కాజాల్లాంటి బాజాలు-83: జుంబా డాన్స్ – ఆన్‌లైన్ క్లాస్‌లో..

2
2

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఈ[/dropcap]మధ్య ఓ నెల్లాళ్ల కోసం మా అమ్మాయింటికి వెళ్ళేను. మనవడు వంశీ మూడో క్లాసు చదువుతున్నాడు. ఏడాదినుంచీ అన్ని స్కూళ్ళూ, ఆఫీసులూ ఆన్‌లైన్‌లో నడుస్తున్నాయని అందరికీ తెలిసిన విషయమే. దానివల్ల ఇంట్లో ఆడవాళ్ళకి పనెక్కువయిందన్న విషయవూ లోక విదితమే.

మా అమ్మాయి కూడా అంతే. ఇటు తన ఉద్యోగం, అటు మొగుడికి అందింపులు, ఇంకోవైపు వంశీని ఆ ఐపాడ్ ముందు కూర్చోబెట్టి, దాన్నెలా వాడుకోవాలో మధ్య మధ్య వాడికి చెపుతుండడం, ఇంటి పనీ, వంటపనీ అన్నింటితో సతమతమైపోడం చూసి నా మనసుకి కష్టమనిపించింది. ఏదైనా సాయం చేద్దామన్నా నాకు ఆ ఐపాడ్‌లూ, లాప్‌టాప్‌ల గురించి తెలీదాయె. అందుకే నాకు వచ్చిన పని వంట మటుకు చేసేసి, ఆ కాస్త శ్రమా మా అమ్మాయికి తప్పించేదాన్ని. అది కూడా తొమ్మిదయేసరికి అయిపోవాలి. ఆ తర్వాత కుక్కర్ సౌండ్, మిక్సీ సౌండ్ వినపడకూడదు. అదేవిటో నేను పోపేస్తే ఆ చిటపటలు కూడా వాళ్ల పనికి అడ్దమయేవి. అందుకని పొద్దున్నే వంట పూర్తి చేసేసుకుని అప్పుడు దేవుడి ముందు కూర్చునేదాన్ని.

అదేం ఖర్మో.. టీవీ పెట్టుకుందుకు కూడా లేదు కదా.. కావాలంటే సౌండ్ లేకుండా పెట్టుకోమని మా అమ్మాయి పర్మిషనిచ్చినా నాకేవిటో అలా నచ్చక దేవుడి దగ్గరే ఇంకాసేపు కూర్చుని మరో రెండు అష్టోత్తరాలు చదువుకునేదాన్ని నెమ్మదిగా.

పగలంతా ఇలా గడిచిపోయేక సాయంత్రమేనా కాసేపు అమ్మాయితో కబుర్లు చెప్పుకుందామనుకుంటే ఆ టైమ్‌లో వంశీ ప్రాజెక్ట్ కోసం ఏవో కొనాలంటూ షాప్‌కి వెళ్ళి, అట్టముక్కలూ అవీ తెచ్చుకుని, ఏదో బొమ్మో, బిల్డింగో తయారుచేసి మర్నాడు వంశీ క్లాసులో చూపించడానికి రెడీ చెయ్యాల్సొచ్చేది మా అమ్మాయికి.

ఇంకోరోజు ఇంకో ప్రాజెక్టుట.. విత్తనాలు ఓ మట్టికుండీలో వేసి అవి ఎన్ని రోజులకి మొలకలెత్తేయో, రోజూ ఎంతెత్తు పెరిగేయో కొలిచి, వాటిని ఫొటోలు తీసి పెట్టాలిట. ఇవెక్కడి చదువులండీ.. మూడోక్లాసు చదివే పిల్లాడు ఇవన్నీ ఎక్కడ చెయ్యగలడూ! చెయ్యలేడు.. ఇంక వాళ్ళమ్మకి చెయ్యక తప్పదు. ఖర్మకాలి ఆ అమ్మ చేసిన ప్రాజెక్ట్ సరిగ్గా రాకపోతే పిల్లాడికి మార్కులు తగ్గిపోతాయి.

అయినా చదువంటే తెలుగు పద్యాలు, ఇంగ్లీషు స్పెల్లింగులూ, లెక్కల్లో ఎక్కాలూ చెప్పాలి కానీ ఇలా బిల్డింగులు కట్టండీ, మొక్కలు పెంచండీ అనడవేవిటీ.. హేవిటో.. నాకేవీ అర్థం కాలేదు. చదువుకునేది పిల్లాడా…వాళ్ళమ్మా.. ఇంతలా నలిగిపోతున్న మా అమ్మాయిని చూడలేక ఆ స్కూల్ వాళ్లని తిట్టడం మొదలెట్టేను.

నా తిట్లు ఆపి మా అమ్మాయి నాకు అన్నీ వివరంగా చెప్పింది. స్కూల్లో లెక్కలూ, ఇంగ్లీషులతోపాటు ఇలాంటి ఎక్స్‌ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయిట. దానివల్ల పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుందిట. అందులో పిల్లలకి ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చుట. మా మనవడు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్శ్ తీసుకున్నాడుట. అందుకని అన్నీ ఇలాంటి నిర్మాణాత్మకమైన ప్రాజెక్ట్సే ఇస్తున్నారుట.

“ఇవి కాక ఇంకేవుంటాయి తీసుకుందుకూ” అనడిగేను.

“చాలా ఉంటాయి.. పెయింటింగూ, మ్యూజిక్కూ, డేన్సూలాంటివన్నీ ఉంటాయి.”

“అయితే ఎంచక్కా పాటలు నేర్చుకోమను.. నీకీ గొడవుండదు..” అన్నాను.

“అబ్బ.. అమ్మా.. మనం పిల్లల్ని అలా ఆజ్ఞాపించకూడదు. వాళ్లకి ఎందులో ఇంటరెస్ట్ వుందో అదే నేర్పించాలి. మన ఇష్టాలు వాళ్లమీద రుద్దకూడదు.” అంది మా అమ్మాయి.

ఏవిటో.. నలుగురు పిల్లల్ని పెంచేను.. ఏం పెడితే అది తినేవారు.. ఎలా చెప్తే అలా వినేవాళ్ళు. ఒక్క పిల్లాడిని పెంచడానికి వీళ్ళు సైకాలజీ పుస్తకాలన్నీ చదివేస్తున్నారు. నిష్ఠూరంగా రాబోయిన మాటని గొంతులోనే ఆపుకుని, ఇంక మా అమ్మాయికి చెప్పి లాభం లేదని మనవడిని దగ్గర కూర్చోబెట్టుకుని, బెల్లమ్ముక్క చెతిలో పెట్టి నెమ్మదిగా చెప్పడం మొదలెట్టేను.

“ఒరే నాన్నా.. ఈ పిచ్చి బొమ్మలూ, మొక్కలూ ఎందుకురా.. ఎంచక్క పాటలు పాడడం నేర్చుకో బాగుంటుంది..” అని.

“పాటలు బాగుండ వమ్మమ్మా..” అన్నాడు వాడు ఏమాత్రం మొహమాటం లేకుండా..

ఆశ్చర్యపోయేను.. ఎందుకు బాగుండవని నేనడిగినదానికి వాడిచ్చిన జవాబిదీ..

“ఆ పాటలు చెప్పే మిస్‌కి ఇద్దరు పిల్లలున్నారు. స్కూల్లో జరిగే అన్ని ఫంక్షన్లకీ వాళ్ల చేతే పాడిస్తుంది. మిగిలినవాళ్లకి అసలేవీ చెప్పదు..”

వార్నీ.. వేలెడంతలేడు.. వీడికప్పుడే ఇంత అవగాహనుందా అనిపించింది. అందుకే వీళ్ళని పెంచడానికి అమ్మల కిన్ని తిప్పలు అనుకున్నాను. అయినా సరే నా పట్టు వదలకూడదనుకుంటూ “పోనీ…డేన్సు నేర్చుకో..” అన్నాను.

వాడి మొహం విచ్చుకుంది..”ఓ.. అలాగే.. ఇప్పుడే మామ్‌తో చెప్తాను..” అంటూ పరుగెత్తేడు. హమ్మయ్య.. ఆ టీచరేదో డేన్సు చెప్తుంది, వీడు నేర్చుకుంటాడూ.. ఇంక అమ్మాయికి ఆ ప్రాజెక్ట్ ల పని తగ్గుతుందీ అని సంతోషపడిపోయేను.

మనవడు కూచిపూడి నాట్యం నేర్చేసుకుని వెంపటి చినసత్యంగారంత గొప్పవాడైపోతాడని సంతోషపడిపోతూ

“ఇంతకీ ఆ స్కూల్లో కూచిపూడి నేర్పుతారా లేపోతే భరతనాట్యవా..” అనడిగేను మా అమ్మాయిని.

“అవేవీ కాదమ్మా.. వీడు జుంబా డేన్స్ నేర్చుకుంటానని చెప్పేడు వాళ్లకి..” అంది మా అమ్మాయి.

నాకు తల తిరిగిపోయింది. ఒక్కసారిగా నాకు అదేదో సినిమాలో వెంకటేష్ “జుంబారే ఆ జుంబరే… జుంబారే ఆ జుంబరే..” అంటూ అడవి మనుషుల్లాంటి వాళ్లతో చేసిన డేన్స్ గుర్తొచ్చింది. అంటే రేప్పొద్దున్న వంశీ కూడా నడుముకి ఆకులూ గట్రా కట్టుకుని, కత్తులూ, బల్లాలూ పట్టుకుని అలాంటి అడివి డేన్స్ చేస్తాడేమోననే అనుమానం వచ్చేసింది. దాన్ని కడుపులో ఆపుకోలేక మా అమ్మాయి దగ్గర కక్కేసేను. అది నావైపు వింతగా చూసింది.

“జుంబా డేన్సంటే అడివి మనుషులు చేసే డేన్స్ కాదమ్మా.. తొంభైలలో, కొలంబియాలో ఆల్బర్టో పెర్వెజ్ అనే కొరియోగ్రాఫర్ ఎయిరోబిక్స్ చెప్పేవాడు. ఒకరోజు అతను రోజూ వాయించే మ్యూజిక్ మర్చిపోయేడు. అందుకని అతను తన బాక్ పాక్ లో వున్న సల్సా, మెరింగూ డేన్సుల టేపులు తీసి, రెండూ కలిపేసి ఈ జుంబా డేన్సు కనిపెట్టేడు. అప్పట్నించీ వందకి పైగా దేశాలు ఈ డేన్సుని గుర్తించి, సల్సా, బచటాలాంటి లాటిన్, ఇంటర్నేషనల్ దరువుల్లో దీనిని ప్రోత్సహిస్తున్నాయి. ముందు ఈ డేన్సుని పొట్ట తగ్గడానికి నేర్చుకునేవారుట.. తర్వాత్తర్వాత ఎయిరోబిక్స్ లాగా చేస్తున్నారుట”

నాకేవిటో గ్రీక్ అండ్ లాటిన్ విన్నట్టు ఒఖ్ఖ ముక్క అర్ధమయితే ఒట్టు. ఏదైతే నాకేం.. మా అమ్మాయికి పని తప్పితే చాలనుకున్నాను.

ఆ మర్నాడు పొద్దున్న తొమ్మిదయేసరికి నేను దేవుడిముందూ, మా వంశీ ఐపాడ్ ముందూ సెటిలైపోయేం.

కాసేపటికి వంశీ రూమ్ లోంచి గట్టిగట్టిగా కేకలు వినిపించేయి. ఆత్రంగా వెళ్ళి చూద్దును కదా…వంశీ నిలబడి గట్టిగా అరుస్తున్నాడు. వాడితోపాటు ఎదురుగా వున్న స్క్రీన్ మీద పిల్లలు కూడా అరుస్తూ కనిపించేరు. కాస్త లోపలికెళ్ళి గమనిస్తే స్క్రీన్ మీద టీచర్ ఒక మంచంమీద బాసింపట్టు వేసుకుని కుదిమట్టంగా కూర్చునుంది. ఆవిడ పక్కన వీడియోలో కొంతమంది స్టేజి మీద డేన్సు చేస్తున్నట్లుంది. అది డేన్సులా లేదు. ఏవో ఎక్సరసైజులు చేస్తున్నట్టుంది. ఏమాట కామాటే చెప్పుకోవాలి.. ఆ టీచర్ కాస్త తూకంగానే వుంది. ఆవిడ మంచం మధ్యలో స్థిమితంగా కూర్చుని, పిల్లలకి డేన్సు వీడియో పెట్టేసి, అది చూసి డేన్సు నేర్చుకోమని చెప్పినట్లుంది.. ఇంక పిల్లలు ఒకటే గోల..

“టీచర్.. యూ డేన్స్ టీచర్.. యూ షో అజ్ టీచర్..” అంటూ ఆపకుండా కేకలు పెడుతున్నారు పిల్లలు.

ఆ టీచర్ మటుకు మంచం మధ్యనుంచి కదలకుండా, చక్కగా నవ్వుతూ,”చిల్డ్రన్.. ఫస్ట్ యూ లెర్న్ ద స్టెప్స్.. దెన్ ఐ విల్ షో యూ..” అంటోంది.

ఓర్నాయనో.. ఆవిడ కనక ఆ డేన్సు చేస్తే స్క్రీన్ అదిరిపోదూ… నాకు భయమేసింది. ఈ విషయం తెలుసనుకుంటాను.. ఆవిడ ఏమాత్రం కదలకుండా చిరునవ్వుతో అలా చెప్తూనే వుంది.

”చిల్డ్రన్.. ఫస్ట్ యూ లెర్న్ ద స్టెప్స్.. దెన్ ఐ విల్ షో యూ..”

వీళ్ళు పిల్లలా…పిడుగులా.. అలా అరుస్తూనే వున్నారు.

ఆఖరికి వీళ్ళ అరుపులు వినలేక ఆవిడ “ఓకె.. ఓకె.. ఐ విల్ షో యూ ఇన్ ద నెక్స్‌ట్ క్లాస్..” అంటూ వాళ్లని ఆపింది.

అంటే తర్వాత క్లాసులో ఆవిడ ఆ జుంబా డేన్సు చేసి పిల్లలకి చూపిస్తుందా! నాకు గాభరాగా అనిపించింది.

వెంటనే మా అమ్మాయితో,

“రేపు వంశీ క్లాసుకి ఆ ఐపాడ్ ఇవ్వకు. వాణ్ణి డెస్క్ టాప్ ముందు కూర్చోబెట్టు..” అని చెప్పేను..

ఎందుకన్నట్టు చూసింది మా అమ్మాయి.

“నువ్వు నిన్న చెప్పినట్టే బహుశా ఆ టీచర్ ముందు తన పొట్ట తగ్గడానికి ఈ డేన్సు నేర్చుకుని వుంటుంది. అది పని చెయ్యకపోయేటప్పటికి ఇంక స్కూల్లో పిల్లలకి పాఠాల్లా చెపుతోందనుకుంటాను. ఎందుకంటే రేపు క్లాసులో ఆ టీచర్ కనక ఈ డేన్సు చేసి చూపించిందంటే ఐపాడ్ అదిరిపోతుంది.. ఆవిడ సైజుకి ఇంత చిన్న స్క్రీన్ సరిపోదు కూడానూ..”

నా మాటలకి మా అమ్మాయి ఫక్కున రాబోయిన నవ్వుని బలవంతంగా ఆపుకుంది.

“అమ్మా, తక్కువ బియ్యమైతే చిన్నగిన్నె పెట్టూ… ఎక్కువ బియ్యమైతే పెద్దగిన్నె కావాలీ అన్నట్టుంది నువ్వు చెపుతున్నది. ఐపాడ్ అయినా, డెస్క్ టాప్ అయినా స్క్రీన్‌లో అందరూ కనిపిస్తారు.. ఎటొచ్చీ కాస్త చిన్నగా కనిపిస్తారంతే.. ఐనా నే చూసుకుంటాలే.. వర్రీ అవకు..” అంటూ నన్ను సమాధానపరిచింది.

నిజవే.. నాల్రోజులుండిపోయేదాన్ని.. వాళ్ల విషయాలు నాకెందుకు! అయినా నా కనుమానవే.. ఆ టీచర్ ఎంత రానన్నా రేప్పొద్దున్న ఈ పిడుగుల్లాంటి పిల్లలు ఆ టీచర్‌ని డేన్సు చెయ్యమని అరవకుండా వుంటారా.. వీళ్ళ అరుపులు వినలేక ఒకవేళ ఆ టీచర్ ఆ జుంబా డేన్సు కాస్తా చేసేస్తే… ఆ ఐపాడ్ పరిస్థితేవిటీ! తల్చుకుంటేనే గుండెల్లో దడొస్తోంది కదా!

అయినా నాకెందుకులెండి… నాల్రోజులుండి పోయేదాన్ని..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here