[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత డా. చిత్తర్వు మధు గారి ‘Z సైన్స్ ఫిక్షన్ మరికొన్ని కథలు’ పుస్తకానికి కస్తూరి మురళీకృష్ణ గారు వ్రాసిన ముందుమాట ఇది. [/box]
డాక్టర్ చిత్తర్వు మధు కథల సంపుటి ‘Z -సైన్స్ ఫిక్షన్, మరికొన్ని కథలు’ తెలుగు సాహిత్య ప్రపంచంలో అవశ్యకమైన, ఆహ్వానించదగ్గ కథల సంకలనం. తెలుగు పాఠకులంతా చదవాల్సిన కథలు. ఒకే రకపు మూస కథలు, పేరు గొప్ప ఊరు దిబ్బలాంటి విమర్శకుల ప్రశంసలు ఇబ్బడిముబ్బడిగా అందుకుంటున్నా చదవటానికి చావుయాతన పడాల్సి వచ్చే ‘ఉత్త'(మ) కథల కుప్పల తెప్పల నడుమ ఎడారి నడుమ ‘ఒయాసిస్’ లాంటి కథల సంపుటి ఇది. రచయితలు తమ చుట్టూ గిరిగీసుకుని, విమర్శకులు సైతం కళ్లకు గంతలు కట్టుకుని పరిమిత పరిధిలోనే గుడ్డివాడు నాలుగు గోడల నడుమనే తిరిగినట్టు తిరుగుతూ తెలుగు కథా సాహిత్య పరిధిని సంకుచితం చేస్తున్న తరుణంలో, ఎవరి మెప్పులకు ఆశించక, విస్మరించినా పట్టించుకోక నిజాయితీగా తాను రాయాలనుకున్న విభిన్నమైన కథలను రాయాలనుకున్నట్టు రాస్తూ ముందుకు సాగుతున్న అతితక్కువమంది రచయితలలో డా॥ చిత్తర్వు మధు ఒకరు.
నేను అప్పుడప్పుడే కథలు రాస్తూ, పత్రికలలో ప్రచురితమయ్యే రచనలు చదువుతూ ఆశ్చర్యపోతూ, ఆ రచయితల ప్రతిభకు అచ్చెరువొందుతూ, వారి అదృష్టానికి అసూయ పడుతున్న రోజులలో డాక్టర్ చిత్తర్వు మధు రచనలు నన్ను చాలా ఆకర్షించిన రచనలు. ముఖ్యంగా ప్రేమగాథలు, కుటుంబగాథలే తెలుగులో అధికంగా వస్తున్న సమయంలో వాటి దిశను మళ్లించిన యండమూరి, మల్లాదిల రచనలకు భిన్నంగా కానీ, రొటీన్ రచనల కన్నా విభిన్నంగా చిత్తర్వు మధు సృజించిన ‘బైబై పొలోనియా’, ‘ఐసిసియు’ వంటి రచనలు నన్ను ఆయన అభిమానిగా చేశాయి. తెలుగులో ‘రాబిన్ కుక్’కు దీటుగా నిలబడే రచయితగా నా మనస్సులో ఆయనను నిలిపాయి. అందుకే నేను ‘సృజనస్వరం’ కార్యక్రమంలో రచయితల ఇంటర్వ్యూలు ఆరంభించగానే ఆయనను ఇంటర్వ్యూ చేశాను. అలాగే ‘సంచిక’ వెబ్ పత్రిక ఆరంభించగానే ఆయన నవలను సీరియల్ గా ప్రచురించాను. ఈ సంపుటిలోని అధికశాతం కథలు ‘సంచిక’లో ప్రచురించిన భాగ్యం నాదేనని సగర్వంగా చెప్పగలుగుతున్నాను. అందుకే ఈ పుస్తకానికి ముందుమాట రాయమని ఆయన నన్ను అడగటం నాకు ఎంతో గర్వంగా అనిపించింది. నేను అభిమానించే రచయిత కథలసంపుటికి ముందుమాట రాయటం అరుదైన గౌరవంగా తోస్తోంది.
ఈ సంపుటిలోని కథలన్నీ రొటీన్‌కు భిన్నమైన కథలు. సాంఘిక కథలున్నాయి. మెడికల్ ఫిక్షన్‌గా వర్గీకరణలో ఒదిగే ధీరజ్ ప్రధాన పాత్రధారిగా కల కథలు ఓవైపు పాఠకులకు వైద్యసంబంధిత సమాచారాన్నిస్తూ, సస్పెన్సునూ కలిగిస్తాయి. నిజానికి ధీరజ్ ప్రధాన పాత్రగా మరిన్ని మెడికల్ ఫిక్షన్ కథలను రచిస్తే ఇవన్నీ ప్రత్యేక కథలుగా ఓ సంపుటిని ప్రచురించవచ్చు. స్వయానా డాక్టర్ కావటంతో ఇది అంత పెద్ద కష్టం కూడా కాదు. చిత్తర్వు మధు ఈ వైపు దృష్టి సారిస్తే తెలుగు కథాసరస్వతి మెడనలంకరించే విభిన్న కథామాలికలో ఒక విభిన్నమైన పుష్పం చేరినట్టవుతుంది.
అధికంగా ఈ సంపుటిలో సైన్స్ ఫిక్షన్ కథలున్నాయి. ‘జాంబీ’లు అంటే మరణించిన జీవచ్ఛవాలలాంటి వాటిని ప్రస్తావించిన తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ కథ ‘Z’ సంపుటిలో ఉంది. అలాగే రోబో డాగ్స్, పారలల్ యూనివర్స్, న్యూట్రాన్ వంటి తెలుగువారికి పరిచయం లేని అనేక వైజ్ఞానిక అంశాలను పరిచయం చేసే సస్పెన్స్ సైన్స్ ఫిక్షన్ కథలు ఈ సంపుటిలో ఉన్నాయి. ఇక్కడ మనం ఓ విషయం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది.
ప్రపంచ సాహిత్యంలో సైన్స్ ఫిక్షన్ ఒక మహావృక్షంలా ఎదిగింది. కానీ తెలుగు సాహిత్యంలో సైన్స్ ఫిక్షన్ ఇంకా రెండు మూడు ఆకులతో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చిన్ని మొక్క స్థాయిలోనే ఉంది. దీనికి పలు కారణాలు. విమర్శకులు సామాజిక స్పృహ అన్నది తప్ప మరొకదాన్ని చూడలేని గుడ్డితనంతో ఉండటం, పాఠకులలో ‘సైన్స్ స్పృహ’ అధికంగా లేకపోవటం, రచయితలు సైతం ప్రధానంగా ఉద్యమకారులు, ఎకాడమీషియన్లు కావటమో లేక మెప్పు పొందే రచనలు చేసి గుర్తింపు కోసం తాపత్రయపడటం వల్లనో తెలుగులో సైన్స్ ఫిక్షన్ కథలు రాలేదు. సైన్స్ ఫిక్షన్‌గా గుర్తింపు పొందిన గుప్పెడు కథల్లోనూ సైన్స్ ఫిక్షన్ ప్రామాణికాలతో చూస్తే నిలిచే కథలు తక్కువే. ఇలాంటి పరిస్థితిలో తెలుగులో సైన్స్ ఫిక్షన్ రాయటం అంటే రచయితకు పట్టుదల, దీక్షలతోపాటు ఎవరి మెప్పును, పొగడ్తను, గుర్తింపును ఆశించని నిర్మోహత్వంతోపాటు, అందరూ విస్మరిస్తున్నా, విమర్శిస్తున్నా ఒక తపస్సులా రచనను కొనసాగించే నిబద్ధత ఉండాలి. పైగా రచనలో ప్రస్తావించే అంశాలు పాఠకులకు పరిచయం లేనివి కాబట్టి, పరిచయం లేని వైజ్ఞానిక అంశాలను పాఠకులకు వివరిస్తూనే, పాఠం చెప్పినట్టు కాక ఆసక్తికరంగా వివరిస్తూ, కథను ముందుకు నడపాలి. అంటే కథాగమనం దెబ్బతినకండా వైజ్ఞానిక అంశాలను వివరిస్తూ రచనను సృజించాలన్నమాట! కత్తిమీద సాములాంటి ఈ పని అందరికీ సాధ్యం కాదు. అది సాధ్యమైన అరుదైన తెలుగు సైన్స్ ఫిక్షన్ రచయిత చిత్తర్వు మధు. అందుకు ఈ సంపుటిలోని సైన్స్ ఫిక్షన్ కథలు నిదర్శనాలు.
సైన్స్ ఫిక్షన్ కథాసాహిత్యం కాదనీ, సైన్స్ ఫిక్షన్ కథలలో సామాజిక స్పృహ ఉండదనీ, వాటిని చదవకుండానే తీసిపారేసే కళ్లకు గంతల, రంగుటద్దాల సాహిత్య పెద్దలు ఈ కథలు చదివి సామాజిక స్పృహ మామూలు కథలలో కన్నా సైన్స్ ఫిక్షన్‌లోనే అత్యంత అద్భుతంగా, స్వేచ్ఛగా, నిక్కచ్చిగా ప్రదర్శితమవుతుందని అర్థం చేసుకోవాలి. మామూలు కథల రచనల్లో ప్రదర్శించలేని నిక్కచ్చితనం సైన్స్ ఫిక్షన్ కథలలో రచయితలకు ప్రదర్శించే వీలు చిక్కుతుంది. మామూలుగా అందరి మనోభావాలు దెబ్బతినే అంశాలను అత్యంత సృజనాత్మకంగా, నిజాయితీగా ప్రదర్శించే వెసులుబాటు సైన్స్ ఫిక్షన్ రచనల్లో లభిస్తుంది. ఇందుకు ఈ సంపుటిలో ప్రదర్శితమైన అనేక విభిన్నమైన, సంక్లిష్టమైన సామాజికాంశాలు ఉదాహరణలుగా నిలుస్తాయి. ప్రజల్ని పీల్చే కార్పొరేట్ ఆస్పత్రులలోని అక్రమాలు, అన్యాయాలు, రీసెర్చి పేరుతో సమాజాన్ని అల్లకల్లోలం చేసే అంశాలు, సైన్స్ అభివృద్ధి తప్పుదారి పడితే కలిగే భయంకరమైన పరిణామాలు, భూఆకలి సృష్టించే విపరీతాలు, పర్యావరణ సమస్యలు, మానవ సంబంధాలలో మారుతున్న సామాజిక, సాంకేతిక పరిస్థితులవల్ల కలుగుతున్న మార్పులు ప్రదర్శిస్తూ, భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచనప్రాయంగా ప్రదర్శిస్తూ, రాబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు సమాజాన్ని మానసికంగా సిద్ధం చేయగల శక్తి కలవి సైన్స్ ఫిక్షన్ కథలు. ఈ కథలను విస్మరించటం అంటే గుడ్డివాడు వజ్రాలను రాళ్లనుకొని పారేయటమే. ఆధునిక సమాజానికి అత్యంత అక్కరకు వచ్చే సృజనాత్మక ప్రక్రియ సైన్స్ ఫిక్షన్ కథారచన. ఈ సత్యాన్ని నిరూపిస్తాయి ఈ సంపుటిలోని కథలు. రచయిత తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు. ఇప్పుడు పాఠకులు రచయితకు ప్రోత్సాహాన్నిచ్చి తమ బాధ్యత నిర్వహించాలి.
ఇలాంటి విభిన్నమైన కథలను విశిష్టంగా రచించిన చిత్తర్వు మధును అభినందించక తప్పదు. ఎవరెంతగా నిరాశపరచినా, నిరాశకు తావివ్వక తన కర్తవ్యాన్ని నిర్మోహంగా నిర్వర్తిస్తున్నందుకు అభినందిస్తూ భవిష్యత్తులో మంచి విభిన్నమైన రచనలను విస్తృతంగా, విశిష్టంగా సృజించాలని మనవి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి వల్ల ఈనాడు తన కథలను పాఠకులకు చేరువ చేసే వీలు రచయితలకు లభిస్తోంది. గతంలోలా మీడియా అండ, విమర్శకుల నీడ, సాహిత్య మాఫియా పెద్దల ఛత్రఛాయ లేకపోతే రచయితలు మనలేని దుస్థితి ఈనాడు రచయితలకు లేదు. కాబట్టి చిత్తర్వు మధు మరిన్ని రచనలు చేయాలని, ఆయనని ఆదర్శంగా తీసుకుని యువరచయితలు విభిన్నమైన రచనలు చేయాలని, తద్వారా తెలుగు కథా సాహిత్యంలో సైన్స్ ఫిక్షన్ మహావృక్షంలా ఎదిగి దశదిశలా విస్తరించాలన్న ఆశాభావం వ్యక్తపరుస్తూ, అందుకు ఈ కథలసంపుటి నాందీ ప్రస్తావన కావాలని ఆశిస్తున్నాను. కథలసంపుటిలోని కథలు చదవండి. ఆలోచించండి. రచయితను అభినందించి, ఉత్సాహ ప్రోత్సాహాలనివ్వండి.
***
డా. చిత్తర్వు మధు
జెవి పబ్లికేషన్స్,
పేజీలు: 264,
వెల: రూ.150
ప్రతులకు:
డా. చిత్తర్వు మధు,
విజయ మెడికల్ అండ్ హార్ట్ క్లినిక్,
2-2-23/2, ఎస్‌బిహెచ్ కాలనీ,
సిటిఐ వెనుక, బాగ్ అంబర్ పేట్,
హైదరాబాద్ – 500 013
ఫోన్: 9848044126
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు