అదృష్టం

2
7

[box type=’note’ fontsize=’16’] రమణాశ్రమంలో ఉండే భక్తుల మధ్య సంవాదం జరిగింది. అక్కడున్న భక్తులందరిలోకి తనే అదృష్టవంతుడననీ, భగవాన్ కన్నా తనే అదృష్టవంతుడనని అంటాడో భక్తుడు. ఎలాగో వివరిస్తాడు కూడా. ఆ భక్తుడికి పట్టిన ‘అదృష్టం‘ గురించి చెబుతున్నారు జొన్నలగడ్డ సౌదామిని. [/box]

[dropcap]నే[/dropcap]ను ఆ పూరిల్లు బయట చెట్టు నీడలో కూచుని భగవాన్‌కి భక్తులు సమర్పించిన పూలన్నీ మాతృభూతేశ్వర లింగానికి వెయ్యటానికి దండలుగా కడుతున్నాను. అక్కడక్కడా పక్షుల అరుపులూ ఆవుదూడల అంభారవాలూ తప్ప వేరే శబ్దమేమీ వినపడటంలేదు. ఇంతలో ఎవరో గట్టిగా అరుచుకుంటూ వొస్తున్నారు. ఎవరా అని పరకాయించి చూస్తే విశ్వనాధమూ, కృష్ణ భిక్షూనూ. విశ్వనాధం ఏదో చెబుతూ ఉన్నాడు దాన్ని కృష్ణ భిక్షు తప్పని గట్టిగా వాదిస్తున్నాడు.

విశ్వనాధం మంచివాడే కానీ కోపధారి. తాను చెప్పింది కాదంటే అంతెత్తున ఎగిరి పడతాడు ముందర. కానీ చప్పున చల్లారతాడు కూడా. తమిళం బాగానూ, తెలుగు కొద్దిగా వొచ్చినా సంస్కృతంలో పెద్ద  ప్రవేశం లేదు. భగవాన్ దగ్గర చాలా రోజులు ఉండటం వాళ్ళ ఆయన చెప్పేది బాగా విని ఆకళింపు చేసుకున్నాడు. కృష్ణ భిక్షుకి  తెలుగు తమిళంలో ప్రవేశం ఉన్నా, ఇలాంటి వాగ్వివాదాలు వొస్తే ఆయనకొచ్చిన సంస్కృత శ్లోకాలు బాగా కాపాడతాయి. చక్కని గాత్రమూ, స్ఫుటమైన ఉచ్చారణా, విశదంగా చెప్పే విధానమూ వెరసి కృష్ణ భిక్షుతో వాదించి గెలిచే వాళ్ళే ఆశ్రమంలో లేరు.

అలా వాళ్ళిద్దరూ కాసేపు వాదించి అలిసిపోయి చెట్టు నీడలో కాసేపు కూచున్నారు. అంతలో కృష్ణ భిక్షు నాదగ్గరికి వొచ్చి “ఒరే , నువ్వన్నా చెప్పు విస్సుకి” అంటూ తన పక్షం ఏమిటో అయిదు నిమిషాలు ఆపకుండా చెప్పాడు. వాడు ఆపగానే విశ్వనాధం వొచ్చి ఇంకో అయిదు నిమిషాలు తన పక్షం ఏంటో చెప్పాడు. అప్పుడు కృష్ణ భిక్షు “నీ ప్రకారం ఎవరు సరో చెప్పు” అన్నాడు.

“నాకు తెలీదు”

“మరి ఇంత సేపూ విన్నావు కదా”

“మీరు వినిపించారు, నా పనిలో నేనున్నాను అందుకని నేనేమీ వినలేదు”

కృష్ణ భిక్షు మొహంలో తిరస్కార భావమూ, విసుగూ కనిపించాయి

నేను కడుతున్న పూల వంకా నావంకా ఎగాదిగా చూసి అవహేళనగా నన్ను చూపిస్తూ విశ్వనాధంతో “ వీడు చాలా అదృష్టవంతుడు కదా, ఆశ్రమం భోజనం మఠం నిద్రా” అని నవ్వాడు.

నాకు వొళ్ళు మండిపోయింది.

“అవును నేను అదృష్టవంతుణ్ణి. ఇంకా మాట్లాడితే నేనే అదృష్టవంతుణ్ణి. మీ అందరికంటే, ఆశ్రమంలో ఉన్న అందరికంటే. గట్టిగా మాట్టాడితే భగవాన్ కంటే కూడా” అని ఘట్టిగా దురుసుగా పెంకెతనంతో చెప్పాను.

“భగవాన్ కంటే కూడానా, ఎంత అహంకారం” అంటూ విశ్వనాధం పరుగు పరుగున భగవాన్ కూర్చునే పాత హాలు దగ్గిరికి వెళ్ళాడు.

“అదేంటి, అంత మాట అన్నావు” అని పక్కన కూచుని నా చేతిని చేతిలోకి తీసుకుని సముదాయిస్తూ అడిగాడు కృష్ణ భిక్షు.

“పొరపాటై పోయింది” అంటూ తల దించుకున్నాను.

“భగవాన్ గురించి అలా మాట్లాడితే ఎలా. సరే నేను రాత్రికి భగవాన్‌తో ఏకాంతంగా మాట్లాడతాలే” అని కృష్ణ భిక్షు లేచి వెళ్ళిపోయాడు.

పూలు కట్టటం దాదాపు పూర్తయింది కానీ నా మనసు మనసులో లేదు. “ఇదేమిటి ఇట్లా అయిందేమిట్రా  భగవంతుడా” అంటూ మనసులో ఏదో శంకిస్తూ ఉండగా భోజనానికి గంట కొట్టారు. అందరూ వెళ్లి కూచున్నాక కొద్దిగా ఆలస్యంగా వెళ్లి చివరి బంతిలో కూర్చుని నాలుగు మెతుకులు తిని గదికి వొచ్చి పడుకున్నాను. కానీ నిద్ర రాలేదు ఎంతసేపటికీ. అలా ఎలా మాట్లాడానా అని వితర్కించుకుంటూ, రేపు అందరి ముందరా ఎలా సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ నిద్రపోయాను.

మర్నాడు పొద్దున్న కూడా భగవాన్‌కి దూరం నించే నమస్కారం చేసి పన్లోకి వెళ్లిపోయాను. పొద్దున్నపది అయ్యింది. సూర్యుడు ఎండ మండిస్తున్నాడు. విశ్వనాధం దూరం నించి కేక వేశాడు. విననట్టు ఊరుకున్నా. దగ్గిరికొచ్చి “భగవాన్ రమ్మంటున్నారు” అన్నాడు. తప్పక నన్ను నేను తిట్టుకుంటూ బయల్దేరాను. పాత హాల్‌లో భగవాన్ యథా ప్రకారంగా ఆసీనులై ఉన్నారు.

లోపలికి వెళ్ళంగానే విశ్వనాధం మొదలెట్టాడు. “మా అందరి కంటే అదృష్టవంతుడుట. భగవాన్ కంటే కూడా అదృష్టవంతుడట”. భగవాన్ కళ్ళెత్తి విశ్వనాధం వైపు చూసారు. వాడు మాట్లాడటం ఆపేసాడు. భగవాన్ నావైపు చూసారు ప్రశ్నార్థకంగా. హాల్‌లో అందరూ నన్నే చూస్తున్నారు. వాళ్ళందరూ అలా చూడటం చూసీ, మొదటిసారి భగవాన్ ఎదురుగా నుంచోడం వల్లా, గుండె గబగబా కొట్టుకుంటోంది. కాళ్ళూ చేతులూ ఆడట్లేదు. బుర్ర పనిచెయ్యడం లేదు.

భగవాన్ మెల్లిగా కృపాపూర్ణమైన చిరునవ్వు చిందించారు. నాకు కొద్దిగా ధైర్యం వొచ్చింది. “ఆ మాటలు నేనే  అన్నాను. మీకు ఉన్న శిష్యులందరిలో అతి తక్కువగా చదువుకున్న వాడిని నేను. నాకు మీరు చెప్పే వేదాంతం ఏమాత్రమూ అంతుబట్టలేదు. కానీ మీరు నన్ను దయతో చూస్తున్నారు. ఆశ్రమంలో ఉండనిస్తున్నారు. ప్రపంచానికి అతీతులైన మీకు, నా చాతనైన పనులు సేవగా చేస్తున్నాను. ఇంతకంటే ఇంక అదృష్టం ఏముంటుంది. మిగతా వాళ్ళందరూ ఎక్కువ ధనవంతులూ, చదువుకున్నవాళ్ళూ , నాకంటే అన్నిట్లోనూ ముందున్న వాళ్ళు. వాళ్ళతో బాటు ఆశ్రమంలో నేను కూడా ఉన్నానంటే నేను వాళ్ళందరి కంటే అదృష్టవంతుడిని కదా భగవాన్” అన్నాను.

భగవాన్ స్థిరంగా నిశ్చలంగా చూస్తున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళంతా నా సమాధానంతో సంతృప్తి పొందినట్టు అనిపించింది. భగవాన్ పాదాల దగ్గర కూచున్న యోగి రామయ్య గారు “బావుంది” అని మందహాసం చేసారు. నాకు కాస్త ధైర్యం వొచ్చింది.

“మరి భగవాన్ మాటో” అన్నాడు విశ్వనాధం కసిగా.

“అది అసలైన మాట. అన్నిటి కంటే అతి తేలిక ప్రశ్న” అంటూ అందుకున్నాను.

“తెలివి గల వాళ్ళకీ, పెట్టి పుట్టిన వాళ్ళకీ, పూర్వ జన్మ సంస్కారాలు బలంగా ఉన్న వాళ్ళకీ భగవాన్ అక్కర్లేదు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళని దగ్గరికి తీయక తప్పదు కాబట్టి ఏదో ఒక రూపంలో వొస్తాడు. వాళ్లకి మోక్షం ఇస్తాడు.

నాలాంటి తెలివి లేని వాళ్ళ కోసం అజ్ఞానుల కోసం, మమ్మల్ని ఎలాగోలా కరుణించడం కోసం ఎవరొస్తారు. భగవాన్ వొచ్చారని నా నమ్మకం.

నా అదృష్టం ఏమిటంటే భగవాన్ లాంటి గురువు దొరకటం. నా అదృష్టం ఏమంటే భగవంతుడే భూమికి దిగివొచ్చి అరుణాచలంలో కూర్చున్నప్పుడు పుట్టటం. భగవంతుడికి సేవ చేసే అదృష్టం కలగటం. ఇంకేం కావాలి ఈ జీవితానికి. భగవాన్‌కి అదృష్టం ఏముంది నాలాంటి అజ్ఞానులు శిష్యులుగా దొరుకుతూ వుంటే? భగవాన్ నిజంగా అదృష్టానికి అతీతులు అని నా నమ్మకం. అట్టాంటి ఆయన్ని ఈ అదృష్టాల రొంపిలోకి లాగటం తప్పని నా అభిప్రాయం ఇప్పుడు చెప్పండి, నేను  అదృష్టవంతుడినో  భగవాన్ అదృష్టవంతులో” అని ఊరుకున్నాను.

భగవాన్ చిరునవ్వు రువ్వి మళ్ళీ మామూలుగా అచలంగా స్థిరంగా కూర్చున్నారు. ఆయనకి దణ్ణం పెట్టి హాలు బయటికి వొచ్చాను.

వెనకాలనుంచి ఎవరో చేయి వేస్తే తిరిగిచూసాను. కన్నీళ్లు కారుస్తూ విశ్వనాధం. అలాగే నా చెయ్యి పట్టుకుని దగ్గిరికి లాక్కుని పొదువుకున్నాడు. నాక్కూడా ఆనందమూ ఉద్వేగమూ సమ్మిళితమై కన్నీళ్లు జలజలా రాలాయి. దూరంగా నుంచున్న కృష్ణ భిక్షు దగ్గిరికి వొచ్చి వీపు నిమిరాడు. ప్రపంచమంతా రమణానందమయమై పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here