Site icon Sanchika

అంతరంగ పరివర్తన కాంక్షించే ‘యోగక్షేమం వహామ్యహం’

[ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు గారి ‘యోగక్షేమం వహామ్యహం’ అనే ఆధ్యాత్మిక కథల సంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]ప్ర[/dropcap]ముఖ రచయిత శ్రీ ఆర్.సి.కృష్ణస్వామి రాజు గారి రెండవ ఆధ్యాత్మిక కథల సంపుటి ‘యోగక్షేమం వహామ్యహం’. ఇందులో 52 చిన్న కథలు ఉన్నాయి.

ఆధ్యాత్మిక, భక్తి అంశాలను రోజూవారీ సంఘటనలకు ముడిపెట్టి చక్కని కథలుగా మలిచి పాఠకులకు అందించారు రచయిత.

~

“ఆధునిక అవసరాలకు అనుగుణంగా పరివర్తన జరగని శాస్త్రమేదైనా కనుమరుగైపోతుంది. ఈ కాలం అవసరాలు, మానవ ప్రవృత్తులు, జీవన సరళులు దృష్టిలో ఉంచుకొని ఆధ్యాత్మిక శాస్త్రాన్ని కొత్త ఒరవడితో అభివ్యక్తి చేస్తున్న రచయిత శ్రీ ఆర్.సి.కృష్ణస్వామి రాజు గారు” అని శతావధాని శ్రీ ఆముదాల మురళి తమ ముందుమాట ‘పునరపి పఠనం.. పునరపి మననం’ లో వ్యాఖ్యానించారు.

~

“నాకు తెలిసిన నాలుగు మంచి విషయాలు నలుగురికీ తెలియజేయాలన్నది నా అభిప్రాయం. ఆ మంచి కూడా చిన్న చిన్న కథల ద్వారా అయితే ఎక్కువ మంది చదువుతారనే ఆలోచనకు ప్రతిరూపమే ఈ పుస్తకం” అన్నారు రచయిత తమ ముందుమాటలో.

~

సత్సంగంలో పాల్గొంటున్నా కూడా, సంఘంలోకి వెళ్ళాకా, అవవసర విశయాలపైన ఆసక్తి ప్రదర్శించి, సంఘం లోని దారినపోయే చెత్తనంతా మనసులోకి ఎక్కించుకుని ఊరేగుతాం. దానివల్ల ప్రయోజనం ఉండదని తెలిపే కథ ‘గజస్నానం’. ఆధ్యాత్మ పురోగతి సాధించాలంటే గజస్నానం పనికిరాదు.

ఈ సృష్టిలోని అనంత కోటి జీవరాశులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయనీ, దేని స్థానం దానిదేనని చెప్పే కథ ‘మిరప కారం’.

సంపదని ప్రోగు చేసే కొద్దీ మరిన్ని సమస్యలొస్తాయనీ, అతి ఎప్పుడూ అనర్థదాయకమనీ చెబుతుంది ‘ఎంత చెట్టుకంత గాలి!’ కథ.

పూర్వానుభవాలను మనసులో పెట్టుకుని వర్తమాన విషయాలను పరిశీలిస్తే భంగపాటు తప్పదని ‘ఖాళీ పాత్ర’ కథ సూచిస్తుంది.

వర్తమానమే సత్యమని ‘నేడే నిజం’లో చెప్తారు రచయిత. మనం మనంలా ఉండడమే జీవితంలో మార్పుకి దోహదం చేస్తుందని ‘పంజరంలో చిలుక’ కథలో కోకిల ద్వారా సూచిస్తారు రచయిత.

అర్చకులు భక్తులతో ఎలా మెలగాలో అద్భుతంగా చెప్పిన కథ ‘ఎంత దూరం?’. కుటుంబంలో అత్తమామలతో ఎలా మసలుకోవాలో ‘పాల మీగడ’ కథ చెబుతుంది. ‘గుగ్గిళ్ళ రహస్యం’ ఏమిటో అర్థమయితే ఆధ్యాత్మిక సంపద మనదవుతుంది.

ఏ మతమైతే ఏమిటి, సత్యం తెలుసుకోడమే ముఖ్యమని చాటే కథ ‘సత్యాన్వేషణ’. ‘గుమ్మడి కూర’ కథ గొప్ప సత్యాన్ని వెల్లడిస్తుంది.

ఎక్కడెక్కడో తిరిగే మనసును కట్టడి చేయడానికి భజన ఉపకరిస్తుందని ‘భజన ఎందుకు?’ కథ ద్వారా తెలుస్తుంది. ‘గాలి బెలూను’ కథ చక్కనిది, ఓ ధనవంతుడి కళ్ళు తెరిపిస్తుంది.

మానవ జీవితాన్ని అద్భుతంగా వ్యాఖ్యానించిన కథ ‘రోజూ దీపావళే!’. నిజమైన భక్తుల స్వభావం ఎలా ఉంటుందో ‘మొక్కుబడి’ కథ చెబుతుంది.

‘అర చేతుల్లో..’ కథ గొప్ప జీవన సత్యాన్ని వెల్లడిస్తుంది. చాలా లోతైన విషయాన్ని ఈ చిన్న కథ అత్యంత నైపుణ్యంగా ప్రదర్శించింది.

అనేక సమస్యలకు మూలం చాలా వాటికి మనం దగ్గర కావడం, చాలా వాటికి దూరంగా జరగలేకపోవడం అంటుంది ‘పట్టు విడుపులు’ కథ.

‘తోటలో తుపాను’ కథ చక్కని సందేశాన్నిస్తుంది. ఎవరూ దేనికీ అతీతులు కారని స్పష్టం చేస్తుంది.

అనుకున్నది జరగదేమో అన్న అనుమానమే ఉండకూడని చెబుతూ సూర్యుడిని, భూమిని ఉదాహరణలుగా కొత్తగా చెప్పిన కథ ‘దృఢ దీక్ష’.

గురువు తమని కొండ ఎక్కించడం ఇంత మర్మం ఉందా అని ఆశ్చర్యపోతారా ముగ్గురు యువకులు ‘మూడో రోజు ప్రయాణం’ కథలో. కారణం తెలుసుకుంటే, అందులోని పాఠాన్ని నేర్చుకుంటే జీవితాన్ని ఆనందంగా జీవించవచ్చు.

దేవుడి లీలలు ఎలా ఉంటాయో ‘నమ్మినోళ్ళకు నమ్మినంత..’ కథ చెబుతుంది. ‘ఆయన చూస్తున్నాడు’ చక్కని కథ. మనుషుల మనస్తత్వాన్ని కళ్ళకు కడుతుంది.

మనం గుర్తించలేని మన బలహీనతలను ఇతరులు గుర్తించి చెప్పినప్పుడు వాటిని దిద్దుకుంటే ఎలా ఉపయోగం ఉంటుందో ‘బలం-బలహీనత’ కథ చెబుతుంది.

‘ఒకే కిటికీ’ కథలో గురువుగారు చేసిన సూచనను పాటించగలిగితే భార్యభర్తల మధ్య అపార్థాలు తొలగి గృహాలు నందనవనాలవుతాయి.

అన్ని విషయాలలోనూ రంధ్రాన్వేషణ చేస్తూ పోతే మనకంటూ ఎవరూ మిగలరని హెచ్చరిస్తుంది ‘మాట మంచిదైతే’ కథ.

మనిషికి అసలైన ‘శ్రేయోభిలాషులు’ అతని తల్లిదండ్రులేనని చెప్తారు రచయిత.

‘తల్లి ప్రేమ’ కథలో – చంద్రుని వెలుగుకి మించిన వెలుగుని ఓ పండితుడికి చూపుతుందో తల్లి.

‘గురుదేవోభవ!’ కథ – గురువు, ఉపాధ్యాయుల మధ్య ఉండే తేడాని వెల్లడిస్తుంది.

‘నమ్మాలే కానీ..’ కథ విశ్వాసో ఫలదాయకః అనే నానుడిని నిరూపిస్తుంది.

‘ఇవ్వడంలోనే ఉంది..’ కథ ఆనంద రహస్యాన్ని స్పష్టం చేస్తుంది. ‘చూసే కళ్ళు’ కథ – కడుపు నిండిన వాడి ఆలోచనలకీ, నిండని వాడి ఆలోచనలకు మధ్య ఉండే తేడాని చెబుతుంది.

~

ఇవే కాకుండా – కొత్త ఊరు, ప్రేమను పంచుదాం!, జీవన సౌందర్యం, మాతృ రుణం, విసిరిన రాయి, ప్రేమ విత్తనాలు, సాలెగూడు, ఎవరు అదృష్టవంతులు, సూదంత సమస్య, మల్లెల పరిమళం, పశ్చాత్తాపం, అర్ధాంగి, చదరంగం – వంటి కథలు జీవితంలోని సమస్యలను ప్రస్తావిస్తూ, యోగ్యమైన పరిష్కారాలను సూచిస్తూ ఆధ్యాత్మిక బాటలో నడించేందుకు ప్రేరణిస్తాయి.

~

ఈ కథలు చదవడం పూర్తి చేశాకా, చివరి అట్ట మీద తన సందేశంలో డా. రేవూరు అనంత పద్మనాభరావు గారు పేర్కొన్న, “నిరాశానిస్పృహలతో కొట్టుమిట్టాడే వ్యక్తుల పాలిట దివ్య కథామృత రసాయనం ఈ కథా సంపుటి” అన్న అభిప్రాయం సరైనదేనని పాఠకులు భావిస్తారు.

***

యోగక్షేమం వహామ్యహం (ఆధ్యాత్మిక కథలు)
రచన: ఆర్.సి.కృష్ణస్వామి రాజు
ప్రచురణ: రాజాచంద్ర పౌండేషన్, తిరుపతి
పుటలు: 111
వెల: ₹ 160/-
ప్రతులకు:
ఆర్ సి కృష్ణ స్వామి రాజు
ఫోన్ 9393662821.
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Yogakshemam-Vahamyaham-Spiritual-Motivational-Stories/dp/B0CQXLXQR5

Exit mobile version