తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే సంవత్సరం విజయదశమినాటికి 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువ భారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశ్యంతో ఇకపై ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.
యువభారతి నిర్వహించిన కార్యక్రమాలను వివరిస్తూ 1971లో అప్పటి యువభారతి అధ్యక్షులు ఇరివెంటి కృష్ణమూర్తి గారి ప్రసంగ పాఠం ఇది.
[dropcap]“చు[/dropcap]ట్టూరా ఆవరించుకొని ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడంకంటె ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నైనా వెలిగించటం మంచిది” అన్న సూక్తిలోని యథార్థ్యం మా ఊపిరి. మా ప్రయత్నం ఉడుతాభక్తి. ఒడ్డున ఉండి సముద్రాన్ని దాటలేమని అనుకుంటూ ఊరికే గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడం కన్న మనస్సును దిటవుపరచుకొని మేధకు పదునుపెట్టి ఉద్యమించడం మేలు. అదే మా ధ్యేయం. నేటి యువతరం నిర్మాణాత్మకంగా ఆలోచించి తన భవిష్యత్తును ఉజ్జ్వలంగా తీర్చిదిద్దుకోవడానికి అనువైన వాతావరణం కల్పించాలనే మహత్వకాంక్షతో ‘యువభారతి’ రూపొందింది. పందొమ్మిదివందల అరవైమూడు విజయదశమినాడు సాహితీప్రియులైన కొందఱు స్నేహితులు ఒక బృందంగా యేర్పడి ‘యువభారతి’ని అవతరింపచేశారు. సాహితీ స్నేహమే ‘యువభారతి’కి ప్రాణం, ధ్యేయం.
ప్రతి వ్యక్తిలోనూ అంతర్లీనంగా ఏదో ఒక ప్రతిభ ఉంది. ఆదరణ, అవకాశం, ప్రోత్సాహం లేక అది వెలికి రాక అవరోధాల తాకిడికి అణగారిపోవచ్చు. ఆ అవరోధాలను తొలగించి అతని పార్థక్యంలోని వైశిష్ఠ్యాన్ని వెలికి తీసి అతని ప్రతిభా సామర్థ్యాలు సామాజికోన్నతికి దోహదమయ్యే విధంగా తీర్చిదిద్దడం అవసరం. ఒక వ్యక్తి తన తీరిక సమయాన్ని వినియోగించుకునే తీరును బట్టి ఆ వ్యక్తి సంస్కారాన్ని అర్థం చేసుకోవచ్చు. ‘యువభారతి’ యువతరంలో ఉత్తమ సాహిత్య పఠనాభిలాషను, సువచోరీతిని, రచనాసామర్థ్యాన్ని పెంపొందింపజేయడానికి గత ఎనిమిదేండ్లుగా యథోచితమైన కృషి చేస్తున్నది.
ప్రతినెలలో మొదటి ఆదివారం, మూడో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాదు సుల్తాన్ బజారులో శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో యువభారతి నిర్వహిస్తున్న సాహిత్య సమావేశాలు పెద్ద ఎత్తులో కాకపోయినా పరిమితంగానైనా సాహిత్యాభిరుచిని ఉద్దీపింపచేయడానికి ప్రయత్నం చేస్తున్నవి. ప్రతినెల మొదటి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆ గ్రంథాలయంలోనే యువభారతి వనితా విభాగం సాహిత్య సమావేశాలు నిర్వహిస్తున్నది.
మా సాహిత్య కార్యక్రమాల సంక్షిప్త వివరణ
పుస్తక చర్చ: సాధారణంగా మనం చదివే పుస్తకాలు మనలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. పుస్తకాలలోని ఔచిత్యాన్ని గ్రహించ గలిగే పాఠకులున్నప్పుడే ఉత్తమ సాహితీ సృష్టికి సరియైన అవకాశాలు లభిస్తాయి. ఈ పుస్తక చర్చ ఉత్తమ సాహిత్యాధ్యయానానికి మార్గదర్శకమౌతుందని మా ఆశయం. ఈ చర్చ ప్రతిమాసం జరుగుతుంది. చర్చకు ఎన్నుకున్న పుస్తకం ఒక నెల ముందుగా సభ్యులకు ఉచితంగా అందజేయబడుతుంది. సాహిత్యపఠనంలో ఉత్తమాభిరుచులను పెంపొందించి ప్రామాణికమైన విమర్శనాదృష్టికి అలవరింపజేయడం మా ‘పుస్తకచర్చ’ ప్రధానలక్ష్యం.
క్లుప్తగోష్ఠి: భాష ఏదైనా భావ వ్యక్తీకరణకు తోడ్పడాలి. కనీసం మన మాతృభాషలోనైనా మనం అందంగా, క్లుప్తంగా, స్పష్టంగా, నిర్భయంగా, ప్రయోజనాత్మకంగా మాట్లాడగలగాలి. అందుకే మా యీ క్లుప్తగోష్టి కార్యక్రమం – ఇచ్చిన విషయంపై రెండు నిముషాలలో సద్యఃస్ఫూర్తితో సమయనియమాన్ని అనుసరించి సమగ్రంగా సదస్యుల హృదయాలలో ముద్రితమయ్యేటట్లు మాట్లాడడం అలవరచుకోవాలి. సభాకంపాన్ని పోగొట్టుకోవడానికి ఏర్పరచిన క్లుప్తగోష్ఠిలో అందరికీ తెలిసి అందుబాటులో వుండే విషయాలే వక్తవ్యాంశాలుగా ఉంటవి – ఈ కార్యక్రమం ఆలోచనాశక్తిని ప్రేరేపించి సముచిత వచోరీతిని పెంపొందించాలని మా అభిమతం. ఈ ‘క్లుప్తగోష్ఠి’లో సభాసదులకు నచ్చిన ఉత్తమవక్తకు ప్రోత్సాహ బహుమతి పుస్తకము రూపేణా ఇవ్వబడుతుంది.
వక్తృత్వం: ఉపన్యసించడం ఒక కళ. చక్కగా ఉపన్యసించగల్గడం వ్యక్తిత్వానికి విశిష్టత సంపాదించుకోవడమే. మొదలు తుది లేక లక్ష్యశుద్ధి లేక అస్తవ్యస్తముగా మాట్లాడటం ఉపన్యాసం అనిపించుకోదు. సభ్యులలో సముచిత వక్తృత్వ శక్తిని పెంపొందించడానికి ఒక కార్యక్రమం యువభారతి రూపొందించింది. సభ్యుడు తనకిష్టమైన విషయాన్ని గురించి సమగ్రంగా ఆలోచించి, ఐదు నిమిషాలపాటు ప్రసంగించవలసి ఉంటుంది. ఒక పక్షం రోజులముందే ప్రసంగించవలసిన సభ్యులు నిర్ణయింపబడుతారు. నాటక ప్రయోగం సామాజికులు లేనిదే సమగ్రం కానట్టు శ్రోతలు లేనిదే వక్తృత్వం సమగ్రం కాదు. శ్రోతలంటే కేవలం వినేవాళ్ళే కాదు. ప్రసంగాన్ని మనఃస్ఫూర్తిగా, సావధానంగా, సతర్కంగా వినగల్గేవాళ్ళు శ్రోతలు, వక్తలు పరస్పరాశ్రితులై వున్నప్పుడే ప్రసంగంలోని ఔచిత్య అనౌచిత్యాలను విశ్లేషించుకోగల్గుతారు. మా యీ వక్తృత్వ కార్యక్రమము ఈ ఆశయానికనుగుణంగా వుండేట్లు ఉపన్యాసకళకు సంబంధించిన కొన్ని శాస్త్రీయమైన పద్ధతులను రూపొందించటానికి మా యువభారతి కృషి చేస్తున్నది.
నా ఊహాపథంలో: దైనందిన జీవితంలో తారసిల్లే సంఘటనలను గురించి గాని అప్పుడప్పుడు హృదయాన్ని కదలించిన భావాలకు గాని రచనారూపం కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. వాన, పూలు, ఫోటోలు, నిద్ర, అబద్ధాలు, సంఘాలు, వెన్నెల, ఇంటర్వ్యూల వంటి విషయాలను ముందే ఎన్నుకొని సభ్యులకు ఒక పక్షం రోజులకు ముందే తెలియజేస్తాము. మూడు నిమిషాలకు మించకుండా, ప్రతి సభ్యుడు ఆ విషయాలపై పద్యమో, గద్యమో, గల్పికో, గేయమో లేక తనకు నచ్చిన రీతిలో వ్రాసుకొని వచ్చి వినిపించవలసి ఉంటుంది. మనస్సుకు తట్టిన తలపులకు అక్షరరూపం కల్పించడానికి సభ్యులు ప్రయత్నం చేయాలి. రచనాకంపం వంటిది కొంతైనా తగ్గాలని సంస్థ ఆశయం.
చర్చలు: సారస్వత, సామాజిక, సాంస్కృతిక సమస్యలపై సభ్యులు అప్పుడప్పుడు చర్చిస్తారు. చర్చనీయాంశం ఒక పక్షం రోజులకు ముందుగానే ప్రకటింపబడుతుంది. సభ్యులు ఆయా సమస్యలకు వివరాలను సమీకరించుకునే అవకాశం కలిగించి, చర్చల వల్ల విషయ పరిజ్ఞానం సమ్యక్ దృష్టి అలవరచడం ఈ చర్చల లక్ష్యం.
స్వీయ రచనా పఠనం: ప్రతి సమావేశంలో తమ తమ రచనలను సభ్యులు వినిపించి ప్రోత్సాహం పొందేందుకు ఈ కార్యక్రమం రూపొందించబడింది. సాధారణంగా జరుపబడే ఈ కార్యక్రమాలేకాక యువభారతి, కవితాగోష్ఠులను, నాటక ప్రయోగములను, చిత్రలేఖనా ప్రదర్శనాలను విజ్ఞుల, సాహితీ మర్మజ్ఞుల, కళాకోవిదుల ఉపన్యాసాలను; సాంస్కృతిక యాత్రలను, పుస్తక ప్రచురణలను, గోష్ఠులను నిర్వహిస్తున్నది.
‘కావ్యలహరి’ కార్యక్రమం ఈ వరుసలోనిదే
కొన్ని వివరాలు: ‘యువభారతి’ తొలిదశలో ‘యువభారతి’ అనే పేరున ఒక సైక్లోస్టైల్డ్ మాసపత్రికను ఒక సంత్సరం పాటు పన్నెండు సంచికలు వెలువరించి సుమారు వెయ్యి ప్రతుల దాకా సాహిత్యాభిమానులకు అందించింది. ధనాభావం వల్ల దానిని కొనసాగించలేక ఇటీవల కొందరికైనా అందాలని చిన్న ఎత్తున లిఖితసమాస పత్రికను నిర్వహించింది.
ఉత్సాహవంతులైన నటులెందరో నటన కళతో యువభారతి నారాధించారు. సాహిత్యాసక్తిని ఇతోధికంగా ఇనుమడింపజేయడానికి ప్రచురణకు పూర్వమే విరాళాలు స్వీకరించి శ్రీ అనుముల కృష్ణమూర్తిగారి ‘సరస్వతీ సాక్షాత్కారం’ అనే కావ్యాన్ని, శ్రీ కాళోజి తెనిగించిన ఖలీల్ జిబ్రాన్ The prophet (జీవనగీత)ను యువభారతి ప్రచురించింది. అయిదవ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని నలుగురు యువభారతి సభ్యుల కవితా సంకలనం ‘వీచికలు’ ప్రచురణ జరిగినది. ఈ మధ్య కాలంలో వెలువడిన కవితా సంకలనాలలో అత్యధిక సమీక్షకులచే ఔననిపించుకొన్న మా యీ ప్రచురణ మాకు గర్వకారణం.
పుస్తకపథకం: మనలో పలువురికి పుస్తకాలు కొని చదివే అలవాటు తక్కువ. తక్కువ పెట్టుబడితో ఎక్కువ పుస్తకాలను న్యాయంగా ఆర్జించి పెట్టగలిగే పద్దతిలో మేము పుస్తక పథకాన్ని రూపొందించి ఒక్క సంవత్సరం పాటు నిర్వహించినాము. తగిన ఆదరణ, సహకారం, లభించకపోవటం వల్ల ప్రస్తుతానికి పథకం నిలిపివేసినాము. ఈ పుస్తక పథకం సభ్యులకు ప్రత్యేక ప్రచురణగా అయిదుగురు ప్రఖ్యాత కథకుల కథాసంపుటి ‘పంచవటి’ ప్రచురించాం. పుస్తక పథకం నిర్వహణ నిమిత్తమై సోదర సంస్థ ‘స్పందనసాహితి’ వారితో కలిసి శ్రీమతి డి. కామేశ్వరిగారి ‘వానచినుకులు’ వెలువరించాం.
విద్యార్థి రచయితలకు కథా రచనపోటీ (1970): విద్యార్థులలో సృజనాత్మక రచనాశక్తిని పెంపొందించే నిమిత్తం ప్రఖ్యాత ప్రచురణకర్తలు శ్రీ యం. శేషాచలం అండ్ కంపెనీ వారితో అఖిల భారత స్థాయిలో తెలుగు విద్యార్థులందరికీ తెలుగులో కథా రచన పోటీ నిర్వహించాము. ప్రవేశరుసుము లేని ఈ పోటీకి నగదు పారితోషికాలే కాక పుస్తకరూపంలో ఉత్తమ కథలకు బహుమతులనిచ్చి 1970 విజయదశమి (యువభారతి సప్తమ వార్షికోత్సవం నాడు) పదిహేను మన్నికైన కథల సంపుటిగా ‘విద్యార్థి సాహితి-2’గా ఎమెస్కో పాకెట్ బుక్‍గా వెలువరించాం.
సప్తమ వార్షికోత్సవ (1970) సందర్భంగా మా కార్యక్రమాలో ముఖ్యమయినదిగా ‘మారుతున్న విలువలు – రచయితల బాధ్యతలు’ అనే విషయంపై ఒక గోష్ఠిని నిర్వహించాం. వడివడిగా మారుతున్న ఈ కాలంలో మేధావి వర్గానికి కూడా హక్కులు గుర్తున్నంతగా బాధ్యతలు గుర్తురాని ఈ రోజులలో, ఒక బేరీజు వేద్దామని, జాగ్రత్తగా అంచనా కడదామనీ కనీసం రానున్న తరానికైనా కాస్తయినా కనువిప్పు కలిగిద్దామనే అభిప్రాయంతో మేమీ గోష్ఠికి ఉద్యమించాం. ముప్పది ఏడుగురు ప్రముఖ సాహితీ స్రష్టల వ్యాసాలను ముందుగానే సేకరించి ‘రచన’ అనే పేరుతో ఒక సంపుటిగా ప్రచురించి గోష్ఠికి వచ్చేవారికి ఒక వారంరోజుల ముందే అందజేశాం. జంట నగరాల ఇరవై కళాశాలల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు 400 మంది కళాశాలాధ్యాపకులు, విద్యార్థులు, రచయితలు, వివిధ రంగాలకు సంబంధించిన యువకులు ప్రతినిధులుగా పాల్గొన్న ఈ సదస్సు ఒక రోజంతా మూడు సమావేశాలుగా జరిగింది. విభిన్న దృక్కోణాలుతో “మారుతున్న విలువలు రచయితల బాధ్యతలు” అనే విషయంపై వ్యాసాలను అందించి, చదివి, చర్చించిన వారిలో ప్రాచీనార్వాచీన సాహితీ సిద్ధాంతాలకు ప్రతినిధులైన రచయితలు పలువురు పాల్గొనడం ఈ గోష్ఠిలోని ఒక విశేషం. ప్రముఖ సాహిత్య మాసపత్రిక ‘భారతి’ 70 అక్టోబరులో, ప్రతి సాహితీ పరుడూ తప్పక చదువవలసిన వ్యాస సంకలనం ఇదనీ, ఈ పుస్తకాన్ని చదవటం ఒక గుణమని చెప్పటమే కాదనీ, చదవకపోవడం ఒక లోపమని కూడా చెప్పవచ్చుననీ ‘రచన’ను సమీక్షిస్తూ పేర్కొన్నారు.
యువభారతి కృషి, కార్యక్రమాలు, సాహిత్య సాంస్కృతిక రంగాలకు పరిమితమైనవి. మానవుడి సంస్కారానికి గీటురాయి సంస్కృతీ ప్రియత్వమే కదా! సంస్కృతి నిగ్రహాన్ని నేర్పుతుంది. సృజనాత్మకశక్తికి దోహదమిస్తుంది. మానవుడు సంఘజీవి. సమాజవికాసానికి సామూహిక కృషి అవసరం. సామూహిక కృషికి మొదటి అవసరం సహృదయత. అది లేనినాడు అపస్వరాలు వినిపిస్తాయి.
ఇది యువభారతి కృషి స్థూలంగా వివరించాము. చైతన్య పూరితమైన ఆశయసాథనా సంరంభాన్ని జడమైన అచ్చుసిరా ద్వారా అందించగలగడం కష్టం. మా కృషి వెనుకనున్న చైతన్య స్రవంతిని సహృదయులు పోల్చుకోగలరని ఆశిస్తున్నాము.
హైదరాబాద్
05-09-1971
ఇరివెంటి కృష్ణమూర్తి
అధ్యక్షుడు, యువభారతి