Site icon Sanchika

ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ యాత్రా విశేషాలు-5

[dropcap]మే[/dropcap]ము చూసిన predictable Geysers లో erupt అవుతూండగా చూసినది old faithful Geyser. దానికి కాస్త దూరంగా సందర్శకులు వీక్షించడానికి వీలుగా సిమెంటు బెంచీలు ఏర్పాటు చేసి వున్నాయి. మేము ఆ ప్రాంతం చేరేసరికి దాదాపు వెయ్యి మంది దాకా ఆ eruption కోసం ఎదురు చూస్తున్నారు. వారిని చూడగానే నాకు, ‘మన దేశంలో కన్యాకుమారిలో సూర్యోదయం మరియు సూర్యాస్తమయం చూడడానికి సముద్రం ఒడ్డున జనం ఇలాగే కదూ వేచి వుంటారు’ అనిపించింది.

ముందు పొగలు, ఆవిర్లు, కొంచెం కొంచెం నీరు బయటకి రావడం మొదలయి తర్వాత ఒక్కసారిగా ఎంతో ఎత్తుకి నీటిధార పైకి లేవడం చూడగానే ఒకరకమైన ఉద్విగ్నత కలిగింది. అలా దాదాపు 30 నిమిషాలు ఆగకుండా వస్తూనే వుంది. తర్వాత క్రమేపీ తగ్గుముఖం పట్టింది. తిరిగి మళ్లీ సుమారు 10-12 గంటల తర్వాత ఇలా జరుగుతుంది. అలాగే మిగతా Geyserలు కూడా ఇలా టైమ్ ప్రకారం erupt కావడం.. చాలా వింతగా తోచింది. Old faithful అవగానే మిగతావి కూడా కొద్ది కొద్ది సమయం తేడాతో erupt అవుతాయని, వాటిని చూడడానికి జనం పరుగు పరుగున వాటి వద్దకు చేరుతారు. ఇవన్నీ చూడడానికి ఎక్కువగానే నడవాల్సి వస్తుంది.

మరునాడు ఉదయం 12 గంటల ప్రాంతంలో Castle Geyser eruption సమయమని తెలిసి మేము గంట ముందు గానే అక్కడకి చేరిపోయాము. అదొక తెల్లని బూడిద, తెల్లని రాళ్ళతో వున్న కొండ. నిరంతరం అందులో నుండి పొగలు బయటకి వస్తూనే వుంటాయి. సరైన సమయానికి ఒక్కసారిగా వేడినీరు ఆకాశంలోకి ఎగిసిపడ్డాయి. ఆ దృశ్యాన్ని వీడియోలు, ఫోటోలతో బంధించేసాము.

ఎల్లో స్టోన్ నదీ తీరం, అక్కడ నుంచి కనిపించే పర్వతాలు.. వాటిని ఆనుకుని వున్నట్లు వుండే లేత నీలి రంగు ఆకాశం, తెల్లని మబ్బులు.. ఓహ్! రెండు కళ్ళు చాలవని అనిపించింది.

ఇదే నది నెమ్మదిగా ప్రవహిస్తూ.. ఒక్కసారిగా వెయ్యి అడుగుల ఎత్తు నుంచి, అటూఇటూ ఎల్లోస్టోన్ పర్వత శ్రేణుల మధ్య నుంచి.. జలపాతమై గుమికూడి.. జలజల వంపులు తిరుగుతూ.. సాగిపోతోంటే..

అక్కడ ‘ఆకులో ఆకునై.. పూవులో పూవునై.. ఈ అడవి దాగిపోనా.. ఎటులైనా ఇచటనే ఆగిపోనా’ అనే గీతం ఆలపించకుండా ఆగలేము. ఆ పర్వతాలు పసుపు రంగు రాతి కట్టడాలు వలే వున్నాయి. బహుశా అందుకే ఈ పార్క్‌ని ఎల్లోస్టోన్ అని వుంటారు అనుకున్నాను.

ఇలాంటి విచిత్రమైన, సంభ్రమాన్నికలిగించే దృశ్యాలు అక్కడ కోకొల్లలు.

తర్వాత చెప్పవలసినది మరోటి అక్కడ జంతు సంపద. ఎక్కువగా బైసన్లు, ఎలుగుబంట్లు, తోడేళ్ళు, రకరకాల పక్షులు, జలచరాలు. వీటిని చూడడానికి కూడా సందర్శకులు ఇష్టపడతారు. ఈ అడవిలో వేట నిషిద్ధం. చేపలు పట్టడానికి అనుమతి తీసుకోవాలి.

ఆ అటవీ లోయలలో మాకు బైసన్లు వేల సంఖ్యలో కనిపించాయి. రోడ్డు దాటుతూ ట్రాఫిక్‌ను ఆపేయడం కూడా చేస్తాయి. రోడ్డు మీద కదలకుండా రెండు బైసన్లు నిలబడిపోవటంతో మేము దాదాపుగా గంటసేపు కదలలేకపోయాము. వాటిని అదిలించడం, కారు హారన్ మోగించడం వంటివి చేస్తే, అవి మనకి హాని కలిగించే అవకాశం ఎక్కువగా వుంటుంది. వాటిని చూస్తూ మేము, దున్నపోతు లాగా కదలదు మెదలదు’, ‘దున్నపోతు మీద వాన పడ్డా చలనం లేదు’ అనే మన మాటలు తలుచుకుని నవ్వుకున్నాము. వాటి జోలికి వెళ్ళి వాటిని విసిగిస్తే మాత్రం అవి వూరుకోవట.

తర్వాత అక్కడ ఎలుగుబంట్లతో కూడా చాలా జాగ్రత్తగా వుండాలని, వాటికి వంద అడుగుల దూరంలో వుండాలని.. ఒకవేళ అవి మనకి ఎదురైతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. అక్కడ అడుగడుగునా సెక్యూరిటీ గార్డులు మనకి తెలియచేస్తూంటారు. మా నాలుగు రోజుల యాత్రలో ఒకచోట మాత్రం మాకు ఒక ఎలుగు తారసపడింది.

Lamar valley లోకి వెళ్ళగలిగితే మరిన్ని ఎలుగుబంట్లు, తోడేళ్ళు కనపడేవేమో కానీ.. జూన్‌లో వచ్చిన వరదల మూలంగా ఆ వేలీలో పాడయిపోయిన రహదార్లు ఇంకా పునరుద్ధరించక పోవడంతో ఆ వేలీలోకి ప్రవేశం నిలిపి వేయడంతో మేము వెళ్ళలేకపోయాము.

సహజంగా ఏర్పడిన అటవి, జలపాతాలు,నదులు, లోయలు, మైదానాలు, అగ్నిగుండాలు, వేడినీటి గీజర్లు ఇవన్నీ భగవంతుని సృష్టి కదా అనుకుని,  నివ్వెరపోవడం ఒక ఎత్తయితే..

మానవుని సృష్టి, మేధా సంపత్తి కూడా తక్కువ కాదని నిరూపించేలా.. ఇంత విశాలంగా వ్యాపించి వున్న అటవీ ప్రాంతంలో.. గొప్ప రహదారి సదుపాయం, ఏ మారుమూల నైనా దారి తెలియచేసే బోర్డులను, వసతి సదుపాయాలు, క్లినిక్‌లు, గ్యాస్ స్టేషన్‌లు, పార్కింగ్ సదుపాయాలు ఇతరత్రా ఏవేమి అవసరమో అన్నీ ఏర్పాటు చేసి, ప్రకృతి సంపదను వెయ్యి కళ్ళతో కాపాడుతూ.. నేషనల్ పార్క్ ప్రాముఖ్యత అందరికీ తెలిసేలా అమెరికా గవర్నమెంట్ చేసే కృషి కూడా మెచ్చుకోవాలి.

నాలుగు రోజుల పాటు, ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ నందు.. ఎంతో చక్కని అనుభూతిని.. జ్ఞాపకాలలో దాచుకుని తిరుగు ప్రయాణం అయి.. ఇంటికి చేరాము.

(సమాప్తం)

Exit mobile version