ఇట్లు కరోనా-8

1
6

[box type=’note’ fontsize=’16’] కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని ధారావాహికగా అందిస్తున్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. [/box]

8

[dropcap]ప[/dropcap]రిశుభ్రత ఆవశ్యకత గురించి పునరాలోచించుకుంటూ దేశ పాలకులు కూడా చికిత్స దోసిట్లోకి చేరుకుంటున్న ఈ కఠోర సమయంలో నా కరాళ నృత్యానికి ఎప్పటికప్పుడు పరిశుభ్రతతో అడ్డంకులు కలిపిస్తూ, నేలను పసికూనగా తలపోస్తూ చీపురు దువ్వెనతో తలదువ్వుతూ, మాలిన్యాన్ని చేతల చేతులతో ఎత్తిపోస్aతూ స్వచ్ఛతే గుణంగా, శుభ్రతే ఆభరణంగా, ప్రక్షాళనే ఆయుధంగా మానవాళికి సేవలు చేస్తున్న ఆ పారిశుధ్య చెలెమలే కనక లేకుంటే ఇంకా ఎంతమంది అసువులు బాసి ఉండేవారో! పారిశుధ్య కార్మికుల సేవలు అజరామరం. అందుకే సఫాయన్నా నీకు దండాలన్నా అంటూ చేతులెత్తి దండాలు పెట్టారు మీ పాలకులు. అయినా ఉపద్రవం వచ్చేంతవరకూ మిన్నకుండిపోయి ఇప్పుడు తప్పంతా మాదేనన్నట్టుగా మహమ్మారిగా పిలుస్తున్నారే!

ఆకలి మూలంగా శాశ్వత నిద్రలోకి జారుకొనే తన తోటి మనుషులకోసం, దప్పికతో అలమటించే ఎడారి బతుకులకు ఒయాసిస్సులుగా మారి ఊపిరులు పోసిన వారు ఎందరో.. ఆర్థికంగా గుర్రాల అనూరాధ చూపిన వితరణ గొప్పగా అనిపించింది. తనకిచ్చిన రేషన్ బియ్యం నుంచి సగం బియ్యం దానం చేసి నన్ను చూసుకునేందుకు ఇక్కడ కే‌సి‌ఆర్ వున్నాడు, నేను ఇక్కడ అన్నార్తుల కడుపు నింపితే ఎక్కడో వున్న నా బిడ్డకి ఇంత బువ్వ ఏ తల్లైనా పెట్టదా అంటూ అప్పటికప్పుడు 8 క్వింటాళ్ళ బియ్యాన్ని జమ చేసిన తీరు నన్ను సంభ్రమాశ్చర్యాలకు లోనుచేసింది. ప్రణల్ జాస్తి ఆర్ట్ ఎగ్జిబిషన్‌ని నిర్వహించి 2.20 లక్షలు అందివ్వడం, రంగారెడ్డి జిల్లా, ఇబ్రాహీం పట్నం అమ్మాయి పుట్టుకతోనే చెవుడు మూగ అయిన పసునూరి స్నేహ, తాను దాచుకున్న లక్ష రూపాయలతో అన్నదానం చేయడం, అది చూసి ఆమె తండ్రి శ్రీనివాస్ కోప్పడక పోగా మళ్ళీ లక్ష రూపాయలతో మరోసారి అన్నదానం చేయించడం సంభ్రమం కలిగించింది. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేటలో ఒక దాత ఇంటికి ఒక కోడి చొప్పున పంచి, వాటి పెంపకం ద్వారా వచ్చే గుడ్లతో రోగనిరోధక శక్తిని పెంచుకోమనడం చాలా ఆశ్చర్యం కలిగించింది.

నేను చీదరించుకున్న సంఘటన కూడా నీకొకటి చెప్పాలి. బీహార్‌లోని ఖద్దు గ్రామంలో మధ్యాహ్న భోజనం తయారు చేసే వంటవారు నాకు భయపడి రావడం మానేశారు. మమతల మాగాణమ్మ ఆ ఊరి మహిళా సర్పంచ్. పిల్లలు పస్తులుండడం చూసి తానే వండి పిల్లలందరికీ భోజనం పెట్టింది. పిల్లలు ససేమిరా తినం అని కూర్చున్నారు. సంగతేమిటా అని విచారిస్తే.. ఆ సర్పంచ్ దళిత మహిళట. ఆకలికి కూడా కులం అంటగట్టిన భావిభారత నిర్మాతల్ని చూసి నేనే సిగ్గు పడ్డాను. కొన్ని తరాలుగా స్వార్థపరులు కత్తెరతో విడదీస్తూ వచ్చిన సమాజాన్ని సంస్కర్తలు సూది లాగా కుట్టుకుంటూ నడిపించుకుంటూ వచ్చారు. ఈ ఆధునిక కాలంలో అందునా చావు అంచున నిలబడ్డ సమయంలో కూడా వదలని ఈ కులాల చిచ్చుని చూసి నేనే భయపడుతున్నాను. నాకర్థం కావటం లేదు కానీ మానవా మీరు రక్తం ఎక్కించుకుంటున్నప్పుడు ఇది ఏ కులం వారి రక్తం అని ఆలోచిస్తున్నారా, బతికితే చాలు దేవుడా అని ఆత్రంగా ఎక్కించుకోవడం లేదూ.. కృత్రిమ గర్భధారణకి వెళ్తున్నప్పుడు ఈ అండం ఏ మతం వారిది.. ఈ స్పెర్మ్ ఏ రాష్ట్రం వారిది అని ఆలోచిస్తున్నారా? బిడ్డ పుడితే చాలు అని కోరి కోరి మళ్ళీ ప్రయత్నించడంలేదా.. అవయవదానం పొందడం కోసం కన్నీళ్లతో ప్రార్థిస్తుంటారే అవయవం దొరకగానే సంబరాలు చేసుకుంటారే తప్ప ఏ కులందీ అని ఆలోచిస్తారా.. ప్రాణాల దగ్గరకొచ్చేసరికి రాజీ పడే మీకు ప్రశ్నించే హక్కు, వివక్ష చూపే దమ్ము ఎవరిచ్చారు? పురాణాల్ని కాలక్షేపంగా చదువుతున్నారే తప్ప వాటి సందేశాల్ని ఆచరణలో చూపిస్తున్నారా? ఒకసారి ఇపుడైనా కాస్త ఆలోచించండి.

అబ్బో కాస్త సీరియస్‌గా ప్రశ్నించేసరికి నీ ముఖం నల్లబడిందే. సరేగానీ నేను నీకు మరికొంతమంది ఫైటర్స్ గురించి చెప్పాలి. మాటల్లో పడి మరిచిపోతానేమో చదువు మరి. రజియా బేగమ్ గుర్తుందా – బోధన్ నుండి స్కూటీ మీద బయలుదేరి 3 రోజుల్లో నెల్లూరు రహతాబాద్ నుండి తన కొడుకుని తీసుకొని వెనుతిరిగిన ఆ మాతృమూర్తి ధైర్యం ముందు నేనెంత అనిపించింది. మహారాష్ట్ర సాంగ్లీ లోని ప్లాస్టిక్ కంపెనీలో పనిచేసే ఓ వలస కూలీ 1700 కిలోమీటర్ల దూరాన్ని పేదరికం వల్ల వచ్చిన తెగింపుతో ఏడు రోజుల్లోనే సైకిల్ మీద చేరుకొని తన కుటుంబాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసాడు. హైదరాబాద్ మునిసిపల్ రిక్షా పుల్లర్ కొడుకు.. ఐ‌ఐ‌టి చదువుతున్న నెల్సన్ రాజ్ తన తండ్రి పారిశుధ్య కార్మికుడు అని చెప్పుకోవటం గొప్పతనంగా వుందని చెప్పటం, అలాగే మున్సిపల్ కార్మికులైన జవాన్ అంకేశ్వరరావు, ఎల్లస్వామి, పద్మావతి కూడా ‘రోడ్ల సఫాయి లేకుండా ఈ అంటురోగం ఆగుతుందా’ అంటూనే ‘ఇంకా ఎక్కువ పనిచెయ్యాలి’ అంటూ.. రోజు కన్నా ముందుగా విధులకి రావటం చూసి నేను ఖంగుతిన్నాను. సాయి రమాదేవి, మెదక్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వయంగా కదిలి కోర్టు ప్రాంగణంలోనే రోజూ అన్నదానం చేసిన విషయాన్ని మర్చిపోలేము.

బర్కత్‌పురాలో ఇంటింటికీ తిరిగి వృద్ధులకు ధైర్యం చెప్తూ, మందులు పంచుతున్న కొండ శ్రీనివాస్ ఆదరణ, జంతు ప్రేమికురాలు అన్నపూర్ణగా పేరొందిన ఋషిభానక్ అయాన్ కారుణ్యాన్ని, రాజన్న సిరిసిల్ల జిల్లా దేవాని గుట్ట తండా వార్డు మెంబరు భూక్యా జగ్గవ్వ చాపత్తి, పంచదారల్ని పంచుతూ తన పెన్షన్ డబ్బుల్ని వాడిన తీరు, ఆదిలాబాద్ జిల్లా రైతు మోర హన్మాండ్లు తన పంట డబ్బు 50,000 ని తోటివారి ఆకలి మంటని తీర్చడానికి గాను దానం చేయటం కంట నీరు పెట్టించింది. ఆదిలాబాద్ జిల్లా రైతు అబ్బూరి మాల కొండయ్య తన పొలంలో పండిన జొన్నల్ని కొన్ని కుటుంబాలకి పంచి తన కరుణని చాటుకున్నాడు. మహబూబ్ ఖాన్ – గోప తండా సర్పంచ్, అజ్మీరా లక్ష్మి ఊరంతా శానిటైజ్ చేస్తూ ఎందరి ప్రశంసల్నో పొందింది.

మిత్రమా! ఒక్కసారి కెన్యా వైపు దృష్టి సారించవా, ప్రపంచం యావత్తూ తలదించుకొనే సంఘటన ఒకటి చూపిస్తాను. కెన్యా లోని మోంబసా కౌంటీలో కిట్సావో అనే సర్వెంట్ మెయిడ్ ఉంది. తన భర్త దోపిడీదార్ల చేతుల్లో చనిపోయాడు. ఎనిమిది మంది పిల్లల్తో నానా ఇబ్బందీ పడుతూ ఒంటరి పోరాటం చేస్తున్న ఆమె మీద లాక్‌డౌన్ విపత్తు మరింత భారాన్ని కలిగించింది. ఆకలితో పిల్లలు ఏడుస్తుంటే గుప్పెడు గింజలు కూడా లేని ఆ తల్లి వారి ఏడుపు చూడలేక పొయ్యి వెలిగించి గిన్నెలో కాసిన్ని నీళ్ళు పోసి అందులో అయిదారు పలుగు రాళ్ళు వేసి ఉడికించడం ప్రారంభించిందిదట. తల్లి ఏదో ఉడికిస్తోంది, తమకు పెడుతుంది అని ఆశతో ఎదురు చూసీ చూసీ పిల్లలు మళ్ళీ ఏడుపు అందుకోవడంతో ఇరుగు పొరుగూ వచ్చి చూసి కదిలి పోయి ఆ పిల్లలకి కాస్తంత అన్నం పెట్టి ఈ వార్తని సామాజిక మాధ్యమాలకి అందించారు. వెంటనే కెన్యా ప్రజలు తన బ్యాంకు ఖాతాకి డబ్బులు పంపటం ప్రారంభించారు. చూశావా మనిషీ, సకాలంలో స్పందించటం వలన ఆ తల్లి ఎనిమిది మంది బిడ్డల ఆకలి తీర్చగలిగింది. ఆకలి మూలంగా అయినవారు గుర్తొచ్చాక అంతెందుకు, కాంక్రీట్ మిక్చర్ ల ట్రక్కులో ఆకలితో కూలీలు రాష్ట్రాలు దాటుతున్న వైనాన్ని నువ్వు కూడా చూస్తూనే వున్నావు కదా.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here