‘యాత్ర’ చూద్దామా ఎపిసోడ్-11

0
2

[dropcap]రై[/dropcap]లు నెమ్మదిగా వచ్చి ఆగ్రా స్టేషన్‌లో ఆగుతుంది. శ్వేత వనిత, కొత్త దంపతులు దిగుతారు.

కొత్త దంపతులు శ్వేతవనితకి వీడ్కోలు చెప్తారు. ఆమెకి మంచి భర్త రావాలని కోరుకుంటుంది కొత్త పెళ్ళి కూతురు. ‘ఇక మీరు లండన్ వెళ్ళిపోతారా’ అని అడుగుతాడు కొత్త పెళ్ళికొడుకు. “లేదు, భారతదేశంలో చూడాల్సినవి ఇంకా ఉన్నాయి” అంటుందామె. “మీరు అస్సాంకి రావాలి, అందమైన ప్రాంతం” అంటాడతను. “ఏమో, ఎవరికి తెలుసు, వస్తానేమో. గుడ్‌బై” అంటుంది. ఇంతలో నాయర్ కూడా వచ్చి శ్వేత వనితకి వీడ్కోలు చెప్తాడు. ‘ఆగ్రాలో ఏదైనా బస తెలుసా’ అని నాయర్‌ శ్వేత వనితని అడిగితే లేదంటుంది. “ఇక్కడ ట్రావెలర్స్ కౌంటర్ ఉంటుంది, అందులో అడగండి” అంటాడు. ఆమె కదిలి కౌంటర్ వైపు వెడుతుండగా, సింగ్ ఆమెకి సాయం చేస్తానంటూ మళ్ళీ వెంటబడబోతాడు. ఆమె తిరస్కరించి ముందుకు కదులుతుంది.

“నువ్వు ఇక్కడ ప్లాట్‌ఫామ్ మీద కూర్చుంటావా? లేకపొతే వెయిటింగ్ రూమ్‌లోనా? అస్సాం వెళ్ళే బ్రాడ్‌గేజ్ రైలుకి ఇంకా మూడు గంటల సమయం ఉంది” అని కొత్త పెళ్ళికొడుకు భార్యని అడుగుతాడు. ఆమె “తాజ్‌మహల్ చూసి వద్దాం” అంటుంది. “సమయం సరిపోదేమో?” అనుకున్నా, “సామన్లు ఎవరు చూస్తారు?” అంటాడు భర్త. పక్కనున్న నాయర్‌ని అడుగుతాడు ‘తమ సామన్లు కూడా చూస్తుంటారా’ అని. ‘నావే చాలా ఉన్నాయి సామాన్లు’ అని, “బ్రాడ్‌గేజ్ ప్లాట్‌ఫామ్ మీదకు మార్పించండి. నావి కూడా అక్కడ ఉంచుకుని చూస్తాను” అంటాడు నాయర్.

అందరూ వెళ్ళిపోతారు. ఆఖరున టిటిఇ మాధుర్ తన బ్యాగ్ సూట్‌కేస్‌లతో నడుచుకుంటూ బయటకి వస్తాడు. ఆయన అడుగులు భారంగా పడుతుంటాయి – రంగస్థలం మీద నుండి నిష్క్రమిస్తున్న చివరి పాత్రధారిలా!

***

నవదంపతులిద్దరూ తాజ్‌మహల్ చూసి అబ్బురపడతారు. షాజహాన్ తన భార్య స్మృతిలో నిర్మించాడని భర్త భార్యకి చెబుతాడు. ఆ రాజు తన భార్యని అంతగా ప్రేమించాడా అంటుంది భార్య. లోపలికి వెళ్ళి చూద్దామా అంటే, మనకి సమయం లేదు అంటాడు భర్త.

***

వాళ్ళిద్దరూ తిరిగి స్టేషన్‌కి చేరే సరికి ప్లాట్‌ఫామ్ మీద బండి సిద్ధంగా ఉంటుంది. కానీ నాయర్ కనిపించడు. తమ సామాన్లు ఏమయ్యాయో అతనికి అర్థం కాదు. అక్కడ ఉన్న టిటిఇకి తమ పేర్లు చెప్పి తమ బోగీ ఏదో కనుక్కుంటారు. ఆ బోగీ ఎదురుగానే వారు నిలుచుని ఉంటారు. ఇంతలో నాయర్ పరిగెత్తుకు వస్తాడు. “బండి బయల్దేరడానికి 20 నిమిషాల ముందు వస్తానన్నారు, ఆలస్యంగా వచ్చారు. ఇంకో 5 నిమిషాలుంటే బండి బయల్దేరిపోయేది” అంటూ కోపగించుకుంటాడు. “మా సామాన్లు….” అని భర్త అడిగితే, లోపల పెట్టించాను” అంటాడు. అందరూ బోగీలోకి ఎక్కి తమ కూపేలోకి వస్తారు.

అక్కడ అప్పటికే ఒక వ్యక్తి లోయర్ బెర్త్‌ని ఆక్రమించుకుని దుప్పటి పరుచుకుని, వీపుకి దిండు పెట్టుకుని కూర్చుని ఉంటాడు. భర్త సామన్లు సర్దుతుంటే ఏది ఎక్కడ పెట్టుకుంటే బావుటుందో సూచనలు చేస్తాడు. తనని తాను స్వాతంత్ర సమరయోధుడు మాధవ్ ప్రసాద్‌గా పరిచయం చేసుకుంటాడు. తాను కూర్చున్న సీట్ భర్తదేననీ, తాను పెద్దవాడిని కాబట్టి లోయర్ బెర్త్ తీసుకున్నాననీ, తన బెర్త్‌లో భర్త పడుకోవచ్చని చెప్తాడు. పరిచయాలవుతాయి. తాము గౌహతి దాటి భద్రపూర్‌కి వెళ్తున్నాం అని భర్త చెప్పి ‘మీరెక్కడి దాకా’ అని మాధవ్ ప్రసాద్‌ని అడుగుతాడు. “ఎక్కడికి వెళ్ళాలనిపించినా, నేను రైలెక్కాస్తాను. ఎక్కడ దిగాలనిపిస్తే అక్కడ దిగేస్తాను” అంటాడు. “అంతే లెండి, మీరు స్వాతంత్ర సమరయోధులు కదా, ఎక్కడయినా ఎక్కచ్చు, ఎక్కడయినా దిగచ్చు, ఎవరి సీట్‌నైనా ఆక్రమించవచ్చు” అంటూ భర్త అతన్ని వేళాకోళం చేస్తాడు. బదులుగా, “నేను దేశం కోసం బ్రిటీషు వాళ్ళ దగ్గర తన్నులు తిన్నాను, ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాను” అని అంటాడు మాధవ్ ప్రసాద్‌.

వాళ్ళిద్దరూ కొత్త దంపతులని గ్రహించిన మాధవ్ ప్రసాద్, ఆమె ఒంటి మీదున్న నగలని ఒక పెట్లో పెట్టమని, ఆ మార్గంలో రైల్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని అంటాడు. భార్య భయపడుతుంది. మెడలోంచి, చేతులనుంచి ఆభరణాలు తీయనంటుంది. ఆర్‌పిఎఫ్ సిబ్బంది రైల్లో ఉన్నారు, ఏం పర్వాలేదు అంటాడు నాయర్.

ఇంతలో ఒక ముస్లిం వ్యక్తి వచ్చి తాను అక్కడ కూర్చోవచ్చా అని అడుగుతాడు. తనకు టిసి వచ్చి వేరే చోట సీట్ ఇస్తానని చెప్పాడని చెబుతాడు. మాధవ్ ప్రసాద్ వద్దంటాడు. నాయర్ ఎందుకు కూర్చోకూడదు, అని అతన్ని కూర్చోబెడతాడు. పగటి పూట ఆరుగురు కూర్చోవచ్చని, రాత్రి పూట నలుగురు కూర్చోవాలని అంటాడు. అయినా ఇలా పగటి పూట బెర్త్ వేసుకుని దుప్పటి పరుచుకోడం సరికాదంటాడు.

రైలు బయల్దేరుతుంది.

***

“మీరెక్కడి దాకా వెళ్తున్నారు?” అని ఆ ముస్లిం వ్యక్తిని నాయర్ అడుగుతాడు. తాను గౌహతి వెళ్తున్నానని, అక్కడ ఓ సమావేశంలో ప్రసంగించాల్సి ఉందని అంటాడాయన. “అయితే, మీకు రాజకీయాలతో పరిచయం ఉండే వుంటుంది” అంటాడు మాధవ్ ప్రసాద్.

ఆయన పేరు అడిగి తెలుసుకుంటారు. ఆయన ఏ అంశంపై ఉపన్యసించబోతున్నారో అడుగుతారు. “లౌకిక వాదం, ప్రభుత్వం” అని చెప్తాడాయన. “నన్నెవరైనా అడిగితే, అసలు మతానికీ, ప్రభుత్వానికి సంబంధం ఉండకూడడనే అంటాను” అంటాడు మాధవ్ ప్రసాద్. దేశంలో మతాల గురించి మాట్లాడుతాడు. రష్యా, అమెరికాలు ప్రభుత్వానికి, మతానికి సంబంధం లేకుండా చూసుకున్నాయి కాబట్టే అంత గొప్ప దేశాలయ్యాని అంటాడు. అంతరిక్షంలోకి మనుషుల్ని పంపగలిగేవాళ్ళా, ఎన్నటికీ కాదు అంటాడు.

“అయితే మన దేశంలో ఏ వ్యక్తి కయినా ఏదో ఒక మతంపై విశ్వాసం ఉండాలి” అంటాడు భర్త. దైవం మీద విశ్వాసం లేకుండా ఎవరైనా ఎలా ఉండగలరు అంటాడు. “సాధారణ మానవులకి దేవుడిపై నమ్మకం ఉండడం అవసరం” అంటాడు నాయర్. సైన్యం వెంట కూడా మత గురువులు ఉంటారనీ, ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్తున్నప్పుడు వాళ్ళూ వస్తారని చెప్తాడు.

“ఇదే మీరు చేస్తున్న తప్పు. మీ అంతట మీరుగా మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు” అంటాడు మాధవ్ ప్రసాద్.

“నా ఉద్దేశం అంధ విశ్వాసాలు కాదు, కాని క్షేత్రస్థాయిలో దీని వల్ల ఉత్సాహం కలుగుతుంది” అంటాడు నాయర్.

ముస్లిం వ్యక్తి మాట్లాడుతూ, “ప్రభుత్వమైనా, మతమైనా సామాన్యుడి మేలే కోరుతాయి” అంటాడు. వాళ్ళ మధ్య మతం, రాజకీయాలపై చర్చ జరుగుతుంది. ఇంతలో టిటిఇ వచ్చి ముస్లిం వ్యక్తి మరో కూపేలో సీట్ కేటాయించానని చెప్తాడు. ఆయన అందరికీ ధన్యవాదాలు చెప్పి తన కూపేలోకి వెళ్ళిపోతాడు. రైలు ముందుకు సాగుతుంది.

***

మరో కూపేలో ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకోడం చూపిస్తారు.

గ్రామీణ మహిళ ఏదో మాట్లాడుతుంటే, విద్యాధిక మహిళ సంభాషణకి ఆసక్తి చూపించదు. తాను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నానని చెప్తుంది. తాను పెళ్ళి చేసుకోలేదని చెప్తుంది. వీలైనంత త్వరగా పెళ్ళి చేసుకోమని గ్రామీణ మహిళ చెబుతుంది.

***

చీకటి పడుతుంది. నాయర్ కూపేలో అందరూ నిద్రపోతారు. మాధవ్ ప్రసాద్ పెట్టే గురకకి భార్యాభర్తలకి నిద్ర పట్టదు.

***

కెమెరా డ్రైవర్, అసిస్టెంట్‌నీ చూపిస్తుంది.

రైలు చీకట్లో వెళ్తుంటే, ఒక సొరంగం గుండా వెళ్తున్నట్టు అనిపిస్తుందని డ్రైవర్ అంటాడు. ఇంతలో ఇంజన్‍లో అలారం మోగి, పవర్ డ్రాప్ అయిపోతుంది. త్వరగా చెక్ చేయమని, ఆయిల్ చూడమని డ్రైవర్ హెచ్చరిస్తాడు. కాని ఇంజన్ పనిచేయదు. చేసేదేం లేక బండిని ఆపేస్తాడు డ్రైవర్.

మెమో రాసిచ్చి, గార్డుకిచ్చి రమ్మని అసిస్టెంట్‌కి పురమాయిస్తాడు. అసిస్టెంట్ వెళ్ళబోతుంటే గార్డే అక్కడికి వస్తాడు –  బండి ఎందుకు ఆగిపోయింది అంటూ. అసిస్టెంట్ అతనికి జరిగినది చెప్పి, “మీరు వెళ్ళి కంట్రోల్‌కి ఫోన్ చెయ్యండి” అంటాడు. “సరే, నువ్వు ముందు వైపు కాపాలా ఉండు, నేను వెనుక వైపున ఉంటాను” అంటూ గార్డు వెళ్ళిపోతాడు.

***

రైలు ఆగిపోవడంతో మాధవ్ ప్రసాద్‌కి మెలకువ వస్తుంది. రైలు ఎందుకు ఆగిపోయింది అంటూ కేకలు వేస్తాడు. దొంగలొస్తారేమో అంటాడు. దొంగలు ఆపి ఉండరు, ముందర సిగ్నల్ దొరికి ఉండదు అంటాడు భర్త. భార్య భయపడుతుంది. కిటికీ లోంచి చూసి ఎవరో లాంతరు పట్టుకుని తిరుగుతున్నారనీ, వాళ్ళే దొంగలని అందర్నీ హెచ్చరిస్తాడు మాధవ్ ప్రసాద్. ఇంతలో గార్డు ఆగ్రా స్టేషన్‌కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలనుకుంటాడు, కానీ ఫోన్ పని చేయదు. నాయర్ కిందకి దిగి విషయం తెలుసుకుంటాడు. ట్రాక్ మీద డెటోనేటర్ పెట్టి ఎదురుగా వచ్చే రైలుని ఆపమని అసిస్టెంట్‌కి చెప్తాడు. అతనలాగే చేస్తాడు. ఇంతలో ఎదురుగా ఓ రైలొచ్చి ఆగుతుంది. ఆ డ్రైవర్‌కి మెమో ఇచ్చి, వేరే ఇంజన్‌ని పంపమని చెప్తాడు గార్డు.

మాధవ్ ప్రసాద్ లోపలికి వచ్చి తమ కూపే తలుపు వేసేస్తాడు. నాయర్ బయటి నుంచి తలుపుకొడ్తే ముందు తీయడు. తానెవరో చెప్పాకా, అప్పుడు తీస్తాడు. లాంతర్లు పట్టుకుని తిరుగుతున్నది దొంగలు కాదని, రైల్వే సిబ్బంది అనీ, ఇంజన్ పాడయిపోయిందనీ, మరో ఇంజన్ వస్తోందని చెప్తాడు.

ఇంకో ఇంజన్ రావడంతో, వీళ్ళ బండి బయల్దేరుతుంది.

వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తుంటే, మనం ఇక్కడ విరామం తీసుకుందాం.

***

ఈ 11వ ఎపిసోడ్‌ని ఇక్కడ చూడచ్చు.

12వ ఎపిసోడ్‌ తదుపరి సంచికలో!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here