మావూరి చెరువు

0
12

[dropcap]మా[/dropcap] తాతగారి ఊరు ప్రకాశం జిల్లా చీరాల పక్కనున్న వేటపాలెం. నేను పుట్టిందీ, కాలేజీ చదువులు చదివిందీ చీరాలలో. కానీ నా బాల్యం, స్కూలు చదువులూ గడిచింది చీరలకు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకొల్లులో కాబట్టి మావూరి ముచ్చట ఇంకొల్లు గురించే.

నాకు రెండేళ్ల వయసున్నపుడు మా నాన్న, అమ్మ ఇంకొల్లులో ఉన్న మా రైస్ మిల్లును చూసుకునేందుకు ఆ వూరికి మకాం మార్చారు. మా రైస్ మిల్లుకు దగ్గర్లోనే ఉన్న ఓ ఇంట్లో అద్దెకు దిగాం. తర్వాత రోజుల్లో అదే నా అత్తగారిల్లు అయింది. అంటే మావూరు నా పుట్టినూరు, మెట్టినూరూ అన్నమాట. మా ఇంటికి అనుకోని గంగారామ్ పోయే రోడ్డు, రోడ్డు కవతల పెద్ద చెరువు అనబడే చెరువుంటుంది. ఆ చెరువు గట్టునిండా మర్రి, జువ్వి, కానుగ చెట్లుండేవి. చెరువు నిండా ఎర్రని తామరలు, కలువలు జలకాకాడుతూ, ఇంకో పక్క గేదెలు స్నానం చేస్తూ ఉండేవి. ఊరి ప్రజల ఇంటి అవసరాలకు ఈ చెరువు నీళ్ళే కాక మరొక చెరువు కూడా ఉంది. దాన్ని నాగుల చెరువు అంటారు.

ఈ చెరువులో తెప్ప తిరణాలు బాగా జరుగుతుంది. ఊరంతా నల్లరేగడి నేలలు కాబట్టి వర్షాకాలంలో బయట నడవడం చాలా కష్టం. విపరీతమైన బురద ఉంటుంది. అక్కడి ప్రజలకు బూట్లు వేసుకోవాలంటే కొనుక్కోవాల్సిన పని లేదు. వర్షాకాలంలో బయటికెళితే చాలు కాళ్ళ చుట్టూ బూట్లలా అతుక్కొనేది బురద. ఇలాంటి సమయాలలో నడవటానికి ఎక్కువగా చెరువు కట్టాను ఉపయోగిస్తారు. ఒకసారి గుంటూరు నుంచి తహసిల్దారు ఒకాయన మా నాన్నగారితో పనుండి మా ఇంటికొచ్చారు. అవి వర్షాలు పడుతున్న రోజులు. బురుడ ఎక్కువగా ఉందని చెరువు కట్ట మీద నుంచి తీసుకెళ్లమని తోడుగా నన్ను పంపారు. కొంత దూరం అడుగులో అడుగు వేసి నడిచినా అలవాటు లేక ఆయన కాలు జారీ చెరువులోకి జారీ పడిపోయారు. ఇలా కొత్తవాళ్ళోస్తే కాలుజారి పడటలూ లేవటలూ మామూలే.

మా వూరికి రెండు కిలోమీటర్ల దూరంలో పావులూరు అనే వూరు ఉంటుంది. అక్కడ ఉండే ఆంజనేయస్వామి గుడిలో ప్రతిఏటా తిరణాల అధ్బుతంగా జరుగుతుంది. ఈయన మహిమా గల దేవుడని కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. నా చిన్నతనంలో ఈ గుడిలోనే నాకు చెవులు కుట్టించడం, ఏ‌ ఫంక్షన్ కయనా అందరం ట్రాక్టర్‌లో ఊరేగుంపుగా వెళ్ళటం నాకిప్పటికి గుర్తున్నాయి. మేము ఈ మధ్యనే ఆ గుడికొచ్చే భక్తుల కోసం అక్కడ రెండు రూములు కట్టించాము. పోయిన సంవత్సరం మా అబ్బాయికి మెడిసిన్ సీటు వచ్చినపుడు అక్కడికి వెళ్ళి ఆకుపూజ చేయించి వచ్చాము. తిరణాలకు పెద్ద పెద్ద ప్రభలు ట్యూబ్ లైట్లను అలంకరించుకొని రంగు రంగు కాగితాలు అతికించుకొని అందంగా ముస్తాబయి వచ్చేవి. అందరూ చుట్టూ ప్రక్కల ఊళ్ళ నుంచి ఎడ్ల బండ్ల మీద వచ్చేవారు తిరణాలకు. అక్కడే బండ్ల మీద గ్రామఫోను రికార్డులు పెద్ద డ్యాన్సులు చేసేవాళ్ళు. అంగరంగ వైభోగంగా ఆ తిరణాళ్ళు రాత్రంతా జరుగుతూనే ఉంటాయి. రంగుల రాట్నాలూ, నిమ్మకాయ సోడాలూ అప్పటి పిల్లలకు ప్రధాన ఆకర్షణ.

మా ఆటలన్నీ చెరువు కట్టమీదే. చెరువు చుట్టూతా కాపలా కాస్తన్నట్లు పెద్ద పెద్ద మర్రి చెట్లు ఊడలతో జడలు విరబోసుకున్నట్లు కనిపిస్తాయి. ఆ మర్రి చెట్టుకు పెద్ద తొర్ర ఉండేది. అది పిడుగు పడినప్పుడు ఏర్పడిందట. అందులో పక్షులు గుడ్లు పెట్టుకొని అప్పుడప్పుడూ తలలు బయట పెట్టి కనిపించేవి. ఇపుడు ఆ చెట్టును కొట్టేసి వాటర్ టాంక్ కట్టారు. ఊరంతటికి నీళ్ళ బాధ పోయినా, ఆ పెద్ద మర్రిచెట్టు పోయినందుకు చాలా బాధనిపించింది. చెరువు దగ్గర్నుంచి మా మిల్లుకు లారీలు రావటానికి మేమే ఒక రోడ్డు స్వంతంగా వేయించుకున్నాం. మా ఇంటి వద్ద నుంచి మిల్లు మీదుగా ఆ రోడ్లోకి వెళ్ళి చెరువు వైపు నుంచి మరలా ఇంటికి రావడం. ఇది చిన్నప్పటి మా రన్నింగ్ రేస్ దారి. ఈ ఆటల్లో నాతో పాటు నా స్నేహితురాలు లక్ష్మీ, తులసి, మా అన్నయ్య కొడుకులు ఆచారి, పార్థసారథి, మా చుట్టాల పిల్లలు బసవేశ్వరి, అన్నపూర్ణ ఉండేవాళ్ళు. ఇదంతా ఇంటి దగ్గర బ్యాచ్. మా ఇంటి ముందు వారాలు లేని దిగుడు బావి ఒకటుంటుంది. పిల్లలు రోడ్డు మీద కొస్తే పరుగెత్తులాటల్లో ఆ బావిలో పడతారేమోనని పెద్ద వాళ్ళ భయం. మర్రి చెట్టు కింద కూర్చుంటే పై నుంచి మర్రి కాయల వాన కురిసేది. ఉదయం నిద్ర లేచి లేవగానే చెట్టు కింద పడి ఉన్న మర్రి కాయల్ని ఏరు కొచ్చుకునేవాళ్ళం. ఆ కాయలు ఎర్రగా మెత్తగా ఉంది దాని పొట్ట చీలిస్తే ఇసుక రేణువులంత విత్తనాలు ఉంటాయి. అంతా చిన్న విత్తనంలో నుంచి అంతా పెద్ద మర్రి చెట్లు ఎలా వస్తుందో అని ఆశ్చర్యం వేస్తుంది.

సాయంకాలం ఇంటి ముందు ఆరుబయట మంచాలు వేసుకొని ఆకాశంలో చుక్కలు లెక్కబెడుతూ, అమ్మతో ఏడు మల్లెల సుకుమారీ, కీలుగుర్రం లాంటి రాజకుమారుల కథలు చెప్పించుకుంటూ, చెరువు మీద నుంచి వీచే చల్లని గాలి ఒళ్ళంతా తగుళ్తూ ఉంటే, మర్రిచెట్టు కొమ్మలు వింజామరాళ్ళ వీస్తూ జోకొడుతుంటే కమ్మని నిద్ర వస్తుంది. ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో తొక్కుడు బిళ్ళ, నాలుగు స్తంభాలాట, దాగుడు మూతలు ఆడేవాళ్ళం. ఇంటి ముందున్న స్థలమంత పేడతో కళ్ళాపి చల్లి పచ్చగా తయారుచేసి ముగ్గులు పెట్టమని మా పిల్లలకు అప్పచెప్పేవాళ్ళు. ఎన్ని ముగ్గులైన పట్టేవి ఆ స్థలంలో. సంక్రాంతి సమయంలోనైతే గొబ్బెమ్మలు పెట్టడానికి ఆవు పేడను ఎదురింట్లోని నాగయ్య గారి దొడ్లో తెచ్చుకునే వాళ్ళం. గొబ్బెమ్మల మీద పెట్టడానికి చెరువులోని తామర్లు, కాలువలు గాని తెచ్చేవాళ్ళం. అవి ఒక్కోసారి అందకుండా వెనక్కి ఉంటే చుట్టూ పక్కల ఇళ్ల వాళ్ళ దాల్లకు అల్లుకున్న గుమ్మడి, బీర, కాకర పూలు గుచ్చేవాళ్ళం. ఆ ముగ్గులు వేసే అలవాటే కాలేజీకొచ్చాక ఎన్నో ప్రైజులు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత సందేశాత్మక రంగవల్లులు అనే ప్రక్రియను చేపట్టి ఎగ్జిబిషన్లు పెట్టి పేరు తెచ్చుకునేందుకు వేదికయింది.

చెరువును ఇపుడు స్పిన్నింగ్ మిల్లు ఆక్రమించేసింది. చెరువు కళ కోల్పోయింది. చెరువు కట్ట మీద మధ్యలో కొంచెం చదునుగా ఉంది అక్కడ మంచి నీళ్ళ కోసం గిలకబావి ఉంటుంది. బిందెలు తోమే వాళ్ళ గాజుల చప్పుడు, నీళ్ళు తోడే వాళ్ళ గిలకల చప్పుడుకు తోడై ఆ దారంట వెళ్ళే వాళ్ళకు మంచి సంగీతాన్నందిస్తాయి. కట్ట మీద వినాయకుడి గుడి ఉంటుంది. ఆ గుడి కిందికి ఉంది లోపలకు దిగతనికి మెట్లు ఉంటాయి. పరీక్షలప్పుడు ఆ గుళ్ళో వినాయకుడికి దండం పెట్టుకొని వెళ్ళే వాళ్ళం.

మా స్కూలు కెళ్ళే దారిలోనూ, ట్యూషన్ కెళ్ళే దారిలోనూ నీటి చప్టాలు ఉంటాయి. దాంట్లో ఎప్పుడూ కాళ్ళు తడిచెంత నీళ్ళు పారుతూ ఉంటాయి. అందులో కాళ్ళు కడుక్కొని పక్కనే ఉన్న రబ్బరు తయారు చేస్తారనే నమ్మకం. అంతేకాదు, బచ్చలి కాయల్నుంచే రెడ్ ఇంక్ తయారవుతుందని కూడా. ఒకసారి ఆ గింజలన్నీ చిదిమి పెన్నులో పోస్తే పెన్ను ఖరాబయింది. కానీ రెండ్ ఇంక్ తయారవలేదు. ఉప్పు కణికలను నీటిలో కలిపి ఆ ద్రావణాన్ని పింగాణి పాత్రలో పోసి ఇగిరిస్తే మరలా ఉప్పు కణికలు వస్తాయని స్కూల్లో చెప్పిన పాఠాన్ని ఇంట్లో ప్రయోగం చేయాలనుకున్నా కానీ ఇగిరించడం ఎంతో అర్థం కాలేదు. మర్నాడు మా అమ్మ “అన్నం ఇగిర్చాను, స్టవ్ ఆపెయ్” అన్నది. ఇగర్చటం అంటే స్టవ్ మీద పెట్టడం అనుకోని ఒక సాసర్‌లో ఉప్పు ద్రావణం తయారు చేసి స్టవ్ మీద పెట్టి ఉప్పు తయారవుతుందని చూస్తున్నాను. ఉప్పు తయారవలేదు కానీ సాసర్ పగిలిపోయింది.

బస్టాండు దగ్గర్లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూలులో నేను చదువుకున్నాను. చుట్టూ క్లాస్‌రూములు, మధ్యలో విశాలమైన ఆవరణలో ప్రేయర్ జరిగేది. స్కూలు బయట చుట్టూ ప్రశాంతమైన మైదానం. అక్కడే మమ్మల్ని ఆటలు ఆడించేవారు. డ్రాయింగ్, సంగీతం, క్రాఫ్ట్, కుట్లు అన్నీ అటలూ ఆడించేవాళ్ళు. పోటీలు పెట్టి ప్రైజులిచ్చేవాళ్ళు. మా స్కూలులో జరిగే వార్షికోత్సవాలలో ప్రైజులు ఇవ్వటానికి మావూరి పిల్లల డాక్టర్ ధర్మానందరావుగారు వచ్చేవారు. వాళ్ళ అబ్బాయి కూడా మా క్లాసే. ఆ డాక్టరుగారు మా మిల్లులో నుంచే పాలిష్ పట్టని ముడి బియ్యం తీసుకెళ్ళే వాళ్ళు మంచివని. మాకు జలుబుచేసిన జ్వరమొచ్చినా మా నాన్నగారు ఆ డాక్టరు దగ్గరకే తీసుకెళ్ళే వాళ్ళు. ఎప్పుడు హాస్పిటల్‌కు వెళ్ళినా నలుగురైదుగురికన్నా స్టమక్ వాష్ చేస్తుండే వాళ్ళు. అంటే ఆత్మహత్య చేసుకోవడానికి మందులు తాగిన వాళ్ళకు మరలా కక్కించే వాళ్ళన్నమాట. ఆ రోజుల్లో పల్లెటూర్ల పరిస్థితులు అలా ఉండేవి.

ప్రతిరోజూ స్కూలుకు లాంగ్ బెల్ కొట్టగానే పరుగెత్తుకొని ఎవరు ముందుగా స్కూలు బయటకు వస్తే వాళ్ళు గెలిచినట్టు. అదీ మా స్కూలు పందెం. ఒకరోజు అలా పరిగెడుతూ పడిపోయి గడ్డం పగిలిపోయి రక్తం కారిపోయింది నాకు. నా ప్రక్కనున్న నా స్నేహితులు చారుమతి, సీత, లక్ష్మి, తులసి నన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. డాక్టరు గారు నన్ను చూసి గుర్తుపట్టి ‘ఆచారి గారమ్మయా’ అంటూ కుట్లు వేసి ద్రస్సింగ్ చేసి ఇంటికి పంపారు.

ఆరవ తరగతిలో చేరిన కొత్తలో టైం టేబిల్‌లో ఒక పీరియడ్ రేడియో అని ఉన్నది. సైన్స్, తెలుగు అంటూ ఉన్న పీరియడ్లకు ఆ పుస్తకాలు తీసుకెళుతున్నాం కదా అని రేడియో అని ఉన్నది కాబట్టి రేడియో తీసికెళ్లాలేమో అని దాన్ని మోసుకుంటూ స్కూలుకు తీసుకెళ్ళాం. ఆరవ తరగతిలో కొత్తగా ప్రవేశపెట్టే హిందీ పరీక్షలలో ‘కిసాన్’ అన్న మాటకు అర్థం రాయమని ఇచ్చారు. ఆ రోజుల్లో ‘కిసాన్’ పేరుతో కూల్ డ్రింక్ బాటిల్ ఉండేది. అది చూసి కిసాన్ అంటే అదే అనుకోని సోడాలో కలుపుకొని తాగే కూల్‌డ్రింక్ అని రాసి వచ్చాను పరీక్షలలో. స్కూలు ముందు ఐసులు, పాపిడి కొనుక్కు తినటం, జామెట్రీ బాక్సుల్లో నేరేడు పండ్లు లాంటివి పెట్టుకొని క్లాసుకు తీసుకెళ్లటం… ఇలా ఎన్నో మధుర జ్ఞాపకాలు చిన్నప్పటివి. ఇప్పటికీ మా వూరెళితే మా స్కూలును ఒక్కసారైనా చూసుకుని వస్తాను. మావారు పిల్లల డాక్టరు. మేము ప్రస్తుతం నివాసముంటున్న సిరిసిల్లలో స్కూళ్ళ వార్షికోత్సవాలకు మావారు పిల్లల డాక్టరుగా హాజరై ప్రైజులు పంచుతున్నపుడు నా చిన్నప్పటి స్కూలు దృశ్యాలు రీలుగా నా ముందు కనిపిస్తుంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here