[dropcap]ఇ[/dropcap]క్కడ నేను ఎక్కువగా గమనించింది ఏంటంటే.. ఇక్కడ అమెరికన్లకి ఎక్కువ మందిలో, తమ లైఫ్‌లో ఎక్కువ సమయం కొత్త ప్రాంతాలు తిరగడం, పర్వతాలు, కొండలు ట్రెక్కింగ్ చేయడం, అటవీ ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని కాంపింగ్ చేయడం, నదీ విహారాలు, ఈతలు, ఆటలు ఇలా గడపడం ఇష్టపడతారు. వాటి కోసం ఎంతైనా డబ్బు వెచ్చిస్తారు. అదే మనవారైతే ఆస్తులు, స్ధలాల కొనుగోలు, బంగారం, బట్టలు ఇలాంటి వాటి కోసం సమయం, సొమ్ము వెచ్చిస్తారు.
ఇక్కడ మనలా కనపడరు.
కొందరైతే ఇలా ప్రయాణాల కోసం ప్రత్యేకంగా RV (Recreation Vehicle) అనే బస్సులు ఏర్పాటు చేసుకుంటారు. ఇవి ఒకోసారి అద్దెకి తీసుకోవడం లేదా కొందరు వీటిని స్వంతగా కొనుగోలు చేసుకుంటారు. వాటిలోనే వంటలు, పడకలు.. ఇతరములన్నీ అమర్చుకుంటారు. పెద్ద పెద్ద వాన్ లలోనే వారి నివాసం. ప్రతి ఊరిలోనూ ఈ వాహనాలు నిలుపుకుందుకు స్టేషన్‌లు వుంటాయి. అక్కడ గేస్ మరియు కరెంట్ ఛార్జ్ చేసుకునే అవకాశం వుంటుంది. ఈ బస్సులు వెనుక కారు, పడవలు, సైకిళ్ళు, మోటారు బైక్‌లు ఇతరత్రా తగిలించుకుని దూర ప్రయాణాలు చేస్తూంటారు.
ఇలాంటి RV లు మాకు దారి పొడుగునా వేల సంఖ్యలో కనిపించాయి. ఇలా ఇవన్నీ చూసుకుంటూ ..Idaho, Wyoming స్టేట్స్ మీదుగా Montana రాష్టం చేరాము.
ఈ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ మూడు రాష్ట్రాలను కలుపుకుంటూ వున్నప్పటికీ ఎక్కువ భాగం మాత్రం Wyoming రాష్ట్రం లోనే ఆక్రమించి వుంది.
మేము అక్కడికి చేరే సమయానికి చీకటి పడిపోయింది. పార్క్ లోపల ఉండడానికి మంచి హోటల్స్ వున్నాయి కానీ, వంట చేసుకునే వీలు, ఇతరత్రా సదుపాయాలు వున్నవి మాకు దొరకలేదు. అందుచేత మేము పార్క్ బయట వెస్ట్ ఎల్లోస్టోన్ ఊరిలో AIR Bnb లలో మూడు రోజులకి వసతి ఏర్పాటు చేసుకున్నాము. ఇవి హోటల్ రూమ్‌లా కాకుండా ఇల్లు లాగా మొత్తం ఇంట్లో వంట సామాగ్రి, స్టౌ, ఓవెన్, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, టివీ.. వంటి సదుపాయాలతో పాటుగా రెండు మూడు బెడ్ రూమ్‌లు, దుప్పట్లు, టవల్స్, ఒకటేమిటి మనకి ఏవేమి అవసరమో అవన్నీ అక్కడ ఏర్పాటు చేసి వుంటారు. కొందరు తన ఇళ్ళు ఇలా అద్దెలకి ఇచ్చేస్తూ వుంటారు. డోరు ఓపెన్ అవడానికి సీక్రెట్ కోడ్ నెంబర్ మనకి మెయిల్ చేస్తారు. ఇచ్చిన వారెవరో మనకి కనపడకుండానే.. మెసేజ్‌లు, మెయిల్ ద్వారా మన పని జరిగి పోతుంది.
ఆ రాత్రి అక్కడకి చేరుతున్నపుడే ఎల్లోస్టోన్ ఊరిలో ఉన్న సూపర్ మార్కెట్‌లో పాలు, బ్రెడ్, కొన్ని బంగాళాదుంపలు, టమాటలు, చపాతీ రుచిలాగే వుండే టార్టియా పేకెట్లు (వీటిని పెనం మీద చపాతీ మాదిరి కాల్చుకోవాలి.) తెచ్చుకుని ఆ పూటకి వీటితో డిన్నర్ ముగించుకున్నాము.
ఆ ప్రాంతంలో ఎలుగుబంట్లు ఎక్కువగా వుంటాయని, ఎట్టి పరిస్థితుల్లోను తలుపులు తీసి పెట్టుకోవద్దని, రాత్రి సమయంలో బయటకు రావద్దని.. మేము బస చేసిన Airbnb వారు అక్కడ పుస్తకలో రాసి వుంచారు. వారు ఇచ్చిన వైఫై పాస్‌వర్డ్.. మా ఫోన్లకి కనెక్ట్ చేసుకున్నాము. ప్రస్తుతం ఇది అందరికీ చాలా ముఖ్యం కదా! ఎక్కడికి వెళ్ళినా, తిండి, నీరు కన్నా.. అక్కడ వైఫై వుందో లేదో చూసుకునే కాలమిది.
మర్నాడు ఉదయమే త్వరగా తయారయి, బయలుదేరాలి కదా అనుకుని, ఇక మంచాల పైకి చేరాము.
మరుసటి నాటి ఉదయం.. టిఫిన్లు ముగించుకుని మధ్యాహ్నం తిండి కోసం మూటాముల్లే సర్దుకుని బయలుదేరాం. ఏ పాటు తిప్పినా సాపాటు తప్పదు కదా!
మేము ఉన్న ఎల్లోస్టోన్ ఊరు నుండి పార్క్ లోకి ప్రవేశం వెస్ట్ గేటు నుంచి వెళ్ళాము. ఈ పార్క్‌కి మొత్తం 5 ఎంట్రన్స్‌లు వున్నాయి. అయితే.. రెండు నెలల క్రితం వచ్చిన తీవ్రమయిన వరదలు మూలాన.. నార్త్ వైపు గేటు లోపల నుండి పార్క్ లోకి వచ్చే రోడ్లు మరమ్మతులు పూర్తి కానందున ఆ వేపు గేటు ఇంకా మూసివేసే వుందట.
ఈ సంవత్సరం ఈ పార్క్ లోకే కాకుండా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న ప్రతి నేషనల్ పార్క్ లోకి.. నాలుగవ తరగతి చదివే స్టూడెంట్ లకి, వాళ్ళ కుటుంబానికి ప్రవేశం ఉచితం అని మేము బయలుదేరే ముందు తెలిసింది.
మా పెద్ద మనవడు సాకేత్ నాలుగో క్లాస్ అవడంతో వాడి మూలంగా టికెట్ కొనే అవసరం రాలేదు. 35 డాలర్ల ఖర్చు తన మూలంగా మిగిలిందని.. తన వల్లే మేము ఈ పార్క్ చూడగలిగాము అని తెగ సంబరపడిపోయాడు మా సాకేత్.
మేము పార్క్ లోకి వెళ్ళిన నాలుగు రోజులూ కూడా గేటు దగ్గర సెక్యూరిటీ వారు, వాడిని కారులో చూసిన తర్వాతే లోపలకి ప్రవేశం వుండేది.
పెద్ద బస్సులకి, కార్లకు, లేదా సైకిల్ మీద, నడిచి వెళ్ళేవారు ఇలా ఒక్కో విధంగా ప్రవేశ రుసుము వుంటుంది. మొదటి రోజు ఎంట్రీ ఫీ కడితే దాంతోనే వారం రోజుల పాటు వెళ్ళవచ్చు.
ఎంట్రీ కార్డుతో పాటుగా లోపల తిరగడానికి రూట్ మ్యాప్ ఇస్తారు. ఆ మ్యాప్ సహాయంతోనే లోపల తిరగడానికి సాధ్యం అవుతుంది.
నెట్ సరిగా కనెక్ట్ కాకపోవడంతో ఫోనులో గూగుల్ మ్యాప్ పనిచేయదు. అందుకే పార్క్ వారిచ్చిన మ్యాప్ మాత్రమే ఆధారమవుతుంది.
(సశేషం)