విలక్షణ కథల సమాహారం – ‘Z’

0
2

[dropcap]వృ[/dropcap]త్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన చిత్తర్వు మధు తాజా కథాసంపుటి – ‘Z సైన్స్ ఫిక్షన్ మరికొన్ని కథలు’.

‘సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ’ విభాగంలో పన్నెండు కథలు, ‘మెడికల్ ఫిక్షన్’ విభాగంలో అయిదు, ‘నాన్ సైఫీ’ విభాగంలో రెండు మొత్తం 19 కథలున్నాయి ఈ పుస్తకంలో. ఇవన్నీ వేటికవే విభిన్నమైన కథలు.

సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ:

శాస్త్రవేత్తలు, ఔషధ కంపెనీలు ధనకాంక్షకి లొంగిపోతే, ప్రయోగాలు వికటించి ఒక ఊరు ఊరంతా జీవచ్ఛవాలుగా, నరమాంస భక్షకులుగా మారిపోతే, వైరస్ వ్యాపిస్తుంటే – ఎంత భయంకరంగా ఉంటుందో ‘Z’ కథ చెబుతుంది.

మిలియన్ డాలర్లు సంపాదించాలనీ, అమితమైన కీర్తి ప్రతిష్ఠలు పొందాలని ఆశపడిన ఓ డాక్టరు తయారు చేసిన కొత్తమందు వికటించి ఆ ప్రయోగశాల చుట్టూ ఉండే కోయగూడెం వారిని జాంబీలుగా మార్చేస్తుంది. ఆ డాక్టర్, ఆ మందు ఫార్ములా కోసం ఆశపడిన ఓ లేడీ డాక్టర్ ఆ జాంబీల చేతిలోనే మరణిస్తారు ‘కొత్తమందు’ కథలో.

వేరే గ్రహానికి చెందిన రాక్షస బొద్దింకలు అనుకోకుండా భూగ్రహంలో ప్రవేశించి, హైదరాబాద్‌లోని ఓ పాతబడిన ఇంట్లో దాక్కుని, వాటి శక్తితో మనుషుల్ని వశం చేసుకుని వారి రక్తం పీల్చి చంపేస్తుంటాయి ‘రోఛెస్’ కథలో. గగుర్పాటు కలిగిస్తుందీ కథ.

రైలు ప్రమాదంలో మరణించి, అంత్యక్రియలకై ఎదురుచూస్తూ, అవి పూర్తయ్యేదాక దెయ్యాలై మిగిలిన నలుగురి స్నేహితుల కథ ‘ఆనందభవన్’.

మనిషి మెదడు అమర్చిన మగ రోబో, ఆడ రోబో (హ్యుమనాయిడ్లు) ప్రేమలో పడితే ఏమవుతుందో ‘రూబీ! ఐ లవ్ యు!’ కథ చెబుతుంది.

అంతరాలు అధికమైన సమాజంలో ఉన్నవాడిని దోచి పేదలకి పెట్టాలన్న ఆలోచన చేసిన ఓ బృందం ప్రయత్నం విఫలమై రోబో డాగ్స్ బారినపడిన వైనం ‘జాగిలాలు’ కథ చెబుతుంది.

మ్యుటెంట్‌ల జీవితం ఎలా ఉంటుందో వివరిస్తుంది ‘నీలికొండలు’ కథ.

ఐఓటి – ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ – హ్యాకర్ల బారిన పడితే ఎంత ప్రమాదమో; స్వార్థం, డబ్బు మీద ఆశతో కొందరు ఎంతటి నీచానికి దిగజారుతారో ‘జాలం’ కథ చెబుతుంది.

కాలం ఒక వలయమని, ఆ వలయంలో ముందుకు/వెనక్కు వెళ్ళగలిగితే జీవితాలు ఎలా మారే అవకాశముంటుందో ‘వలయం’ కథలో తెలుస్తుంది.

ఎక్కడో దూరాన కెప్లర్ గ్రహానికి ఉన్న ఇద్దరు సూర్యుళ్ళు ఒకేసారి కాంతిహీనమై చీకట్లు వ్యాపిస్తే ఏర్పడే ప్రళయం ఎలా ఉంటుందో ‘నక్షత్ర భరిణె’ కథ చెబుతుంది.

కుజగ్రహం మీద మిస్ అయిన వ్యోమగామి సజీవంగా ఉన్నాడని తెలియడంతో, అతన్ని క్షేమంగా వ్యోమనౌకలోకి, అక్కడ్నించి భూమికి తీసుకొచ్చిన వైనం ‘అంగారకం’ కథలో చదవవచ్చు.

ఓ హంతకుడిని వెంటాడుతూ వెళ్ళిన ఓ పోలీస్ అధికారి – ‘ఉందని భావించబడే పారల్లల్ యూనివర్స్’లోకి ప్రవేశిస్తే అతని అనుభవాలు ఎలా ఉంటాయో ‘సమాంతరం’ కథ చెబుతుంది.

మెడికల్ ఫిక్షన్:

తాను అభిమానించే కవి కొన ఊపిరితో తన వద్దకు వస్తే అతనికి చికిత్స చేసిన డాక్టర్ అంతరంగ మథనం ‘డి.ఎన్.ఆర్.’ కథ. ఆ కవి రాసిన కవితలను ఓ అభిమానిగా మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకుని, ఓ వ్యక్తిగా ఆయన జీవితం తారుమారైనందుకు బాధపడతాడు డాక్టర్.

“తాను డ్యూటీ సిన్సియర్‌గా చేస్తూనే ఉన్నా, ఎక్కడ నిలిచిపోయాడో అక్కడే వున్నాడు. తన జీవన విధానాన్ని మార్చుకోవాలా?” అనుకునే ఓ వైద్యుడి అంతరంగ మథనాన్ని చిత్రించిన కథ ‘నిర్ణయం’.

ఓ హాస్పిటల్లో డాక్టరుగా ధీరజ్ ఇమడలేకపోవడానికి కారణమేమిటో ‘ప్రెజెంటేషన్’ కథ చెబుతుంది. ఆ హాస్పిటల్లో పని మానేసిన డాక్టర్ ధీరజ్‌ని తిరిగి ఆ హాస్పటల్ యాజమాన్యమే ఎందుకు పిలిచి ఉద్యోగం ఇచ్చిందో ‘పునరాగమనం’ కథ చెబుతుంది.

తన వ్యాధి నిర్ధారణ సరైనదేనని నిరూపించడం కోసం రాష్ట్ర మంత్రితోనే వాదించి, తన నిర్ణయమే నిజమని నిరూపించిన వైద్యుని కథ ‘అర్ధరాత్రి కవతలవైపు’ .

నాన్ సైఫీ:

పూణేలో ఒక వైద్యకళాశాల ప్రమాణాల తనిఖీకి వెళ్ళిన డా. మానస్ తిరుగు ప్రయాణం కోసం చాలా సేపు విమానాశ్రయంలో చిక్కుకుపోవాల్సి వస్తుంది. విమానాశ్రయంలో పరిచయమైన ఓ యువతి అతనికి మధుర స్వప్నాలను, పీడకలల్ని కల్గిస్తుంది. ఆసక్తిగా చదివించే కథ ‘ఎయిర్ పోర్ట్’.

“కాలచక్రం గిర్రున తిరిగి ఓ క్షణం ఒక్కొక్క చోట ఆగుతుంది. అప్పుడు భావాలు, ఆలోచనలు కూడా ఓ క్షణం ఘనీభవిస్తాయి” అని ‘ఆఖరిపద్యం’ కథ చెబుతుంది. కులం పేరిట చేసే దారుణాలు కుటుంబాలకు ఎంతటి వ్యథని మిగుల్చుతాయో ఈ కథ చెబుతుంది.

ఈ కథలు వైవిధ్యభరితమైన అనుభవాలను కలిగిస్తాయి. విభిన్నమైన, విశిష్టమైన ఈ కథా సంకలనం పాఠకులను ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు.

***

Z సైన్స్ ఫిక్షన్ మరికొన్ని కథలు
డా. చిత్తర్వు మధు
జెవి పబ్లికేషన్స్,
పేజీలు: 264, వెల: రూ.150
ప్రతులకు:
డా. చిత్తర్వు మధు,
విజయ మెడికల్ అండ్ హార్ట్ క్లినిక్,
2-2-23/2, ఎస్‌బిహెచ్ కాలనీ,
సిటిఐ వెనుక, బాగ్ అంబర్ పేట్,
హైదరాబాద్ – 500 013
ఫోన్: 9848044126
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here