[dropcap]డా.[/dropcap] బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, డైరెక్టర్‌గా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా పనిచేసిన డా. పి. విజయలక్ష్మి పండిట్ చదివింది బోటనీ సబ్జెక్టు అయినా స్వతహాగా ఆమెకి తెలుగు భాష, సాహిత్యం- ముఖ్యంగా కవిత్వం, గజల్ పట్ల ఆసక్తి ఎక్కువ. కవితలు, కథలు, హైకూలు వంటి వివిధ ప్రక్రియల్లో దాదాపు 12 పుస్తకాలు రచించారు.
ఆమె మధురభక్తి భావనతో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వెలురించిన మొదటి గజళ్ళ సంపుటి ‘యోగరేఖలు’. ఆమె రవీంద్రుని గీతాంజలిని తెలుగు లోకి అనువదించారు ‘అపూర్వ గానం’ శీర్షికతో. గీతాంజలిలో రవీంద్రుని భగవంతుడిపై భక్తి, ప్రేమ ఆ అద్వైతసిద్ధి భావసారూప్యత ఆమె ‘యోగరేఖలు’ లోని 42 గజళ్ళలో ప్రస్పుట మవుతుంది.
గజల్ – ఏడవ శతాబ్దంలో పర్షియన్, అరబ్బీ భాషలలో వచ్చిన ఓ కవితా ప్రక్రియ. 13వ శతాబ్దం నుండి భారతదేశంలో మొదటగా ఉర్దూ కవులు రాయటం మొదలుపెట్టి గజల్‌ను విజయయాత్ర చేయించారు.
ఉర్దూ కవితా సాహిత్యంలో అత్యంత ప్రముఖ సాహితీ ప్రక్రియ ‘గజల్’ అనే పదానికి టర్కీ భాషలో అర్థం ‘జింక’ లేక ‘జింక కనులు గల స్త్రీ’ అని. గజల్ కవులు స్త్రీ సౌందర్యాన్ని, ప్రేమను, విరహాన్ని, నిరీక్షణను వర్ణించడానికి గజల్ ప్రక్రియతో సుమధురంగా ఆలపించారు. సూఫీతత్వంలో ప్రేమను, దేవుడిపై మధురభక్తి తోనూ వ్రాశారు సూఫీకవులు.
గజల్ హృదయాన్ని కదిలించి మైమరపించే సాహిత్య ప్రక్రియ. గజల్ వస్తు, భావ నిర్మాణంలో ప్రత్యేకతను నియమాలను కలిగన కవిత ప్రక్రియ.
గజల్‌లో 5 షేర్లు తప్పని సరిగా ఉండాలి. 7, 9, 11 షేర్లతో కూడా గజల్ రాయచ్చు. తెలుగులో ద్విపదను పోలిన ‘షేర్’లో రెండు పాదాలు ఉంటాయి. ప్రతి పాదాన్ని ‘మిశ్రా’ అంటారు. గజల్ లోని మొదటి ‘షేర్’ను ‘మత్లా’ అంటారు. గజల్ ఆఖరు షేర్‌ను ‘మఖ్తా’ అంటారు. మత్లాలో మొదటి రెండు మిశ్రాలలో ‘కాఫియా’ (అంత్య ప్రాస)తో ముగుస్తాయి. తరువాతి షేర్లలో ప్రతి షేర్‌లో రెండో మిశ్రాలో కాఫియాతో ముగుస్తుంది. గజళ్ళలో కాఫియాతో ‘రదీఫ్’ను కూడా వాడుతారు.
గజల్ చివరి షేర్ ‘మఖ్తా’లో కవి పేరు గానీ, కలం పేరు రాయడాన్ని ‘తఖల్లుస్’ అంటారు. గజల్ మిశ్రాలలో మాత్రా చందస్సును పాటిస్తారు.
తెలుగులో గజళ్ళను రాసిన మొదటి కవులు దాశరథి, సి.నా.రె. దాశరథి గారు గజల్ కవి మీర్జాగాలిబ్ ‘గాలిబ్ గీతాల తెలుగు అనువాదమే’ కాక తాను కొత్తగా తెలుగు గజళ్ళను రాశారు. ప్రముఖ గాయకుడు పి.బి.శ్రీనివాస్ గజళ్ళను రాయడమే కాక గానం చేసారు. దాశరథి, సి.నా.రె. ఉర్దూ, తెలుగుభాష పండితులు కావడం వల్ల గజల్ ప్రక్రియను ప్రేమించి తెలుగు గజళ్ళకు ప్రాణం పోశారు, రచించి, ప్రచారం కల్పించారు.
గజల్ అంటేనే ఒక సాంద్రమైన, చక్కనైన, నిండైన, శ్రావ్యమైన, ఆపాత మధురమైన గానం. తలత్ మెహమూద్, మెహదీ హసన్ శ్రావ్యమైన గజల్ గానాన్ని విని తీరవలసిందే.
“ప్రియురాలితో సల్లాపం” (మాషూకాసే గుఫ్త్ గూ) స్థాయి నుండి గజల్ తాత్త్వికత, మానవీయ విలువలు, ప్రగతిశీల దృక్పథం వైపుగా పయనించి, పండిత పామర రంజకాలైనాయి.
గజల్ వస్తువులో కాలంతో పాటు వైవిద్యం చోటుచేసుకుంది. సి.నా.రె. గజళ్ళలో మానవత, సామాజికత ఎక్కువ. గజల్ ఒక గులాబీల గుచ్ఛం. మత్తకోకిల రసాత్తకూజితం. ఇంపూ కుదింపు దాని జీవలక్షణం. అందుకే క్రమంగా తెలుగు కవుల మనసును దోచుకుంది. తెలుగు కవులు అనేక మంది తెలుగు గజళ్ళను రాస్తున్నారు. తెలుగు బాషలో ఇది ఆహ్వానించదగ్గ ఒక మంచి పరిణామం.
‘విశ్వపుత్రిక’ కలం పేరుతో డా.విజయలక్ష్మిపండిట్ రాసిన గజళ్ళ సంపుటి ‘యోగరేఖలు’. గజళ్ళు రాస్తున్న చాలమంది కంటే సరళమైన, మంచి తెలుగులో రాస్తారామె. కఠినమైన సంస్కృత పదాల జోలికి పోరు. రవీంద్రనాథ్ ఠాగూర్ ‘గీతాంజలి’కి ప్రభావితురాలై, దానిని తెలుగు లోకి అనువదించడం వల్ల ఆమె గజళ్ళలో ప్రభుచింతన, విశ్వవ్యాప్తమైన ప్రేమ ఉంటుందని చెప్పవచ్చు. ఆమె గజల్ నుండి కొన్ని షేర్లు-
“నా మధురవేదన నీ దివ్యధామాన్ని తాకింది/ ఆమని అందుకే నా హృదయాన్ని తాకింది”
ఈ షేర్ రిఫత్ సుల్తాన్ రాసిన ఓ ఉర్దూ షేర్ – “బహారోంకో చమన్ యాదాగయాహే/ ముఝే ఓ గుల్బదన్ యాదాగయాహే” గుర్తుకు వస్తుంది.
“వెలుగునీడల సవ్వడిని ఆలకిద్దాం రా ప్రియా / సుఖదుఃఖాల సందడిని ఆస్వాదిద్దాం రా ప్రియా” అన్న కాఫియా, రదీఫ్‌తో సుమధురమైన అమృతధారని అందించారు విజయలక్ష్మి.
“నీ కంటి కడలిలో మునిగిపోనీ నన్ను/ స్వాతిముత్యమై నీపై నిలిచిపోనీ నన్ను
…………………………………………..
నా కష్టాల కడగండ్లు నను వీడిపోవులే/ శాంతికై నీ పాదాలచెంత వాలి పోనీక నన్ను” అంటూ ఆ భగవంతునికి ఆత్మార్పణతో హృదయ నివేదన చేస్తుంది.
ఆమె అలౌకిక భావ వ్యక్తీకరణకు కొన్ని పంక్తులు-
“విశ్వాంతరాళ అనంత విన్యాసాల విభూతిని నీవు/ నీ అంతరంగాన్ని ఆశ్రయించినా జీవాత్మను నేను”
“నా మదిలో నీ మురళీ రవమే వినిపిస్తూంది/ అది నా హృదయ వేదనను మరిపిస్తూంది”
“ఈ పిల్లనగ్రోవిలో ఊగి తూగే ఊపిరి నీ అనుగ్రహమే”
~
‘యోగరేఖలు’ 42 గజళ్ళ సంపుటిలో విజయలక్ష్మి పండిట్ రాసిన గజళ్ళు అన్నీ ఆద్ధ్యాత్మిక భావనతో అలౌకిక అనుభూతులతో మనసును అలరిస్తాయి.
‘మానవత్వమా! ఏది నీ చిరునామా’, ‘నా ఆత్మకళలు’ అనే కవితా సంపుటులు, పర్యావరణ పరిరక్షణపై ‘ధరిత్రీ విలాపం’ అనే దీర్ఘ కవిత వెలువరించారు డా. విజయలక్ష్మి. కవిత్వమే కాక కథాప్రక్రియ పట్ల ఆసక్తితో ‘రమ్య ద రోబో’ పన్నెండు కథలతో సంపుటి తీసుకొని వచ్చారు. జపాన్‌లో ఆవిర్భవించిన ‘హైకూ’ కావ్య ప్రక్రియని ఇష్టంగా ఆస్వాదిస్తూ ‘విశ్వపుత్రిక హైకూలు’ పేరిట ఆ అనుభూతిని పాఠకులకు అందించారు. యోగరేఖలు సంపుటి లోని ఆమె 12 గజళ్ళతో ఆడియో సిడిని, 5 గజళ్ళతో వీడియోను వెలువరించారు. వాటిని యూట్యూబ్ ఛానల్‌లో, విశ్వపుత్రిక గజల్స్‌లో వినవచ్చును.
తెలుగు గజల్ కవులను, గాయకులను ప్రోత్సహించి తెలుగు గజళ్ళను విశ్వవ్యాప్తం చేయాలనే మంచి ఆశయంతో ‘విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్’ను 2021 ఫిబ్రవరి 7 న హైదరాబాదులో ఆవిష్కరించారు.
డా.విజయలక్ష్మి పండిట్ త్వరలో తన రెండవ గజల్ సంపుటిని ఆవిష్కరించబోవు సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు.
***
రచన: డా. విజయలక్ష్మి పండిట్.
పేజీలు: 101
వెల ₹120/-
ప్రతులకు:
డా. విజయలక్ష్మి పండిట్
ఇంటి నెం.3.6.361/A
హిమాయత్ నగర్, స్ట్రీట్ నెం. 20
హైదరాబాద్ 500029
ఫోన్: 8639061472
మరియు అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లో