యువకెరటాలు

0
2

[dropcap]స[/dropcap]రస్వతి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నది. అన్నల దగ్గర అగచాట్లు పడుతున్న తండ్రిని చూడలేక, భర్త పోయిన తనకు తోడుగా ఉంటాడని, అన్నలు అనే సూటిపోటి మాటలు తప్పిపోతాయని తనవెంట తెచ్చుకుంది. కానీ దేవుడు చిన్నచూపు చూశాడు. తెచ్చుకున్న నాలుగు నెలలకే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసి అందరినీ బందీలుగా మార్చింది. ఉగాది పండుగ కూడా చేసుకోనివ్వకుండా లాక్‌డౌన్ పడేలా చేసింది. వయసు పైబడ్డ తండ్రి, చదువుకుంటున్న కొడుకుతో, భర్త కాలంచేసినపుడు వచ్చిన డబ్బుతో, మరికొంత ప్రభుత్వసాయంతో బ్రతుకు వెళ్ళదీసుకొస్తున్నది. భర్తది ప్రైవేటు ఉద్యోగం కావడం వల్ల పింఛను అవకాశం లేదు. తండ్రికి మాత్రం ప్రభుత్వం ఇచ్చే పింఛను వస్తుంది. మొత్తానికి ఎలాగోలా కాపురాన్ని నెట్టుకొస్తున్నది.

ఇంత కష్టకాలంలో తల మీద పడ్డ తాటికాయలా, ఆరోగ్యంగా ఉన్న తండ్రికి అకస్మాత్తుగా గుండెపోటు రావడం, ఆసుపత్రి వాళ్ళు చేర్చుకోవడానికి వెనుకాడడంతో అతని ఊపిరి అంతసేపు ఆగలేక ఆగిపోయింది. ఇందులో తప్పొప్పులను ఎంచలేము. కరోనా సోకిందో లేదో తెలియకుండా చేర్చుకోవడం వీలుకాదని కొందరు, ఆరోగ్యశ్రీతో కాదు మాకు డబ్బు చెల్లించాలని కొందరు, పడకలు ఖాళీలు లేవని కోవిడ్ సెంటరులు ఏ కారణమైతేనేం, ఒక బడుగుజీవి ప్రాణం హరించుకుపోయింది.

తండ్రి శవాన్ని ముందు పెట్టుకుని ఏడుస్తూ అన్నలిద్దరికీ ఫోనుచేసి విషయం చెప్పి, వచ్చి తండ్రి అంత్యక్రియలు చేయమని బ్రతిమలాడుకుంది సరస్వతి. ఈ తెలివి తండ్రిని తీసుకుపోయే ముందు ఉండాలని చిన్నన్నయ్య, ఆయనకు వచ్చింది గుండెపోటో లేక కరోనా వ్యాధో తెలియకుండా వచ్చి ఆ రోగం నేను తగిలించుకోలేనని పెద్దన్నయ్య కారణాలుగా చెప్పి ససేమిరా రానన్నారు. కోవిడ్ భయంతో శవాన్ని మోయడానికి కాదుకదా, కనీసం చూడడానికి కూడ చుట్టుపక్కల వాళ్ళెవరూ రాలేదు. సాయంత్రం కావస్తున్నది కానీ ఎవరిలోను చలనం లేదు. అందరూ ముఖం చాటేశారు.

అప్పుడే షరీఫ్ కూరగాయల కొట్టునుంచి ఇంటికి వచ్చాడు. అతనికి కరోనా వ్యాధి వచ్చి తగ్గిపోయి నెలరోజులు దాటింది. వారం క్రితమే డాక్టరు గారు ఫోను చేసి అతని రక్తం కావాలని అడిగాడు. దానివలన మరికొంత మంది కోవిడ్ బాధితులు కోలుకుంటారని చెప్పారు. అదేదో ప్లాస్మాథెరపి అనే పేరుకూడ చెప్పాడు. అతనికి కరోనా వ్యాధి వచ్చినపుడు వారి కుటుంబాన్ని అందరూ వెలివేసినట్లు చూశారు. కానీ అవన్నీ మరచిపోయి, తనవల్ల పదిమందికి జబ్బు నయమవుతుంది అంటే అంతకన్నా కావలసిందేముందని రక్తం ఇచ్చాడు. కుటుంబంలో ఎవ్వరూ అతని మాట కాదనలేదు. ఇప్పుడతను తనతో పాటు వ్యాధికి గురయి నయమయిన వారి జాబితాను డాక్టరు నుంచి తీసుకుని వారందరితోను మాట్లాడి, వారిచేత కూడ ప్లాస్మాథెరపి కోసం రక్తం ఇప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

“భయ్యా. సరస్వతి అక్క నాన్న చనిపోయారు గుండె పోటుతో. పాపం శవాన్ని తీసుకెళ్ళను ఎవరూ ముందుకురావటం లేదు. అక్క విపరీతంగా ఏడుస్తున్నది. ఏదైనా దారి చూడన్నా. అక్క చాలా మంచిది” దుస్తులు మార్చకుంటున్న షరీఫ్ తో చెప్పింది చెల్లెలు సుల్తానా.

“యా అల్లా.. ఎంత పని జరిగింది. నే వెళ్ళి చూసి వస్తాను” అంటూ దుస్తులు మరలా వేసుకుని వెళ్ళాడు షరీఫ్.

***

“అక్కా బాధపడకు. ఎవరమైనా ఎప్పుడో ఒకప్పుడు పోవలసిందే, కాకపోతే అయ్య తొందరపడ్డాడు. ఇంతకూ అన్నా వాళ్ళకు ఫోను చేశావా”

“చేశాను. ఎవ్వరూ రామని చెప్పారు. ఏంచెయ్యాలో అర్థంకావటం లేదు షరీఫ్ భయ్యా” అంటూ షరీఫ్ చేతులు పట్టుకుని ఏడవసాగింది సరస్వతి.

“రో నకో. ఏడవకు అక్కా. ఏదో ఒకటి చేద్దాం. అయ్యను అంపే బాధ్యత నాది. ధైర్యంగా ఉండు” అని ఇవతలికి వచ్చి తన స్నేహితులకు ఫోనులు చేసి మాట్లాడాడు.

చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి సహాయాన్ని ఆశించాడు. కానీ ఎవరూ స్పందించలేదు. ఏమిటీ మనుషులు. ఇలాంటి వాళ్ళ కోసమేనా నలుగురిని పోగుచేసుకోమనేది. ఛీ…అనిపించింది షరీఫ్‌కు.

ఇంతలో వినోద్ నుంచి ఫోను వచ్చింది.

“హలో వినోద్ బయలుదేరారా”

“బయలుదేరామురా. నేను, కార్తీక్, బద్రి, యాకూబ్ వస్తున్నాం. చాలా మా తమ్ముడిని తీసుకురమ్మంటావా”

“వద్దురా. మీరు చాలు. త్వరగా రండి. మరీ పొద్దుపోతే ఎవరైనా అభ్యంతర పెడతారేమో”

“ఆల్రెడీ బయలుదేరాం. పావుగంటలో అక్కడ ఉంటాం” అని చెప్పి ఫోను పెట్టేశాడు వినోద్.

వీళ్ళందరూ మంచి స్నేహితులు. దరిదాపుగా ఒకే వయసు వారు. రాజకీయనాయకులు వేసే కుల పాచికల మారణహోమాలు వీళ్ళనింకా తాకలేదు. మతాలూ ఒకటి కావు, కులాలు ఒకటి కావు. వీరంతా చిన్నప్పటి నుంచి స్నేహితులు. వినోద్‌ది పూల హోల్‌సేల్ వ్యాపారం. కార్తీక్, బద్రిలది కిరాణాకొట్టు. యాకూబ్ సైకిల్ షాపు. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట వీరంతా కలవాల్సిందే. ఇక సెలవు రోజైతే సాయంత్రం వరకు కలిసే ఉంటారు. యాకూబ్‌కు తప్ప ఇంకెవరికీ వివాహాలు కాలేదు. షరీఫ్‌కు కరోనా సోకినపుడు అతడిని క్వారంటైనులో ఉంచితే వాళ్ళ కుటుంబాన్ని కంటికి రెప్పలా చూస్తూ, షరీఫ్‌కు కావలసిన ఆహారాన్ని, డాక్టరు వ్రాసిన మందులను తెచ్చి యిచ్చి అతడిని కాపాడుకున్నారు. అంతేకాక షరీఫ్ చేస్తున్న ప్లాస్మాథెరపి కోసం రక్తదాతలను కలిసే ప్రయత్నంలో కూడ వీరంతా భాగస్వాములే. చేసేది చిరు వ్యాపారాలైనా, పది మందికి మేలు చేయాలనే తపన ఉన్న యువకులు.

“అక్కా. మీకభ్యంతరం లేకపోతే మా స్నేహితులందరం కలసి అయ్యకు దహన సంస్కారాలు చేస్తాం. మీ ఆచారం ప్రకారం దహనం చేస్తాం. మా వాడు కార్తీక్ హిందువే. వాడి చేత తలకొరివి పెట్టిస్తాం. మేము మా వినోద్ గాడి బండిలో శవాన్ని స్మశానానికి తీసుకెడతాం. చెప్పక్కా మేము వేరే మతం వాళ్ళమని అనుకోవుగా” ఎంతో వినయంగా అడుగుతున్న షరీఫ్ ను పట్టుకుని భోరున విలపించింది సరస్వతి.

“అక్కా అని పిలిచిన నీకంటే నాకు బంధువులు ఎవరయ్యా. ఏంచెయ్యాలో పాలుపోని నాకు దేవుడిలా వచ్చి పరిష్కారం చూపావు. మానవత్వం లేని కులం నాకొద్దు. మా హిందువే కాదయ్యా మనసు, మానవత్వమున్న నువ్వు తలకొరివి పెట్టినా నా తండ్రి ఆత్మ శాంతిస్తుంది. మీరు మనుషులు కాదయ్యా దేవుళ్ళు. మీరెట్టా చేసినా నాకిష్టమే. కొడుకుల కోసం ఏడుస్తారందరూ. ఏరయ్యా ఆ కొడుకులు. స్వార్థంతో తండ్రిని తగలెయ్యడానికి కూడ రాలేదు. మీరేనయ్యా ఆయనకు పిల్లలు” కృతజ్ఞతతో ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి.

ఏ ఆర్భాటాలు లేకుండా, కోవిడ్‌లో తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, వినోద్ తెచ్చిన మినీవ్యానులో సరస్వతి తండ్రి శవాన్ని ఎక్కించారు షరీఫ్ బృందం. సరస్వతి కూడ వారితో బయలుదేరింది. హిందూ సాంప్రదాయం ప్రకారం దహనసంస్కారాలు నిర్వహించి వచ్చేశారు అందరూ.

ఇదేమి విడ్డూరమని కొందరంటే, మరికొందరు ఆ యువకులలో మూర్తీభవించిన మానవత్వానికి చేతులెత్తి నమస్కారం చేశారు. ఎవరేమనుకున్నా యువతరం చేసిన ఈ సాహసాన్ని అన్ని మీడియాలు అభినందించాయి. అదే సమయంలో ఆ బృందం చేసిన వ్యాఖ్య అందరినీ ఆలోచనలో పడేసింది.

“కోవిడ్ ఒక వైరస్ వ్యాధి. అది ఎవరికైనా రావచ్చు. అది వచ్చినంత మాత్రాన వారిని అంటరానివారుగా చూడడం అమానుషం. రక్తసంబంధీకులే తప్పుకోవడం చాలా బాధాకరం. కానీ మాకు అలాంటి భయం లేదు. ఎవరు చనిపోయినా, వారికి అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రానపుడు మాకు ఫోను చేయండి. మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాము. ఇందుకు మీరు మాకు ఏ రుసుము చెల్లించనక్కరలేదు. ఇది మా తోటి భారతీయుడికి మేము చేసే చిన్న సేవ మాత్రమే. మరొక్క విన్నపాన్ని ఈ మీడియా ద్వారా మీ ముందు ఉంచుతున్నాము. ఎవరైనా కోవిడ్ వచ్చి కోలుకుని వుంటే, దయచేసి మీరు సమీపంలోని కోవిడ్ సెంటరు నందలి డాక్టరును సంప్రదించి మీ రక్తాన్ని ఇవ్వండి. ప్లాస్మాథెరపి ద్వారా వైద్యులు కరోనా రోగగ్రస్తులను కాపాడగలరు. అందరం కలసి పనిచేద్దాం. కరోనాను తరిమేద్దాం” అని ముక్తకంఠంతో తెలిపారు వారు.

***

గత నెల నుంచి ఒక్క మరణం కూడ నమోదు కాని జిల్లాగా ఆ జిల్లా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. చాలా సంతోషపడ్డాడు ఆయన. ఆ జిల్లా కలెక్టరును అభినందించాలని, ఆ స్థితికి రావడానికి అతను చేపట్టిన చర్యలేవో తెలుసుకుని, అదే రకంగా మిగిలిన జిల్లా అధికారులను కూడ చేయమని చెప్పాలనే నిర్ణయంతో జిల్లా కలెక్టరుల వీడియో కాన్ఫరెన్సును ఏర్పాటు చేయించారు ఆరోజు.

“అందరికీ స్వాగతం. ఈరోజు ప్రధాన అజెండా రాష్ట్రంలో కోవిడ్ నిర్మూలన. కలెక్టరు భగత్ గారిని ముందుగా అభినందిస్తున్నాను. గత నెల రోజుల నుంచి ఒక్క మరణం కూడ ఆ జిల్లాలో నమోదు కాలేదు. దీన్ని ఆయన ఎలా సాధించారో మన అందరికీ తెలియజేయాలని, వీలైతే మనమూ ఆ విధానాన్ని అనుసరించి కరోనారహిత రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని నిలపాలని నా ఆలోచన. ముందుగా భగత్ ను మాట్లాడమని కోరుతున్నాను.

భగత్ లేచి నిలుచున్నాడు.

“అందరికీ నమస్కారం. గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారి అభినందనలకు నా ధన్యవాదములు. నిజానికి ఇది నా విజయం కాదు. ఇది అయిదుగురు యువకుల విజయం. ఈ అభినందనలకు నిజమైన అర్హులు వారే. ముఖ్యమంత్రి గారు అనుమతిస్తే వారిని మీ అందరికీ పరిచయం చేస్తాను” అని వినయంగా కోరాడు భగత్.

ముఖ్యమంత్రి గారు ఆసక్తితో అనుమతి ఇచ్చారు. బయట నుంచి లోపలికి వచ్చారు వారు. వారే షరీఫ్ బృందం. వారిని ఒక్కొక్కరిని అందరికీ పరిచయం చేశారు భగత్.

“నేను ఒకరోజు ఉదయం పేపరు చూస్తున్నపుడు ఒక వార్త నా దృష్టిని ఆకర్షించింది. గుండెపోటుతో చనిపోయిన వ్యక్తికి కరోనా సోకిందేమోనన్న అనుమానంతో బంధువులే దహనసంస్కారాలకు వెనుకాడినపుడు, ఈ అయిదుగురు ముందుకువచ్చి, కరోనాకు తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆ శవానికి దహనసంస్కారాలు చేశారు. ఆ సంఘటన నా జిల్లాలోది కావడంతో వెంటనే వారిని పిలిపించమని చెప్పాను. నేను ఈ విషయం నా పి.ఏ తో చెప్పినపుడు నాకు ఇంకో ఆసక్తికర విషయం చెప్పాడు. అతను ముందు రోజు రాత్రి దూరదర్శన్‌లో వీళ్ళ మాటలు విన్నాడట. వీళ్ళు కరోనా వ్యాధితో చనిపోయినవారికి అవసరమయితే అంతిమక్రియలు నిర్వహించడమే కాకుండా, కరోనా నుంచి కోలుకున్న వారిని సంప్రదించి ప్లాస్మాథెరపికి వారి నుంచి రక్తం సేకరించడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్నాను. ఇటువంటి సమాజసేవ చేసే యువతకు ప్రభుత్వం నుంచి సహకారం అందితే వీరు ఇంకా ఉత్సాహంగా చేయగలరని అనిపించింది. వెంటనే వారిని పిలిచి వారిని అయిదు టీములుగా ఏర్పడమని, వారిలా ఉత్సాహవంతులను టీము సభ్యులుగా చేర్చుకొనమని చెప్పాను. ఆసుపత్రులలో వ్యాధి నుంచి కోలుకున్న వారి జాబితాను తెప్పించి వారికి ఇచ్చాను. అందులోని వ్యక్తులను ఫోను ద్వారా గానీ, వ్యక్తిగతంగా కలిసి గాని రక్తదానానికి ఒప్పించమని అడిగాను. ఇందులో అయ్యే ఖర్చంతా మేమే భరిస్తామని చెప్పారు. దానికి వారు స్పందించి ప్రయాణఖర్చులు మాత్రం ఇస్తే చాలన్నారు. అవన్నీ తరువాత అని చెప్పి వారికి నా నుంచి అనుమతి పత్రం ఇచ్చాను. వీరు పదిహేను రోజులలో అరవై శాతం పైచిలుకు వ్యక్తులను ఒప్పించి రక్తదానం చేసేలా చేశారు. ఆసుపత్రిలో వైద్యులు వీరి ఉత్సాహాన్ని చూసి చైతన్యం చెంది, రాత్రనక పగలనక కష్టపడి కరోనా రోగులకు చికిత్సలు చేశారు. అందువలననే మా జిల్లాలో కరోనా వ్యాధి మృతుల సంఖ్య సున్నాకు చేరింది. వీరి చొరవ చూసి కరోనా వ్యాధి సోకిన వారి బంధువులు కూడ సిగ్గుపడి, వారి బంధువుల అంత్యక్రియలకు వారే ముందుకురాసాగారు. దానివలన వీళ్ళు తమ కాలాన్ని పూర్తిగా రక్తదాతలపై కేంద్రీకరించి జిల్లాను మృతరహిత జిల్లాగా చేశారు. వీరు వెళ్ళిన ఊరిలోని అందరికీ కరోనా సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను పదేపదే చెప్పడంతో జిల్లాలో కరోనా బారినపడే వారి సంఖ్య కూడ తగ్గింది. కాబట్టి ఈ విజయానికి కారణం వీరు, వీరి టీములే గాని నేను కాదు సర్. యువతను ఉత్సాహపరచి సరియైన మార్గంలో నడపగలిగితే అద్భుతాలను సాధించవచ్చని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను” అని సవినయంగా చెప్పారు భగత్.

“వెల్ డన్ భగత్. కలెక్టర్ అంటే రాజకీయ నాయకుల ఆజ్ఞలను పాటించడం కాదు, ప్రజలకోసం కొత్తగా ఆలోచించాలి అని ఋజువు చేశారు. మీలా చేసే ప్రభుత్వ ఉద్యోగి నిబంధనలను అతిక్రమించినా నేను అభినందిస్తానే గానీ ఆక్షేపించను. అందరూ విన్నారుగా. భగత్ దారిలో నడుస్తారో, కొత్తగా ఆలోచిస్తారో మీ ఇష్టం. మన రాష్ట్రం మరో రెండు నెలలలో కరోనారహిత రాష్ట్రం కావాలి. షరీఫ్ అండ్ కో, మీ సేవలు ప్రభుత్వం విస్మరించదు. అవకాశము వచ్చినపుడు మీకు తగిన సహాయం చేస్తుంది. భగత్ వీళ్ళను ఎలా సత్కరిస్తారో, ఏ బహుమానం ఇస్తారో మీ ఇష్టం. మా ప్రమేయం లేనప్పుడే మీరు అద్భుతాలు సృష్టించగలరని అనిపిస్తున్నది. ఇకనుంచి మనమంతా ప్రజలకోసమే పని చెయ్యాలి. ఎక్కడైనా, ఎవరివల్లనైనా ఇబ్బందైతే నాకు నేరుగా చెప్పండి. రెండు నెలలలోపు నేను చెప్పిన మాట నిజం చేయాలి” అని అందరికీ నమస్కరించి, మరోమారు ఆ అయిదుగురు యువకులను అభినందించి వెళ్ళారు. భగత్ ఆనందంతో అందరినీ ఆలింగనం చేసుకున్నాడు. వాళ్ళ మనసులు ఆనందంతో పొంగిపోయాయి. “సరియైన మార్గం చూపకపోవడం వల్లనే యువత అక్కడక్కడ దారి తప్పుతున్నది. మంచి మార్గాన్ని చూపి ప్రోత్సహించగలిగితే యువతరం సాధించనిది ఉండదేమో” తన మనసులో అనుకున్నాడు భగత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here