Site icon Sanchika

‘యాత్ర’ చూద్దామా ఎపిసోడ్-9

[dropcap]’యా[/dropcap]త్ర’ 9వ ఎపిసోడ్ ప్రారంభంలో రాజస్థాన్‌లో ఎడారిని, సామాన్లు మోస్తున్న ఒంటెలను పట్టుకుని నడుస్తున్న కొందరు మాట్లాడుకుంటూ నడుస్తుండడంతో మొదలవుతుంది. స్త్రీ పురుషులు వాయిద్యాలు పట్టుకుని ఉన్న ఒక బృందం వీళ్ళను దాటుకుని ముందుకు వెళ్తుంది.

ఇంతలో నాయర్, మరికొందరు ఎక్కిన జీపు రోడ్ మీదకి వస్తుంది.

“నీ ఫ్యామిలీ పోస్టింగ్ శాంక్షన్ అయిందా లేదా? ఏ స్టేషన్‌కి అప్లయ్ చేశావు?” అని ఓ మిత్రుడు నాయర్‌ని అడుగుతాడు.

“నా భార్యకు మద్రాస్ ఇష్టం” అంటాడు నాయర్.

“మీలాంటి వాళ్ళకు ఒకే చోట మూడేళ్ళు డ్యూటీ ఉంటే పర్వలేదు, లేకపోతే కుటుంబ జీవితం చెదిరిపోతుంది. నేనంటే బ్రహ్మచారిని.. ఇంతకీ మీ శ్రీమతి ఎలా ఉంది? పిల్లలా?” అంటూ అతను నవ్వేస్తాడు.

“బావుంది. ఇంకా పిల్లల్లేరు. పుడతారులే…” అంటాడు నాయర్.

“ఇక్కడ్నించి అస్సాం‍కి మూడు రోజుల ప్రయాణం. హాయిగా పడుకుని వెళ్ళొచ్చు”

“నాకు దూరప్రయాణాలంటే ఇష్టం” అంటాడు నాయర్.

“ప్రయాణంలో రకరకాల వ్యక్తుల్ని కలిసేందుకు అవకాశం దొరుకుతుంది. అయినా అసలు జీవితమే ఓ ప్రయాణమనీ అంటారు. కానీ ప్రయాణంలో జీవితంలో విభిన్న పార్శ్వాల అనుభవం కలుగుతుంది. కొద్ది రోజుల క్రితం నేను కన్యాకుమారి నుంచి జమ్మూ వరకు ప్రయాణించాను” అని చెబుతూ ఆ ప్రయాణంలో తనకెదురైన నీనా గుప్తా గురించి, స్వామీజీ గురించి, వేణుగోపాల్ గురించి తన మిత్రులకి చెప్తాడు నాయర్. ప్రయాణం పూర్తయ్యేసరికి వాళ్ళు తనకెంతో దగ్గర మనుషులు అని అనిపించిదని చెప్తాడు.

“కానీ వాళ్ళిప్పుడు నాకు అపరిచితులైపోయారు. కానీ జ్ఞాపకాలలో శకలాలయి నిలుస్తారు” అంటాడు. జీపు ముందుకు సాగుతుంది.

***

“ప్రతీ వ్యక్తీ ఎక్కడికోక్కడికి చేరుకోవాల్సిందే. ప్రతీ మనిషికీ తనకంటూ ఓ గమ్యం ఉంటుంది” అంటూ నేపథ్యంలో నాయర్ గొంతు వినిపిస్తుంది

***

నాయర్ జీప్ వచ్చి జైసల్మార్ స్టేషన్‌లో ఆగుతుంది. సిపాయిలు సామన్లు దింపుతారు. మిత్రుడు కొన్ని జాగ్రత్తలు చెబుతాడు. ఈసారి నాయర్ గమ్యం గౌహతి.

ఒంటెల మీద సామాన్లు వేసుకొని వచ్చిన వ్యక్తులు, వాయిద్యాల బృందం అందరూ స్టేషన్ చేరుతారు.

వాయిద్యాల బృందం ప్లాట్‍ఫామ్ మీదే పాటందుకుంటుంది.

***

ఓ శ్వేత జాతి వనిత ప్లాట్‍ఫామ్ మీదకి వస్తుంది. ఆమె వెనకాలే ఒకతను వస్తాడు. ఆమె టికెట్లు ఇచ్చి, ఆమె బ్యాగ్ తాను పట్టుకుంటానంటూ విసిగిస్తాడు. ఆమె వద్దంటున్నా బ్యాగ్ తీసుకోబోతాడు.

***

రైలొచ్చి ఆగుతుంది. అందరూ ఒక్కసారిగా ఎక్కడానికి ప్రయత్నిస్తారు. శ్వేతవనితని ఎలాగోలా రైలిక్కిస్తాడు వచ్చినతను. నేను టిసితో మాట్లాడుతాను అంటాడు. ఆమెకి కొద్దిగా హిందీ వచ్చు. తన పనులు తాను చూసుకోలననీ, ఇక వెళ్లమని చెప్తున్నా అతను వినడు. ఆమెని విసిగిస్తూ ఉంటాడు.

ఆమె కింద కూర్చోవడం చూసిన నాయర్ తన సీట్ ఆమెకి ఇవ్వబోతే, ఆమె వద్దంటుంది.

వాయిద్య బృందంతో మాటలు కలుపుతాడు నాయర్. మీది జైసల్మేరా అని అడిగితే, “కాదు సమీపంలో పల్లెటూరు. మేము అక్కడ వ్యవసాయం చేస్తాం” అని చెప్తారు. “ఇక్కడ వ్యవసాయం కూడా చేస్తారా?” అని ఆశ్చర్యపోతాడు నాయర్.

“గత నాలుగేళ్ళుగా వానల్లేవు… పంటల్లేవు… అందరికీ మాలాగా ప్రోగ్రామ్స్ ఉండవు” అని ఒకతను చెప్తాడు.

“మీకు ప్రోగ్రామ్స్ బానే ఉంటాయా?” అని నాయర్ అడిగితే అవునంటాడు.

“ఆఁ, ఏవున్నాయి లే! ఒక్కప్పుడు ఏ కార్యక్రమం అయినా పిల్చేవారు… ఇప్పుడన్నీ సినిమా పాటల రికార్డులే” అంటాడు ఒకతను.

“అయితే మాకు ప్రభుత్వం ప్రోగ్రామ్స్ ఇస్తుంది” అంటాడతను.

“పర్యాటకుల కోసమా?” అని నాయర్ అడిగితే, అవునంటాడు.

“ఇదిలో ఇలాంటి తెల్లవాళ్ళొస్తే, కాసిన్ని డబ్బులు దొరుకుతాయి, ఏమైనా ఇదివరకులా మాత్రం లేదు” అంటాడింకోతను.

ఇప్పుడు జబ్బులు పెరిగిపోయి, సంపాదించిన కొద్ది మొత్తమూ వైద్యానికో సరిపోతుందని వాపోతాడు.

“మీరెక్కడి వెళ్తున్నారు?” అని అడుగుతాడు నాయర్.

తాము అజ్మీర్ షరీఫ్ వెళ్తున్నామని చెప్తాడతను.

“అక్కడ ప్రోగ్రామ్ ఉందా?”

తన భార్యని చూపిస్తూ, “తనకి ఆరోగ్యం బాలేదు. అందరూ అక్కడికెళ్తే నయమవుతుందంటున్నారు. అందుకే వెళ్తున్నాం” అంటాడతను.

కాలక్షేపం కోసం ఏదైనా పాడమంటాడు నాయర్. బృందం పాటందుకుంటుంది. భాష అర్థం కాకపోయినా ఆ పాట హృదయాలని తాకుతుంది. వాయిద్యాల వాద్యం కూడా ఆకట్టుకుంటుంది. పొగ చిమ్ముకుంటూ రైలు ముందుకు సాగుతుంది. (అవును, అది బొగ్గు ఇంజన్ రైలు!). పాటా, ప్రయాణం సాగుతుంటాయి. ఒకచోట నెమలి ఒకటి పట్టాల మీదుగా పరిగెడుతుంది.

***

సింగ్ అనే ఆ వ్యక్తి శ్వేతజాతి వనితని విసిగిస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తాడు. “మీరు ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణిస్తే మంచిది” అంటూ ఆమెకి సూచిస్తాడు నాయర్.

అవునవునంటు వంతపాడతాడు సింగ్.

ఇంతలో జబ్బుగా ఉన్న ఆ రాజస్థానీ మహిళ పడిపోతుంది. నోట్లోంచి నురగలు వస్తుంటాయి. ఎవరి దగ్గరైనా చెంచా ఉందా అని అడుగుతాడు నాయర్. లేదంటారు, తన పెన్ తీసి నోట్లో పెట్టమని ఇస్తాడు నాయర్. కొద్ది సేపటికి నురగ ఆగుతుంది.

“ఇదివరకు నెలల తరబడి ఉండేది. ఇప్పుడు వారానికి ఒకసారి వస్తోంది” అని చెప్తాడో వ్యక్తి.

“రెండో పెళ్ళి చేసుకోరా అంటే మా వాడు వినడు” అంటాడు ఇంకోతను.

“తను నా భార్య, నా పిల్లల తల్లి… ఇంకో పెళ్ళి ప్రసక్తే లేదు” అంటాడా భర్త.

ఈ రోగం నయం చేయించుకోడానికే, అజ్మీర్ షరీఫ్ వెళ్తున్నామని, అల్లా దయ చూపుతాడని అంటారు. ఆమెకి కొంచెం సర్దుకుంటుంది. భర్త చేతులు రుద్దుతూంటాడు. గుమిగూడి ఉన్నవారిని తప్పుకుని ఆమెకి కాస్త గాలి తగలనివ్వమని అంటాడు నాయర్.

కాసేపటికి జోధ్‌పూర్ స్టేషన్ వస్తుంది. పాత విగ్రహాలను స్మగ్లింగ్ చేసే వ్యక్తులు కొందరు ఇక్కడ దిగుతారు. తమ సామాన్లతో పారిపోబోతుంటే అధికారులు వాళ్ళని తరిమి పట్టుకుంటారు.

శ్వేత జాతి వనిత క్రిందకి దిగి టిసిని కలిసి తనకి ఫస్ట్‌క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో సీట్ ఇవ్వగలుగాతాడేమో కనుక్కుంటుంది. సింగ్ ఇంకా ఆమె వెంటపడుతూనే ఉంటాడు. ఫస్ట్ క్లాస్‌లో టికెట్లు లేవని అంటూ, కావాలంటే, ఇంకో మహిళ క్యాబిన్‌లో ఇస్తాను అంటాడు. అందుకామె ఒప్పుకుంటుంది. నాకు ఓ సీట్ కావాలంటాడు సింగ్. ఇతను మీ మనిషా అని శ్వేతజాతి వనితను అడుతాడు టిసి. కాదంటుంది. ఇంతలో నాయర్ తనకి మిలిటరీ కోటాలో ఫస్ట్ క్లాస్ టికెట్ ఉందనీ, తను ఏ బోగీలో ఎక్కాలి అని టిసిని అడుగుతాడు. వాళ్లిద్దరూ టిసి చూపించిన కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కి కూర్చుంటారు.

కొత్తగా పెళ్ళయి, అత్తారింటికి వెళ్తున్న అమ్మాయి బంధువర్గం ఆమెని సాగనంపడానికి వస్తుంది. కొత్త పెళ్ళికూతురు ఏడుస్తూ ఉంటే, బంధువులు ఓదారుస్తుంటారు. మామగారు కొత్త అల్లుడికి జాగ్రత్తలు చెప్తాడు. రైలు బయల్దేరుతుంది. నాయర్ కంపార్ట్‌మెంట్‌లోనే ఆ కొత్త దంపతులు ఎక్కుతారు.

“ఇందాక ఏదైనా గొడవైందా?” అని ఆ భర్తని అడుగుతాడు నాయర్.

“అదేం లేదు. ఎవరో దొంగ పారిపోతూ, మా ఆవిడ గొలుసు దోచేయాలని ప్రయత్నించాడు” అని చెప్తాడు.

“దెబ్బలేమయినా తగిలాయా?”

“లేదు బాగా బెదిరిపోయింది” అంటాడు.

ఇంతలో భార్య తాను దుస్తులు మార్చుకోవాలని భర్తతో అంటుంది.

“మీరు కాస్త అలా పక్కకి వెళ్తారా?” అని భర్త నాయర్‌ని రిక్వెస్ట్ చేస్తాడు. నాయర్ కదులుతడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

***

పర్యాటక స్థలాలలో మహిళలను, ముఖ్యంగా విదేశీ మహిళలను వేధించడమనే జాడ్యం 30 యేళ్ళ క్రితమూ ఉందని ఈ ఎపిసోడ్ చెబుతుంది.

అవిద్య, అనారోగ్యం, అంధవిశ్వాసాలు ఒకనాడెంత బలంగా రాజ్యం చేశాయో ఈ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది.

అయినా ప్రయాణంలో సామాన్యులు ఎంత హాయిగా ఉండగలరో, ఇరుక్కుని ప్రయాణం చేస్తున్నా, హృదయాలు విశాలంగా చేసుకుని ఉదారంగా ఉండగలరో తెలుస్తుంది.

కాలమాన పరిస్థితులు మారడంతో ఒకనాడు ఎంతో ఆదరణ పొందిన కళాకారులు నేడు భుక్తి కోసం ఇబ్బందిపడడం అప్పుడూ ఇప్పుడూ ఉండడం గమనిస్తే బాధ కలుగుతుంది. నాటికీ నేటికీ కళాకారులకు వారి కళలే సాంత్వన.

“The journey has its own lyrics, a duet of balanced motion, the rails and wheels in tune” అన్న Richard L. Ratliff మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఇక్కడ ఆపుదాం.

***

ఈ 9వ ఎపిసోడ్‌ని ఇక్కడ చూడచ్చు.

పదవ ఎపిసోడ్‌ తదుపరి సంచికలో!

(సశేషం)

Exit mobile version