ బాబుతో చెప్తారు.

రామ్ చంద్ర్ చౌబేని బి గ్రేడ్‌కి మార్చడంపై తన అసంతృప్తిని స్టేషన్ మాస్టర్ వద్ద వెల్లడిస్తాడు కిషన్ బాబు.

“ఏం చేద్దాం, డ్రైవర్ చూపు మందగిస్తే, ఎక్స్‌ప్రెస్ రైలు నడపకూడదు కదా” అంటారాయన. “అయినా, నీకేం భయం? నీకేం పర్వాలేదు. నువ్వు మంచి డ్రైవర్‌వి. ఈ సెక్షన్‌లో నీకు మంచి కమాండ్ ఉంది” అంటారాయన.

ఇంతలో టీటీఇ భార్య కొడుకుని, కొడుకుతో పాటు మరో వ్యక్తిని వెంటబెట్టుకుని స్టేషన్ మాస్టర్ వద్దకు వస్తుంది. “రండి రండి.. బండి వచ్చే టైమ్ అయ్యింది” అంటారాయన. కిషన్ బాబు బయటకు వచ్చేస్తాడు.

“ఏమన్నా పని ఉందా మాధుర్ గారితో? ఇంకో పది నిమిషాల్లో బండి వచ్చేస్తుంది” అంటారు స్టేషన్ మాస్టర్.

“ఆయన ఇంటికొచ్చి మూడు నెలలు అవుతోంది. కనీసం స్టేషన్‌లో నైనా కలుద్దామని వచ్చాను” అంటుంది మిసెస్ మాధుర్.

“ఎక్కువ సేపు తీసుకోకండి. ఆయన జైపూర్ ప్లాట్‌ఫాం మీద ఎంతో బిజీగా ఉంటారు” అంటారు స్టేషన్ మాస్టర్.

***

రైలొచ్చి జైపూర్‌లో ఆగుతుంది.

శ్వేత వనిత కిందకి దిగగానే సింగ్ వచ్చి మళ్ళీ ఆమెను వేధించబోతే, నాయర్ హెచ్చరిస్తాడు.

కళాకారుల బృందం నాయర్‌కి వీడ్కోలు చెప్పి కదులుతారు. టీటీఇ కూడా దిగుతాడు. “డ్యూటీ అయిపోయిందా?” అని నాయర్ అంటే, “లేదు” అంటాడతను.

“అరే, నా భార్యా, కొడుకు వస్తున్నారు” అంటాడు.

“ఏంటి వీడ్నెందుకు తీసుకొచ్చావ్? అరే బోరా గారు కూడా వచ్చారే? ఏంటి విషయం?” అని భార్యని అడుగుతాడు.

పిల్లాడు అల్లరి వాడైపోతున్నాడనీ, రాత్రంతా ఇంటికి రావడం లేదనీ, బోరా గారి సైకిల్ దొంగిలించి అమ్మేయబోతే… తెలిసినవాళ్లు చూసి ఆపారని, పోలీసు కేసు వరకూ వెళ్ళలేదని ఆమె చెప్పుకొస్తుంది. కొడుకుని గట్టిగా మందలించి, బోరా గారిని క్షమాపణలు వేడుకుంటాడు మాధుర్.  తన కొడుకు ఇలాంటి పనులు ఇంక ముందు చేయడని మాటిస్తాడు. ఆ పిల్లాడు కూడా బోరా గారిని క్షమాపణ వేడుకొంటాడు.

“ఒంట్లో నలతగా ఉన్నట్టుంది” అంటుంది భార్య. రైల్లో నిరంతరం ప్రయాణిస్తూ డ్యూటీ చేసేవాళ్ళకి ఆరోగ్యం ఏం బావుంటుంది?” అంటాడు మాధుర్.

“త్వరలో నాలుగు అయిదు రోజులు సెలవు పెట్టి అన్నీ చూసుకుంటాను… మన వెధవని దారిలో పెడతాను” అంటాడు. ఓ రైల్వే అధికారి అనారోగ్యంతో ఉన్న గేట్‌మాన్‌నీ, అతని భార్యని డాక్టర్ వద్దకి తీసుకెళతాడు.

ఇప్పటి దాక  బండి నడిపిన డ్రైవర్, అతని అసిస్టెంట్ డ్యూటీ దిగుతారు. వారి స్థానంలో కిషన్ బాబూ, అతని అసిస్టెంట్ బాధ్యతలు తీసుకుంటారు.

రైలు ఎందుకింత ఆలస్యమైందని కిషన్ బాబు అడిగితే, రైలు సైకిల్‌ని గుద్దడం గురించి, అతని ప్రాణాలు పోవడం గురించి చెప్తాడు పాత డ్రైవర్. ఇంజన్‌కి ఏం కాలేదు కదా? అంటే ఇంజన్‌కి ఏమవుతుంది, ఏం కాలేదని జవాబిస్తాడు.

తన అసిస్టెంట్‌ని తమ ఇంజన్‌ని మళ్ళీ ఒకసారి పూర్తిగా చెక్ చేయమని చెప్తాడు కిష‍న్‌బాబు.

***

ఇంజన్ మార్చుకుని, కొత్త డ్రైవర్, కొత్త అసిస్టెంట్‌తో రైలు మళ్ళీ బయలుదేరుతుంది.

“మీరు నిజంగానే పెళ్ళి వరకు ముందెప్పుడూ కలుసుకోలేదా?” అని ఆశ్చర్యంగా అడుగుతుంది శ్వేత వనిత ఆ కొత్త దంపతులను. లేదంటాడు భర్త. తాము మొదటిసారి పెళ్ళిలోనే కలిసామని, ఆమె తండ్రి పేపర్లో ప్రకటన ఇస్తే, తన తండ్రి అది చూసి పెళ్ళి చేశారని చెప్తాడు. ఆమెకి పెళ్ళయిందేమో కనుక్కోండి అంటుంది భార్య. భర్త అడిగితే ఇంకా కాలేదని చెప్తుంది. తన పేరు ట్వెండలిన్ టర్న్‌బో అని చెప్తుంది. తనికి పెళ్ళి కాలేదని, తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఉంటున్నానని చెప్తుంది. “అతను వదిలేస్తేనో?” అంటుంది భార్య. అదే మాటని శ్వేత వనితను అడుగుతాడు భర్త.

“వదిలేయచ్చు. మేం కొన్నాళ్ళు కలిసుంటాం. ఒకరికొకరు నచ్చితేనే పెళ్ళి చేసుకుంటాం. పెళ్ళి విషయంలో రిస్క్ చేయలేం కదా” అంటుంది.

“మీ గురించి ఏం తెలియకుండా పెళ్ళి చేసుకుంది కదా, మీ భార్య ఏమునుకుంటుంది ఈ పెళ్ళి గురించి?” అని అడుగుతుంది.

అదే మాటని భార్యని అడుగుతాడు. “భర్తతో కలిసి ఉండడం భార్య ధర్మం. భర్త మంచివాడయితే అది ఆమె అదృష్టం. చెడ్దవాడయితే ఆమె దురదృష్టం” అని జవాబిస్తుంది. అదే తర్జుమా చేసి చెప్తాడు.

***

రైలు ముందుకు సాగుతూంటుంది. పట్టాల మీద ఏదో అడ్డం ఉన్నట్టు కిషన్ బాబు అంటాడు. తన అసిస్టెంట్‌ని చూడమంటే…. అతనేం లేదంటాడు. “నాకు కనిపిస్తోంది. చూడు సరిగా” అంటాడు కిషన్ బాబు.

ఓ వ్యక్తి అప్పటిదాకా పట్టాల మీద నిలబడి ఉంటాడు. రైలు దగ్గరం రావడం చూసి పట్టాల మీద పడుకుంటాడు. అది గమనించిన కిషన్ బాబు బ్రేక్ వేసి రైలుని ఆపుతాడు. కిందకి దిగి ఆత్యహత్య చేసుకోబోయిని అతన్ని లేపి చెంపదెబ్బ కొడతాడు. “అంతగా చావాలనుకుంటే ఏ నదిలోనో దూకచ్చుగా, నా రైలే దొరికిందా” అంటాడు. టీటీఇ, నాయర్, గార్డ్ మరికొందరు దిగి వస్తారు. డ్రైవర్ అతన్ని కొట్టబోతుంటే టీటీఇ ఆపి “చట్టాన్ని మీ చేతులోకి తీసుకోవద్దు. పోలీసులకి అప్పజెప్దాం” అంటాడు. అతన్ని ఎక్కించుకుని రైలు కదులుతుంది.

***

‘యాత్ర’ ఈ ఎపిసోడ్‌లో రైల్వే ఉద్యోగుల సమస్యలని రేఖామాత్రంగా ప్రస్తావిస్తారు. ఉద్యోగులపై ఉండే ఒత్తిడి వారి మానసిక స్థితినీ, వారి కుటుంబ జీవితాలని ఎలా ప్రభావితం చేస్తుందో చూపిస్తారు. ఆధునిక కాలంలో మనం మాట్లాడుకుంటున్న ‘స్ట్రెస్’ అప్పుడూ ఉండేది.

గేట్ వేసి ఉన్నప్పుడు పట్టాలు దాటకపోవడం శ్రేయస్కరం. అది మన బాధ్యత. మన బాధ్యత మనం నిర్వహిస్తే, ప్రమాదాలు సంభవించే అవకాశాలు తగ్గుతాయి. ఎప్పటిలానే ఈ ఎపిసోడ్‍ కూడా పలు సామాజిక సమస్యలను ప్రస్తావిస్తుంది.

***

ఈ 10వ ఎపిసోడ్‌ని ఇక్కడ చూడచ్చు.

పదకొండవ ఎపిసోడ్‌ తదుపరి సంచికలో!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here