Site icon Sanchika

ఎగుడు దిగుడు బాటలో జీవన పయనం

[box type=’note’ fontsize=’16’] కన్నడంలో డా. విజయ రచించిన ‘ఎరిళితగళ నడువె ఉక్కువ జీవన ప్రీతి’ అనే కథని అనువదించి తెలుగులో అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు. [/box]

[dropcap]ఈ[/dropcap] ఛణానికి నా ముందర ప్రశ్నలే లేవు. అయితే దినమంతా అవి నన్ని ఇంస పెతడానే వుంటాయి. లోపలా… బయట…

పాత్రలోని బిర్యానికి ‘దం’ ఇయ్యాల. బిరియాని రుచిగా వుంటాది. అయితే ప్రతి ఛణం ‘దం’… అయ్యేనా మనసుకి రుచి యాడ? నాలాంటి ఆడ కూతుళ్లు ఇట్టాగే బతుకుతూ ఉంటాము. సెప్పేందుకు కొత్త సంగతేముంది?… అందరి అగసాట్లు అవే… అవే…

***

ఇది, నేను నడుప్తా ఉండే ఓటలు. తొలిసారిగా నేను గల్లా పెట్టె ముందు కూకున్నప్పుడు, లోని కొచ్చినోళ్లందర్కీ ఇడ్డూరమే. చెవులు కొఱుక్కుండారు కొంతమంది. లోలోనే నగుతావుండారు. తాగి, తిన్నోళ్లు లెక్క జెప్పి ఇచ్చేటప్పుడు నా మొగం జూసి నవ్వినారు. నేను, ఆల్ల మొగం కూడా సూడకండా, ఆళ్లు టేబిల్ పైన పైసల్ని గల్లా పెట్టెలోకి ఏస్కోని, సిల్లర ఇచ్చేటోళ్లకి సిల్లర ఇచ్చేస్తావుంటి. ఔను, ఇన్ని దినాలు ఇట్లోనే వుంటి, బయటికొచ్చేదాన్నే కాదు. ఇపుడు, ఈ మిలట్రీ ఓటేల్‍లో గల్లా పెట్టె తాన గౌరమ్మ లెక్కన కూకోని వుంటి. అందర్కి ఆచ్చర్యంగానే వుండె. దీన్కి కారణం సెప్పేటోళ్లు ఎవ్రు. మూతి కట్టేస్కోని బింకంగా వుండిపోతి.

రాస్తాలో నడిసిపోయేటోళ్లు, ఓ కొంచం సేపు నిలబడుకుని “సీతక్క కదా ఆడుండేది”, అని ఒకరంటే, “రాముడిగాడి పెండ్లాం గాదా!”, అని ఒకడంటే,  “ఏందిది ఆచ్చెర్యం! ఈ యమ్మ కూకొని వుండాదే! ”, “రాముడియ్యాల లేడే, పైలో బాలేదోమో”, “అయినా ఆడకూతుర్ని కూకోబెట్టి నాడే!”  –  ఇట్లా ఆళ్లంతకి ఆళ్లే మాట్లాడుతా వుండ్రి. నన్నటిగే దయర్యం ఎవ్రికీలేకపోయే.

నాకా ‘ఓ’ అంటే ‘ఠో’ రాకపోయే. సదివేందుకూ రాదు రాసేందూకూ రాదు. దేని కెంతో తెలీదు. బిల్లు ఎట్లా సేయలో తెలియకపాయె. తిన్నోళ్లే, ఆళ్లకి తెల్సినంత దుడ్లు టేబిల్ మీద పెతతావుండ్రి. దాన్ని గల్లా పెట్టెలోకి ఏస్కుంటా వుంటి. నా అవస్థ సూసి నా మీద నాకే కోపం వస్తావుండె. ఇట్టా పరిస్తితి వత్తుందని నేనెప్పుడు అనుకేని వుణ్ణిందే లేదు. ఆ పరిస్తితి వచ్చే వచ్చింది.

***

మాది పల్లి. నాయన రైతు. రేసం గూడ్ల యాపారం. నా సిన్నతనమంతా రేసం గూడ్ల మద్దినే గడిసిపాయె. బలవంతంగా నన్ని ఇస్కూల్‌కి పంపించ్చిండ్రు. సదువు నా తలకెక్కక పాయె. తిట్టి బుద్ది సెప్పేటోళ్లు లేకపాయిరి. బళ్లోన అన్ని క్లాసుల్కి ఒకే అయ్యవోరు. “రే మీరు లెక్కల్ సేయండ్రా, రే,  మీరు తెలుగు పాటం సదవండ్రా, రే, మీరు సూసి రాత రాయండ్రా” అని ఒక్కో క్లాసోళ్లకి సెప్పేది, ఆయనంత కాయన గొఱకపెట్టి నిద్రపోయేది. మేమాడిందే ఆట. సదువెల్లా ఒచ్చీని? అచ్చరం ముక్కరాలే. జతగాళ్లని ఎంటేస్కుని, మామిడి తోటల్లోకి నుగ్గేరే సరిపాయ. ఇప్పుడర్తమయ్తా వుంది నేనేం పోగొట్టుకుండానో అని. పెద్దదాన్ని అయ్తనే పెండ్లి చేసిరి రామన్నతోటి. మా ఇద్దర్దీ మంచి జోడి అని అంద్రూ పొగడబట్రి. మాంచి కండబలంతోటి, ఎడల్పయిన ఎద, గండు ముఖంతో తోటి ఉండే నా మామ. మాట పెడుసైనా మనసు ఎన్నపూస. ఎవ్రయినా కట్టంలో వుండారు అని తెలిస్తే సాలు, కరిగిపోయే మడిసి. బెంగ్లూరు సేర్తిమి. సీమనూనె యాపారం చేయబట్టె. అప్పుడంతా సీమనూనికి కంట్రోలుండె, లయిసెన్సూ తెచ్చుకోని, నూకే బండిలోన డ్రమ్ము నిండా సీమనూనె నింపుకొని రాజ లెక్క బజార్కి దిగేటోడు. సంపాదన బాగా వుండె. కారుడు లేనోళ్ల తాన కొంచ ఎక్వ దుడ్లు తీస్కోని అమ్మేటోడు. దాంతో అంతో ఇంతో మిగుల్తా వుండె. సంపాదించేదేగాని జమా కర్సులు తెలీకుండె నా మొగుడికి. ఎనకేసుకునేదంటే ఏందో తెలీకపాయె. కట్టంలో వుండానని ఎవ్డయినా వచ్చి అడిగెనా, అంతే చెయ్యెత్తి ఇచ్చేదే గాని మల్లా అడిగేటోడేగాదు. ఆళ్లిస్తే ఇప్పించుకొనేది, లేదంటే అడిగేదేలేదు. నే నెప్డయినా, “ఏం మల్లా అడిగేదీ లేదా” అంటే “పోన్లేవే కట్టంలో వుండారంట –  వుంటే ఇస్తావుండెగదా!” అని అనేటోడు. జాస్తి మాట్లాడితే ఇంకెక్కట్టి- నరసింహసామే –  కండ్లు ఎర్రగ జేసుకొని “ఏయ్” అంటే సాలు నాకు ఊపిరే నిల్సి పాయేది ఇంకేంది అడిగేది!

అయితే ఆడికి నేనంటే వల్లమాలిన ఇట్టం – ఏం అడిగినా లేదనేవోడు గాదు. మా ఇద్దర్ని సూసినోళ్లు –  సీతమ్మ రామసెంద్రుడు లెక్కన ఉండారని అంటుండ్రు. నేనేమి ఎక్వ సెపుతా ఉండానని అనుకనేరు. మేమిద్దరం అట్లనే ఉంటిమి. ఈడూ జోడూ బాగా కుదిరినాది. మాకీ ఓ అడకూతురాయె. ‘ప్రీతి’ అని పిల్సుకొంటూ వుంటిమి. సాలా అందంగానూ ఉండె. మా మాదిరిగా, ఓనమాలు రాకుండా మొద్దుదాని లెక్క వుండగూడదని దాన్ని బాగా సదివించాలని ఇద్దర్కీ ఆసె. సదివిస్తిమి. అది గూడా బాగా సదివి పై క్లాసుల్కి పోతుండె. కాలేజీకి సేరిందాయ. కాలేజీలోన సదువుతుండాది మా కూతురని మా ఇద్దర్కీ సంబరమే సంబరం.

మా ఇల్లు ఉండేది ఓ ఐదారిండ్లుండే కాంపౌండ్ లోన. ఆడుండే ఆళ్లందరి తాన పరిసయాలు ఆయ. ఆళ్లని సూసి నేనూ నాజూకుతనాన్ని నేర్చుకొంటి. అందరికన్నా ఏం తక్వ లేకుండా బతుకుతా వుంటిమి. ఆ ఇంట్లో వుండేటోళ్లని మాట్లాడించేందుకని ఓయమ్మ వస్తుండె. ఆ అక్క పేరు స్నేహ. సానా మంచిది. వస్తా, పోతా నాతోనా మాట్లాడేది. అట్లా, మాట్లాడ్తా, మాట్లాడ్తా మంచి దోస్తీ కుదిరిపాయె. కట్టసుకాలు ఇచారుస్కునేది, అదీ, ఇదీ ఇచారించేది.

ఓ దినం “ఇంట్లోకి రండక్కా” అని పిలిస్తి. మాట్లాడ్తా, మాట్లాడ్తా ఇసయాల్ని తెల్సుకొని “యాల, ఇంకా సొంతిల్లు సేసుకోలేదా?” అని అడిగింది. సన్నగా నగుతూ “వుర్లోన వుండాయి. ఇళ్లు ఇక్కడెందకనే అక్కా!” అనే నా మొగుడు.

“ఏదైనా సొంత బిజినెస్ చెయ్యవచ్చుకదా” అని అంటుండె స్నేహ అక్క నా మొగడు తాన. అట్లా పోరి, పోరినాక, అదేమనిపించిందో నా యజమానునికి – ఎండనకా, వాననకా సీమనూనె గాడీని తొక్కుకుంటా తిరిగేదాని కన్నా ఓ యాపారం సేయాలనిపించింది –  అదే ఈ ఓటల్ యాపారం. మెయన్ రోడ్ దగ్గిట ఓ కాలీ జాగా వుండె, నా మొగిడి జతగానిది. “రే రాముడూ నీకే లేదంటానా… లీజ్కి ఏస్కాంట తీస్కో. ఏం యాపారం జేత్తావో సెయ్యి” అని జాగా ఇచ్చె. దాంట్లాన ఓ సెడ్డు – లోన ఓ రూమూ వుండె. ఏం ఆలోచన సేసినాడో ఏందో నా యజమాను ఓటల్ పెడదామనె.

నా కూతురు ప్రీతి పేరే దానికీ, ‘ప్రీతి మిల్ట్రీ ఓటల్’ అని బోరుడు రాయంచు కొచ్చినాడు. ఆ ఏరియాలోన నా పెనిమిటి జతగాడు చంద్రణ్ణ  – మంచి పేరున్నోడు. అందర్కీ సాయం జేసేటోడు –  ఆయప్ప సాయం మాకు దొరికినాది. సీమనూనె యాపారం జేసేతవుడు జనాలు బాగా పరిసయమయ్యిండ్రిగదా –  రామయ్య ఓటల్ – అని జనాలు రాబట్రి. ఓటల్ పెట్టిందాని కేమి మోసం లేకపోయె. యాపారం బాగానే అయితా వుండె.

నాకీ సదువు రాకపాయె, నా పెనిమిటికీ సదువు రాకపాయె. లెక్కలు రాసేకని, సరుకులు తెచ్చేదనికని, సదుకొచ్చిన సిద్రాము అనే వోణ్ణి పనిలోకి బెట్టుకుంటిమి. ‘ప్రీతి’ ఓటల్ అంటే సానా మందికి ఇట్టమాయె.

స్నేహ అక్కకి టాంక్స్ సెప్పాల ఇట్లా ఐడియా ఇచ్చినందుకు. బ్యాంక్ యావ్వారమే మాకి తెలియకపాయె. స్నేహ అక్కయ్యే మాకు బుద్ధి సెప్పి బ్యాంక్‌లో ఖాతా తెరిపించా. అదేందోగాని ఆ అక్క ఏం సెప్పినా దాన్కి ఎదురు సెప్పేటోలే గాదు మా యజమాన్డు… ఆయమ్మ సెప్పబట్టే ఓ సొంతిల్లుకి పూనుకొంటిమి. ఇండ్ల కోసమని పారాడి, పారాడి సుస్తు అయిపాయ నా మొగుడు. ముందు లెక్కన వుషారుగా లేకుండె. ఎప్డూ ఉస్సప్పా, ఉస్సమ్మా అని అంటూండె. “ఇట్లా తిరగాల్ల అంటే ఆయస మయితాదె” అంటుండె నా తాన.

“పోని ఇడ్సి పెట్టు. నీకు బేకు లేదనుకుంటే నాకూ బేకు లేదు. నీవు నగ్తా నగ్తా వుంటే నాకదే సాలు” అంటూంటి.

ఈ ఇండ్ల కోసం పుడకలాడి పుడకలాడి ఇంకా సుస్తు ఎక్కువైనాది. ఇది సూసి స్నేహక్క బలంతాన ఆస్పత్రికి తోల్కొనిపోయి సెకప్పు సేయించె. అయ్యె, ఆ డాక్ట్రు యధాదిష్టిగా చెప్పినాడు కాన్సర్ అని. నే నాడనే కూలబడితి. నా మొగుడు సప్పమొగమేస్కోని కూకుండి పోయే. మాట్లాడడు. ఎమయ్తావుందో ఏమో?  నాకేమో దిగులు. డాక్ట్రు తాన ఏందేందో మాట్లాడుకొని వచ్చె స్నేహక్క. నా మొగడి సెయ్యి బట్కొని “రామన్నా నీకేం గాలేదు. మందులుండాయి. అన్నీ సరిపోతాయి” అని సెబితే “సరే అక్కా నీ వెట్లా సెబితే అట్లా” అనె నా మొగుడు.

మందులూ, సూది మందులు, ఓగిటా… రెండా… తిప్పలు.  తిప్పలాట మద్దినే, ఇల్లు కొనిందీ ఆయ. ఇంట్లో సేరే శాస్త్రమూ ఆయ. అంతో ఇంతో కూడ బెట్కొనిందంతా కర్సు అయిపాయ. నా మొగుడికి దుడ్లు బాకీ ఇయ్యాల్సినోళ్లు మొండి సెయ్యి సూపిరి. స్నేహక్క పుణ్యమా అని బ్యాంక్‌లో లోన్ చిక్కె. అయితే వాయిదాలు కట్టేకి దుడ్లు సాలకొస్తుండె. మందుల్కి, ఆస్పత్రికీ- తిరిగేకే సాలయిపాయి. ఇదీ సాలక కూతురు సదువు కర్సు. ఏమంటే దాని సదువు అయిపోతానే, దానికి ఉద్యోగమూ సిక్కె. కొంచం నిలదొక్కకుంటిమి. మా పాలిట సుకం, సంతోషం అంతా మా బిడ్డే. అది నగితే సాలు మేము మా కట్టాలన్నీ మర్సి పోతా వుంటిమి.

ఆదీ, ఓ పిల్లగాణ్ణి ఇట్టపడింది. ఆ పిల్లోడూ మంచోడే. మా జాతోడు కాకపోతే ఏంటంట. బిడ్డ అయినా వుండే మాకదే సాలు. మా యజమాన్డు వుసారుగా వుండే టయం లోనే దాని మనువూ జరిపేస్తమి. పెండ్లి పేరంటమూ, ఆస్పత్రి అని మేము దింట్లోనే మునిగిపోతే ఓటల్ వుస్తువారి సుస్కోనేది ఎవ్రు, అని సిద్రామణ్ణ బుజాల మీద ఏస్తిమి. లెక్కా, ఏక్కా రాసేదానికి మాకింత సాయంగా వుంటాడని ఆణ్ణి పన్లోకి పెట్కొన్నప్పుడు, ఆడికుండే ఇనయం, వస్తా వస్తా అది మాయమైపాయ. మాడ్లాడే మాట కొంచం బిరుసాయ. లెక్కల్లో ఏరు పేరు కానొచ్చి. మా యజమానప్పకి ఆడి మీద అనుమానమే లేకపాయె. నేనేమన్నా నోరు ఇప్పితే, “లేనపోనిదంతా సెప్పేకి రావొద్దు. నీకేందెల్సే యాపారమంటే – నోర్మూస్కునుండు” అని గదిరిస్తాడు. ఆడు, ఆ సిద్రామణ్ణగాడు రాసిందే లెక్క, సెప్పిందే రైటు, ఇచ్చిందే దుడ్లు అయిపాయ. వస్తా వస్తా యాపారం లోపలికొచ్చె. “ఈ పొద్దు ఇంతే అయినాది యాపారం” అని ఎయ్యో రెండువేలో సేతిలో బెడుతుండె.

మా యజమాని ఖాయిలా ఎట్లాంటదని తెల్సి నాకే ఆడూ, ఆని పితలాటకం జాస్తి ఆయ. మొగుడు మంచాన బడినాడు, ఒంటరి ఆడది సిక్కుతాది అని ఆడి లెక్కచారం. ఎవర్తానా సెప్పేది కాదు సెప్పినా ఇనోటోళ్లూ లేరు. ఆణ్ణి గతిలేకపాయె. అయితే ఎన్ని దినాలని సయించుకొని వుండేదవికయితాది. ఈ నా యజమాన్డు, ఎవర్నన్నా నమ్మేస్తే అంతే, ఆణ్ణి నెత్తిన బెట్కుంటాడు. “నీకెంతెల్దు నీ వూర్కో” అని నా నోరు మూసేస్తాడు.

రాను రాను సిద్రామణ్ణగాడి యవ్వారం జాస్తీ ఆయా నా సెయ్యి ముట్టేది, మీద సెయ్యేసేది ఎక్కవాయె. ఓ దినం నేరుగానే అనేసినాడు. “నాతాన జతగట్టి నేసెప్పినట్ట ఇన్కోనివుండు” అని. పిచ్చి కోపమొచ్చెనాకు. వీణ్ణిదేంది జబద్దస్తీ అని నేనే ఓటల్లో గల్లా పెట్ట ముందు గూకుంటి. సిద్రాకుణ్ణగాడి తప్పుడు కూతలు, ఆడిన నాటకాలు అన్నీ నాకు తెల్సినాయి. మా ఇంటాయనకి వచ్చిన కట్టాన్ని వాడుకొని, వచ్చే ఆదాయంలో దిగమింగుతూ, ఆ పైన నన్నీ బుట్ల ఏసుకునేకి చూస్తావుండే. ఇట్లాంటోన్ని, ఇంకా నమ్మకాన్ని పెట్కోనుండే నా పెనిమిటి పైన ఇపరీతమైన కోపమొస్తా వుండే. మనసుల్ని నమ్మాల… అయితే ఇంతగానా!

నేను గల్లా పెట్ట దగ్గరే కూకుంటా వుంటి. అది ఆ సిద్రామణ్ణగాడికి కట్టమైంది. దుడ్లు కొట్టేసే చాన్సు దొరకలేదు ఆడికి. నా మీద గుర్రుమంటుండె. అన్నీ అపద్దాలు చెప్తావుండె. సామాన్లు తెచ్చేదాంట్లో కమిషన్ కొట్టేది. పాత్రలు తోమే టోన్కి అది ఇదీ సెప్పి ఆణ్ణి పనికి రాకుండా సేసి నాకు తొందర ఇచ్చేది. ఇట్లాంటివి చేస్తుండే. ఇది పని గాదని నానే అన్ని పన్లు సేసుకొనేందుకి కొంగు బిగిస్తి, ఆ సిద్రామణ్ణగాడి ఆట ఎట్లయినా కట్టేయాల అనేదే నా హఠం. ఎన్ని పన్లు జేసినా గల్లా పెట్ని మాత్రం నాతానే పెట్కుంటి. బిరియానీ సేసోటోన్కి అంతో ఇంతో ఇచ్చి ఆణ్ణీ పనిలోకి రాకుండా జేసే. అయితే నేను దేనికీ తగ్గిందే లేదు. బిర్యానీ సేసేటంద్కు దిగితి. ఓ రెండు దినాలు..య అంతే… కమ్మని బిరియాని సేయబడ్తి. పరోటా సేసేదీ నేర్సుకుంటి –  యాపారమూ బిరుసాయ. అదెట్లా అమ్మోరు పూనిందో ఏమో – ఎట్లా శగ్తి వచ్చేందో ఏమో – దేన్కీ ఎనకేటు ఏసిందే లేదు. ఆడు ఆ సిద్రామణ్ణ గాడు ఎన్ని అడ్డరాళ్లు ఏసినా – గెలిసే తీర్తననే హుమ్మస్సు నాది. ఓ దినం మా యజమాన్డు వచ్చి, “ఏంద్కే ఇంత గాసి బడ్తావుండావు” అని అంటే అప్పుడు కొంచ జోరుగానే “ఇదిగో, ఇంత బాకీ తీర్సినా… ఇంత బ్యాంక్ లోకి జమ జేసిన… యాపారం తగ్గేదే లేదు” అని అంటానే నా మొగుడు బిత్తరపాయ. నేను సెప్పక పోయినా, ఆడు ఆ సిద్రామణ్ణగాడు ఎంత అన్నేయం జేసినాడు తెల్సిపోయినాది మా ఆయనకి.

“సీతా రేపు పద్దన్నే నాలుక్కి లేపు. పనుండాది” అనె. అట్లేగాని అంటి.

లేసిందే తడవ “పద ఎల్దాం”  అనె. యాడ్కి అంటి.

“పదా… నీక్కాల…” అని కూటర్ బయటకి దీసి, కూకో అని దాన్ని స్టార్టు జేసి దూరంగా ఉండే మైదానం కాడికి నడిపి, నిలిపి “దిగు” అనె. దిగితి. “ఈ యాండిల్ పట్కో… పట్కోని దీన్ని దబ్బుకుంటాపా” అనె. “ఏందే అట్లా ముకం ముకం జాత్తావుండావు” అని గదిరె. ఎన్నో సార్లు ఇంటికాడ బయటున్న గాడిని ఇంట్లోకి నూక్కొని పోతావుండే. అటాటుండె దాంతో మెల్లిగ నూక్కుంటూ పోతి… బేస్. నీక బాలెన్స్ పట్టేది కట్టం లేదని ఇంకా ఏంటేంటో చెప్పించా. గాడీ నడిపేది నేర్సుకుంటి. మా యజమానున్కి సంబరమే. సంబరం… “ఇక ముందు నుంచి నీవి ఓగితివే ఎవ్రి సాయం లేకనే యాటకైనా దయర్యంగా పోవాల”, అని నా భుజం తట్టినాడు.

మా యజమాన్డు సదివినోడు కాపోయినా, ఎంత ముందాలోచన వుందో సూదండి. ఓ ఆడది సొతంత్రంగా నిలబడాల అంటే మగోడు ఇట్లా ఎనకేసుకొని రావాల. నాకు దొరికినాది సొతంత్రం.  ఈ కూటరే నా సొంతత్రానికి గుర్తు.

అంతే! పతి దినం నేనే మార్కెట్‌కి పోయేది. కూరగాయలు, మాంసము, సేపలు, అన్నీ కూటర్ మీద ఎస్కోనేది, వచ్చేది షూరూ అయింది. సిద్రావణ్ణగాడు ముక్కున ఏలేసుకొనె, ఔరా ఇది అన్నీ నేర్సిందిగాదా అని. ఏయి ఏనుగుల బలం నాకిప్డు. నా యజమాన్డు నా మాటకి ఇలువ ఇస్తావుండాడు.

సిద్రామణ్ణగాడికి గేట్ పాస్ ఇచ్చేస్తి. తిట్కోనె ఆడు నన్ను. “కడుపు కొడ్తా వుండావు. సూస్తా వుండు నేనేం జేస్తానో” అని నామీద సవాల్ ఇసిరినాడు. సిద్రమణ్ణగాణ్ణి ఆతలకి పంపినాక నాకు కట్టమైన పని ఏందంటే బిల్లింగ్ సేసేది. నాకు సదువు రాకపాయే గదా! అతి కట్టం మీద 1 నుండి 100 వరకు ఎంచేది తెల్సింది. అయితే అచ్చరాలు సదివేది కట్టమయ. ఒక్కొ అచ్చరమే కూడబల్కొని సదవటం నేర్చుకుంటి.

మల్లా స్నేహక్క సాయానికొచ్చె. గల్లాపెట్టి ముందు కూకొని బిల్లింగులు చేస్తావుండె. పాపం, ఆ అక్క మా వంట తినేది కాదు. అయినా సయించుకొని మా యాపారానికి సానా సాయం చేస్తావుండె. ఓ దినం ఓ బోరుడు తెచ్చి దాని మీద పరోటా రూ.30/-, మటన్ మసాలా రూ.120 /- ఇట్లా అన్నింటికీ రేట్లు రాసి పెట్టింది. అదేందో లెక్కజేసే మిసన్ కాలుకులేటర్ అంట – దాన్ని తెచ్చి, దాంతో లెక్కఎట్లా జేయాలో నేర్పింది. స్నేహక్క సాయంతోటి అన్నీ నేర్సుకుంటి. ఇదంతా సుసిన సిద్రాకుణ్ణగానికి కడుపుమండె. ఎట్లయిన జేసి నన్ని గబ్బులేపల్న అని లేని పోని గాలి సుద్దులు లేపినాడు. “దానికీ నాకి సంబందం వుంది. అదే నా పైన బడ్తావుండాది. కూరగాయలమ్మే వానితాన, మాంసం అమ్మేవాని తాన సంబంధాలుండాయి, అందర్నీ బుట్లో ఏస్కుండాది, గిరాకీల్తాన నగసారంగా మాట్లాడతాది” అని పుకార్లు పుట్టంచినాడు. అడి నోటికి అడ్డే లేకపాయ.

వాడెంత జేసినా నేనేమీ తగ్గిందేలేదు. ఇంకా గడుసుబారితి. అయితే రాత్రిళ్లు పడుకొనే ముందు ఈయన్నీ గుర్తుకొచ్చి ఏడుపొచ్చేది. అయితే నా మొగుడు, రామణ్ణ  “సీతా ఏడొద్దే!” అని సమాదానం చెప్తుండె. దేన్నయనా సయించొచ్చుకాని ఇట్లా సెడ్డకూతల్ని ఎట్టా బరించేది?

నా పెనిమిటి రోగం దినం దినానికి ఎక్కవవుతానే వుండె. నా సేతనయినంతా చేస్తి అయినా ఆ కాన్సరు బూతం తినేసింది. ఊపిరి పోయేటప్పడు “మీ సీతని నేను చూసుకుంటా” అని స్నేహక్క మాటిచ్చినాక కన్ను మూసినాడు. “ఏడొద్దు సీతా” అని నా మొగుడు  అనిండే మాటకి కట్టుబడి ఏడ్పును దిగమింగితి. ‘ఇదెట్లా ఆడది! మొగుడు పోయినా ఏడ్సిందే లేదు’ అని సెవులు కొరుక్కుండ్రి.

పోలీస్ స్టేసన్ దగ్గరే ఉండబట్టి ఆళ్లకే నా ఓటెల్ నుంచి బిర్యానీ పారిసిల్ పోతావుండె. ఆళ్ల తాన నా పరిసయాల్ని సూసి సిద్రామణ్ణగాడి ఆటలు సాగకపాయె. వాడు సల్లగాయ.

దుడుస్తి… దుడిస్తి… ఈ ఊపిరి ఉండేదే దానికొస్కరమే. ఇంటిపై నుండే అప్పు తీర్చేస్తి. బ్యాంకోళ్లు సెబాస్ అని మెచ్చుకొన్రి. యాపారం జోరాయ. పనికి ఇంకా ఇద్రు పిల్లోళ్లని పెట్టుకుంటి. ఆన్‍లైన్ ఆర్డర్లూ ఎక్కవాయె.

నేను ఎల్లాంటి దాన్ని అనేది అందర్కీ తెల్సిపోయే. నీతిగా బతికేటోళ్లకి దేవుడు ఏనాడు అన్నేయం సేయ్యడు. అది నా నమ్మకం.

అయితే ఇంక ముందేమి! బతుకులో ఉత్సాహముండాల. అప్పుడే దానికి ఇలువ అని స్నేహక్క ఎప్పుడూ చెప్పేది.

ఇట్లా ఎంతకాలమని?  ఏమో తెలీదు. హుమ్మస్సు ఉండేంత కాలం ఇట్లే జరుపుకొని పోతా.

ఏమంటారు?

నమస్కారం

మీ సీత

కన్నడ మూలం: డా. విజయ

అనువాదం: కల్లూరు జానకిరామరావు

Exit mobile version