యువకెరటం

0
2

[dropcap]న[/dropcap]వ్యాంజలి పబ్లిక్ స్కూల్. ఆ రోజు పాఠశాల వార్షికోత్సవం. ఉదయమే విద్యార్థులలో హడావిడి మొదలు. సభ సాయంత్రం నాలుగుకు, కానీ నాటకాలు, నాట్యాలు, హాస్యవల్లర్లు – వీనిలో పాల్గొనే విద్యార్థులకు ఆఖరి రిహార్సల్సు. వారందరిలో ముఖ్య అతిథి ఎవరు అనే కుతూహలం  పెరిగింది. అతడు ఈ స్కూల్ పూర్వ విద్యార్ధి. ఎంతో పూర్వం కాదు. నాలుగేళ్ల క్రితం. పన్నెండో తరగతి వరకు చదివేడు. సన్నగా, పొడుగ్గా, నూనూగు మీసాల ఆ కుర్రవాడు చాలామందికి గుర్తే. పేరు శ్రీహర్ష.

‘ఎవరో హర్ష. 21 ఏళ్ల కుర్రాడు ముఖ్య అతిథి ఏమిటి?’ అనుకొన్నారు.  టీచర్లను అడిగేరు. “హర్ష మామూలు యువకుడు కాదు. వేరే విధంగా ఆలోచించేవాడు. ‘మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్’ ఇలా మాట్లాడేవాడు. ‘పర్యావరణం దెబ్బతింటోంది, కాలుష్యం పెరిగింది’ – అంటూ సైన్సు సోషల్ క్లాసుల్లో వాడీ వేడీ చర్చలు” గుర్తు చేసుకున్నారు టీచర్లు.

అదో మహానగరం.  ఊరి శివార్లలో నవ్యాంజలి పాఠశాల, దానికి దగ్గర గృహ సముదాయాలు. నగరాలు పెరగడం చిత్రంగా ఉంటుంది. ఓ పరిశ్రమ, విద్యాలయం, నీటి వనరు, లెవెల్‌గా ఉన్న భూమి – ఇలా కారణం ఏదో ఒకటి. స్కూలుకు దగ్గరగా ఇళ్లు, అపార్ట్మెంట్లు, రోహౌసులు, బంగళాలు, కాలనీలకు కొదువలేదు. ఓ కాలనీలోని బంగళాలోని  సంపన్నుల బిడ్డ శ్రీహర్ష. వాళ్ళ  నాన్నకు దేశ విదేశాల్లో ఫ్యాక్టరీలు, హోటళ్లు, వంటి వ్యాపారాలు ఉన్నాయి.  హర్ష ఇంట్లో అమ్మ,  నాన్న,  చెల్లి వర్ష,  తాతయ్య, బామ్మ వున్నారు. తండ్రి గోపినాథ్ నెలలో ఇరవై రోజులు దేశ విదేశాల్లో పర్యటనలు. తల్లి కిరణ్ డిగ్రీ చదివింది. వ్యవహారాలన్నీ తానే  చూసుకుంటూ కొంచెం రాజసం, ఠీవి; హుందాగా ఉండి, చిన్న చిన్న విషయాలను ‘పోనీలే’ అని వదిలేస్తుంది.

హర్ష చురుకైన వాడు. బడి నుండి వచ్చినది మొదలు ఒక చోట కాలు నిలువదు. వాళ్లింట్లో ఓ మినీ లైబ్రరీ వుంది. పిల్లల పుస్తకాలు ఎన్నో! దేశ విదేశాలనుండి గోపినాథ్ తెచ్చి పెడతాడు. “పుస్తకం అంటే ప్రాణంలా చూడాలిరా, పుస్తకాలిచ్చే విజ్ఞానం ఇంతా అంతా కాదు. సరిగ్గా ఉంచక పోతే తాట ఒలిచేస్తాను – జాగ్రత్త”, అని ఒక సారి గట్టిగా  చెప్పాడు. అర్థమైంది హర్షకు. ఒక్కో పుస్తకం చదివి, అమ్మ బామ్మ, తాతయ్యలతో ఆ కథ, విశేషాలు చెప్పి చాలా ప్రశ్నలు వేస్తాడు. “ఇలా ఎందుకు జరిగింది? అలా జరిగితే బాగుండేది కదా?” అంటూ. వార్తా పత్రికలు చూస్తాడు, చదువుతాడు. టెన్నిస్ ఆడుతాడు.

ఒక ఆదివారం ప్రొద్దుటే ఓ పుస్తకంలో తలా దూర్చేడు. కదలడు. టిఫిన్లకు పిలుపు. “ఇక్కడికి పంపు”. భోజనం ఎలాగో కానిచ్చేడు. రాత్రి దాకా గదిలోనే. చదవడం. కాగితాల మీద రాయడం. మర్నాడు ప్రొద్దున్నే లేవలేదు. అమ్మ వచ్చింది. “నేను ఈ రోజు స్కూలుకు వెళ్ళను. రేపు లీవ్ లెటర్ వ్రాసియ్యి” అని ముసుగు వేసుకున్నాడు. తొమ్మిది దాటేక కంప్యూటర్ దెగ్గర కూర్చున్నాడు. మధ్యలో గూగుల్ సెర్చి చేస్తూ, వ్రాస్తూ, మధ్యాహ్నం రెండు వరకు పనిలోనే!! “మేలుజాతి ఆవు గురించి, జీవన ప్రమాణం, ఎన్ని పాలిస్తుంది, ఎన్ని పిల్లల్ని కంటుంది, ఏం పోషకాలతో గ్రాసం ఇవ్వాలి; దాని పేడ, మూత్రం, సహజ ఎరువుగా మార్చే విధానం” – ఇవి ఒక రిపోర్ట్ తయారు చేసేడు. రెండు రోజుల తర్వాత గోపినాథ్ గారు సింగపూర్ నుండి వచ్చేరు. “డాడీ, నేనో రిపోర్ట్ తయారు చేసేను చూడండి” అని ఇచ్చేడు. పిల్లవాని ముఖంలో మూర్తీభవించిన నిజాయితీకి తండ్రికి కొంత ఆశ్చర్యం కలిగింది. “ఏడిసేవులే” అనలేదు. “సరే అక్కడ పెట్టు” అన్నారు. ఆఫీసుకు వెళ్తూ కారులో ఆ పేపర్సు చూసేరు. నీట్‌గా, పధ్ధతిగా,  కంప్యూటర్ ప్రింట్. “ఒక ఆవు వలన ఇన్ని ప్రయోజనాలు. మనం వెంటనే పది ఆవులు కొనాలి. పది ఎకరాల భూమి సంపాదించాలి. ఫార్మ్‌హౌస్ కట్టాలి. నేను, తాతయ్య, బామ్మ అక్కడ ఉంటాము. ఆవులను పెంచి, సేంద్రీయ ఎరువులతో మొక్కలు పెంచుతాను. కూరగాయలు, పళ్లు, మొక్కజొన్న, రాగి, వంటి చిరు ధాన్యాలు పండిస్తాను. ఇజ్రాయెల్ పద్దతిలో బిందు సేద్యం చేస్తాను. అవకాశం ఇవ్వండి”. ఇదీ సారాంశం – గణాంకాలతో సహా. “పిల్లవాడా? కల గంటున్నాడా గాలిలో? భ్రమా?” – గోపినాథ్‌కు అర్థం కాలేదు. ఆఫీసుకు వెళ్లి కంప్యూటర్‌లో చెక్ చేసేడు. హర్ష రిపోర్ట్ సత్య దూరం కాదు. అసాధ్యమసలే కాదు. తన ముఖ్య సలహాదారు, ఆఫీసులో పెద్దాయన రామచంద్ర మేధావి. రిపోర్టు ఆయన చేతిలో పెట్టేడు.

మర్నాడు రామచంద్ర “ఆలోచన గొప్పది. ఆచరణ సంభవమే. దేశ విదేశాలు తిరిగి, ఆఫీసుల్లో వంగి సలాములు చేసే కంటే, భూమి తల్లిని నమ్మి చెడిన వారుండరు” అన్నారు. హుటాహుటిన కార్యాచరణ సాగింది. పన్నెండో తరగతి పరీక్షలవగానే పల్లెకు ప్రయాణం కట్టేడు హర్ష. పొలంలో ఓ చిన్న కుటీరం, ఓ వంట మనిషి. ఒక నమ్మకం గల కుటుంబం హర్షకు తోడున్నారు.

ఏడాది తిరిగేసరికి పశు సంవర్థక శాఖ నిపుణులచే సలహాలు పొందేడు. ఆవుల ఆరోగ్యం, గ్రాసం, రక్షణ, జరిగేయి. మొక్కలు పెంచేడు సేంద్రీయ ఎరువులతో; అవి బాగా పెరిగేయి. మొదట్లో ఇంట్లో అందరికి కమ్మని పాడి, రసాయన ఎరువుల్లేని కూరగాయలు, పళ్లు లభించేయి. విస్తరణ జరిగిన కొద్దీ మనుష్యులు పెరిగేరు. ఇళ్ళు, పక్కా రోడ్లు వచ్చేయి. ప్రక్క గ్రామ అధికారులతో మాట్లాడి తన నగరంతో ఆ ప్రాంతాన్ని అనుసంధానం చేసే రోడ్డు, అభివృద్ధికి పథకాలు వేసేడు హర్ష. తన వాటా ఆర్థిక వనరులు ఇచ్చేడు. ఇలా బి.కామ్. డిగ్రీ చదువు కూడా కొనసాగించేడు ప్రయివేటుగా.

హర్షతో పాటు బామ్మ తాతయ్య వచ్చేరు ఫార్మ్‌హౌస్‌లో నివసించడానికి. వాళ్ల ఆనందం వర్ణనాతీతం. హరిత భరితమైన ఆ ప్రదేశం స్వచ్ఛమైన గాలి, చల్లదనం – బంగ్లాలోని ఏసీ గదులు తేగలవా? వాళ్లిద్దరూ చిన్నపిల్లల్లా పొలమంతా తిరిగి, పనుల్లో సాయపడుతూ, సలహాలిస్తూ, లెక్కలు వేస్తూ, సులువులు చెప్తూ, పగలంతా అలసి పోయి, వేళకు తిని, సుఖ నిద్ర పోతున్నారు.

చిన్న అనారోగ్యాలు, రుగ్మతలు, వాళ్లని వదలి పారిపోయేయి. గోపినాథ్ గారు, నిపుణులను సంప్రదించి, పెద్ద మాల్సుతో కూరగాయలు, పళ్లు, పాడి సప్లై కోసం ఏర్పాట్లు చేసి, కోల్డ్ స్టోరేజిలు, పనివారి కుటుంబాల ఆరోగ్య రక్షణ కోసం ఆస్పత్రి, పిల్లలకు పాఠశాలలు ఏర్పర్చేరు.

సాయంత్రం నాలుగయింది. రంగుల తోరణాల స్వాగతం మధ్య హర్ష లోనికి వచ్చేడు. పాఠశాల ప్రిన్సిపాల్ సాదరంగా వేదికపైకి తీసుకుని వెళ్ళేరు. “వెల్కమ్ టు శ్రీహర్ష. ప్రౌడ్ టు బి ఇన్ ది సేమ్ స్కూల్” అంటూ విద్యార్థులు హర్షధ్వానాలు చేసేరు. సీనియర్ ఆధ్యాపిక సరోజినిదేవి –  తమ చిరు ఉపన్యాసంలో “మన 21వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథి శ్రీహర్షను పరిచయం చేయడానికి ఆనందం, గర్వం కలుగుతున్నాయి. అతనికీ 21 ఏళ్లే. పెద్దగా ఫస్ట్ మార్కులు, ర్యాంకులు రాలేదు; పాఠాలు శ్రద్ధగా విని, ఎన్నో ప్రశ్నలు వేసేవాడని, టీచర్లకు గుర్తు. సైన్సు క్లాసులో “వరదలు ఎందుకు పెరుగుతున్నాయి? నదుల్లో పేరుకుపోయిన చెత్త కదా కారణం? ప్లాస్టిక్ నిషేధాన్ని గట్టిగా అమలు చెయ్యాలి. సౌర శక్తి వినియోగం పెరగాలి. శుభ్రత కూడా” అనేవాడు. సోషల్ క్లాసులో, “అన్ని దేశాల్లో ప్రజలు ఒకప్పుడు పేదవారు. సైన్సు, సాంకేతికత పెరిగి వారి జీవితాలు బాగు పడ్డాయి. మనమే స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు దాటినా ఇలా ఉండిపోయాము. వనరులెన్నో వున్నా దేశం పేదది కాదు. నాయకులు, ప్రజలే పేదలు” అనేవాడు. పదో తరగతిలో ఉండగా శ్రీకారం చుట్టిన ప్రాజెక్టు గత నాలుగేళ్లలో మోడల్ పారిశ్రామికవేత్తగా ఎదగగలిగేడు. వంద పాడి ఆవులు, ఫౌండేషన్లు, కూరగాయలు, చిరుధాన్యాలు పండించే స్థాయి. మన నవ్యాంజలి పాఠశాల నవ్య తేజం – శ్రీ హర్షకు స్వాగతం” అన్నది ఆమె.

శ్రీహర్ష వంతు వచ్చింది. “చిన్నప్పుడు నాన్న పుస్తకాలు తెచ్చేవారు. అవి చదివే వాడిని. మనం చిన్న చిన్న వస్తువులను విదేశాల నుండి ఎందుకు కొనాలి? బాగా చదువుకున్న మన పౌరులు విదేశాలకు ఎందుకు పోతున్నారు?” అని బాధ పడేవాణ్ణి. మొదట ఆవుల కాపరిని, పొలం రైతుగా మారి ప్రస్తుతం యీ స్థాయిలో వున్నాను. ‘ఉచితంగా ఏదీ ఇవ్వకూడదు. ఉపాధి కల్పించాలి’ అన్న గాంధీజీ సూక్తిని నమ్ముతాను. ఉపాధి కల్పించేము. Bill Gates, Oprah Winfrey వంటి మహనీయుల జీవితాలు నన్ను ప్రభావితం చేసేయి. పుస్తక పఠనం, ప్రకృతితో మమేకం పాటిస్తున్నాను. ఇచ్చటి విద్యార్థులను అడుగుతున్నాను. బద్దకం వదిలి  దీక్షగా పని చేయగలరా? ప్రభుత్వమే పోషిస్తుంది అనే ఆలోచన మానండి. మంచి ఆలోచన మంచి పనికి నాంది. రండి. ఈ దేశ గతిని మార్చుదాము. జై హింద్” అన్నాడు. కరతాళ ధ్వనులు మిన్ను ముట్టేయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here