అమెరికా ముచ్చట్లు-15

0
13

[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

ప్రపంచానికి స్ఫూర్తినిస్తున్న స్టాచ్యు ఆఫ్ లిబర్టీ

[dropcap]న[/dropcap]యగారా జలపాతం తర్వాత ప్రపంచ పర్యాటకులకు న్యూయార్క్ రాష్ట్రంలో మరొక తప్పనిసరి దర్శనీయ స్థలం ‘స్టాచ్యు ఆఫ్ లిబర్టీ’. న్యూయార్క్ హార్బర్‌కు సమీపంలో అట్లాంటిక్ మహా సముద్రంలో ఉన్న ఒక చిన్నద్వీపంలో ఈ 93 అడుగుల ఎత్తైన స్టాచ్యు ఆఫ్ లిబర్టీ పేరిట ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత ఈ ద్వీపానికి లిబర్టీ ఐల్యాండ్‌గా నామకరణం చేశారు.

లిబర్టీ దీవిలో విగ్రహం ఏరియల్ వ్యూ
స్టాచ్యు ఆఫ్ లిబర్టీ

అమెరికన్ సివిల్ వార్‌లో ఫ్రెంచి వారు అమెరికాకు మద్దతుగా నిలచిన కారణంగా రెండు దేశాల మైత్రికి నిదర్శనంగా ఒక స్మారకాన్ని ఏర్పాటు చేయాలని ఫ్రాంకో – అమెరికన్ యూనియన్ సంస్థ ఈ పథకాన్ని రూపొందించింది. ఇది ఫ్రెంచి ప్రజల తరపున అమెరికా ప్రజలకు ఒక అద్భుత కానుకగా చరిత్రలో నిలచిపోవాలని వారు తలపోశారు. ఆనాడు అమెరికాలో బానిసత్వ వ్యతిరేక ఉద్యమానికి మద్దతుగా ఫ్రెంచి వారు ఏర్పాటు చేసుకున్న సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న ఎడ్వర్డ్ రెని డి లాబోలాయ్ మొదటిసారిగా 1870లో ప్రతిపాదించారు. ఆయన ఆనాటికి ప్రసిద్ధుడైన బుద్ధిజీవిగా, బానిసత్వ వ్యతిరేక ఉద్యమకారుడిగా పేరు గడించారు. ఆయన ప్రతిపాదన రెండు దేశాలలో ప్రజల నుంచి మంచి ప్రతిస్పందన వచ్చింది. విగ్రహాన్ని ఫ్రెంచి వారు తయారుచేయాలని, విగ్రహాన్ని నిలబెట్టడానికి గద్దెను అమెరికా నిర్మించాలని నిర్ణయానికి వచ్చారు. ఫ్రాంకో-అమెరికన్ యూనియన్ వారు రెండు దేశాలలో స్టాచ్యు ఆఫ్ లిబర్టీ విగ్రహం ఏర్పాటుకు ప్రజల నుంచి, దాతల నుంచి విరాళాలు సేకరించడం మొదలు పెట్టారు.

క్రూజ్ షిప్ నుంచి స్టాచ్యు ఆఫ్ లిబర్టీ దృశ్యం
స్టాచ్యు ఆఫ్ లిబర్టీ ఆయిల్ పెయింటింగ్

ఫ్రాన్స్ లో ప్రజల నుంచి విగ్రహానికి భారీగా విరాళాలు అందాయి. విగ్రహం ఎట్లా ఉండాలి అన్న విషయంలో అనేక చర్చలు, అధ్యయనాల తర్వాత స్వేచ్ఛకు, స్వాతంత్ర్యానికి ప్రతీకగా భావించే రోమన్ దేవత ‘లిబర్టాస్’ను ఈ విగ్రహనికి నమూనాగా ఎంచుకున్నారు. అమెరికా ప్రజలకే కాదు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కాంక్షిస్తున్న ప్రజలందరికీ ఈ విగ్రహం స్ఫూర్తిని కలిగించాలని విగ్రహ రూపకర్తల ఆలోచన. విగ్రహం రూప శిల్పిగా ఫ్రెడెరిక్ ఆగస్టిన్ బార్తోల్డిను ఎంపిక చేశారు. ఆయన కాళ్ళ నుంచి కాగడా చివరిదాకా 46 మీటర్లు ఎత్తు రాగి విగ్రహానికి డిజైన్లు రూపొందించినాడు. పైకి ఎత్తిన కుడి చేతిలో మండుతున్న కాగడా, మడిచి పెట్టుకున్న ఎడమ చేతిలో ఒక పుస్తకం, ఆ పుస్తకం అట్టపై అమెరికా స్వాతంత్ర్య ప్రకటన తేదీ జులై 4, 1776 రోమన్ అంకెల్లో రాయాలని, కాళ్ళ వద్ద బానిసత్వ శృంఖలాలు తెగిపోయిన దానికి ప్రతీకగా తెగిపోయిన గొలుసులు ఉంచాలని నిర్ణయించి విగ్రహాన్ని రూపకల్పన చేశారు. ఈ నమూనా అందరి ఆమోదం పొందిన తర్వాత 1875లో విగ్రహం నిర్మాణం ప్రారంభం అయ్యింది. విగ్రహాన్ని కొన్నిభాగాలుగా తయారు చేశారు. మొదట తల భాగాన్ని1877 నాటికి పూర్తి చేశారు. 1878లో పారిస్‌లో ఏటా జరిగే పారిస్ వరల్డ్ ఫెయిర్ లో ప్రదర్శనకు పెట్టారు. ఫ్రాన్స్ లో 1879 నాటికి 2,50,000 ఫ్రాంక్ లను విగ్రహం తయారీకి సేకరించగలిగినారు. 1884 నాటికి విగ్రహం తయారీ పూర్తి అయ్యింది.

పారిస్ వరల్డ్ ఫెయిర్ లో ప్రదర్శనకు ఉంచిన విగ్రహం తల భాగం

విగ్రహాన్ని నిలబెట్టడానికి కావలసిన స్టీల్ ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించినది గుస్తావ్ ఐఫిల్. పారిస్‌లో ఐఫిల్ టవర్‌ను నిర్మించింది ఈయనే. అమెరికాలో విగ్రహం ప్రతిష్ఠించడానికి నిర్మించవలసిన గద్దె కోసం విగ్రహాన్ని ఫాన్స్ లోనే ఉంచవలసి వచ్చింది. ఫ్రాన్స్‌లో జరిగినట్టే అమెరికాలో కూడా విగ్రహం ఏర్పాటు చేయడానికి గదీ నిర్మాణానికి విరాళాల సేకరణ మొదలయ్యింది. 3 లక్షల డాలర్లు సేకరించాలన్న లక్ష్యం నెరవేరడానికి సమయం పట్టింది. మందకొడిగా ప్రారంభం అయిన విరాళాల సేకరణ ‘న్యూయార్క్ వరల్డ్’ పత్రిక యజమాని జోసెఫ్ పులిట్జర్ ఒక లక్ష డాలర్లు ఇచ్చిన విరాళం తర్వాత ఊపందుకున్నది (ఈయన పేరు మీదనే 1917 నుంచి సాహిత్యం, జర్నలిజం రంగాలలో ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్ పురస్కారాన్ని ఇస్తున్నారు). ఆయన విరాళం ఈనాటి విలువ 2.3 మిలియన్ డాలర్లు. చిన్న ఆదాయం కలిగిన ఉద్యోగులు, కార్మికులు ఒక డాలర్ కూడా సమర్పించినారు. బడి పిల్లలు సైతం తమ కిడ్డి బ్యాంక్ నుండి విరాళాలు సమర్పించారు. తగినన్ని డాలర్లు సమకూరడంతో 1883లో గద్దె నిర్మాణం ప్రారంభం అయ్యింది. రెండేళ్లలో 1885 నాటికి పూర్తి చేశారు. అంతకు ముందే గద్దె డిజైన్లను రూపొందించడానికి ఆమెరికాలో స్థిరపడిన నార్వే దేశానికి చెందిన ప్రముఖ సివిల్ ఇంజనీర్ రిచర్డ్ మోరీస్‌ను ఎంపిక చేశారు. మొదట 35 మీటర్ల ఎత్తయిన గద్దెను రూపొందించినప్పటికీ దాన్ని 27 మీటర్లకు తగ్గించినారు. దృఢమైన గ్రానైట్ రాళ్ళతో ఈ గద్దెను నిర్మించాలని నిర్ణయించారు. ఈ గద్దె నిర్మాణానికి వందలాది డ్రాయింగులను రూపొందించాడు రిచర్డ్ మోరీస్.

అమెరికాలో గద్దె నిర్మాణం పూర్తి కావడంతో ఫ్రాన్స్ నుంచి విగ్రహం భాగాలను స్టీమర్ లోకి ఎక్కించి న్యూయార్క్ తీరానికి తరలించినారు. 17 జూన్ 1885 రోజున స్టీమర్ న్యూయార్క్ తీరానికి చేరుకున్నది. న్యూయార్క్ వాసులు ఆ స్టీమర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. సెప్టెంబర్ 1886 నాటికి విగ్రహాన్ని గద్దె మీద ప్రతిష్ఠించే పని ముగిసింది. విగ్రహాన్నిఅమెరికా ప్రజలకు అంకితం చేయడానికి 28 అక్టోబర్ 1886 న ముహూర్తం నిర్ణయించారు. ఆనాటి అమెరికా అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్ ల్యాండ్ స్టాచ్యు ఆఫ్ లిబర్టీని ఆహుతుల హర్షద్వానాల మధ్య జాతికి అంకితం చేశాడు. ఈ సందర్భంగా ఆయన అన్న మాటలు.. “Stream of light shall pierce the darkness of ignorance and man’s oppression until liberty is enlightens the world”. 1886 నాటికి బానిసత్వం చట్టపరంగా రద్దు అయినప్పటికీ, అమెరికా నల్ల జాతి ప్రజలకు ఇంకా పూర్తి స్వేచ్చా స్వాతంత్ర్యాలు, సమానత్వం దక్క లేదు. అందుకే న్యూయార్క్ కేంద్రంగా అచ్చు అయ్యే ఆఫ్రో అమెరికన్ పత్రిక ‘ది క్లీవ్ ల్యాండ్ గజిట్’ విగ్రహాన్ని ఆవిష్కరించినా అమెరికా నిజమైన అర్థంలో సమానత్వాన్ని సాధించిన దేశంగా అవతరించేదాకా టార్చ్‌ను మాత్రం వెలిగించవద్దని కోరింది. వారి కోరికను అమెరికా ప్రభుత్వం మన్నించ లేదని వేరే చెప్పనవసరం లేదు. రాత్రి వేళల్లో విగ్రహాన్ని చూడటానికి దీప కాంతులతో అలంకరించారు. 1906 నాటికి రాగి విగ్రహం రంగు రసాయనిక చర్య కారణంగా ఆకుపచ్చ రంగుకు మారిపోయింది. ఇది విగ్రహానికి ఈ విధంగానూ నష్టదాయకం కాదని నిర్ధారించారు.

విగ్రహం వేషధారణలో ఒక బిక్షకుడు

స్టాచ్యు ఆఫ్ లిబర్టీని చూడటానికి ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు వస్తారు. ఏటా సరాసరి 30- 35 లక్షల మంది పర్యాటకులు విగ్రహాన్ని చూడటానికి వస్తారని ఒక అంచనా. విగ్రహన్ని నిలబెట్టిన గద్దె ఎత్తు 27 మీటర్లు కాగా, కాలి నుంచి కాగడా చివరి దాకా ఎత్తు 46 మీటర్లు. మొత్తం ఎత్తు 93 మీటర్లు. ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహాల్లో ఇది నాల్గవ స్థానంలో ఉన్నది. మొదటి స్థానంలో గుజరాత్‌లో సాబర్మతి నది ఒడ్డున నిర్మించిన స్టాచ్యు ఆఫ్ యూనిటీ (182 మీటర్లు).

గుజరాత్ లో ఏర్పాటు చేసిన స్టా చ్యు ఆఫ్ యూనిటీ విగ్రహం

రెండవ స్థానంలో చైనాలో ఏర్పాటు అయిన రెండు ప్రాచీన బుద్ధ విగ్రహాలు (128 మీ, 108 మీ). విగ్రహం తయారీకి వాడిన రాగి లోహం 27.22 టన్నులు, విగ్రహాన్ని నిలబెట్టడానికి వాడిన స్టీల్ 113.40 టన్నులు. లిబర్టీ దీవికి వెళ్ళడానికి నియార్క్, న్యూ జెర్సీ నగరాల నుంచి నేషనల్ పార్క్ సర్వీస్ వారు క్రూజ్ షిప్‌లు నడుపుతున్నారు.

విగ్రహం ఏర్పాటు అయిన తర్వాత 1901 వరకు యు ఎస్ లైట్ హౌజ్ బోర్డు అధీనంలో ఉండేది. ఆ తర్వాత 1933 వరకు డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ (ఈ పేరుతో ఒక ప్రభుత్వ శాఖ అమెరికాలో తప్ప మరెక్కడా ఉండే అవకాశం లేదు) వారు నిర్వహించారు. 1933 నుంచి పక్క పక్కనే ఉన్న లిబర్టీ, ఎల్లిస్ దీవులను నేషనల్ పార్క్ సర్వీస్ వారికి అప్పగించారు. లిబర్టీ దీవిలో విగ్రహం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన లాబోలాయ్, బార్తోల్డి, ఐఫిల్, మోరీస్, పులిట్జర్, లాజరస్ తదితరుల గౌరవార్థం విగ్రహాలను ఏర్పాటు చేయడం విశేషం. ఈ విగ్రహం స్పూర్తితో అమెరికా లోనే వందలాది చిన్న విగ్రహాలు ఏర్పాటు చేసారు. విదేశాల్లో సైతం స్టాచ్యు ఆఫ్ లిబర్టీలు ఏర్పాటు అయినాయి. పారిస్ లో, టోక్యో నగరాల్లో ఈ విగ్రహం నమూనాలు పర్యాటకులను ఆకర్షించడానికి ఏర్పాటు చేశారు.

పారిస్ లో ఏర్పాటు చేసిన స్టాచ్యు ఆఫ్ లిబర్టీ విగ్రహం
లాస్ వెగాస్ నగరంలో ఏర్పాటు చేసిన స్టాచ్యు ఆఫ్ లిబర్టీ విగ్రహం

అమెరికా నెవేడా రాష్ట్రంలో ఉన్న లాస్ వెగాస్ నగరంలో న్యూయార్క్ హోటల్ లో కూడా ఈ విగ్రహం నమూనా ఏర్పాటు చేశారు. స్టాచ్యు ఆఫ్ లిబర్టీ బొమ్మతో పోస్టల్ స్టాంపులు విడుదల అయినాయి. అమెరికా ప్రెసిడెంట్ మెడల్ పై కూడా ఈ విగ్రహం బొమ్మను పెట్టింది అమెరికా ప్రభుత్వం. మొదట్లో విగ్రహం కాగడా బాల్కనీ దాకా సందర్శకులను అనుమతించేవారు. 1916 లో కాగడా బాల్కనీ ప్రవేశాన్ని నిషేదించినారు. ఇప్పుడు తల బాల్కనీ దాకా వెళ్ళనిస్తున్నారు.

విగ్రహం తల భాగం బాల్కనీలో పర్యాటకులు

ఇంతటి ఘన చరిత్ర కలిగిన స్టాచ్యు ఆఫ్ లిబర్టీను చూడాలని అమెరికా పోయే ముందే అనుకున్నాను. మొదట న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్న నయగారా జలపాతాన్ని సందర్శించాము. నయాగారా విశేషాలు 14వ భాగంలో రాసి ఉన్నాను. నయాగారా జలపాతం చూసిన తర్వాత బఫెల్లో నగరం నుంచి రాత్రి 10 గంటలకు లగ్జరీ బస్‌లో న్యూయార్క్ బయలుదేరాము. ఉదయం 6 గంటలకు న్యూయార్క్ చేరుకున్నాము. అక్కడి నుండి ముందే బుక్ చేసుకున్న హోటల్‌కు అరగంటలో చేరుకున్నాము. మా గది హోటల్ 25వ అంతస్తులో ఉన్నందువలన న్యూయార్క్ నగరం అంతా విహంగ వీక్షణం లాగా వీక్షించే అవకాశం చిక్కినది. హడ్సన్ నది అట్లాంటిక్ మహా సముద్రంలో కలుస్తున్న దృశ్యం మా హోటల్ గది నుంచి వీక్షించాము. మరో రెండు మూడు గంటలు నిద్ర పోయి లంచ్ చేసి స్టాచ్యు ఆఫ్ లిబర్టీకి బయలుదేరాము. న్యూయార్క్ హార్బర్ పాత రాతి కట్టడాలతో సుందరంగా ఉన్నది. న్యూయార్క్ హార్బర్ టోలో నాళ్ళ నుంచే యూరప్ వలసదారులకు గెట్ వే గా ఉపయోగపడింది. అమెరికా తూర్పు తీరంలో మొదట వలసలు స్థాపించుకొని పశ్చిమానికి విస్తరించినారు. క్రూజ్ షిప్ లో లిబర్టీ ఐల్యాండ్ ప్రయాణం ఒక అరగంట ఉంటుంది. ఆహ్లాదకరంగా సాగే ఈ క్రూజ్ ప్రయాణంలో ఐల్యాండ్ దగ్గర పడుతున్నా కొద్ది ఆకుపచ్చని ఛాయలో స్టాచ్యు ఆఫ్ లిబర్టీ విగ్రహం కూడా రా రమ్మని మనలను పిలుస్తూ ఉంటుంది. క్రూజ్‌ను లంగరు వేసిన తర్వాత ప్రయాణికులు ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు.

ప్రెసిడెంట్ మెడల్ పై స్టాచ్యు ఆఫ్ లిబర్టీ బొమ్మ

మా పిల్లలు టికెట్లు తీసుకొని వచ్చాక విగ్రహం దిక్కు కదిలిపోయాము. చూపరులను కట్టి పడవేసే గంభీరమైన విగ్రహం. ఎన్నెన్ని కోణాల్లో ఫోటోలో తీస్తూనే ఉన్నారు మా బిడ్డలు అంజలి, వెన్నెల. అయితే మేము వెళ్ళిన రోజు ఆదివారం కావడంతో విగ్రహం బాల్కనీ వద్ద పెద్ద క్యూ లైన్ పెద్దగా ఉండడంతో బాల్కనీ ఎక్కే ప్రోగ్రామ్‌ని విరమించుకున్నాము. రెండు గంటల పాటు పార్కులో కలియదిరిగి సాయంత్రం కావస్తుండడంతో పార్క్‌లో ఏర్పాటు చేసిన మ్యూజియంకు వెళ్ళాము. అందులో విగ్రహం ఏర్పాటు సంబందించి చరిత్రను, విగ్రహ నిర్మాణ సాంకేతికతను ప్రదర్శించే నమూనాలను ఉంచారు. బోలెడన్ని జ్ఞాపికలు, సాహిత్యం, పోస్టరు, కీ చెయిన్లు, టీ షర్ట్స్, కప్పులు, మాగ్నెట్స్.. ఇంకా మరెన్నో వస్తువులు అమ్మకానికి పెట్టారు.

నేను ఒకటిన్నర అడుగుల విగ్రహ నమూనాను గౌరవ ముఖ్యమంత్రి కె.సి.ఆర్. కోసం, మరొక విగ్రహాన్ని మా కోసం కొన్నాము. పిల్లలు మాగ్నెట్స్ కొన్నారు. ఎక్కడికి పోయినా ఆ ఊరి జ్ఞాపకంగా మాగ్నెట్స్‌ను కొనడం వారి అలవాటు. వాటిని ఫ్రిజ్ తలుపుకు అతికిస్తారు. నేను విగ్రహం నిర్మాణ చరిత్రను వివరించే పుస్తకాన్ని కొన్నాను. అట్లా స్టాచ్యు ఆఫ్ లిబర్టీని చూడాలన్న నా కోరిక నెరవేరింది. తిరిగి క్రూజ్ షిప్లో న్యూయార్క్ హార్బర్‌కు చేరుకున్నాము. అక్కడ ఔత్సాహిక చిత్రకారులు వెంటబడితే ఒక చిత్రకారుడిచే మా ఇద్దరి బొమ్మ వేయించుకున్నాము. 20 నిమిషాల్లో బొమ్మ పూర్తి అయ్యింది. అయితే అందులో మా పోలికలు కొన్ని తప్ప మా బొమ్మలాగా అనిపించలేదు. వేయించుకున్నందుకు 10 డాలర్లు సమర్పించుకొని బయటపడినాము. పార్క్ బయట న్యూ యార్క్ స్ట్రీట్ ఫుడ్ కూడా ఎంజాయ్ చేశాము. రాత్రి వరకు అంబరాన్నిఅంటే బహుళ అంతస్తుల భవనాలు చూస్తూ న్యూయార్క్ వీదుల్లో కలియ తిరిగాము.

విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన శిలా ఫలకంపై రూపకర్తల మాటలు
25వ అంతస్తు హోటల్ గది నుంచి న్యూ యార్క్ నగర దృశ్యం

రెండో రోజు న్యూయార్క్‌లో ప్రపంచ వాణిజ్య కేంద్రం కూల్చినప్పుడు మరణించిన వారి కోసం అదే చోట కట్టిన స్మారకాన్ని, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌ను, టైమ్ స్కేర్ లను సందర్శించుకొని సాయంత్రం కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానం ఎక్కి అర్ధరాత్రి డాలస్ చేరుకున్నాము. ఇట్లా మూడు రోజుల న్యూయార్క్ రాష్ట్ర పర్యటన మధురానుభూతులను మిగిల్చింది.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here