Site icon Sanchika

ఒకనాటి యుద్ధక్షేత్రాల స్నేహహస్తం

[dropcap]సా[/dropcap]ధారణంగా పర్యాటకులు ప్రశాంతమైన, సుందరమైన, సేద దీరగలిగే ప్రదేశాలను సందర్శిస్తుంటారు. ఆసక్తి ఉన్నవారు అక్కడి ప్రకృతి, పరిసరాలను, అందాలను, విశేషాలను వర్ణిస్తూ వ్యాసాలు రాస్తారు. అనుభూతులు మరీ అధికంగా ఉంటే యాత్రా కథనాలు వెలువరిస్తారు. డా. నర్మద, ఇంద్రారెడ్డి గార్లు ఒక అడుగు ముందుకు వేసి ఒకనాటి యుద్ధక్షేత్రాలను సందర్శించి, అలనాటి చీకటి వెతలను వెల్లడి చేసి, ఇప్పుడా ప్రాంతాలు/దేశాలు ఎలా అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయో గమనిస్తూ తమ అనుభవాలను, అనుభూతులను ‘యుద్ధక్షేత్రాల్లో మా ప్రయాణం’ అనే యాత్రా కథనంలో వివరించారు.

తొలుత ఈ దంపతులు భారత్ పాక్ సరిహద్దు ప్రాంతమైన కచ్‍లో పర్యటించి, ఉప్పు ఎడారిని చూస్తారు. అక్కడ ఒక కల్నల్‍ కుటుంబం వీరికి ఆతిథ్యం ఇస్తుంది. రచయిత్రి తన వివరణ ద్వారా అక్కడి అందాల్ని పాఠకులు సైతం అనుభూతి చెందేలా వర్ణించారు.

తాము జమ్మూ కశ్మీర్‌కి రెండుసార్లు వెళ్ళామని చెబుతూ, మొదటిసారి ప్రయాణానికి, రెండోసారి ప్రయాణానికి ఉన్న తేడాలను వెల్లడించారు రచయిత్రి. అక్కడి నుండి అమర్‍నాథ్‌కి వెడతారు. ఇదే కథనంలో కశ్మీరులో జరిగిన బాంబుపేలుళ్ళ గురించి, కార్గిల్ యుద్ధం గురించి వివరించారు. కార్గిల్ పర్యటన అనుభూతులలో కొన్ని జలదరింపజేస్తాయి.

కశ్మీరులో యాత్ర ముగించుకుని రైల్లో పంజాబ్ చేరుతారు. అక్కడ బార్డర్ బీటింగ్ రిట్రీట్ గురించి వివరిస్తారు. స్వర్ణదేవాలయాన్ని దర్శించి, అక్కడి వంటశాల ‘లంగర్’ గురించి చెబుతారు. ఇదే కథనంలో జలియన్‌వాలా‌ బాగ్ హింసాకాండ గురించి కూడా ప్రస్తావిస్తారు. పంజాబ్ నుండి ఢిల్లీ వచ్చి అక్కడ షాపింగ్ చేస్తుండగా బాంబు పేలడం, వందమందికి పైగా చనిపోవడం – బాధ, విభ్రాంతి కలిగించాయంటారు.

శ్రీలంక వెళ్ళి రామాయణం నాటి చిహ్నాలు/స్మృతులు ఉన్న అన్ని ప్రాంతాలను దర్శిస్తారు. తాము శ్రీలంక వెళ్ళిన రెండుసార్లు ఉద్రిక్త పరిస్థితులున్నాయని, యుద్ధం జరగలేదని చెబుతారు. శ్రీలంక లోని ఇతర దర్శనీయ స్థలాల గురించి వివరిస్తారు. 2004 సునామీ కారణంగా శ్రీలంక ఎంత నష్టపోయిందో వివరించి, అక్కడి సునామీ మ్యూజియం గురించి చెప్తారు.

ఈజిప్టు ప్రయాణంలో భాగంగా కైరో నగరంలో పర్యటిస్తున్నప్పుడు కొన్ని నెలల క్రితం కైరోలో జరిగిన అల్లర్లు గుర్తుకువస్తాయి రచయిత్రికి. ఈ ఘర్షణల్లో వందలాది చనిపోగా, వేలాదిమంది గాయపడిన వైనం రచయిత్రిని బాధిస్తుంది. ఈజిప్టు లోని స్ఫింక్స్, మ్యూజియం, వ్యాలీ ఆఫ్ కింగ్స్, అలెగ్జాండ్రియా లైబ్రరీ, పంపీ స్తంభం తదితర పర్యాటక ప్రాంతాలు చూసి వాటి గురించి పాఠకులకు వివరిస్తారు.

నిత్యం ఘర్షణలతో అట్టుడికే ‘ఇజ్రాయిల్’లో పర్యటించబోతున్నాం అంటే తమ శ్రేయోభిలాషుల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైందని చెప్తారు రచయిత్రి. ఇజ్రాయిల్ చరిత్రని, పాలస్తీనాతో ఉన్న వైరుధ్యాలని సంక్షిప్తంగా వివరిస్తారు. ఓలివ కొండ, జీసస్ జన్మస్థలం, వీపింగ్ వాల్, టెల్ అవీవ్, డెడ్ సీ మొదలైన వాటిని చూస్తారు, పాఠకులకూ చూపిస్తారు.

‘వియత్నాం’ అంటే మనకి ఏం గుర్తుకు వస్తుంది అంటూ వియత్నాం యాత్రా కథనాన్ని ప్రారంభిస్తారు. ఏం గుర్తుకువస్తుందో చెబుతారు. సుదీర్ఘ కాలం యుద్ధంలో మునిగిన ఈ దేశం గత గాయాల నుండి కోలుకుని ఎదుగుతున్న విధానం స్ఫూర్తినిస్తుంది అంటారు. హోచిమిన్ సిటీని, మరికొన్ని యుద్ధక్షేత్రాలను దర్శిస్తారు. వియత్నాం చరిత్రను క్లుప్తంగా అందిస్తారు.

తమ టర్కీ ప్రయాణం గురించి ముచ్చటిస్తూ, ఆసియా-యూరప్ అనే రెండు ఖండాల భిన్న సంస్కృతిని ఇముడ్చుకున్న దేశం అని అంటారు. 2019లో సిరియాతో టర్కీ చేసిన యుద్ధం, దాంతో ఎందరు విగతులయ్యారో చెప్తారు. ఇస్తాంబుల్‍లోని దర్శనీయ ప్రాంతాలలో తమ పర్యటనానుభవాలను చెప్తారు.

జర్మనీ పర్యటన సందర్భంగా రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ వల్ల ఇతరులకు సంభవించిన కష్టాలు/జర్మనీకి ఎదురైన నష్టాలు వివరిస్తారు. జర్మనీ విభజన గురించి, పునరేకీకరణ గురించి చెబుతారు. సెప్టెంబర్ ఫెస్ట్ గురించి తెలుసుకోవడం ఆసక్తికరం! దేశంలోని వివిధ పర్యాటక స్థలాల గురించి చెబుతూ హోలోకాస్ట్ మెమోరియల్ గురించి చెప్తారు.

సూర్యుడు ఉదయించే భూమి జపాన్‍లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తూ ఆ దేశంపై జరిగిన అణుబాంబు దాడిని ప్రస్తావిస్తారు. నారా పట్టణంలోని ‘కింకాకుజి’లో గోల్డెన్ టెంపుల్, క్యోటోలోని జింకల పార్కు, ప్యూజి అగ్నిపర్వతం గురించి తెలుసుకోవడం బావుంటుంది. ప్రపంచం కనీ వినీ ఎరుగని విషాదాన్ని చవిచూసినా, ఏనాడూ, ఎవ్వరి సాయం అడగని జపాన్ వారి అంకితభావం, కష్టించే మనస్తత్వం, వారి పట్టుదల ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అంటారు.

ఒకనాడు అమెరికాతో పెద్ద యుద్ధాన్ని చేసి ఎంతో నష్టాన్ని, విషాదాన్ని మిగుల్చుకున్న ‘ఫిలిప్పీన్స్’ పర్యటన సందర్భంగా ఒక కొత్త లోకంలో విహరించిన అనుభూతిని పొందుతారు రచయిత్రి. మనీలాలోని ట్రాఫిక్ జామ్‍లు చూసి విస్తుపోతారు. ఒకనాటి యుద్ధ వాహనాలని నేడు ‘జీప్‌నీస్’ పేరుతో వాడటం గురించి ఆసక్తికరంగా చెప్తారు రచయిత్రి. అక్కడ అగ్నిపర్వతాన్ని, అతి విషపూరితమైన చెట్టుని చూశారు. ఇక్కడ తారసపడిన ఓ అలుపెరుగని యాత్రికుడిని పాఠకులకు పరిచయం చేస్తారు. యుద్ధ జ్ఞాపకాలతో నిర్మించిన మ్యూజియం చూడడం కూడా విషాదం అనిపిస్తుందంటారు.

పొరుగు దేశంతో నిత్యం ఘర్షణలలో ఉండే దేశాలలో ఒకటైన దక్షిణ కొరియాలో పర్యటించారు రచయిత్రి. కొరియా విభజన వల్ల నష్టపోయింది ఉభయ దేశాలలోని శ్రామిక ప్రజలే అంటారు. ఇక్కడి దర్శనీయ స్థలాల గురించి సవివరంగా వెల్లడించారు రచయిత్రి.

అండమాన్ పర్యటన సందర్భంగా రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ అండమాన్ దీవులను ఆక్రమించుకోవడాన్ని వివరిస్తారు. అండమాన్ ఇవాళ ఓ టూరిస్ట్ ప్లేస్‌గా మారి ఉండవచ్చు కానీ, ఇది ఒకప్పుడు ‘యుద్ధక్షేత్రం’ అని అంటారు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీషువారితో పోరాడిన ఎందరో వీరులు బందీలుగా గడిపిన ప్రదేశం అని గుర్తు చేస్తారు. ఇక్కడి సెల్యులర్ జైలులో అంతులేని పని, భరించలేని శిక్షల గురించి వివరిస్తారు.  అండమాన్ ఒక మినీ ఇండియా అని పిలవబడడంలో ఆశ్చర్యం లేదని అంటారు.

‘ఈ యాత్రా రచనలో కేవలం యుద్ధం జ్ఞాపకాలే లేవని, చీకటి వెంట వెలుగు ఎప్పుడూ ఉన్నట్లే, నిత్యం ప్రమాదం అంచున నిలబడి, గాయం తాలూకూ జ్ఞాపకాలను మెల్లమెల్లగా మరిచిపోతూ నూతన శక్తితో తిరిగి కోలుకుని పర్యాటకులకు స్నేహ హస్తం చాస్తున్న ప్రదేశాలెన్నో’ అని తన ముందుమాటలో వ్యాఖ్యానిస్తారు రచయిత్రి. ఈ పుస్తకం చదివాకా, ఈ వ్యాఖ్యలు నిజమనిపిస్తాయి పాఠకులకి.

ఈ పుస్తకానికి ప్రముఖ పాత్రికేయులు, సంపాదకులు శ్రీ గుడిపాటి వ్రాసిన ముందుమాట పాఠకులకు బోనస్.

ప్రతీ దేశానికి సంబంధించిన వ్యాసానికి ముందుగా ఆ దేశం పాల్గొనవలసి వచ్చిన యుద్ధం, మృతుల సంఖ్య, క్షతగాత్రుల సంఖ్యనూ, ఆ యుద్ధానికి సంబంధించిన ఒక ఫోటో, యుద్ధాలకి సంబంధించిన ఒక కొటేషన్ ఇవ్వడం బాగుంది. ఆయా దేశాల యాత్రాకథనం తరువాత అక్కడి పర్యాటక ప్రాంతాలలో రచయిత్రి తీసుకున్న ఫొటోలు రంగులలో ముద్రించడం ఆకర్షణీయంగా ఉంది.

ఆసక్తిగా చదివించే యాత్రా రచన ఇది.

***

యుద్ధక్షేత్రాల్లో మా ప్రయాణం (ట్రావెలాగ్)

నర్మద రెడ్డి

1-92/5

స్ట్రీట్ నెంబర్-1

హబ్సీగుడా, హైదరాబాద్ 500007.

పుటలు: 256

వెల: ₹ 200/-

ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు, ప్రచురణకర్త 9849018510

Exit mobile version