Site icon Sanchika

జీరో: అసంపూర్తి పాత్రల అసంపూర్ణ చిత్రణ

[box type=’note’ fontsize=’16’] “వొక సినెమాగా జీరో మనసుకు హత్తుకోదు. ఇంతకంటే బాగా తీయగల కథ, కాని షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ కారణంగా అలా రూపుదిద్దుకోలేదేమో” అంటున్నారు పరేష్. ఎన్ దోషి “జీరో” సినిమాని సమీక్షిస్తూ. [/box]

“తను వెడ్స్ మను” లాంటి వంక పెట్టలేని చిత్రాలు అందించిన ఆనంద్ ఎల్ రాయ్ చిత్రం ఇది “జీరో”. మరుగుజ్జు అనతగ్గ వో పొట్టివాణ్ణి నాయకుడుగా, సెరెబ్రల్ పాల్సి తో బాధ పడుతూ, చక్రాలబండికి పరిమితమైన సైంటిస్టు ని నాయికగా పెట్టినప్పటికీ ఆ కొత్తదనం వున్నా, మొత్తం మీద ఈ చిత్రం అంతంగా సంతృప్తిపరచదు. మరుగుజ్జుగా ఇదివరకు మనం కమల్ హాసన్ ని సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో “విచిత్ర సోదరులు”లో చూశాము. అలాగే సెరెబ్రల్ పాల్సి తో బాధపడుతున్న నటిగా కల్కి కేక్లాఁ ని “మార్గరెటా విథ్ ఎ స్ట్రా” లో చూశాము. రెండూ రెండు చాలా బాగా వచ్చిన చిత్రాలు. ఇది కూడా ఇంతకంటే బాగా తీయగల కథ, కాని షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ కారణంగా అలా రూపుదిద్దుకోలేదేమో.

సరే క్లుప్తంగా కథ చూద్దాం. మీరట్ లో 38యేళ్ళ బౌవా సింఘ్‌కి తను పొట్టిగా వున్న కారణంగా సరైన సంబంధం దొరకని అవివాహితుడు. కలలు మాత్రం బబిత (కత్రినా కైఫ్) లాంటి అమ్మాయి భార్యగా రావాలని కంటుంటాడు. మేట్రిమోనియల్స్ లో అతను దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ ఉపయోగం వుండదు. అలాంటప్పుడు అక్కడే అతని చేతికి ఆఫియా (అనుష్కా శర్మ) ఫొటో వస్తుంది. అక్కడి మేనేజర్ చెబుతాడు కూడా, నీకు సరైన సంబధం కాదు ఆమె వూరికే వూగిపోతూ వుంటుంది అని. కానీ ఇవేవీ వినే స్థితిలో వుండడు బౌవా. ఆమెను వెతుక్కుటూ వెళ్తే తెలుస్తుంది : నాసా లాంటి సంస్థలో సైంటిస్టుగా చేస్తున్న ఆమె సెరెబ్రల్ పాల్సి తో బాధపడుతూ చక్రాలబండి సాయంతోనే కదలగల అమ్మాయి అని. పది పాసైన అబ్బాయి, రాకెట్ సైంటిస్టు అమ్మాయి ల మధ్య ప్రేమ చాలా సినెమేటిక్ గా జరిగిపోతుంది. కొన్ని నెల్ల సావాసం తర్వాత వాళ్ళకు పెళ్ళి కూడా నిశ్చయం అవుతుంది. ఇదివరకెప్పుడో వొక డాన్స్ షో కి అతను దరఖాస్తు పెట్టి వుంటాడు. అందులో లాటరీ పధ్ధతిలో యెన్నుకోబడిన అభ్యర్థులలో విజేతకు బబితను కలుసుకునే అవకాశం వుంటుంది. పెళ్ళి పందిట్లోనే బౌవాకి తను యెన్నికైనట్లు తెలుస్తుంది. అంతే నాటకీయంగా పెళ్ళి పందిరి నుంచి పారిపోతాడు. ఆ పోటీలో కూడా నెగ్గి బబితను కలుసుకోగలుగుతాడు. తన బాయ్ ఫ్రెండ్ ఆదిత్య చేసిన మోసం కారణంగా మనసు క్రుంగి పోయిన బబిత బౌవాకు చేరువవుతుంది. అలా కొన్నాళ్ళు గడిచాక ఆఫియా గురించిన విషయం తెలిసి బబిత బౌవాకి తనపట్ల వున్న మనసు విరిగేలా ప్రవర్తిస్తుంది. పశ్చాత్తాపంతో న్యూ యార్కులో వున్న ఆఫియా దగ్గరికెళ్తాడు బౌవా. ఆమె అతన్ని కలవ నిరాకరిస్తుంది. బౌవా కి ఇంకో ఆశ్చర్యకర సంగతి తెలుస్తుంది. తనకూ ఆఫియాకూ వో మగబిడ్డ కలిగిందని. ఆమెకు దగ్గర అవ్వాలన్న అతని ప్రయత్నాలు ఫలించవు. ఆఫియా వివాహం శ్రీనివాసన్ (మాధవన్) తో కావాల్సి వుంటుంది. అక్కడ వో రాకెట్టును, మార్స్ కు పంపే ప్రయోగం జరుగుతూ వుంటుంది. అందులో పంపడానికి వో చింపాంజీని కూడా శిక్షణ ఇచ్చి తయారు చేసి వుంటారు. మళ్ళీ నాటకీయంగా మార్స్ కు పంపాలనుకున్న మనుషుల యెంపికలో అతను అన్ని పరీక్షల్లో నిగ్గుతేలి యెన్నికవుతాడు. చివరికి శిక్షణ పూర్తి చేసుకుని మార్స్ కు వెళ్తాడు కూడా. కాకపోతే తిరుగుప్రయాణంలో అతని అంతరిక్ష వాహనం ప్రమాదవశాత్తు కనపడక మాయమవుతుంది. పదిహేనేళ్ళ తర్వాత చైనీసు అంతరిక్ష కేంద్రానికి సిగ్నల్స్ అంది, అతని అంతరిక్ష వాహనం సముద్రంలో పడిందని తెలుస్తుంది. అయితే బతికే వున్న బౌవాకి వయసు మాత్రం పెరిగి వుండదు.

షారుఖ్ వుంటే ఆ మార్క్ వున్న సంభాషణలు, సీన్లు, హీరోయిజాలు అన్నీ వుండాల్సిందే. ఇందులోనూ వున్నాయి. అందుకే అతని నటన కూడా మిగతా చిత్రాలలో మాదిరిగానే వుంది తప్ప కొత్తగా యేమీ కనబడదు. అతను ప్రజలకు వినోదం పంచడంలో ఆరితేరినవాడు కాబట్టి ఇందులో కూడా అదే పని చేస్తాడు. కాని వొక సినెమాగా జీరో మనసుకు హత్తుకోదు. సెరెబ్రల్ పాల్సి తో బాధపడుతున్న అనుష్కా శర్మ నటన బాగుంది. తెర మీద అందాలరాణి, తెర వెనుక విషాదాలను మోసే పాత్రలో కత్రినా కూడా బాగా నటించింది. యెటొచ్చి చాలా విషయాలు కథలో తీసుకుని, సరైన న్యాయం చేయక నిరుత్సాహపరుస్తాడు దర్శకుడు. అందునా చిత్రం నిడివి కూడా తక్కువేం కాదు. అజయ్ అతుల్ సంగీతం బాగుంది. ఇక పెద్దగా చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు.

Exit mobile version