తెలుగు వికీపీడియా కథ

    0
    10

    ఒకరు జంటనగరాల్లో పేరొందిన డాక్టరు, మరొకరు విశాఖపట్టణంలో భవన నిర్మాణ రంగంలో ఉన్న కాంట్రాక్టరు, వేరొకరు ఉద్యోగార్థి, ఇంకొకరు గృహిణి. ఒకాయన ఉండేది అమెరికాలో, చేసేది,మాలిక్యులర్ బయాలజీలో పరిశోధనలు. వేరే పెద్దాయన ఉండేది హైదరాబాదులో, గడుపుతున్నది ప్రభుత్వ ఉద్యోగం తర్వాత విశ్రాంతి జీవితం.
    వీరి వృత్తులు, ప్రాంతాలు, అభిరుచులు, సామర్థ్యాలు వేర్వేరు. కానీ వీరందరినీ ఒకటి చేసే పని ఒకటి ఉంది.
    వీరంతా ఒక్క నయాపైసా పారితోషికం ఆశించకుండా, తమ రచనా నైపుణ్యాలు, నిర్వహణా సామర్థ్యం పెట్టుబడిగా పెట్టి, కాపీహక్కులు కూడా వదులుకుని వందల కొద్దీ వ్యాసాలు రాస్తూ, రాసిన వ్యాసాలలో సమాచారం చేరుస్తూ, తమ శక్తియుక్తులను, ఖాళీ సమయాన్ని ధారపోసేది, వీరందరినీ కలిపే బంధం – తెలుగు వికీపీడియా.
    గత పధ్నాలుగు సంవత్సరాల నుంచి వేరు వేరు సమయాల్లో ప్రారంభించి వీరందరూ స్వచ్ఛందంగా, తమ కాపీహక్కులను కూడా వదులుకుని అభివృద్ధి చేస్తున్న ఈ తెలుగు వికీపీడియా ఏమిటి? దీనిలో వీరు ఎదుర్కొంటున్న కష్టనిష్టూరాలు, సాధించిన విజయాలు, వేసుకున్న ప్రణాళికలు ఏమిటన్నది చాలా ఆసక్తికరమైన కథ.

    అసలేమిటి ఇది?
    వికీపీడియా అన్నది ఒక ఆన్లైన్ స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. ఎవరైనా స్వేచ్ఛగా ఎవరి అనుమతుల అవసరం లేకుండా పంచుకోగల విజ్ఞాన సర్వస్వం ఇది, అంతేకాదు దీనిలో రచన, నిర్వహణ కూడా ఎవరైనా చేయవచ్చు. అలా స్వచ్ఛంద రచయితలు, కార్యకర్తల సహకారంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వికీపీడియా 2001జనవరి 15న జిమ్మీ వేల్స్, లారీ సాంగర్ ఆంగ్ల భాషలో ప్రారంభించారు. అంతకుముందు న్యూపీడియా అన్న ఆన్లైన్ విజ్ఞాన సర్వస్వాన్ని పాశ్చాత్య విజ్ఞాన సర్వస్వాల నిర్మాణ పద్ధతిలో నిపుణులతో రాయించి సంపాదకులతో సరిజూపించి రూపొందించే ప్రయత్నం చేసి విఫలమయ్యాకా, జిమ్మీ వేల్స్ ఎవరైనా రాయగలిగిన విజ్ఞాన సర్వస్వానికి పునాది వేశాడు. దీని ఆలోచన జిమ్మీ వేల్స్ ది కాగా సాంకేతికంగా రూపకల్పన చేసింది లారీ సాంగర్. ఇంతకీ వికీ అంటే హవాయి భాషలో వేగం అని అర్థం. పీడియా అన్న పదం ఎన్సైక్లో పీడియా నుంచి తీసుకున్నారు. వేగంగా రాయగలిగింది, వేగంగా మార్చగలిగింది, వేగంగా అభివృద్ధి చెందింది కాబట్టి ఆ పేరు సార్థకమైంది.

    తెలుగులో వికీపీడియా
    వికీపీడియా అనే విజ్ఞాన సర్వస్వం సామాన్యమైన వెబ్సైట్ కాదు. దీని వెనుక ఓ ఉదాత్తమైన లక్ష్యం ఉంది – అదే ప్రపంచంలోని సమస్త మానవాళికి సర్వ మానవ విజ్ఞానం స్వేచ్ఛగా పంచుకోవాలన్నది. ఆ లక్ష్యానికి భాష అడ్డు రాకూడదన్న సదుద్దేశంతో 2004లో వికీపీడియా స్థాపకుడు జిమ్మీ వేల్స్ తెలుగులో పద్మ అన్న లిప్యంతరీకరణ (ట్రాన్స్ లిటరేషన్ – ఆంగ్లంలో తెలుగు స్పెల్లింగులు రాస్తే తెలుగు లిపి వచ్చే) ఉపకరణం రూపొందించిన వెన్న నాగార్జునను తెలుగులో వికీపీడియా రూపొందించే ఉద్దేశం వ్యక్తం చేస్తూ మెయిల్ పంపారు. దాని ఫలితంగానే వెన్న నాగార్జున తెలుగు వికీపీడియా రూపొందించి, తెలుగు వికీపీడియా ప్రారంభించిన వ్యక్తిగా నిలిచారు.
    దీని తొలి దశలో చావా కిరణ్, వైజాసత్య, చదువరి, కాసుబాబు, త్రివిక్రం, వీవెన్, రవిచంద్ర, అహ్మద్ నిసార్, మాకినేని ప్రదీప్, మాటలబాబు, అర్జునరావు, నవీన్, సి.చంద్రకాంతరావు, డాక్టర్ రాజశేఖర్, జె.వి.ఆర్.కె.ప్రసాద్, టి.సుజాత, దేవా వంటివారు తెలుగు వికీపీడియా ప్రాజెక్టు పునాదులు ఏర్పరిచారు. వీరిలో కొందరు పది, పన్నెండేళ్ళ నుంచి ఈనాటికీ తెవికీలో తమ కృషి కొనసాగిస్తున్నారు. తర్వాతి దశలో తెలుగు వికీపీడియా తీర్చిదిద్దడం ప్రారంభించిన కె.వెంకటరమణ, పాలగిరి రామకృష్ణారెడ్డి, రహ్మానుద్దీన్ షేక్, భాస్కరనాయుడు, ప్రణయ్ రాజ్, పవన్ సంతోష్, నాయుడు గారి జయన్న, భాస్కర నాయుడు, గుళ్ళపల్లి నాగేశ్వరరావు, శ్రీరామమూర్తి, మీనా గాయత్రి, యర్రా రామారావు, వుక్కం మహేష్ కుమార్, ఎన్.రహంతుల్లా, కట్టా శ్రీనివాస్, తదితరులు ఎందరో వికీపీడియా మరిన్ని వ్యాసాలతో, మరింత సమాచారంతో, నాణ్యతతో విస్తరించడానికి కృషిచేశారు.

    ఏమైనా రాయవచ్చా?
    కూడదు. ఎవరైనా రాయవచ్చు కానీ ఏమైనా రాయడం, ఎలాగైనా రాయడం కుదరదు. వికీపీడియాలో వ్యాసాల రచనకు నిబంధనలు, పద్ధతులు వుంటాయి. వాటినే విధానాలు (పాలసీలు), మార్గదర్శకాలు అంటారు. ఈ పాలసీలు, మార్గదర్శకాలు అన్నీ వికీపీడియా మూల స్తంభాలు అని పిలిచే 5 మూల సూత్రాలకు అనుగుణంగా ఉంటాయి.

    1. వికీపీడియా అన్నది ఒక విజ్ఞాన సర్వస్వం. స్వంత అభిప్రాయాలు, కవిత్వం, కథలు రాసే బ్లాగ్ కాదు, నిర్వచనాలు రాసే నిఘంటువు కాదు, ఏమైనా ఉద్యమాలు, సంస్థలు, వ్యక్తుల గురించి ప్రచారం చేసే వేదిక కాదు, తాజా వార్తలు ప్రచురించే వార్తాపత్రిక కాదు, ఏయే ఊళ్ళలో ఏ హోటళ్ళు ఉన్నాయో, వాటి ఫోన్ నెంబర్లేంటో రాసేందుకు ప్రయాణ మార్గదర్శిని కాదు, ఇలా మరేవో కాదు. విజ్ఞానాన్ని అందించే విజ్ఞాన సర్వస్వం మాత్రమే.

    2. వికీపీడియా తటస్థ దృక్కోణం అనుసరించాలి. వ్యక్తులుగా ఏ వివాదాస్పదమైన అంశంపైనైనా ఏదోక పక్షం మనం అనుసరించవచ్చు, కానీ వికీపీడియా వ్యాసం రాసేప్పుడు ఏదోక పక్షాన్ని సమర్థించడమో, వ్యతిరేకించడమో చేయకూడదు. ఉదాహరణకు వై.ఎస్.రాజశేఖరరెడ్డి లేదా నారా చంద్రబాబు నాయుడు వంటి రాజకీయనాయకుని మీద మనకు అనుకూలమో, ప్రతికూలమో ఏదోక దృక్పథం ఉండవచ్చు. కానీ వ్యాసం రాసేప్పుడు ప్రామాణికమైన మూలాల నుంచి అతని మీద వచ్చిన విమర్శలు, ఆయనపై ప్రశంసలు వేర్వేరు విభాగాల్లో రాసి, తటస్థంగా ఊరుకోవాలి. అంతేతప్ప ఒక పక్షం తీసుకుని ప్రశంసించడమో, విమర్శించడమో లక్ష్యంగా వ్యాసం తయారుచేయకూడదు. ఒకవేళ అలాంటి వ్యాసాలేమైనా వికీపీడియాలో ఉంటే సరిజేయాలి.

    3. వికీపీడియా స్వేచ్ఛగా పంచుకోగలిగింది, ఎవరైనా మార్పులు చేయగలిగింది. ఒక వ్యాసాన్ని కానీ, వాక్యాన్ని కానీ రాసి వికీపీడియాలో ప్రచురిస్తూండగానే మనం దీనిని ఎవరైనా, ముందస్తు అనుమతి లేకుండా వికీపీడియా నుంచి తీసుకున్నది అని, ఓ లింకు ఇచ్చి వాడుకునేందుకు కాపీహక్కుల పరంగా అనుమతిస్తున్నామనే అర్థం. అంతేకాదు ఆ వ్యాసంలో ఈ ఐదు మూలస్తంభాలు, పాలసీలకు వ్యతిరేకం కాని మార్పులుచేర్పులు ఎవరైనా చేసి మెరుగుచేయవచ్చు. అలాంటి సందర్భంలో ఇది నాది, దీనిలో వారు ఎందుకు మార్పులు చేస్తున్నారన్న దృక్పథం కాక, వికీపీడియా వ్యాసాన్ని అభివృద్ధి చేసేందుకు వారు ముందుకు వచ్చారన్న అభినందన నిజమైన వికీపీడియన్ ప్రతిస్పందన అవుతుంది. అలా మెరుగైన మార్పుచేర్పులు చేసినప్పుడు ఎవరినీ నిరోధించకూడదన్నది, ఎవరు పంచుకున్నా ఒప్పుకునే రాయాలన్నది ఈ సూత్రం.

    4. వికీపీడియాను పైన చెప్పినట్టు ఎందరో వికీపీడియన్లు కలిసి అభివృద్ధి చేస్తారు. కాబట్టి వారితో మనకు అభిప్రాయ భేదాలు ఉంటే విభేదించవచ్చు కానీ గౌరవిస్తూనే విభేదించాలన్నది ఈ సూత్రం. అలాంటి సహకార స్ఫూర్తితోనే తయారైన వ్యవస్థను కాపాడుకునేందుకు గౌరవంగా ప్రవర్తించడం చాలా కీలకమైన అంశం. నిజానికి వికీపీడియాలో ఎన్నో వ్యాసాలు, పాలసీలను పరస్పరం విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్న వ్యక్తులు తమ తమ దృక్పథాలు, అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే అభివృద్ధి చేశారు. అలా చేయడానికి ఒకరినొకరు భిన్నాభిప్రాయాలు ఉన్నా నిబద్ధత కలిగిన సభ్యులుగా గౌరవించుకోవడమే కారణం.

    5. పై నాలుగు సూత్రాలు తప్ప మరే ఇతర స్థిరమైన నిబంధనా లేదన్నది ఐదో సూత్రం. అంటే ఏ ఇతర విధానమైనా, మార్గదర్శకమైనా ఈ నాలుగు సూత్రాల ఆధారంగానే, వికీపీడియా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా రూపొందాలి. ఈ మూలసూత్రాల స్ఫూర్తిని నిలుపుకున్నంతవరకే వాటికి విలువ. అంతేకాదు ఈ ఐదో సూత్రం సభ్యులను వికీపీడియాను అభివృద్ధి చేయడానికి చొరవగా ముందుకు రమ్మని చెప్తోంది. వికీపీడియాలో ఏ మార్పు అయినా తిరగదోడవచ్చు, కాబట్టి వ్యాసం పాడవుతుందని భయపడకుండా దాని అభివృద్ధికి కృషిచేయమంటోంది.

    ఈ ఐదు మూలస్తంభాలు వికీపీడియా నిర్వహణలో రాజ్యాంగ ప్రవేశిక వంటివి, వికీపీడియా స్ఫూర్తి ఈ ఐదింటిలోనూ ప్రతిబింబిస్తుంది. ఈ ఐదు మూలసూత్రాలను అనుసరించి పలు పాలసీలను, మార్గదర్శకాలను తెలుగు వికీపీడియా సముదాయం రూపొందించింది. ఏ కొత్త సభ్యులు అయినా ఈ ఐదింటిని దృష్టిలో ఉంచుకుని రాస్తూ ఉంటే, తోటి సభ్యుల ద్వారా సందర్భవశాత్తూ అన్ని అంశాలూ నేర్చుకోవచ్చు. కాబట్టి తెలుగు వికీపీడియాలో ఎవరైనా రాయవచ్చు, దానికి ఏ అర్హతా అక్కరలేదు. కానీ ఎలా రాస్తున్నారు, ఏం రాస్తున్నారు అన్న రెండు విషయాల్లో ఈ మూలసూత్రాలను అనుసరించాలి.
    అలాగే ఇప్పటికే ఉన్న తెలుగు వికీపీడియా వ్యాసాలు ఈ మూల సూత్రాలు (మరీ ముఖ్యంగా కంటెంట్ పాలసీలైన విజ్ఞాన సర్వస్వ పరిధి (మొదటిది), తటస్థ దృక్పథం (రెండు), కాపీహక్కులు ఉన్న పాఠ్యం (మూడు)) ఉల్లంఘిస్తూంటే దాన్ని ఎవరైనా సరిజేయవచ్చు.

    తెలిసిన విషయాలు రాయవచ్చా?
    పై మూల సూత్రాలను అనుసరిస్తూ నిస్సందేహంగా రాయవచ్చు. కానీ తెలియడం అన్నదాంట్లో కొన్ని అంతరాలు ఉంటాయి. ఉదాహరణకు 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని మన అందరికీ (కనీసం చాలామందికి) తెలుసు కదా. ఎలా తెలుసు మనకు, చాలామందిమి కళ్ళతో చూడలేదు కదా. పుస్తకాల ద్వారా తెలుసు. అలా తెలిసిన విషయాలను, ఏవోక పుస్తకాన్ని మూలంగా ఇచ్చి రాయవచ్చు. అదే ఎవరో ఫలానా వ్యక్తి స్వాతంత్ర సమర యోధుడు అన్న సంగతి మనకు నేరుగా తెలుసు, మన ఊరి అతనే కాబట్టి తెలుసుకోవడానికి ఎక్కడా చదవనక్కరలేదు. కానీ ఈ విషయం అలానే మనకు తెలిసినట్టుగా రాసేయడానికి వీలు లేదు. ఎక్కడో ఒకచోట ప్రచురితమై ఉంటుంది కదా. ఏదైనా స్థానిక చరిత్రకు సంబంధించిన పుస్తకం, వార్తాపత్రికలో ఏదో సందర్భంలో పడిన వ్యాసం, లేదంటే మరేదైనా ప్రామాణిక ఆధారం, దాన్ని మూలంగా సమర్పించాల్సివుంటుంది. మనకు తెలుసు అన్న విషయాన్ని ఏదోలా ప్రచురించిన, ప్రామాణికమైన ఆధారం మూలంగా ఇచ్చే రాయాలి. ఎందుకంటే ఇది విజ్ఞాన సర్వస్వం రూపొందించేప్పుడు పరిశోధనను, పరిశీలనను నేరుగా రాసేయకూడదు, ఇప్పటికే ప్రచురితమైన ఆధారాలను ఉపయోగించుకుని రాయాలి. అలాగే కొన్ని పరిధులు ఉంటాయి, తెలుగు వికీపీడియాలో రాయదగ్గ అంశమా కాదా అన్నది కూడా చూసుకోవాలి.

    వికీపీడియా ఎవరిది?
    వికీపీడియాని కొందరు గూగుల్, ఫేస్బుక్ వంటి సంస్థల్లాగా ఏదోక వాణిజ్య సంస్థల అధీనంలో ఉందనుకుని ఎవరిది ఇది అని అడుగుతూంటారు. వికీపీడియా దాన్ని ఉపయోగించుకునేవారే, రాసే వ్యవస్థ, దానిని రాసే వారే నిర్వహించే సంస్థ వ్యవస్థ. అలానే వికీపీడియాలోని సమాచారం రాసి ప్రచురించేప్పుడే వికీపీడియన్లు “వికీపీడియా నుంచి” అంటూ పేజీకి లింకు ఇవ్వడం ద్వారా గుర్తింపునిస్తే ఇంక ఎవరి అనుమతులూ అక్కరలేని స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేస్తారు. సమాచారం వాడుకుని, పంచుకునేందుకే కాదు మొత్తం ప్రాజెక్టు వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని వ్యాసాలూ వేరే వెబ్సైటు తయారుచేసుకోవడానికైనా, పుస్తకాలుగా ప్రచురించుకోవడానికైనా తగిన గుర్తింపు ఇచ్చేస్తే కాపీహక్కుల పరంగా ఏ సమస్య ఉండదు. మరోలా చెప్పాలంటే వికీపీడియా సమాచారం సమస్త మానవాళిదీ. వికీపీడియాలోని సమాచారం మాత్రమే కాదు నిర్వహణపరంగానూ, ఇతరేతర అంశాలలోనూ వికీపీడియా ప్రధానంగా దానిని నిర్వహిస్తూ, రాస్తూండే సముదాయ నియంత్రణలో ఉంటుంది.

    వికీపీడియాను ఎవరు నిర్వహిస్తారు?
    తెలుగు వికీపీడియా (ఆమాటకొస్తే అన్ని వికీపీడియాలూ) ఐదు మూలస్తంభాలను వికీపీడియా అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా అన్వయించి రూపొందించే విధానాలు (పాలసీలు), మార్గదర్శకాల నియంత్రణలో ఉంటాయి. ఆ విధానాలు, మార్గదర్శకాలు రూపొందించేది తెలుగు వికీపీడియా సముదాయమే. తెలుగు వికీపీడియాలో రాసేవారు, దాని అభివృద్ధి కోసం కృషిచేసేవారిని క్లుప్తంగా తెలుగు వికీపీడియా సముదాయం అంటారు. ఏదైనా అంశాన్ని లేవనెత్తినప్పుడు వికీపీడియన్లు ఆ అంశంపై వ్యాఖ్యానించి, సూచనలు తెలియజేస్తూ విధానాలు రూపకల్పన చేస్తారు. ఉదాహరణకు ఎవరైనా పెద్దగా సమాచారం లేని పేజీ సృష్టిస్తే, అభివృద్ధి చేయమని ఎలా సూచించాలి, ఎన్నాళ్ళు వేచిచూసి తొలగించాలి అన్న అంశం ఉందనుకుంటే వికీపీడియన్లు ఈ అంశంపై రచ్చబండ అన్న పేజీలో కానీ, విధానాల ప్రతిపాదనకు వాడే రచ్చబండ (పాలసీలు) అన్న పేజీలో కానీ ప్రతిపాదించి చర్చిస్తారు. చర్చల అనంతరం ఏకాభిప్రాయం ద్వారా తగిన నిర్ణయం తీసుకుంటారు.

    ఫలానా వ్యాసంలో సమాచారం లేదు-తొలగించాలి, ఈ వాడుకరి (స్వచ్ఛంద రచయితను ఇలా కూడా అంటారు) నిష్పాక్షికత దెబ్బతీసే రచనలు చేస్తున్నాడు హెచ్చరించాలి, ఈ బొమ్మ కాపీహక్కుల వల్ల వికీపీడియాలో ఉండకూడదు లాంటి అనేక నిర్వహణ సమస్యలను ఆసక్తి ఉన్నవారు ఎవరైనా వికీపీడియా గురించి తెలుసుకుంటూ పరిశీలించి, పనిచేయవచ్చు. వారు చేసే చర్చల తర్వాత సముదాయం సమిష్టిగా తీసుకునే నిర్ణయాలను కానీ, విధానాల పరంగా చేయాల్సిన పనిని కానీ అమలుచేసేందుకు మాత్రం నిర్వాహకులు, అధికారులు అన్న ప్రత్యేక బాధ్యతలు స్వీకరించినవారు సాంకేతికంగా చేయగలుగుతారు. ఈ నిర్ణయాలు తీసుకునే విషయంలో, విధానాలను అన్వయించే విషయంలో, వ్యాఖ్యానించే విషయంలో నిర్వాహకులు, అధికారులకు ఏమీ ప్రత్యేక హోదా ఉండదు. వాళ్ళూ ఆ విషయంలో అందరు వికీపీడియన్లతో సమానమే, కానీ ఆ నిర్ణయాన్ని అమలుచేయడానికి మాత్రం వీరు చేసిపెట్టగలుగుతారు. కాబట్టే వికీపీడియన్లు నిర్వాహకత్వం హక్కు కాదు బాధ్యత అంటారు. ఇలా మొత్తం వికీపీడియాలో నిర్వహణ కూడా అందరిదీను.

    వికీపీడియా నాణ్యతను కాపాడేందుకు వికీపీడియన్లు కొత్తగా వచ్చిన వ్యాసాలను పరిశీలించి (అలా చూసేందుకు తెలుగు వికీపీడియాలో ఎడమచేతి వైపు కొత్త వ్యాసాలు అన్న బటన్ ఉంటుంది, గమనించండి) అవి నాణ్యమైనవి కాకుంటే సమస్య ఏమిటో ఒక మూస పెట్టడం ద్వారానూ, వ్యాసం సృష్టించినవారి చర్చ పేజీ (ప్రతీ వికీపీడియా పేజీకి దానిని గురించి చర్చించేందుకు ఒక చర్చ పేజీ ఉంటుంది, పేజీ పేరు పైన చూడండి ఈసారి – అలానే వికీపీడియాలో రాసేవారిని సంప్రదించేందుకు వారికీ చర్చపేజీ ఉంటుంది)లో రాయడం ద్వారానూ తెలియపరుస్తారు. ఆ వ్యాసాన్ని రాసినవారు కానీ, మరెవరైనా కానీ అభివృద్ధి చేయడానికి ఈ పని ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఈ వ్యాసంలో ఇతర వికీపీడియా పేజీలకు లింకులు లేవనో, మూలాలు లేవనో, ఈ వ్యాసం పాక్షిక దృక్కోణంతో రాసివుందనో ఆ మూస చెప్తుంది. అలానే రాసినవారు చేసిన మార్పులు వికీపీడియా పాలసీలకు వ్యతిరేకంగా ఉంటే ఎవరైనా, ఎపుడైనా దానిని తిరగ్గొట్టి పాత కూర్పుకు తిరిగి వెళ్ళవచ్చు. అంతేకాక మొదటి పేజీలో పాఠకులకు కనిపించే ఈ వారపు వ్యాసం, మీకు తెలుసా, ఈ వారపు బొమ్మ వంటి శీర్షికలకు తగిన నాణ్యమైన వ్యాసాలు, ఫోటోలు, తగిన అంశాలు ఎంపికచేయడం వంటివీ నిర్వహణ బాధ్యతల్లోకే వస్తాయి. ఉదాహరణకు కె.వెంకటరమణ అన్న తెలుగు వికీపీడియా స్వచ్ఛంద రచయిత ఇలాంటి కృషిని కొన్ని కొన్నిసార్లు కొందరు సభ్యుల సాయంతోనూ, ఒంటరిగానూ ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నారు. ఆంగ్ల వికీపీడియాలో నెలనెలా దాదాపు 12 వందలమందికి పైగా నిర్వాహకులు, వేలాది అత్యంత చురుకైన రచయితలు, 30 వేలమంది స్వచ్ఛంద రచయితలు కృషిచేస్తూండగా, తెలుగు వికీపీడియాలో మాత్రం నెలనెలా 16-20 మంది అతిచురుకైన స్వచ్ఛంద రచయితల కృషితో, అతికొద్దిమంది నిర్వాహకుల సహకారంతో ఈ పనులన్నీ చేసుకుంటూండడం ఎంత విశేషమో గమనించవచ్చు. ఇలా నిర్వహణా పరమైన సహకారం అందించేందుకు మరింతమంది తెలుగు వారు ముందుకువస్తారని వెంకటరమణ వంటివారు ఆశిస్తూ ఉన్నారు.

    వికీమీడియా ఫౌండేషన్ అనే లాభాపేక్ష రహిత సంస్థ పలు భాషల వికీపీడియాల సహా స్వేచ్ఛా విజ్ఞానం అందించే తన ప్రాజెక్టులకు హార్డ్ వేర్ మద్దతు అందించడానికి, వాటి విస్తరణకు కృషిచేస్తూంటుంది. వికీమీడియా ఫౌండేషన్ ట్రస్టీల బోర్డులోనూ ముగ్గురు ప్రపంచవ్యాప్తంగా వికీపీడియన్ల ద్వారా ఎంపికైన సభ్యులు, ఇద్దరు ప్రపంచ వ్యాప్తంగా వికీపీడియా సముదాయాలు ఏర్పాటుచేసుకున్న చాప్టర్లు, థీమాటిక్ ఆర్గనైజేషన్ల నుంచి ఎంపికైన సభ్యులు, నలుగురు బోర్డు నియమించినవారు, వికీపీడియా వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్ సహా పదిమంది ఉంటారు. ఐతే వికీపీడియాల్లో సమాచారాన్ని చేర్చడం, తొలగించడం వంటివాటిపై వికీమీడియా ఫౌండేషన్ కు అధికారం ఉండదు. వికీపీడియాల్లో వాణిజ్య ప్రకటనలు ఇవ్వదు, వికీపీడియా పాఠకులు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చే విరాళాలు ఉపయోగించుకునే వికీపీడియా సర్వర్లు సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, ఉపకరణాల సృష్టి వంటివి చేస్తూంటుంది.

    తెలుగులో ప్రామాణిక రచనలు దొరకకపోతే?
    మనకి ఆసక్తి ఉన్న అంశాలను చదివి, నిష్పాక్షికమైన శైలిలో రాయవచ్చు. అందుకు ఎలాంటి మూలాలు వాడాలి అంటే
    పరిశోధన పత్రాలు, ప్రామాణిక గ్రంథాలు, పాఠ్యపుస్తకాలు, విజ్ఞాన సర్వస్వాలు, చారిత్రక పత్రాలు (లేఖలు, మౌలిక డాక్యుమెంట్లు), పత్రికల వార్తలు, నివేదికలు, మేగజైన్ వ్యాసాలు, జనగణన వంటి గణాంకాలు, పీహెచ్.డి. సిద్ధాంత వ్యాసాలు, సంపాదకుల నియంత్రణ ఉన్న వెబ్సైట్లు, లాంటివి.

    తెలుగు భాష గత కొన్ని వందల సంవత్సరాలుగా విద్య, పరిపాలన, ఉపాధిలాంటి వాటిలో నిర్లక్ష్యానికి గురి అవుతూండడం వల్ల విచిత్రమైన పరిస్థితి దాపురించింది. కొన్ని దేశాల జనాభా కన్నా ఎక్కువమంది మాట్లాడుతున్న తెలుగు భాష, మరికొన్ని దేశాల బడ్జెట్ల కన్నా ఎక్కువ వసూళ్ళు చేసే సినిమాలు నిర్మాణం అవుతున్న భాష విజ్ఞానం, విద్య లాంటి మౌలిక అంశాల్లో నిర్లక్ష్యానికి గురవుతోంది. సంస్థలు, వ్యక్తులు తెలుగులో విజ్ఞానాభివృద్ధికి, నాణ్యమైన పరిశోధనాత్మక వ్యాసాలు, ప్రామాణిక గ్రంథాలు ముద్రించే ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలకు పాలన, విద్య, పరిశోధనా రంగాల్లో ప్రభుత్వపరంగా తెలుగు భాషకు అనుకూలంగా విధానపరమైన నిర్ణయాలు, ప్రణాళికలు లేకపోవడంతో ప్రతీ రంగంలోనూ జరుగుతున్న కృషి, పరిశోధనలు, వెలువడుతున్న విజ్ఞానం, సమాచారం తెలుగులో అందుబాటులో లేదు. వార్తాపత్రికల స్థాయిలోనూ, పాఠ్యపుస్తకాల స్థాయిలోనూ కొరత కనిపించకపోవచ్చు, పరిశోధన పత్రాలు, ప్రామాణిక గ్రంథాలు తెలుగు వారి జన సంఖ్యలో ఏమేరకు లభ్యమవుతున్నాయన్న ప్రశ్న వేసుకుంటే నిరాశే సమాధానంగా వస్తుంది. అంతేకాక ఇప్పటివరకూ వ్యక్తులు, సంస్థలు, కొంతమేరకు విశ్వవిద్యాలయాలు రూపొందించిన ప్రామాణిక పుస్తకాల విషయంలోనూ డిజిటైజ్ చేసి అందుబాటులోకి తీసుకువచ్చే విషయంలో ఇంగ్లీష్ లాంటి భాషలతో పోలిస్తే తెలుగు చాలా దూరంలో ఉంది.
    సహజంగానే లోటు ప్రామాణిక రచనల ఆధారంగా జరగాల్సిన విజ్ఞాన సర్వస్వ రచనపై ప్రభావం చూపించింది. కానీ ముందు అన్ని శాస్త్రాల్లోనూ ప్రామాణిక రచనలు తెలుగులో ప్రచురణ జరిగాకా, అవి అంతర్జాలంలో డిజిటైజ్ అయి పూర్తిగా అందుబాటులోకి వచ్చాకా తాపీగా తెలుగు వికీపీడియా నిర్మాణం సాగిద్దాం అని వికీపీడియన్లు ఊరుకోలేదు. మూలాల లభ్యత ఉన్నంతమేరకు వ్యాసాలను రూపొందించడం మాత్రమే కాక లభ్యం కాని తావుల్లోనూ కొత్త దారులు వెతుక్కున్నారు.
    ఈ సమస్య అధిగమించడానికి కొందరు అనువాదాల బాట పట్టారు. ఆంగ్లంలో వివిధ కారణాల వల్ల విజ్ఞానాభివృద్ధి విస్తారంగా జరిగివుండడం, అలానే ఆంగ్ల వికీపీడియాలో లక్షలాది మంది వికీపీడియన్లు పనిచేస్తూ వ్యాసాలను అభివృద్ధి చేస్తూండడంతో ఆంగ్ల వికీపీడియాలోని వ్యాసాల్లో చాలా సమాచారం లభ్యమవుతోంది. విశేష వ్యాసాలు (ఫీచర్డ్ ఆర్టికల్స్), మంచి వ్యాసాలు (గుడ్ ఆర్టికల్స్) స్థాయి పొందిన వ్యాసాలు అయితే సమవుజ్జీ సమీక్ష (పీర్ రివ్యూ) కూడా పూర్తిచేసుకుని అత్యున్నత నాణ్యతతో ఉంటాయి. ఆంగ్ల వికీపీడియా నుంచి అనువదించి తెలుగు వికీపీడియాలోకి వ్యాసాలను తెచ్చి రాయడంలో ఏ అనుమతులూ ఉండవు, ఆమాటకి వస్తే ఇది వికీపీడియా నుంచి అని ప్రస్తావించి రాస్తే ఎవరైనా, ఎక్కడైనా ప్రచురించుకోవచ్చు. కాబట్టి అలా అనువాదాల్లో కృషిచేస్తున్నవారిలో ముఖ్యులు చెన్నై నుంచి తెలుగు వికీపీడియాలో కృషిచేస్తున్న టి.సుజాత. విస్తారమైన సమాచారం లభ్యమవుతున్న ఆంగ్ల వికీపీడియా నుంచి సుజాత దాదాపు పదేళ్ళ నుంచి అనువాదాలు చేసి తెలుగు వికీపీడియాను అభివృద్ధి చేస్తున్నారు. శాన్-ఫ్రాన్సిస్కో నగర వ్యాసంతో మొదలుపెట్టి ప్రపంచ నగరాలు, భారతీయ నగరాలు, భారతదేశంలోని పుణ్యక్షేత్రాలు, భారతీయ మహిళా శాస్త్రవేత్తలు వంటి వారిపై వ్యాసాలు ఎన్నో అనువదించారు. ఈ క్రమంలో ఆమె మొత్తం భారతదేశంలోని అన్ని జిల్లాల వ్యాసాలనూ, ప్రపంచంలోని అన్ని దేశాల వ్యాసాలనూ తెలుగులోకి అనువదించి భారీ విజ్ఞాన యజ్ఞం చేశారు. ఇంతకీ ఆమె డిగ్రీ వరకూ కూడా చదవలేదని, వికీపీడియా కోసం స్వంతంగా అభివృద్ధి చేసుకున్న అనువాద నైపుణ్యం ఇందుకు వెచ్చిస్తున్నారనీ తెలిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది.

    గూగుల్ సంస్థ 2009-11 తెలుగు వికీపీడియా సహా కొన్ని భారతీయ భాషల వికీపీడియాల్లో గూగుల్ తన అనువాద ఉపకరణం (గూగుల్ ట్రాన్స్ లేట్) వాడి అనువదించిన వ్యాసాలు ప్రచురించడం ద్వారా ముఖ్యమైన వ్యాసాలు అనువదించే ప్రాజెక్టు చేపట్టింది. ఐతే వికీపీడియా సముదాయంతో సంప్రదించకుండా రూపొందించిన ఈ కార్యక్రమం అమలులో లక్ష్యాలను చేరుకోవడం మాని, తెలుగు వికీపీడియాలో ఉడికీ ఉడకని అనువాదాలను ప్రచురించి వికీపీడియా నాణ్యత దెబ్బతీసింది. కొద్ది వ్యాసాలు మటుకే యాంత్రిక అనువాదం తర్వాత మనుషులు శుద్ధి చేసి ప్రచురించడంతో, అలా చేయని అనేకానేక వ్యాసాలు భారీగా, నాణ్యతలేమితో భారమయ్యాయి. ఇలాంటి వ్యాసాలను నాణ్యమైన వ్యాసాలుగా అభివృద్ధి చేయడానికి ఎందరో వికీపీడియన్లు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అర్జునరావు అనే వికీపీడియన్ మొదలుకొని ఎందరో ఈ ప్రయత్నాలు సాగించారు. ఆ క్రమంలో ఒక ఉపకరణం వాడి మొత్తం వ్యాసాలను తిరగరాస్తూ మీనా గాయత్రి అనే మరో మహిళా వికీపీడియన్ పలు వ్యాసాలను అనువదిస్తున్నారు. వికీపీడియన్ సుజాత చేసిన కృషి తనకు స్ఫూర్తి అని చెప్తున్నారామె. ఇంకెందరో వికీపీడియన్లు అనువాదాన్ని నాణ్యమైన సమాచార సృష్టికి ఒక మార్గంగా ఎంచుకున్నారు.

    సమాచారం అరచేతిలోకి తెచ్చేందుకు
    ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకోవడానికి దాన్ని వికీపీడియన్లకు అందుబాటులోకి తెచ్చేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగా తెలుగు సమాచారం అందుబాటులోకి అన్న ప్రాజెక్టులో భాగంగా డీఎల్ఐలో సరైన ఇండెక్సింగ్ లేకపోవడం వల్ల ఉపయోగపడని ఆరువేల పుస్తకాల సూచిక అభివృద్ధి చేయడం, తెలుగు గ్రంథాలయం అన్న ప్రాజెక్టు ద్వారా పలు గ్రంథాలయ సూచిక పేజీలను తెలుగులోకి అనువదించడం వంటి ప్రయత్నాలు తెలుగు వికీపీడియన్లు పవన్ సంతోష్, బి.కె.విశ్వనాథ్ వంటివారు చేపట్టారు. తెలుగులో ప్రచురితమైన ప్రతీ కాయితాన్నీ డిజిటైజ్ చేసి భవిష్యత్తరాలకు, ప్రస్తుత పరిశోధనలకు అందించాలన్న సంకల్పంతో కృషిచేస్తున్న మనసు ఫౌండేషన్ సహకారంతో ఈ దారిలో మరింత ముందడుగు పడింది. సినిమాల వ్యాసాలు అభివృద్ధి చేస్తున్న “స్వరలాసిక” కోడిహళ్ళి మురళీమోహన్, రోజుకో వ్యాసం చొప్పున ఏళ్ళ తరబడి వ్యాసాలు రాస్తున్న ప్రణయ్ రాజ్ లాంటి వారి ప్రయత్నాలకు మనసు ఫౌండేషన్ వారు డిజిటైజ్ చేసి అందిస్తున్న పత్రికలు, పుస్తకాలు ఒకానొక చోదక శక్తిగా ఉపయోగపడుతున్నాయి. కాపీహక్కుల పరిధిలో లేని పుస్తకాలను యూనీకోడ్ పుస్తకాల దాకా రూపొందించే వికీపీడియా సోదర ప్రాజెక్టు తెలుగు వికీసోర్సు కూడా తెలుగు వికీపీడియా వ్యాసాల రచనకు మూలాలుగా ఉపయోగపడే ప్రామాణిక పుస్తకాలను డిజిటైజ్ చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. తెలుగు వికీపీడియా సముదాయం కాక తెలుగు భాషలోని పుస్తకాలను స్కాన్ చేయడంలోనూ, డిజిటైజ్ చేయడంలోనూ కృషిచేస్తున్న సంస్థలు, ప్రామాణికమైన వ్యాసాలను అందిస్తున్న ఈమాట, భూమిక వంటి అంతర్జాల పత్రికలు కూడా పరోక్షంగా ఈ సమస్య తీర్చేందుకు సాయం చేస్తున్నాయి.

    నాణ్యత సంగతి ఏమిటి?
    వికీపీడియాలో ఉండదగ్గ విషయంపై ఒక వ్యాసాన్ని అవసరమైన సమాచారంతో, నిష్పాక్షికంగా, వ్యాసంలో తగిన చోట్ల ఎక్కడ నుంచి రాశారో ప్రస్తావిస్తూ, కాపీకొట్టిన సమాచారం కాకుండా తగిన విధంగా వికీపీడియా శైలిలో తిరగరాసి, వ్యాసంలో పాఠకుడికి చదువుకునేందుకు వీలుగా లింకులు, వర్గాలు వంటివి ఉంటూ, వ్యాస విషయాన్ని వివరించేలా బొమ్మ చేర్చి వికీపీడియా ఐదు మూలస్తంభాలను స్ఫూర్తిని ప్రతిబింబించే వ్యాసాన్ని నాణ్యమైన వ్యాసం అని చెప్పుకోవచ్చు. ఐతే పైన పేర్కొన్న ప్రతీ విషయంతోనూ సమస్యలు ఉన్న వ్యాసాలు సృష్టి అయ్యాయి. విజ్ఞాన, పరిశోధన రంగాల్లో తెలుగు సమస్యలు కూడా దీనికి తోడువచ్చాయి. తొలినాళ్ళలో ప్రధానమైన అంశాలు అన్నటిపైనా వ్యాసాలు ఉండాలి అన్న పద్ధతిలో ముందుకు సాగడంతో వ్యాసాల్లో ఎక్కడ నుంచో తెచ్చి నేరుగా ప్రచురించడం, వికీపీడియా మూలస్తంభాల స్ఫూర్తి ప్రతిబింబించకపోవడం వంటి సమస్యలతో పాటుగా వ్యాసంగా పరిగణించలేనంత చిన్న పేజీలు సృష్టించడం లాంటి సమస్యలు కూడా ఉండేవి. ఇలా అతితక్కువ సమాచారం ఉన్న పేజీలను మొలకలు అని పిలుస్తూంటారు. ఇలా సమాచారం లేమితో పేజీలు తయారైతే వికీపీడియాలో చదవడానికి వచ్చిన పాఠకులు నిరుత్సాహం చెందుతారు, తెలుగు వికీపీడియా స్థాయిపై పెద్ద గొప్ప అభిప్రాయం ఏమీ ఏర్ఫడదు. కాబట్టి దీన్ని అభివృద్ధి చేయడం తెలుగు వికీపీడియా ప్రాధాన్యతల్లో తొలినాళ్ళ నుంచి ఉంది. 2007లో చంద్రకాంతరావు ఎందుకు ఆ వ్యాసాలు అంటూ ప్రశ్నించినా, 2008, 2009 ప్రాంతంలో మొలక వ్యాసాలను పెంచడంపై సముదాయం దృష్టిపెట్టిందని వైజా సత్య ప్రకటించినా ఇందుకే. తర్వాతి కాలంలో ఈ మొలక వ్యాసాలను విస్తరించేలా, వ్యాసం రాసినవారినే ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఏ నెల తయారైన మొలక వ్యాసాల జాబితా, దాన్ని సృష్టించినవారి పేరుతో సహా ఆ తర్వాతి నెలలోనే ప్రచురించే పద్ధతులు అమలులోకి వచ్చాయి. చాలా తక్కువ సమాచారం ఉన్న వ్యాసాలను నిర్ణీత వ్యవధిలోపు అభివృద్ధి చేయకుంటే తెలుగు వికీపీడియాలో మొలక వ్యాసాలు తొలగించేలా పాలసీ చేశారు.

    ఇది కాక వ్యాసాల్లో సంబంధిత అంశం వచ్చినప్పుడు (ఉదాహరణకు తెలుగు అన్న వ్యాసంలో తెలంగాణ, ఆంధ్రపద్రదేశ్ అన్ణ పదాలు ఉంటే ఆ రెండు వ్యాసాలకు లింక్ ఇవ్వాలి) లింకులు ఇవ్వడం, వ్యాసాన్ని సంబంధించిన వర్గంలోకి చేర్చడం (తెలుగు అన్న వ్యాసం ద్రావిడ భాషలు అన్న వర్గంలోకి చేర్చాలి), అక్షరదోషాలు వచ్చినప్పుడు వాటిని సరిదిద్దడం, సరైన నాణ్యతతో లేని వ్యాసాలకు దాని సమస్య ఏదన్నది చెప్పేలాంటి మూసలు (నిర్వహణ టాగ్ ల లాంటివి). వికీపీడియా సోదర ప్రాజెక్టు అయిన వికీమీడియా కామన్సుకు వెళ్ళి సరైన బొమ్మ తెచ్చి వ్యాసంలో చేర్చడం, లేదా వీలైతే మనమే తీసి వికీమీడియ కామన్స్ లో చేర్చి వ్యాసంలో పెట్టడం లాంటి పనులు చిన్న చిన్నగా చేసేవే కానీ ఈ పనుల వల్ల వ్యాసం నాణ్యతలో చాలా అభివృద్ధి కనిపిస్తుంది. పాఠకుడు చదివేందుకు వీలు ఇస్తుంది. కాబట్టే తెలుగు వికీపీడియన్లు వీటి మీదా దృష్టి సారించి వీలైనంత వీటిని అభివృద్ధి చేస్తూంటారు.

    కొత్త సభ్యులకు స్వాగతం
    వికీపీడియా అన్నది బహిరంగంగా చర్చలు చేస్తూ అభివృద్ధి చేసే నమూనాపై నిర్మించింది కాబట్టి తెలుగు వికీపీడియాలోని సమస్యలను తరచు వికీపీడియన్లే పేర్కొంటూ ఉంటారు. ఈ సమస్యల పరిష్కారంలోనే కొన్ని లక్ష్యాలూ ఏర్పడుతూ ఉంటాయి. వీటిలో ప్రధానమైనది ఈ కృషిలో పాల్గొంటున్న సభ్యుల సంఖ్య. తెలుగు వికీపీడియా వ్యాసాల్లో వందమార్పులు చేసినవారి సంఖ్య 2017 నవంబరు నాటికి 14 మంది కాగా గత మూడేళ్ళ నుంచి మధ్యలో కొన్ని హెచ్చుతగ్గులతో వందమార్పులకు పైగా చేసినవారు నెలవారీగా సరాసరి 14 మంది వికీపీడియాలో స్వచ్చంద రచయితలే ఉన్నారు. 2005లో ఒక్క సభ్యుడి సంఖ్య నుంచి క్రమేణా ఎందరో వికీపీడియన్ల కృషి ఫలితంగా ఈ సంఖ్య ఇప్పుడు రెండంకెలకు పైన నిలబడింది. కొందరు ఒక్కొక్క సారి వ్యక్తిగతంగానూ, వృత్తిగతంగానూ ఇతర అంశాలు ప్రాముఖ్యం వహించడం వల్ల వికీపీడియాలో స్వచ్ఛంద కృషి కొన్నాళ్ళు తగ్గించుతూ ఉండగా, అలా అప్పటివరకూ బిజీగా ఉండి అదే సమయానికి కాస్త తీరిక దొరకగానే తెవికీలో రాయడం పెంచే మరికొంతమంది సభ్యులో, లేక కొత్తగా చేరేవారో ఉండడం వల్ల ఈ సంఖ్య తక్కువగానే అయినా నిలకడగా ఉంటోంది. దీన్ని పరిగెత్తించాల్సిన అవసరం ఎప్పుడూ వికీపీడియన్లు గుర్తిస్తూనే ఉన్నారు. తెలుగు వికీపీడియాలో స్వచ్ఛందంగా కృషిచేస్తూండే సభ్యుల సంఖ్య పెరగడం వల్ల వ్యాసాలు, నాణ్యత, వైవిధ్యం అన్నీ పెరుగుతాయి. వేలాదిగా ఉన్న వ్యాసాలు – లక్షలాదిగా పెరగడానికైనా, వ్యాసాల్లో సమాచారం నాణ్యత, లోతు పెరగాలన్నా, తెలుగువారికి తెలుగులో అందుబాటులో లేని మరెంతో విజ్ఞాన అంశాలపై వ్యాసాలు రావాలన్నా – తెలుగు వికీపీడియాలో రాసే సభ్యుల సంఖ్య పెరగాలన్న విషయం గతంలో వికీపీడియన్లు గుర్తించి, చాలాసార్లు చర్చల్లో వ్యక్తంచేశారు. తెలుగు వికీపీడియా ప్రారంభమై ఏడాది గడిచేలోగానే తెలుగు వికీపీడియన్ చదువరి తెవికీ వ్యాసాలు పెంచాలని చేసిన విజ్ఞప్తికి సమాధానమిస్తూ వైజాసత్య “అన్నింటికంటే ముఖ్య మైనది. సభ్యుల సంఖ్య పెంచడము.” అని ప్రస్తావిస్తూ అది సాధించేందుకు మార్గాల కోసం వెతికారు. అవసరమైతే ఇన్స్యూరెన్స్ ఏజెంట్లలాగా ప్రతీవారికి తెవికీలో రాయమని చెప్పాలనీ ప్రయత్నించారు. 2006-07 నాటికే `ఇ-మెయిల్’ ఉద్యమం పేరిట ప్రతీ వారం ఆ వారపు వ్యాసాన్ని (ఇలా ఓ మంచి వ్యాసాన్ని ఎంపికచేసి మొదటి పేజీలో ప్రచురిస్తూ ఉంటారు) మెయిల్ దారిని తమకు తెలిసిన తెలుగువారికి పంపడం – ఇలాంటి కృషి మీరూ చేయొచ్చని దానిలో రాయడం (మాకినేని ప్రదీప్, కాసుబాబు తదితరులు చేపట్టారు), ఆసక్తి ఉందని భావించిన తమ స్నేహితులకు తెవికీ గురించి చెప్పి తీసుకురావడం (రవిచంద్ర వంటివారు ఎందరో చేశారు) వంటివి చేశారు. ఈ కృషి ఫలితంగా తెలుగు వికీపీడియాలో ఖాతా సృష్టించుకునేవారి సంఖ్య రెండంకెల నుంచి మూడంకెలకు పెరుగుతూ వచ్చింది. 2008ఫిబ్రవరి 3న లక్షలాదిమంది పాఠకులు ఉన్న ఈనాడు పత్రిక ఆదివారం సంచిక ముఖచిత్ర వ్యాసం (మన తెలుగు వెబ్ లో బాగు)లో తెలుగు వికీపీడియా గురించి సమగ్ర వ్యాసం ప్రచురించడంతో హఠాత్తుగా తెలుగు వికీపీడియాలో ఖాతా సృష్టించుకునేవారి సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది. 2008 ఫిబ్రవరిలో తెలుగు వికీపీడియాలో ఖాతా సృష్టించుకున్నవారి సంఖ్య మొట్టమొదటి సారిగా 1500 దాటింది, వందమార్పులు చేసినవారి సంఖ్య ఒకే నెలలో 28కి చేరుకుంది. ఈ రెండు అంకెలను మళ్ళీ అందుకోవడం జరగలేదు. సహజంగానే తర్వాతి నెలల్లో ఈ కొత్త సభ్యుల ఒరవడి పడిపోయినా, సంవత్సరంలో నెలలో వందమార్పులు చేసినవారి సగటు సంఖ్య మరి ఎప్పుడూ 2007నాటి స్థాయికి (13మంది) మరి ఎప్పుడూ పడిపోలేదు. ఇందుకు వేరే వేరే కారణాలు ఉంటే ఉండొచ్చు కానీ ఈనాడు పత్రిక ముఖపత్ర వ్యాసం ప్రభావం కేవలం తాత్కాలికమైనది కాదనే చెప్పాలి. 2009లో ఆంధ్రజ్యోతి ఆదివారం సంచిక ముఖచిత్ర వ్యాసంలో ప్రస్తావన వంటివి ఈ క్రమంలో మేలు చేకూర్చాయి. 2008 నాటి ప్రభావం ఎలావుందంటే తర్వాతి సంవత్సరాల్లో వికీపీడియన్లు సంఖ్య గురించిన ప్రస్తావన కాస్త పక్కకు నెట్టి వికీపీడియా నాణ్యత పెంచే ప్రయత్నాల్లో నిమగ్నం కాగలిగారు. ఐతే ఈ సహకారం ఏకపక్షం కాదు, నిజానికి తెలుగు వికీపీడియా సమాచారం పరంగా పత్రికలకు ఇచ్చినది, ఈ ప్రచారం రూపంలో తీసుకున్నదానికన్నా ఎక్కువ అనే చెప్పవచ్చు.
    అయితే మరింతమంది వికీపీడియాలో రాయడం అన్నది చాలా కీలకమైన అంశం కనుకనే తిరిగి సముదాయం వికీపీడియన్ల సంఖ్య పెంపొందించేందుకు ప్రయత్నాలు సాగించింది. వికీమీడియా ఇండియా చాప్టర్ పేరిట వికీమీడియా ఫౌండేషన్ గుర్తించిన చాప్టర్ ను తెలుగు వికీపీడియన్ అర్జునరావు తొలి అధ్యక్షుడిగా ప్రారంభించారు. అర్జునరావు చొరవతో పలు కళాశాలల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి మరింతమందిని తెలుగు వికీపీడియన్లను చేసే దిశగా కృషి సాగించారు. శిక్షణా కార్యక్రమాలను కృషి రహ్మానుద్దీన్, విశ్వనాథ్, కశ్యప్, పవన్ సంతోష్ వంటివారు వ్యక్తిగత, సంస్థాగత కృషిలో భాగంగా వివిధ హోదాల్లో నిర్వహించారు. ఈ కృషిలో సముదాయంతో కలిసిపనిచేసే సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అడ్ సొసైటీ, వికీపీడియన్లకు మద్దతునిచ్చి, నిర్వహణ కృషిలో భాగం పంచుకోగా ఆంధ్ర లొయోలా కళాశాల, విజయవాడ సంవత్సరాల పాటు భాగస్వామిగా విద్యార్థులకు వికీ శిక్షణను ఇచ్చేందుకు సహకరించింది. స్వాగతాలు చెప్పడం మొదలుకొని, వారి సందేహాలు నివృత్తిచేయడం, కొత్త వ్యాసాలు సృష్టించేలా, ఉన్నవి అభివృద్ధి చేసేలా సాయం చేయడం వంటి పనులు చేస్తూ కొత్తగా చేరిన సభ్యులను పలువురు వికీపీడియన్లు ప్రోత్సహిస్తూన్నారు. ఈ క్రమంలో డాక్టర్ రాజశేఖర్, వైజాసత్య, వెంకటరమణ వంటి పలువురు కొత్తవారిని వికీపీడియన్లుగా మలిచే ప్రయత్నాల్లో తమవంతు కృషిచేస్తున్నారు.

    వ్యాసాల సంఖ్య పెరిగితే ఏం వస్తుంది?
    ఆంగ్ల వికీపీడియాతో పోలిస్తే తెలుగు వికీపీడియా ముందున్న సమస్యలు వేరు, మన వికీపీడియన్లకు అందుబాటులోకి వచ్చిన వనరులు (మనుషులే కానివ్వండి, సాంకేతిక పరిజ్ఞానమే కానివ్వండి) వేరు, ఈ సమస్యలను అందుబాటులోని వనరులతో అభివృద్ధి చేసేందుకు వికీపీడియన్లు అనుసరించిన వ్యూహాలూ వేరు.
    గుడ్డు ముందా? పిల్ల ముందా? లాంటి ప్రశ్నలు వికీపీడియన్ల ముందు ఎప్ఫుడూ ఉన్నాయి. వ్యాసాల సంఖ్య పెరిగితే వాటిని చదవడానికి వచ్చేవారు పెరుగుతారు, తెలుగు అంతర్జాలంలో వికీపీడియా స్థానం పెరుగుతుంది తద్వారా ఎక్కువమంది వికీపీడియన్లు పెరుగుతారు. కానీ సంఖ్య పెంచేందుకు నాణ్యత లేని వ్యాసాలు తయారుచేస్తే వికీపీడియా స్థాయి నాణ్యత పడిపోతుంది. మంచి నాణ్యత ఉన్న వ్యాసాలు ఎక్కువ కావాలంటే ఎక్కువ మంది వికీపీడియాలో రాయాలి. ఇదొక సమస్యల వలయం. కానీ దీన్ని ఎక్కడో ఒకచోట ఛేదించాలి కాబట్టి ముందు వికీపీడియన్లు వ్యాసాల సంఖ్య, సమాచారం పెరగాలన్న దగ్గర దీన్ని ఛేదించారు. వికీపీడియా ప్రారంభించుకుని ఏడాది తిరగగానే దీని చక్రం తిప్పాలంటే తప్పకుండా వ్యాసాల సంఖ్య పెరగాలంటూ బాట్ (ఒకేలాంటి మార్పులను యాంత్రికంగా చేసే ఖాతా) ఉపయోగించి వేలాది గ్రామ వ్యాసాలను కొద్దిపాటి సమాచారంతో వైజాసత్య, మాకినేని ప్రదీప్ వంటివారు సృష్టించారు. సినిమాల వ్యాసాలను కూడా ఇలానే సృష్టించారు. ఈ అడుగుకీ – తెలుగు వికీపీడియా సంఖ్యాపరంగా పెరుగుదల రావడానికి తద్వారా తెలుగు వికీపీడియాకు పత్రికల్లో ప్రచారం రావడానికి, ఆ ప్రచారం ద్వారా వికీపీడియన్ల సంఖ్యపెరగడానికి, వారు తిరిగి సంఖ్యాపరంగానూ, నాణ్యతాపరంగానూ తెలుగు వికీపీడియా అభివృద్ధికి కృషిచేయడానికి సంబంధం ఉందని ఈనాడు పదేళ్ళ తర్వాత వెనుదిరిగి చూస్తే తెలుస్తుంది.

    అప్పటి నుంచీ ఈ రెండు వర్గాల వ్యాసాలూ అతి తక్కువ సమాచారం నుంచి మంచి స్థాయికి పెంచాలన్న లక్ష్యాన్ని సమస్య రూపంలో సృష్టించడం, ఆ సమస్య పలువురు వికీపీడియన్లను సృష్టించుకుంది. ఎన్నో ఆలోచనలను నిర్మించింది. నిర్మాణాత్మకమైన పలు ప్రయత్నాలు, విఫలయత్నాల నుంచి నేర్చుకుని కొత్త ప్రణాళికలు రూపొందించడం సాగుతూ వచ్చింది. భాస్కరనాయుడు, గుళ్ళపల్లి నాగేశ్వరరావు, శ్రీరామమూర్తి, చంద్రకాంతరావు, జెవిఆర్కే ప్రసాద్, నాయుడు గారి జయన్న, వైవిఎస్ రెడ్డి, యర్రా రామారావు తదితరులు ఇరవై ఐదు వేలకు పైగా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామాల వ్యాసాల్లో విస్తారమైన కృషిచేశారు. వీరిలో కొందరు పలకరించని, మార్చని వ్యాసం ఇన్ని వేల వ్యాసాల్లో లేదంటే వారు చేసిన స్వచ్ఛంద కృషిలోని విస్తృతి తెలుస్తుంది. 2017-18లోనూ ఈ కృషి సాగుతోంది. ఈ వ్యాసాలు సమాచార లేమితో ఉండకుండా 2011 జనగణన సమాచారాన్ని ఉపయోగించి విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, పండే పంటలు వగైరా సమాచారాన్ని యాంత్రికంగా రూపొందించి మనుషులు చూసి సరిదిద్ది ప్రచురించే కృషి సాగుతోంది.

    తెలుగు వికీపీడియాలో తప్పనిసరిగా ఉండాల్సిన వెయ్యి వ్యాసాలు, వికీపీడియాలో ఉండాల్సిన వెయ్యి వ్యాసాలు వంటి జాబితాలు తెలుగు వికీపీడియన్లు అహ్మద్ నిసార్, కాసుబాబు, వైజా సత్య వంటివారు రూపొందించి సంవత్సరాలుగా పెంచుతూ పోగా సమిష్టి కృషితో వాటిలో చాలావరకూ వ్యాసాలు రూపొందించడం జరిగింది.

    వ్యాసాల యజ్ఞాలు
    సమాచారం పెంచడానికి, కొత్త వ్యాసాలను మరిన్ని రాయడానికి అంతర్జాతీయంగా 100 వికీడేస్ అన్న ఒక ప్రయోగం చాలా సఫలమైంది. ఒక మనిషి 21 రోజుల పాటు ఒక పనిని విడవకుండా చేయగలిగితే దాన్ని అలవాటు చేసుకోవచ్చని మనస్తత్వ శాస్త్ర నిపుణులు చెప్తూంటారు. అలాంటిది అంతర్జాలం, కాలం, విజ్ఞానం, స్వచ్ఛంద కృషి మీద ఆధారపడే వికీపీడియా వ్యాసాల సృష్టి ఒక్కరోజు విడవకుండా వందరోజుల పాటు రోజూ ఒక్కొక్కటి సృష్టించాలన్న నియమంతో 100 వికీడేస్ ప్రారంభమై ప్రాచుర్యం చెందింది. వందలాది భాషలకు చెందిన వికీపీడియన్లు ప్రయత్నించి కొందరు సాధించగలిగితే, మరికొందరు మధ్యలో విఫలమైనా కొన్ని వ్యాసాలను వారి వికీపీడియాలకు అందించగలిగారు. విన్-విన్ పద్ధతిలో రూపొందిన ఈ ప్రయోగాన్ని తెలుగు వికీపీడియన్ ప్రణయ్ రాజ్ వేరే స్థాయికి తీసుకువెళ్ళిపోయారు. వందరోజుల తర్వాత ఆపకుండా 365రోజుల పాటు కొనసాగించి ప్రపంచవ్యాప్తంగా తొలి వికీ వత్సరం పూర్తిచేసినవారిగా ప్రఖ్యాతి పొందారు. అంతేకాక దాన్ని 500 రోజుల పోటీ చేసి దాన్నీ సాధించి, ఇప్పుడు వెయ్యి రోజుల ప్రయాణం మొదలుపెట్టారు. తన పెళ్ళినాడు కూడా వ్యాసం రాసి స్వేచ్ఛా విజ్ఞానం పట్ల నిబద్ధతకు పట్టం కట్టారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా పలు వికీపీడియన్లు, భారతదేశ వ్యాప్తంగా ఉపరాష్ట్రపతి, తెలంగాణ రాష్ట్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు గుర్తించి అభినందించారు. ఇప్పటివరకూ వందరోజులు వంద వ్యాసాలు రాసే వినూత్నమైన ప్రయోగాన్ని తెలుగు వికీపీడియాలో ఒకసారి సాధించింది పవన్ సంతోష్ కాగా, మీనా గాయత్రి రెండు సార్లు, ప్రణయ్ రాజ్ వరుసగా పలుమార్లు సాధించి ఒరవడి పెట్టారు.

    ఎవరిదీ విజ్ఞానం?
    అందరికీ సమస్త విజ్ఞానాన్ని స్వేచ్ఛగా పంచుకునేలా అందివ్వాలన్న లక్ష్యం సాధించడానికి విజ్ఞానంలో అడ్డుగోడలు, వైవిధ్య రాహిత్యం ఉండకూడదని వికీపీడియా ఉద్యమం గుర్తించేవుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల భాగస్వామ్యం అన్ని వికీపీడియాల్లోనూ 8 నుంచి 16 శాతం మధ్యలోనే ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. తద్వారా సమాచారంలోనూ వైవిధ్యం కొరవడి, మహిళల గురించిన సమాచారం 20-30 శాతానికి లోపే ఉంది. తెలుగు వికీపీడియాలో కూడా అతిఎక్కువ మార్పులు చేసిన 40 మంది వికీపీడియన్లలో మహిళలు ముగ్గురే, 25 మందిలో ఇద్దరు, మొదటి పదిమందిలో ఒకే ఒక్కరు. అలానే వ్యక్తుల గురించిన వ్యాసాల్లో మహిళల శాతం బాగా తక్కువగా ఉందని గుర్తించారు. మిగిలిన వ్యాసాల్లో ఈ వైవిధ్యం లేమిని గుర్తించే సాధనాలు తయారుచేసుకోవడమూ కష్టమే.

    ఈ సమస్యను తీర్చడానికి తెలుగు వికీపీడియన్లు 2014 నుంచీ కృషిచేస్తూనే ఉన్నారు. 2013 వికీమేనియా (వికీపీడియా అంటే పిచ్చిప్రేమ ఉన్న ప్రపంచ వికీపీడియన్లంతా కలిసే కాన్ఫరెన్స్)లో కెలీనా ప్రస్తావించిన ఆంగ్ల వికీపీడియా వారి మహిళా శాస్త్రవేత్తల వ్యాసాల అభివృద్ధి కార్యక్రమాన్ని తెలుగులో కూడా చేయవచ్చని అర్జునరావు, విష్ణువర్ధన్ వంటివారు భావించారు. సుజాత, రాజశేఖర్, ప్రణయ్ రాజ్, వెంకటరమణ, రహ్మానుద్దీన్ వంటి వారిని కలుపుకుని లీలావతి డాటర్స్ (లీలావతి అన్న ప్రఖ్యాత మహిళా గణితవేత్త వారసులుగా భారతీయ మహిళా శాస్త్రవేత్తలను భావిస్తూ రాసిన పుస్తకం) అన్న పుస్తకం ఆధారంగా జాబితా వేసి లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టు రూపకల్పన చేసి, విజయవంతంగా పూర్తిచేశారు. తద్వారా వందమంది భారతీయ మహిళా శాస్త్రవేత్తల జీవిత చరిత్ర వ్యాసాలను తెలుగు వికీపీడియాలో సృష్టించి, అభివృద్ధి చేశారు. ఈ ప్రయత్నాన్ని అనుసరిస్తూ 2015, 2016 సంవత్సరాల్లో మహిళా చరిత్ర మాసంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే మార్చినెలల్లో తెలుగు వికీపీడియన్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఎడిటథాన్ పేరుతో వ్యాసాల మారథాన్, నోబెల్ బహుమతి అందుకున్న స్త్రీల వ్యాసాలు సృష్టించే మరో సమిష్టి కృషి జరిగాయి. 2017లో తెలుగు వికీపీడియన్ మీనా గాయత్రి వందరోజుల పాటు వంద వ్యాసాలు రాసే వికీ యజ్ఞం – 100 వికీడేస్ అన్నదాన్ని మార్పుచేస్తూ రోజూ మహిళలకు సంబంధించిన, మహిళల గురించిన వ్యాసాలు రాసేలా 100 వుమన్ వికీడేస్ అన్నదాన్ని రూపకల్పన చేశారు. దీన్ని భారతీయ భాషా వికీపీడియాల్లోనూ ప్రాచుర్యం చెందేలా ప్రచారం సాగించారు. మీనా గాయత్రి, ప్రణయ్ రాజ్ ఈ ఛాలెంజ్ విజయవంతంగా పూర్తిచేశారు. స్వరలాసిక కలంపేరుతో రాసే కోడిహళ్ళి మురళీమోహన్ ఈ క్రమంలో పలు వ్యాసాలు రాశారు.

    పలువన్నెల పూవుల వెనుక కనిపించని దారం
    రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో వివిధ ప్రాంతాలకు చెందినవారు, సాంకేతికం, బోధన, వైద్యం, నిర్వహణ వంటి పలు రంగాల ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్నవారి నుంచి విద్యార్థులు, గృహిణులు వంటివారూ – ఇలా ఎన్నో విషయాల్లో వైవిధ్యం ఉన్నవారంతా తెలుగు వికీపీడియా విస్తరణ, వికీపీడియా ఉద్యమ వ్యాప్తి కోసం చేయిచేయి కలిపి ప్రయాణం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తమ వైవిధ్యాలూ, వైరుధ్యాలూ ఎంత తీవ్రమైనవైనా స్వేచ్ఛగా తెలుగులో విజ్ఞానం లభించాలన్న లక్ష్యం వీరందరినీ కట్టివుంచుతోంది. కొద్ది గుప్పెళ్ళ జనం ఇన్నేళ్ళు తమ భేదాభిప్రాయాలను పంచుకుంటూ, వాటిలోని భిన్న కోణాల ద్వారా లాభం పొందుతూ స్వచ్ఛందంగా తెలుగు వికీపీడియా నిర్మించేందుకు ఎలా పనిచేయగలగుతున్నారన్నది, అందుకు వారు అనుసరిస్తున్న పద్ధతులు, వారిని కలిపి నిలుపుతున్న అంశాలు ఏమిటన్నది విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు అధ్యయనం చేయదగ్గ విషయం.

    తెలుగు వికీపీడియా సముదాయం ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ, తెలియనివి నేర్పించుకుంటూ తెలుగు వికీపీడియా, ఇతర సోదర ప్రాజెక్టుల అభివృద్ధి అన్న ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పనిచేస్తోంది. ఈ క్రమంలో పలు వికీప్రాజెక్టులను ఉమ్మడిగా అభివృద్ధి చేయడమే కాదు, వికీపీడియా మూలసూత్రాలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అనువర్తింపజేసే విషయంలో ఉన్న అభిప్రాయ భేదాలను చర్చించుకోవడం, ఏకాభిప్రాయానికి రావడం వంటివీ చేస్తూంటారు. ఇలాంటి చర్చలకు, తెలుగు వికీపీడియా సముదాయానికి తెలియాల్సిన ప్రకటనలు, వంటివి ప్రచురించేందుకు రచ్చబండ అన్న పేజీని ఉపయోగిస్తూంటారు. అలానే ఒకరినొకరు సంప్రదించుకునేందుకు ఆయా వాడుకరుల (సభ్యులని అలా పిలుస్తారు) చర్చ పేజీల్లో కూడా రాస్తూంటారు.

    ఈ చర్చల్లో చాలావరకూ సామరస్యపూర్వకంగా సాగగా, మరికొన్ని అంశాలు భిన్నాభిప్రాయాలు పదునుతేరిన చర్చలకు కారణమయ్యేవి. సాధారణంగా లక్ష్యం మరిచి చేసే చర్చలు మాత్రం అరుదు. పలు వాడివేడి చర్చల్లోనూ చంద్రకాంతరావు, కె.వెంకటరమణ వంటివారు తమ అభిప్రాయాలను పద్యాల రూపంలో మలచి సరదా వాతావరణాన్ని సృష్టించేవారు.
    ఒకానొక చర్చలో కె.వెంకటరమణ రాసిన ఈ పద్యం ఒక ఉదాహరణ:

    మొలకనైన నేమి మంచి విషయమైన
    విస్తరించి దాని విలువ పెంచు
    విషయలేమిదైన వివరింపు వ్యాసము
    ఎవరికేమి ఫలము! తెవికి ధీర!

    తెలుగు వికీపీడియాలో సమాచారాన్ని, నాణ్యతనీ పెంపొందించేందుకు పలు వికీ ప్రాజెక్టులు నిర్వహించారు. అంటే ఒకలాంటి వ్యాసాలపై పనిచేయడం వల్ల వికీపీడియాకు లాభం ఉంటుందని నమ్మి దానిపై ఒక్కొక్కరూ ఒక్కొక్క పనీ పంచుకుని రాయడం అనుకోవచ్చు. అలా తెలుగు ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ జిల్లాలు, తెలుగు సినిమాలు, సాహిత్యం, తెలుగు పుస్తకాలు, పత్రికలు వంటి ప్రాజెక్టులు ఎన్నిటిలోనో చేయిచేయి కలిపి పనిచేశారు.

    ఆన్లైన్లోనే కాకుండా బయట పలు సమావేశాలను నిర్వహించుకున్నారు. వీటిలో తెలుగు వికీపీడియా స్థాయిలో పెద్ద ఎత్తున నలుచెరగులా ఉన్న తెలుగు వికీపీడియన్లను కలుపుకుని విజయవాడలో దశాబ్ది ఉత్సవాలు, తిరుపతిలో 11వ వార్షికోత్సవాలు జరుపుకున్నారు. వీటి నిర్వహణ ప్రధానంగా వికీపీడియన్లే ఆధ్వర్యం వహించి చేశారు. తమ కృషికి సహకరించే వికీమీడియా ఫౌండేషన్, సీఐఎస్ వంటి సంస్థల సహకారం తీసుకున్నారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణ కమిటీకి బి.కె.విశ్వనాథ్, 11వ వార్షికోత్సవాల నిర్వహణ కమిటీకి భాస్కరనాయుడు అధ్యక్షత వహించగా, నిర్వహణ కమిటీలో ప్రణయ్ రాజ్, కశ్యప్, టి.సుజాత, రాజశేఖర్ వంటి పలువురు కృషిచేశారు. ఇదిలా ఉండగా 2010 నుంచి మొదలుకొని హైదరాబాద్ నగరంలో తెలుగు వికీపీడియన్లు నెలవారీ సమావేశాలు నిర్వహించుకుంటూండడం కూడా ఉంది. వీటిలో సమీక్ష, వికీపీడియన్లు సాధించిన మైలురాళ్ళకు సంబరాలు, అతిథులను ఆహ్వానించి వారితో సంభాషణ, కొత్త అంశాలు నేర్చుకోవడం వంటి ఎన్నో పనులు చేస్తూంటారు. ఐతే కేవలం ఆన్లైన్లోనే ఉండి, బయట సమావేశాల్లో పాల్గొనని వారూ, ఎక్కడో విదేశాల్లో ఉండి భారతదేశంలో జరుగుతున్న సమావేశాల్లో పాల్గోలేకపోయినా అంతర్జాలంలో నిర్వహణ సహకారం అందించేవారు – సముదాయంలోని వైవిధ్యానికి, సమిష్టి తత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు.

    వికీపీడియాలో సమాచారంలో తప్పులు, తడకలు చేరుస్తూంటే సరిజూడడం, హెచ్చరించడం చేసినట్టే చక్కని కృషి చేస్తూన్న వారికి చర్చ పేజీల్లోనే వివిధ పతకాలు (అంతర్జాలంలోని డిజిటల్ పతకాలే చాలావరకూ) ఇచ్చి ప్రోత్సహిస్తూంటారు – వాటికి గండపెండేరం, వీరతాడు, తెలుగు పతకం లాంటి పేర్లు పెట్టుకున్నారు. 2014, 15ల్లో రెండు మార్లు మొత్తం పదిహేనుమందికి తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వం నిర్మించిన కొమర్రాజు లక్ష్మణరావు పేరు మీదుగా కొమర్రాజు లక్ష్మణరావు విశిష్ట వికీపీడియన్ పురస్కారాన్ని ప్రకటించి, తెలుగు వికీపీడియా, సోదర ప్రాజెక్టుల అభివృద్ధికి కృషిచేసిన 15 మందికి ప్రదానం చేశారు. తెలుగు వికీపీడియా ప్రపంచంలో వికీపీడియాతో పాటు తెలుగు స్వేచ్ఛా అంతర్జాల గ్రంథాలయమైన వికీసోర్సు, స్వేచ్ఛా నిఘంటువు అయిన విక్షనరీ – వంటి ప్రాజెక్టులూ ఉన్నాయి. పైన చెప్పినవారిలో కొందరు, అసలు ప్రస్తావనకే రానివారు మరికొందరు ఈ ప్రాజెక్టుల్లోనూ కీలక పాత్ర వహించి అభివృద్ధి చేశారు. ఎందరో మహానుభావులు – అందరి కృషీ పూర్తిగా ప్రతిఫలించేలా రాయాల్సివస్తే సమగ్ర అధ్యయనంతో పుస్తకాలే రావాలి. ఐతే తెలుగు భాష కోట్లాదిమంది మాతృభాషగా ఉన్నా, వినోదం, వార్తా ప్రసారాలు వంటి కొన్ని రంగాల్లోనే వెలుగుతూ ఉంది. తెలుగులో విద్యాబోధనకు, పరిశోధనలకు అత్యంత కీలకమైన విజ్ఞానాభివృద్ధి విషయంలో వికీపీడియన్లు చేస్తున్న కృషి ప్రాముఖ్యత తెలుగు సమాజం ఇంకా గుర్తించాల్సివుందనే చెప్పాలి.
    వినోద భాషగా, వాడుక భాషగా కోట్లాది మంది వాడుతున్నా, విజ్ఞాన భాషగా, పరిశోధన భాషగా మాత్రం ఆ స్థాయి వినియోగంలోకి రాకుండా ఉండిపోతున్న తెలుగు విషయంలో తెలుగు వికీపీడియా చేస్తున్న కృషి భావి తెలుగు భాషకే పునాదిని నిర్మించడమే.

    [1]గృహిణిగా తమ పిల్లల పెంపకం, పెళ్ళిళ్ళ బాధ్యతలు పూర్తిచేసుకున్న తర్వాతి దశలో అమెరికాలో నివసిస్తున్న కూతురితో ఇంటర్నెట్లో సంభాషించేందుకు 2000 దశకం తొలినాళ్ళలో కంప్యూటర్ చేపట్టారు. ఒక అంశాన్ని వెతుకుతూ తెలుగు వికీపీడియాకు వచ్చి, 2006 నుంచి ఇక్కడ స్వచ్ఛంద కృషి చేస్తున్నారు.

    [2] మరీ ముఖ్యంగా 2006 నవంబరు నెలలో వీరి కృషి ఫలితంగా ఈ సంఖ్య 300 దాటింది

    [3]వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 12లో “తెవికీ వ్యాసాలు – పత్రికల కాపీ” అన్న విభాగంలో చర్చ ఈ అంశంలో చాలా చిన్న భాగాన్నే స్పృశించింది. తెలుగు వికీపీడియాని స్వేచ్చగా ఎవరైనా వాడుకునేందుకు వీలుంది, కాకుంటే వికీపీడియా నుంచి సమాచారం తీసుకున్నట్టు ప్రస్తావించాలి. ఉద్దేశం ఎవరైనా స్వేచ్ఛగా వాడుకునే విజ్ఞాన సర్వస్వాన్ని తయారుచేయడం కాబట్టి వికీపీడియాను ప్రస్తావించకుండా చేసిన కాపీని ప్రోత్సహించకపోయినా వికీపీడియన్లు గట్టిగా ఎప్పుడూ వ్యతిరేకించను కూడా లేదు.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here