Site icon Sanchika

‘యాత్ర’ చూద్దామా ఎపిసోడ్-2

[dropcap]రై[/dropcap]లెక్కి మన సీట్లో మనం కూర్చుని, కాస్త కుదుటపడ్డాక, మెల్లిగా తోటి ప్రయాణీకులని పలకరించి వారితో కబుర్లలోకి దిగుతాం. ఈ ఎపిసోడ్‌లో కూడా అంతే! కొన్ని పాత్రలు ఇదివరకే ఒకరికొకరు పరిచితం కాబట్టి, మళ్ళీ తారసపడగానే మాట్లాడుకుంటారు. నిజ జీవితంలో మన ప్రయాణాలలో రైల్లో కొత్తగా ఎక్కిన వాళ్ళని కాస్త పరిశీలించి, ఆ తర్వాత మాటలు కలిపినట్లే, ఈ ఎపిసోడ్‌లోనూ జరుగుతుంది. ప్రయాణీకుల స్వభావాన్ని బాగా విశ్లేషించి తీశారు శ్యామ్ బెనెగళ్.

‘యాత్ర’ రెండో ఎపిసోడ్ కూడా.. ఒక రైలుని, స్టేషన్‌లో రైల్వే సిబ్బందినీ, ప్లాట్‌ఫాం మీద ప్రయాణీకులని చూపిస్తూ, రైల్వేలందిస్తున్న సేవల గురించి ఒకటి రెండు వ్యాఖ్యలతో ప్రారంభమవుతుంది. “కన్యాకుమారిలోనూ, నాగర్‌కోయిల్‌లోనూ రైలు మిస్సయ్యింది. ఇప్పుడు త్రివేండ్రమ్‌లో కూడ మిస్ అయితే ఏమవుతుందో?” అని ఇంతకు ముందు ఎపిసోడ్‌లో రైలు మిస్సయిన నాయర్ మాటలు నేపథ్యంలో వినిపిస్తాయి. రైలు కూతపెడుతూ ముందుకు సాగుతుంటూంది. ఒకవైపు పచ్చని పొలాలు, మరోవైపు ఎత్తైన కొబ్బరి చెట్లూ… ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. అయితే కూతురు చితాభస్మాన్ని సాగరంలో కలిపిన ఆ తల్లికి మాత్రం దుఃఖం ఆగదు, రోదిస్తూ ఉంటుంది. తట్టుకోమంటూ భర్త ఓదారుస్తాడు.

తన గురువుగారిని సైడ్ లోయర్ బెర్త్‌లో పడుకోబెట్టి సపర్యలు చేస్తుంటాడు శిష్యుడు. రైలు ముందుకు సాగుతూంటుంది.

ఈలోపు త్రివేండ్రం రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాం మీదకి ప్రవేశిస్తున్న ఓ గర్భవతి, ఆమె భర్తను చూపిస్తారు. గర్భవతి పాత్రను నీనాగుప్తా పోషించారు. ఆయాసపడుతూ నడుస్తున్న ఆమె దగ్గరలోని ఒక బల్ల మీద కూర్చుంటుంది. “నాకు చాలా బెంగగా ఉంది, నిన్న రాత్రి ఓ పీడకల వచ్చింది” అని భర్తకి చెప్తుంది. ఇందులో భయపడాల్సిందేముంది, కలే కదా అని అనునయిస్తాడు భర్త. ఆమె ఒంటరిగా ప్రయాణిస్తోంది, ఏదో కారణం చేత భర్త రాలేడు. అయితే ఆమె తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుందామనుకుంటుంది. టికెట్ క్యాన్సిల్ చేసేద్దామంటుంది. వద్దని భర్త ధైర్యం చెబుతుంటాడు.

ఇంతలో ఢిల్లీలో ప్రోగ్రామ్ చేయవల్సిన కళాకారుల బృందం ప్లాట్‌ఫారంపైకి వస్తారు. వాళ్ళల్లో ఒక కళాకారుడు ఇంటికి వెళతాడు. వీళ్ళతో పాటు స్టేషన్‌కి రాలేకపోతాడు. అందరూ అతడి గురించి వ్యాఖ్యలు చేస్తారు. అజయ్ అనే అతను కూడా ఎందుకనో రాడు. అతనేం చిన్నపిల్లాడు కాదు వచ్చేస్తాడని ఇంకోతను అంటాడు. ఈ బృందంలో ఒకరిగా ‘ఇలా అరుణ్’ నటించారు. ‘అతని టికెట్ మన దగ్గరే ఉంది, అతను వేరే బోగీలో ఎక్కితే ఇబ్బంది’ అనీ, ‘అతన్ని వెతక’మంటూ ఆమె ఇంకో అతన్ని పంపిస్తుంది.

ట్రాన్స్‌ఫర్ అయి మరో ఊరికి వెళ్ళిపోతున్న అధికారికి వీడ్కోలు పలకడానికి ఆయన మాజీ కొలీగ్స్ వస్తారు. ‘కొత్త ఆఫీసర్ మీలా ఉంటాడో ఉండడో’ అంటారు. “పర్లేదు, నా స్థానంలో వచ్చే అధికారి సమర్థుడు” అని బదిలీ మీద వెళ్తున్న ఆఫీసర్ అంటాడు. తమ బంధువు ఒకరికి ఉద్యోగం ఇప్పించే విషయం మర్చిపోవద్దని ఒక కొలీగ్ వేడుకొంటాడు. “మర్చిపోను, వీలయినంత వరకు పనయ్యేలా చూస్తాను” అంటాడు ఆఫీసర్. “సార్! మీరు అక్కడ కూడా ఇలాగే అందరికీ సాయంగా ఉండాలి” అని ఇంకో కొలీగ్ అంటాడు. ‘ఉత్తరాలు రాస్తూండండి సార్’ అంటాడు. ‘తప్పకుండా మీ సహాయ సహకారాలు మరువలేనివి’ అని అంటాడా ఆఫీసర్.

ఆయన కూతురు కొంచెం దూరంగా తన స్నేహితురాళ్ళతో మాట్లాడుతుంటుంది. “మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది” అంటుంది. “అయితే ఉండిపో…” అంటుందో స్నేహితురాలు. “ఏం చేయాలి, నాన్న ఒప్పుకోరుగా,… చాదస్తం! బోర్… నీకు తెలుసుగా ఆయనో తలనొప్పి మనిషి! ఉత్తరాలు రాస్తారుగా” అంటుందా కూతురు. “రాయంగా….” అంటుందో మిత్రురాలు ఉడికిస్తూ.

ఇలా ప్లాట్‌ఫాంపై జరిగే ఈ సన్నివేశాలు మనందరికీ కూడా ఏదో ఒక ప్రయాణంలో ఎదురయ్యే ఉంటాయి… కొత్త ఆశలలో వెళ్ళేవాళ్ళు, ఉన్న ఊరిని వదిలి వెళ్ళేందుకు సంశయించేవారు, ఆత్మీయులని పోగొట్టుకుని కొత్త ప్రదేశానికి వెళ్ళడానికి వెనుకాడడం… గ్రూప్‌గా ప్రయాణిస్తున్నవారిలో ఒకరో యిద్దరో వెనుకబడిపోవడం, మరికొందరు వారిని వెతుక్కోంటూ వెళ్ళడం, మిగతావారు వాళ్ళొచ్చి రైలెక్కేంతవరకూ ఆందోళన పడడం… ఇవన్నీ తెరపై చూడడం బావుంటుంది. మన అనుభూతినే పునర్దర్శించుకున్న భావన కలుగుతుంది.

***

మెల్లిగా రైలు నగరంలోకి రావడం చూపిస్తారు. కూత వేసుకుంటూ రైలు త్రివేండ్రం స్టేషన్ వైపు పరుగులు తీస్తుంది.

బియ్యం బస్తాలతో ఇబ్బంది పడుతున్న హరీష్ పటేల్ ముఖంలో కాస్త సంతోషం కనబడుతుంది. “త్రివేండ్రం వచ్చేస్తోంది… త్రివేండ్రం వచ్చేస్తోంది” అంటాడు. “అవునండీ” అంటాడా మళయాళీ.

కెమెరా ప్లాట్‍ఫాం పైకి మళ్ళుతుంది.

నీనాగుప్తా ‘నేను వెళ్ళను’ అంటూ ఏడుస్తూ ఉంటుంది.

ఆఫీసర్ అతని కొలీగ్స్‌తో, అతని కూతురు ఆమె మిత్రులతో మాట్లాడుతుంటారు. రైలు వచ్చి ప్లాట్‌ఫాం మీద ఆగుతుంది. కొలీగ్స్ ఆఫీసర్ మెడలో పూలదండ వేసి వీడ్కోలు చెప్తారు. ఆయనేమో, “అమ్మాయ్, మీనాక్షీ పద” అంటూ కూతురిని పిలుస్తారు.

ఇంతకు ముందు టిటిఇ చెప్పినట్టు మన ప్రయాణీకులుంతా ఒక్కొక్కరుగా దిగి తమకు కేటాయించిన బోగీలో తమ తమ సీట్లలో కూర్చుంటారు. ఆఫీసర్ కుటుంబం కూపేలోకి వెళ్తారు. మరాఠీ దంపతులు, నీనాగుప్తా ఒక చోట కూర్చుంటారు. నీనా గుప్తా ఏడుస్తుంటే, మరాఠీ వృద్ధుడు ఏమయిందని అడుగుతాడు. ప్రసవం కోసం పుట్టింటికి జలంధర్ వెళుతోంది అని చెబుతాడు భర్త. మరాఠీ మహిళ కేసి చూసి, “అమ్మా, కాస్త మా ఆవిడని జాగ్రత్తగా చూసుకోండి” అంటాడు. “మీరెక్కడి వరకూ వెళ్తారు?” అని అడిగితే, “జమ్మూ” అంటాడా వృద్ధుడు. “ఏం పర్వాలేదు, మేం అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటాం” అని భరోసా ఇస్తాడు. “మొదటి కాన్పు… అందుకే భయపడుతోంది” అంటాడు భర్త. “అవును.. తొలి కాన్పులో ఆ భయం సహజం” అంటాడు వృద్ధుడు.  నీనా గుప్తా మాత్రం రోదన ఆపదు. “మీరు కూడా ఉంటే బావుంటుంది, నాకు ధైర్యంగా ఉంటుంది” అంటుంది భర్తతో.

“ధైర్యంగా ఉండు, వీళ్ళు నీకు తోడుగా ఉంటారు, ఇక నేను వెళ్తాను” అంటూ భర్త దిగుతాడు.

తమ దుఃఖాన్ని పక్కనబెట్టి ఇలా తోటి వాళ్ళను ఆదుకునేవాళ్ళెందరో మనకు ప్రయాణాల్లో తారసపడతారు కదూ.

***

కళాకారుల బృందం తమ సామాన్లతో బోగీలోకి ఎక్కుతుంది. బృందంలోని ఎవ్వరూ బాధ్యతగా ఉండడం లేదని ‘ఇలా అరుణ్’ విసుక్కుంటుంది. కూతురు అల్లరి చేస్తుంటే, హెచ్చరిస్తుంది. ఈలోపు హరీష్ పటేల్ తమ వాళ్ళను అన్ని బోగీలలో వెతుకుతూంటాడు. వేరే ఏదో రైలు తను ఎక్కాల్సిందనుకుని అటు వెళ్తాడు.

అదే సమయంలో నాయర్ టాక్సీ వచ్చి స్టేషన్ బయట ఆగుతుంది. హడావిడిగా పరిగెత్తుకొస్తాడు. అప్పటికే రైలు బయల్దేరబోతుంటూంది. భార్యకు వీడ్కోలు చెప్పి ఒక బోగీలోకి ఎక్కేస్తాడు. వెళ్ళాక ఉత్తరం రాయమంటుంది భార్య. అలాగే అంటాడు.

హరీష్ పటేల్ కూడా పరిగెత్తుకు వచ్చేసరికి రైలు బయల్దేరిపోతున్న రైలులో ఎక్కాలని ప్రయత్నిస్తే తలుపులు వేసేసి ఉంటాయి. ఐనా అలాగే ఎక్కేసి, తలుపు తీయమని బ్రతిమాలుతుంటాడు.

కళాకారుల బృందంలో రాని వాళ్ళని వెదుకుతూ వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగొచ్చి బోగీలోకి చేరుతారు.

నాయర్ స్వామీజీ ఉన్న చోట తన చోట్లో కూర్చుంటాడు.

“ఈసారి మీరు తలుపు వేయడం మరిచిపోయినట్టున్నారు” అంటాడు శిష్యుడితో.

“క్షమించండి. అక్కడ నేను తలుపు తీసేసరికి మీరు చాలా వెనకుండిపోయారు… అయినా నన్ను మన్నించండి” అంటూ క్షమాపణలు కోరుతాడు శిష్యుడు.

“ఈ స్టేషన్‌లో ఎలా ఎక్కగలిగారు?” అని అడుగుతాడు. పరిగెత్తుకు వచ్చానన్నట్లు సైగ చేసి, నవ్వేసి, “టాక్సిలో వచ్చా” అని చెప్తాడు నాయర్.

శిష్యుడు కూడా నవ్వేస్తాడు.

చాలా సేపటి నుంచి తలుపు దగ్గర వేలాడుతున్న హరీష్ గోల భరించలేక, చివరికి ఓ ప్రయాణీకుడు తలుపు తీసి అతన్ని లోపలికి రానిస్తాడు.

“ఈ బండ్లోనే రాకపోతే… ఇంకో బండిలో రావచ్చుగా…” అంటాడు.

“ఇందులో మా వాళ్ళు ఉన్నారు. మేం ఢిల్లీ వెళ్ళాలి.. లోపలకెళ్ళి కూర్చుంటాను” అంటూ లోపలికొస్తాడు హరీష్.

ఆశ్చర్యంగా అతనికి మళ్ళీ బియ్యం బస్తాల ఆసామి ఎదురవుతాడా బోగీలో.

“మీరు నన్ను బోగీ మారమన్నారు కదా, అందుకే ఈ బోగీ ఖాళీగా ఉందని ఇందులో ఎక్కాను” అంటాడతను. కాసేపాగి, “మీరెందుకో టెన్షన్‌గా ఉన్నారు?” అంటాడు.

“మా వాళ్ళు కనబడడం లేదు. మేమంతా ఢిల్లీ వెళ్తున్నాం. మాది డ్రామా ట్రూప్” అంటాడు హరీష్.

ఇంతలో టిటిఇ వచ్చి టికెట్ అడుగుతాడు హరీష్‌ని. త్రివేండ్రం దాకా తీసుకున్న టికెట్‌ని చూపిస్తాడు. ఇది త్రివేండ్రం వరకే కదా అంటాడు టిటిఇ. “టికెట్ నా దగ్గర లేదు, మా వాళ్ళ దగ్గరుంది వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తున్నాను” అని టిటిఇని ఒప్పించి మిత్రులను వెదుకుతూ ముందుకు వెళతాడు హరీష్.

***

మళ్ళీ కళాకారుల బృందం వైపు మళ్ళుతుంది కెమెరా. ప్రయాణంలో రాని అజయ్ అనే వ్యక్తి గురించి మాట్లాడుకుంటుంటారు. ‘అతను రాడని నాకు ముందే తెలుసు’ అని ఓ వ్యక్తి అంటాడు. నీకెలా తెల్సని మిగతావారు అడిగితే, ‘టీవీ సీరియల్‌లో అవకాశం వచ్చింది, బొంబాయి వెళ్తున్నాను, మన వాళ్ళకి చెప్పద్దు అన్నాడ’ని అంటాడు. మిగతావాళ్ళందరికీ కోపం వస్తుంది. కాసేపు తిట్టుకుంటారు. ఇంతలో ఒకతను ఫ్లూట్ తీసుకుని వాయించడం మొదలుపెడతాడు. ఇంకోతను దాన్ని ఆపమని చెప్పి, ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో ఆలోచిద్దాం అని అంటాడు. అందరూ చర్చలో లీనమవుతారు.

ఈలోపు హరీష్ అన్ని బోగీలలోనూ వెతుకుంటాడు.

***

కూపేలో ఉన్న ఆఫీసర్, అప్పటికే ఎదురు సీట్లో ఉన్న కుర్రాడితో మాటల్లో దిగుతాడు. ఆ అబ్బాయి ఎవరూ, ఎక్కడికి వెళ్తున్నాడు, తల్లిదండ్రులెవరు ఆరా తీస్తాడు. పేరడిగితే ‘రాహుల్’ అని చెప్తాడు. ఓఎన్‌జిసిలో ఇంటర్వ్యూకి వెడుతున్నాడని తెలిసి మెచ్చుకుంటాడు. ఇంటి పేరు అడిగితే ‘అద్వానీ’ అని చెబుతాడు. “ఓ దేశవిభజన అప్పుడు ఇండియాకి వచ్చేసారా?” అని అంటాడు. “నేను అప్పటికి పుట్టలేదు” అని జవాబిస్తాడా కుర్రాడు. ఆ కుర్రాడికి, మీనాక్షికి పరిచయం అవుతుంది.

‘రాహుల్ అద్వానీ’ – ఈ పూర్తి పేరు వింటే ఓ క్షణం పెదాలపై చిరునవ్వు రాదూ?

***

కళాకారుల బృందంలోని ‘ఇలా’ పాటందుకుంటుంది. ఆమె పాట, పాటకి తగ్గట్టుగా వాయిద్యాల ధ్వనుల బోగీలోని ప్రయాణీకులని అలరిస్తాయి. అప్పటిదాకా ఉద్విగ్నంగా ఉన్న ఆ బృందం సభ్యులు పాటలో లీనమై శాంతిపొందుతారు. సాంత్వననిచ్చే సంగీతం వినిపిస్తున్నప్పుడు మనసు తేటపడడం మనకందరికీ అనుభవమే!

***

కెమెరా మళ్ళీ స్వామీజీ, శిష్యుడి వైపు వస్తుంది.

“మీరెక్కడి దాకా వెళ్తున్నారు?” అని అడుగుతాడు నాయర్.

తాము జమ్మూలో దిగి, అక్కడ్నించి హిమాలయాలకు వెళ్తామని అంటాడు శిష్యుడు. “జమ్ము నుంచి శ్రీనగర్ బస్‌లో వెళ్ళాలి, అది స్వామీజీకి కష్టమవుతుందేమో” అని అంటాడు నాయర్. ఎలాగైనా హిమాలయాలకు చేరుకోవాలనేదే తన మనోనిశ్చయమని స్వామీజీ చెబుతారు. “రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు మనకి గమ్యమే ముఖ్యం. కానీ జీవితపు యాత్రలో గమ్యం కన్నా గమనమే ముఖ్యం” అంటాడు నాయర్.

***

తనవాళ్ళను వెతుకుతున్న హరీష్‌కి కళాకారుల బృందం కనబడడం, వాళ్ళంతా అతని మీద అరవడం, అతను సర్ది చెప్పడంతో రెండో ఎపిసోడ్ ముగుస్తుంది.

“One’s destination is never a place, but a new way of seeing things” అని Henry Miller చెప్పిన మాటలని తలచుకుంటూ మనమూ ముగిద్దాం.

***

ఈ రెండో ఎపిసోడ్‌ని ఇక్కడ చూడొచ్చు.

వచ్చే వారం మూడో ఎపిసోడ్‌తో కలుద్దాం!

(సశేషం)

Exit mobile version