ప్రకృతీ నీ ప్రకృతీ

0
5

[box type=’note’ fontsize=’16’] “ప్రకృతి నుంచి మనం నేర్చుకోని విషయమే లేదు. తెరచిన పుస్తకంలా ఉంటుంది. యోగ రహస్యంలా అనిపిస్తుంది. అంతా తెలిసిపోయిందనుకునే ఒక్క విషయం కూడా ప్రకృతిలో లేదు” అంటున్నారు  జియో లక్ష్మణ్ప్రకృతీ నీ ప్రకృతీ” అనే వ్యాసంలో. [/box]

[dropcap]ఆ[/dropcap]కాశం వైపు చూస్తే మన మనసు కూడా అంత విశాలంగా ఉంటే బావుంటుందనిపిస్తుంది. భూమి మీద చెట్టు  చేమ మనలను పలకరిస్తున్నట్లుంటుంది.

ప్రకృతికి మన భావాలకు సంబంధం ఉంది. మనతోనే ఉంటూ మనకు రారాజు పదవిని ఇచ్చింది ప్రకృతి. అందమైన తైలవర్ణ చిత్రంలో ప్రకృతి నేపథ్యంలో మనిషి, పని పాటల్లో ఉంటే ఎంతో ఆహ్లాదకరం? ఎంతైనా మనిషి ప్రకృతికి రుణపడ్డాడు. ప్రకృతి అంతులేని ప్రేమని అనుభవిస్తూనే ఉన్నాడు.

పిచ్చుక పిల్ల నిద్ర లేస్తుంది. తల్లి ఆహారం అందిస్తుంది. పురుగు పరుగు తీస్తుంది హాయిగా. మరో పెద్ద పురుగు దాని పక్కన చేరి గుస గుస పెడుతుంది. పండుటాకు చెట్టు కొమ్మపై నుంచి రాలి పడుతుంది. ఆ శబ్దాన్నికే భయపడిన పురుగులు మట్టి పగుళ్లలోకి పరుగులు తీస్తాయి. చెట్ల మీద పక్షులు కిల కిల రావాలు చేస్తాయి. ప్రకృతి చేసే సహజ సంగీతానికి తాళం వేస్తూ సూర్యకాంతిలో చెట్లు వెలుగు దృశ్యాలుగా మారిపోతాయి. నది గల గల పారుతూ గజ్జల చప్పడు చేస్తుంది. కదులుతున్న వెండి మేఘాలు. రంగులు మారుస్తున్న ఆకాశం. చల్లదనంలో వెచ్చదనం. వెచ్చదనంలో చల్లదనంగా వాతావరణంలో మార్పులు.

నిద్ర లేచిన పులి అడవిలో హాయిగా తిరుగుతుంది. సింహం రాజఠీవితో అన్ని జంతువులను శాసిస్తుంది. భయంతో పరుగులు తీస్తున్న తేళ్ళు. కిచ కిచ మంటూ వృక్షాలకు ఊగుతున్న కోతులు. గుంపులు గుంపులుగా నడుస్తున్న ఏనుగులు.

ఓహ్! ఇదంతా ఇదంతా విశ్వతెర మీద ప్రకృతి ప్రదర్శన! ప్రకృతి నుంచి మనం నేర్చుకోని విషయమే లేదు. తెరచిన పుస్తకంలా ఉంటుంది. యోగ రహస్యంలా అనిపిస్తుంది. అంతా తెలిసిపోయిందనుకునే ఒక్క విషయం కూడా ప్రకృతిలో లేదు. అంతు లేకుండా ఉంది. మేధావుల జిజ్ఞాసకు సవాలుగా నిలుస్తూనే ఉంది. ప్రతి ఒక్కరికి వారి పరిశోధనలో తన మనసును  కొంచెం కొంచెం తొలగించి ఆశ్చర్యపరుస్తోంది. తన వంతు కర్తవ్యం నెరవేర్చి గౌరవం కట్టబెడుతూనే ఉంది.

ఒకడుగు ముందుకు వేస్తే పదడుగులు ఆహ్వానిస్తోంది ప్రకృతి. మానవాళికి సహాయం చేసే స్వభావం దాని సహజగుణం. ప్రకృతి వచ్చదనం కళ్లకి ఆహ్లాదం. మనసుకి ఆనందం. మానవ జీవనానికి హృదయం. ఛాయాచిత్రాన్ని ఒక రంగుల పటంలో బిగించి ఇచ్చినట్లు జీవులను ప్రకృతిలో కలిపి విశ్వంలో ఉంచాడు. ప్రకృతి మన ఆత్మబంధువు.

ప్రకృతిలో మనిషి సర్వవ్యాపిగా ఉన్నాడు. విశ్వప్రతినిధిగా ఉన్నాడు. ప్రకృతిని ఆధీనంలోకి తెచ్చుకొనే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నాడు. రహస్యాల ముడులు విప్పుతూనే ఉన్నాడు. ఇంకా ఇంకా ప్రకృతి మార్మికంగా మిగిలిపోతూనే ఉంది. అదే విచిత్రం.

ప్రకృతి ఎలా ఉందన్నది మఖ్యం కాదు. ప్రకృతిని మనమెలా చూస్తున్నామన్నది విశేషం. ప్రకృతి అంతా పచ్చదనం ఒక్కటే కాదు. దాని వెనుక స్వచ్ఛదనం తెలుసుకోవాలి. దానిని కాపాడుకోవాలి. జీవితానికి ప్రకృతికి సంబంధం ఉంది. ప్రకృతి లేకుండా జీవితం లేదు.

అన్న, చెల్లి, తమ్ముడు, అక్క… తదితర వారి వరసల్లో ప్రకృతిని మనం కలుపుకోవాలి. ఒకే ఒక్క గొప్పమాటతో సంబోధించాలి. అది  ‘తల్లి’. తల్లిని మించిన భావం విశ్వంలో లేదు. మనకు ప్రకృతి తల్లి. జన్మనిచ్చి పెంచి పోషిస్తున్న అమ్మ. మన అమ్మల కన్న అమ్మ.

పంచభూతాలుగా కనిపిస్తున్న ప్రకృతి మనలను రక్షిస్తోంది. ప్రకృతిని మనం అంకితభావంతో రక్షించాలి. మోకరిల్లాలి. శరణాగతి చెయ్యాలి. ఈశ్వరానుసంధాన ప్రకృతీ ప్రధాన ద్వారం. సర్వసాధనలకు ప్రకృతే బీజం వేస్తుంది. ఆమే విత్తనం. అకు వృక్షం. ఆమే సర్వోన్నత హరితమయం. సర్వరోగ నివారణం. సత్వస్పూర్తి దాయకం. నమో నమః.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here